సరిగ్గా నాల్గేళ్ల వయస్సులో ఇంటికి ఓ పామును పట్టుకుని వచ్చాడు ఓ బాలుడు. ఆ సీన్ చూశాక ఏ ఇంట్లోనైనా జడుసుకుంటారు. ముందు ఆ పామును వదిలేయమని కోప్పడతారు. భయపడతారు. కానీ, ఆ తల్లి మాత్రం పెద్దగా భయపడలేదు. ఎందుకు పామును పట్టుకొచ్చావ్.. అది విషపురుగు అని తెలియదా అని మాత్రమే అడిగింది. కానీ, ఇతర జీవజాలం పట్ల తన పిల్లవాడిలో ఉన్న సహానుభూతి ఆమెను ఆకట్టుకుంది. అదే ఆ పిల్లవాణ్ని పెరిగి పెద్దయ్యాక.. స్నేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచేందుకు దోహదపడింది.
రోమూలస్ విటేకర్.. ఈ పేరు చాలామంది వినే ఉంటారు. న్యూయార్క్ లో పుట్టి పెరిగిన విటేకర్.. తన 8 ఏళ్ల ప్రాయంలో భారత్ కు వచ్చాడు. విటేకర్ కు సరీసృపాలపై చిన్ననాటి నుంచే ఆసక్తి. భారత్ ను స్నేక్స్ కంట్రీగా పేర్కొంటారు విటేకర్. న్యూయార్క్ లో పాములున్నా విషరహితమే ఎక్కువ.. అందుకే నేను నాల్గేళ్ల వయస్సులో పామును పట్టుకోగల్గి బతికి బట్ట కట్టాను. కానీ, ఇండియాలో మాత్రం అందుకు పూర్తి భిన్నం. విషం కల్గిన పామును పట్టుుకుంటే అంతే సంగతులు.. ప్రమాదం తప్పదని హెచ్చిరిస్తాడు.

వన్యప్రాణి సంరక్షకుడిగా, హెర్పెటాలజిస్టుగా రోమూలస్ విటేకర్ పాములు, సరీసృపాలను సహజ వారసత్వంలో అంతర్బాగంగా చూడాలంటాడు. దేశవ్యాప్తంగా భయం, ఆందోళన, అపోహల కారణంతో పాములను చంపడం సరికాదంటారు.
జీవవైవిధ్యంలో భారత్ మిగిలిన దేశాలకు ఓ మాడల్. అందుకే, పాములతో సహజీవనం చేయాలే తప్ప.. వాటిని విషపురుగులనే ఒకే ఒక్క తప్పుడు అవగాహనతో చంపడం సరికాదు. సరీసృపాల వల్లే జీవవైవిధ్యం కాపాడుకోగల్గుతున్నాం.
వన్యప్రాణుల సంరక్షణలో భద్రత.. అందుకు కావల్సిన అవగాహన రెండూ ముఖ్యమేనంటారు. పాములు మనుషుల్ని చూస్తే భయపడతాయి. అనుకోకుండానో, లేక ఉద్ధేశ్యపూర్వకంగానో వాటిపైన కాలు వేయడమో, చంపే యత్నం చేయడమో చేస్తేనే ప్రమాదాలు జరుగుతాయి. మనం జాగ్రత్తగా ఉంటూనే.. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడమే జీవవైవిధ్యం.
ఇవాళ్టీకీ భారత్ లో పర్యావరణ సమతుల్యతకు కారణం సరీసృపాలే. కానీ, అవి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సరైన ఆదరణ కరువవుతోందన్నది విటేకర్ ఆవేదన.
ఆరు దశాబ్దాలకు పైగా విటేకర్ సరీసృపాల సంరక్షణ.. వాటిపట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. 1969లో చెన్నైలో మద్రాస్ స్నేక్ పార్క్ ను స్థాపించారు విటేకర్. ఇదే భారత దేశంలో సరీసృపాల కోసం అంకితమైన మొట్టమొదటి పార్క్.
అమెరికాలో జన్మించినప్పటికీ… హెర్పెటాలజిస్టుగా భారత్ నే తన కార్యక్షేత్రంగా చేసుకున్నారు విటేకర్. వన్యప్రాణి సంరక్షణలో విటేకర్ సేవలకు 2018లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. భయంతో నిండిన ప్రజల అభిప్రాయాలను మార్చడంలో ఘనుడు ఈ విటేకర్. అపోహలను తొలగించడం, అంతరించిపోతున్న, అపార్థం చేసుకున్న జీవజాతిని రక్షించడమే లక్ష్యంగా విటేకర్ పర్యావరణ పరిరక్షణలో, జీవవైవిధ్యాన్ని కాపాడటంలో ఓ నాయకుడై నడుస్తున్నాడు.



