వాషింగ్టన్ పోస్ట్ జర్నోను నేలకు దింపిన సేల్స్ గర్ల్! కలైవాణి.. కథ కాదు!!

తత్వబోధకై వెళ్లిన సీనియర్ జర్నలిస్టుకు.. పుస్తకం చదవకముందే తత్వం బోధించిన గల్లీ గర్ల్ కలైవాణి

కొన్ని కథలు హార్ట్ టచింగ్ గా ఉంటాయి. పాత కథే. కానీ, ఎప్పుడు విన్నా ఒకింత స్ఫూర్తి రగిలించే కథ. తమిళనాడువాసైన వాషింగ్టన్ పోస్ట్ సీనియర్ జర్నలిస్టును నేలకు దింపిన కథ.. నిశ్చేష్ఠుణ్ని చేసిన కథ. ఆ జర్నలిస్ట్ పేరు విశ్వనాథ్. ఈ కథను ఆయన మాటల్లోనే విందాం.

మేము ఓరోజు చెన్నై వెళ్లాం. అక్కడ మైలాపూర్ లోని కపాలీశ్వరర్ కోవెలలో దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత ఆధ్యాత్మిక పుస్తకాలు, సంగీత సీడీలు, క్యాసెట్స్ కు పేరెన్నికైన గిరి ట్రేడింగ్ స్టోర్ కు వెళ్లాం.

నేను, నా భార్య ఇద్దరం ఎవరికి కావల్సినవి వాళ్లం వెతుకుతున్నాం. మాలాగే చాలామంది అరుణా సాయిరామ్ భజనల నుంచి మొదలుకుంటే బాంబే జయశ్రీ శాస్త్రీయ సంగీత సీడీల వరకూ వెతికే విభిన్న అభిరుచుల సంగమం అక్కడ కనిపించింది. నా భార్య ఎం.ఎస్. సుబ్బలక్ష్మి భక్తి, శాస్త్రీయ సంగీతం, భారతీయార్ గీతాల సీడీల కోసం వెతుకుతోంది. ఇక నేనేమో తత్వబోధ అనే పుస్తకం కోసం వెతుకుతున్నాను.

ఆ పుస్తకాల షాపులో క్యాషియర్ కు అవతలివైపు నుంచి సరిగ్గా పదిహేడు, పద్దెనిమిదేళ్లుంటాయేమో బహుళా.. ఎనిమిదవ తరగతి చదువుతుండొచ్చు.. ఓ నల్లపిల్ల మావైపే చూస్తోంది. ఆ అమ్మాయి తదేకంగా చూస్తుండటంతో.. ఉన్నవీ, లేనివి అన్నీ ఊహించే నా జర్నలిస్ట్ బుర్రకు… ఏదైనా చుట్టుపక్కల గ్రామానికి చెందిన అమ్మాయేమో.. పేదరికంతో ఇక్కడికి పనిచేయడానికొచ్చినట్టనిపించింది. కానీ, ఆ అమ్మాయి మాత్రం ఓవైపు తన పని చేసుకుంటూనే.. తిరిగి తిరిగి నావైపు చూస్తోంది. నా చూపూ ఆ అమ్మాయి వైపు పడుతున్నా… పోనీలే అనుకుని నా తత్వబోధ కోసం నా వెతుకులాట సాగుతోంది.

సంధ్యావందనం నుంచి స్వామి వివేకానంద షికాగో పర్యటన వరకూ అన్ని పుస్తకాలూ కనిపిస్తున్నాయే తప్ప… సుమారు 40 నిమిషాల నుంచి వెతుకుతుంటే తత్వబోధ మాత్రం లభించలేదు. మళ్లీ ఆ అమ్మాయి నాకేసి చూసింది. నేనూ చూశాను. సార్ నేనేమైనా మీకు సాయపడగలనా అనడిగింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికేం తెలిసుంటుందిలే పోనీ.. ఇక తత్వబోధ దొరకదేమోనన్న ఉద్ధేశంతో… అమ్మా నీకు దొరక్కపోవచ్చు.. తత్వబోధ అనే పుస్తకం కోసం నేను వెతుకుతున్నాను వదిలేయ్ అన్నాన్నేను.

అయితే, నేను మీకు సాయం చేస్తానంది.

ఏస్, నాకు తత్వబోధ కావాలి, దొరుకుతుందా, నీకు తెలుసానని నేనడిగాను.

సంస్కృత పుస్తకమా.. లేక, ఇంగ్లీష్ వెర్షనా అనడిగింది ఆ అమ్మాయి.

అప్పటివరకూ విర్రవీగిన మనస్తత్వంతో ఉన్న నేను.. అప్పటికి కాస్త రియలైజై.. ఓ ఈమెకు సంస్కృతం, ఇంగ్లీషూ కూడా తెలుసా..? అనుకున్నాను.

చిన్మయా మిషన్ పబ్లికేషన్, ఇందు పబ్లికేషన్.. లేదా, రామకృష్ణమఠ్ పబ్లికేషన్ ఏది కావాలనడిగింది..?

నేనింకా వండరయ్యాను!

అప్పటివరకూ తత్వబోధ పుస్తకం గురించి మాత్రమే తెలుసుగానీ.. అన్ని పబ్లికేషన్స్, అన్ని భాషల్లో ఉన్న విషయాలు, ఆ విషయాలన్నీ ఆమెకు తెలుసునన్న విషయాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి.

అప్పటివరకూ ఆమెపైనున్న నా అంచనాలన్నీ ఒక్కొక్కటిగా పటాపంచలైపోతున్నాయి.

అసలు నాకేం తెలియదు.. మీరే చూడండి.. నిజంగానే, నాకు పుస్తకం చదవాలనుకున్నానేగానీ.. అంత లోతుగా తెలియదని నేనే ఆ అమ్మాయికి తిరిగి చెప్పాను.

దాంతో మీరు తమిళం చదవగలరా సార్ అనడిగింది మళ్లీ..?

ఏస్ అన్నాన్నేను. (లోలోపల నేను తమిళుణ్నై ఉండీ ఎన్నోసార్లు బయటపడకుండా ఎలా యాక్ట్ చేసుంటానో నాకు గుర్తొచ్చింది.)

అయితే, మీరు ఇది తీసుకోండంటూ… నేను ఏ బుక్ షెల్ఫ్లోనైతే 30 నిమిషాలపాటు తత్వబోధ కోసం వెతికానో.. అక్కడే మొదటివరుసలో ఉన్న తత్వబోధ బుక్ తీసుకుని నా దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయి.

అంతేకాదు.. ఏన్. శివరామన్ అనే తమిళ రచయిత తమిళంలో చాలా సరళంగా, సులువుగా అర్థమయ్యేలా రచించిన ఇందు పబ్లికేషన్స్ వారి ప్రచురణలో వచ్చిన పుస్తకమిది. మీకు కావాలంటే ఇందులోనే సంస్కృతం కూడా ఉంది. సో, ఇది మల్టీలాంగ్వెజెస్ తో విడుదలైన పుస్తకమని నా చేతికందించింది.

జస్ట్ నేను షాకయ్యాను. ఇంత జీనియస్ అమ్మాయినా నేను అండర్ ఎస్టిమేట్ చేసింది. నేను ఎన్ఆర్ఐనేనా నాకీ గర్వం…? ఓ నల్లపిల్ల అని.. పేదరికంతో ఏదో పని చేసుకునేందుకు వచ్చిందని నాలో నేను భావించి ఎంత తక్కువ అంచనా వేశాననుకుని… నన్ను నేనే ఓ మూర్ఖుడిగా తిట్టుకున్న సందర్భమది.

అప్పుడు ఆమెను మేడం అని సంబోధిస్తూ… నాకు అసలు తత్వబోధ అనే పుస్తకం గురించి ఏమాత్రం తెలియదు. ఓ లెక్చర్ విన్నప్పుడు ఈ పుస్తకం పట్ల ఆకర్షితుణ్నై ఇక్కడ దొరుకుతుందంటే వచ్చి వెతుకుతున్నానని.. అప్పటివరకూ నాలో నేను విర్రవీగిన నేనే ఆమెతో బోల్డ్ గా ఉన్నదున్నట్టు చెప్పాను.

మీరు భారతీయ విద్యాభవన్ లో గోదా వెంకటేశ్వరస్వామి బోధనలు విన్నారా అనడిగింది ఆ అమ్మాయి.

మళ్లీ నేను షాక్! మీకెలా తెలుసు…?

ఆయన ఇలాంటి లెక్చర్స్ లో చెన్నై నగరంలోనే ది బెస్ట్. ఇలాంటి క్లాసెస్ ఆయన క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారని చెప్పిందా ఆ అమ్మాయి.

మీకింలాంటి విషయాల పట్ల ఆసక్తి ఉందా అనడిగాన్నేను.

అవును సార్, నేను స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, అలాగే, మీరు చదువాలనుకుంటున్న తత్వబోధ ఇవన్నీ చదివానని.. తత్వబోధ తనకెంతో ఇష్టమనీ చెప్పిందా ఆ అమ్మాయి.

నేను మళ్లీ షాక్.. ఏంది నువ్వు తత్వబోధ చదివావా..?

అవును, శివరామన్ గారు రాసిన, నేను మీకు షెల్ఫ్ లోంచి తీసిచ్చిన ఆ పుస్తకం చదివితే మీ టేబుల్ పై ఆ పుస్తకం ఎప్పుడూ అలా ఉండిపోవాల్సిందేనంది ఆ అమ్మాయి.

అవునా, ఎందుకంత ప్రత్యేకత ఈ పుస్తకానికి అని మళ్లీ నాలో జర్నలిస్ట్ పైకొచ్చి ప్రశ్నించాడు.

సార్ మీకు తెలీదా తత్వబోధ గురించి..? మీరు నన్ను ఆట పట్టిస్తున్నారంది ఆ అమ్మాయి.

లేదు లేదు.. నిజంగానే నాకు తెలీదు. తెలీకనే నిన్నడుగుతున్నాను. నేను ఆ బుక్ విషయంలో వెరీ పూర్ అని ఒప్పేసుకున్నాను.

తనకు కావల్సిన సీడీల కలెక్షన్స్ అన్నీ పూర్తి చేసుకుని… ఓ మూల నుంచి నా భార్య మా ఇద్దరి సంభాషణా వింటోంది.. ఇక్కడ జరుగుతోందంతా తదేకంగా చూస్తోంది.

ఆ అమ్మాయేం చెప్పిందంటే… సార్ మీరొకసారి ఈ పుస్తకం చదివితే… వేదాంత సారమంతా ఒక్కచోటే దొరుకుతుంది.. మనలో ఉన్న అహంకారం పటాపంచలైపోతుంది.

నిజమా… ఈ పుస్తకం అంత ప్రభావవంతమైందా అని నేనడిగాను.

అవునూ, చిత్తశుద్ధిగా లీనమై చదివితే కచ్చితంగా ఈ పుస్తకం అంత ప్రభావవంతమైందే. అందుకు భక్తితో కూడిన దృఢచిత్తమవసరమని చెప్పిందా ఆ అమ్మాయి.

అప్పుడు నా భార్య కూడా మా ఇద్దరి దగ్గరకు వచ్చింది. నేను నా భార్యకు ఆ అమ్మాయిని ఈమె చాలా ప్రతిభావంతురాలని పరిచయం చేశాను. వెంటనే నా భార్య ఈ అమ్మాయిని వాషింగ్టన్ పోస్ట్ కోసం నువ్వు ఎందుకు ఇంటర్వ్యూ చేయకూడదని ప్రశ్నించింది.. ఎప్పుడూ అమెరికా బిజినెస్ పర్సనాలిటీస్, యాక్టివిస్టులైన ప్యారిస్ హిల్టన్లేనా… ఈమె మీ వాషింగ్టన్ పోస్ట్ కు ఎందుకు వార్తా కథనం కాకుడదన్నది.. నా భార్య ప్రశ్న..?

అవును కదా అనిపించి.. నేను ఆ అమ్మాయిని అడిగాను నీ ఇంటర్వ్యూ కావాలని.

కానీ, ఆమె తిరస్కరించింది. మా బాస్ అనుమతి లేకుండా నేను అలా ఇంటర్వ్యూ ఇవ్వలేను. మీలాగే ఇప్పటికే చాలామంది వారికి కావల్సినవి దొరక్క వెతుకుతున్నారు. నేను వెళ్తానంటూ సెలవు తీసుకుంది.

మీ పేరేంటని అడిగాను.

కలైవాణి అంటూ వెళ్లిపోయింది.

నా భార్య, నేను ఒకరి ముఖం ఒకరం చూసుకున్నాం. ఏదో తెలీని ఆనందం.. అందులోనే అహంకారంతో వేసిన అజ్ఞానపు అంచనా తాలూకు ఆందోళన.

కలైవాణి నాకంటే, నా భార్యను ఇంకా ఇప్రెస్ చేసింది.

ఆమె నేరుగా గిరి ట్రేడింగ్ స్టోర్ యజమాని దగ్గరకు వెళ్లింది. సార్ ఆమె పేరు కలైవాణా అని అడిగింది.

అవును, చాలా కష్టపడి పనిచేస్తుంది ఆ అమ్మాయన్నాడు ఆ స్టోర్స్ యజమాని.

ఆ తర్వాత నా భార్య నన్ను పరిచయం చేసింది. ఈయన నా భర్త. వాషింగ్టన్ పోస్ట్ లో సీనియర్ జర్నలిస్ట్.. పేరు విశ్వనాథ్ అంటూ.

వావ్ వాషింగ్టన్ పోస్ట్ లోనా… గ్రేట్ సార్ అంటూ ఆ యజమాని లేచి నిలబడ్డారు.

నేను ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నానని చెప్పాను. ఆమె నిజాయితీ నన్ను చాలా ఇంప్రెస్ చేసిందన్నాను.

బాస్ ఆమెను పిల్చాడు. అప్పుడు సరిగ్గా సమయం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలవుతోంది.

కలైవాణీ… వీరు యూఎస్ నుంచి వచ్చారు.. మీతో ఏదో ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు.. కాస్సేపు నీతో సమయం కావాలంటున్నారు.. నీకు సమ్మతమేనా అడిగారు బాస్.

సార్ ఇప్పటికే చాలామంది కస్టమర్స్ ఉన్నారు. వాళ్లకు కావల్సినవి దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ స్టోర్స్ బాగా బిజీగా ఉంది. వీలైతే సార్ వాళ్లు రేపు రాగల్గితే బాగుంటుందేమోనన్నట్టుగా కలైవాణి పూర్తిగా కాదనీ, అవుననీ చెప్పకుండా జవాబిచ్చింది.

అప్పుడు కలైవాణి మాకింకా నచ్చింది. దాంతో సరే మేం రేపే వస్తామని చెప్పాం.

అప్పటికే తెల్లవారి నాకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఓ ఇంటర్వ్యూ ఉండె. కానీ, కలైవాణి కోసం దాన్ని వదులుకున్నాను. ఇంకా కొన్ని అపాయింట్మెంట్స్ ఉంటే కూడా లైట్ తీసుకున్నాను. వారందరికీ రాలేనని ఇన్ఫార్మ్ చేశాను.

తెల్లవారి కలైవాణిని కలిసి ఇంటర్వ్యూ చేశాను.

కలైవాణి చెన్నై సమీపంలోని ఆర్కాట్ అనే గ్రామానికి చెందిన అమ్మాయి. ఆమెకు ఐదుగురు చెల్లెళ్లున్నారు. తండ్రి తాగుబోతు. ఆ మద్యమే తండ్రి ప్రాణాలు తీసింది. ఆమె తల్లి తాపీ పనిలో సహాయకురాలిగా కూలీ చేస్తుండేది. కానీ, అప్పటికే రెండేళ్ల క్రితం తల్లి కూడా మరణించింది. మొత్తంగా కలైవాణితో పాటు.. ఆరుగురు ఆడబిడ్డలు అమ్మానాన్నలను కోల్పోయి వీధిలో పడ్డారు.

9వ తరగతి చదువుతున్న కలైవాణి ఉద్యోగం కోసం వెతుకుతుంటే.. ఆమె లైఫ్ స్టోరీ విని గిరి ట్రేడింగ్ సెంటర్ యజమాని ఆమెకు సాయం చేశాడు. తన స్టోర్స్ లో ఉద్యోగమిచ్చాడు. తనకు స్టోర్స్ లో వచ్చే జీతంతోనే మిగిలిన ఐదుగురు చెల్లెళ్లను చదివించింది. చెన్నై కార్పోరేషన్ పాఠశాలలో వారంతా చదివారు.

కలైవాణీ… నీకు తత్వబోధ గురించి తెలుసుకోవాలని ఎందుకనిపించిందని నేనడిగాను.

దానికి ఆమె ఏం చెప్పిందంటే… సార్ ఇక్కడ చేరాక వినియోగదారులకు ఏది అవసరమో దాని గురించి కొంత తెలుసుకోవడం వల్ల మనం మొదట బాగా పని చేయొచ్చు. రోజూ ఇదే స్టోర్ లో పనిచేస్తున్న క్రమంలో అప్పుడప్పుడూ ఖాళీగా ఉన్నప్పుడు స్వామి వివేకానంద పుస్తకాలు తీసుకుని చదవడం ప్రారంభించాను. నన్ను ఆ పుస్తకాలు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత భగవద్గీత, వివేకా చూడామణి వంటి పుస్తకాలపై నా మనసు పడింది. అలా పుస్తకాలు చదవడం ఇక నాకు ఓ అలవాటుగా మారింది.

మీ జీతమెంత ఇక్కడ?

2500 రూపాయలు సార్.

ఇంత మొత్తం మీ ఐదుగులు చెల్లెళ్ల పోషణకు సరిపోతయా మరి..?

అసలే సరిపోవు. కానీ, మా బాస్ నాకు అవసరమైనప్పుుడు ఎప్పుడూ కాదనకుండా సాయం చేస్తుంటారు.

జీవితంలో మీ లక్ష్యమేంటి..?

నా చెల్లెళ్లంతా బాగా చదువుకోవాలన్నదే నా లక్ష్యం సార్. అప్పుడైతే వారందరికీ మంచి ఉద్యోగాలు లభిస్తాయని ఆ ఆశ.

మీ ఖర్చులన్నింటికీ నేను నెలకొక పది వేల రూపాయలిస్తాను.. సరిపోతుందా..?

అసలు అంతమొత్తం మాకు చాలా ఎక్కువ. కానీ, మా బాస్ ఓకే అంటేనే నేను అంగీకరిస్తాను సార్.

అప్పుడు మేం కలైవాణి బాస్ వద్దకు ఆమెను తీసుకెళ్లి, తన చెల్లెళ్ల చదువుల కోసం తాము ప్రతీ నెలా పదివేల రూపాయలు పంపాలనుకుంటున్నట్టు చెప్పాం.

దానికి ఆమె పూర్తి అర్హురాలు. మీరు నాకు పంపడం కంటే కూడా.. నేరుగా ఆమె పేరిటే ఓ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయిస్తాను.. ఆమెకే పంపండని చెప్పాడు ఆమె బాస్.

అప్పుడు నా వెంట టైమ్స్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్, నా స్నేహితుడు జాన్ పాల్ కూడా ఉన్నాడు. ఆయనా చాలా సంతోషపడ్డారు. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావంటూ నన్ను ప్రోత్సహించారు.

కలైవాణిని కలిశాక మాలో ఆశ్చర్యంతో పాటు, సందేహాలు, ప్రశ్నల పరంపర మొదలైంది. భారతదేశంలో అట్టడుగు స్థాయిలోకి వెళ్లితే కలైవాణి వంటి జాతిరత్నాలింకెన్ని ఉన్నాయి కదా అని అనిపించింది.

నా భార్యనైతే ఏకంగా ఆమెను, మరో నాల్గురోజులాగు.. నిన్ను తీసుకెళ్లి, నీతో అమెరికాలో వేదాంత ప్రసంగాలిప్పిస్తానంది. ఆ కర్పగంబల్ కృపతో కలైవాణి వేదాంతంలో నిపుణురాలై.. అమెరికాలో ఉపన్యాసాలిచ్చే స్థాయికి రావాలని తాను ప్రార్థిస్తున్నానంది నా భార్య. అందుకు మనం ఏర్పాట్లూ చేద్దామని అప్పుడే నా భార్య నాతో చెప్పింది.

కలైవాణి అంటే కళలవాణి. అలా వాణీ దేవి పేరుకు సార్థకత చేకూర్చిన మట్టిలో మాణిక్యం చెన్నై కలైవాణి.

కలైవాణి నిజంగానే నాలో ఒక మార్పుకు కారణమైంది. మానవ జీవితంలో ఆర్థిక అసమానతలు, కుల, మత, ప్రాంత, వర్ణ వివక్షలు పక్షపాత బుద్ధికి కారణాలుగా ఎలా మారుతున్నాయి… అలాంటివారిని చూసే చూపులో ఎంత తేడా ఉంటోందన్న ఒక పశ్చాత్తాపాన్ని నాలో తట్టిలేపింది కలైవాణి. అప్పుడుగానీ ఎవ్వరినీ రంగు, రూపు, జాతిని బట్టి తక్కువ అంచనా వేయొద్దని.. తత్వబోధకై వెళ్లిన తనకు తత్వం బోధపడిందంటారు విశ్వనాథ్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles