తండ్రి రాజకీయ వారసత్వాన్నందుకున్నాడు. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతమే నిండా కనిపించే నేటి కంపు కొట్టే స్వార్థపూరిత రాకీయాలకు.. నేటి వారసత్వ రాజకీయ నాయకులకు భిన్నంగా పాలించాడు. అందుకే ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రి. కానీ, ఇప్పుడు వయస్సు పైబడింది. పైగా తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమితుడైన స్థానికేతరుడు పాండియన్ తన రాజకీయాలకు గుదిబండగా మారడమో… లేక, నిజంగానే తన రాష్ట్రంలో మోడీ హవా పెరగడమో.. తనమీద మొహం మొత్తడమో.. ఈసారి ఒడిశా ఓటర్లు విభిన్నమైన తీర్పునిచ్చారు. అప్రతిహతంగా తానేలిన కళింగరాజ్యాన్ని… ఈసారి బీజేపీ చేతుల్లో పెట్టారు.
ఇదంతా ఒకెత్తైతే… ఆ తర్వాత ఒడిశాలో చోటుచేసుకున్న భిన్న రాజకీయ సంప్రదాయాలు ఓటర్లిచ్చిన తీర్పును మరిపించేలా కనిపించాయి. నేటి నాయకులకు లేని లక్షణాలను కళ్లకు కడుతున్నాయి. దేశంలోనూ, రాష్ట్రాల్లోనూ పాలక, ప్రతిపక్షాలంటే వైరి పక్షాలనే భావన బలపడ్డ కాలాన.. అందుకు పూర్తి భిన్నమైన రాజకీయాలకు ఒడిశా స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని నేటి తరం నాయకులతో పాటు.. దేశంలో గల్లాలెగురేసే వాళ్లంతా చూసి నేర్చుకోవాలనే ఒకింత చురకనూ గట్టిగానే అంటిస్తోంది.
ఇంతకీ ఏం జరిగింది ఒడిశాలో..?

ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మోహన్ మాఝీ చూపించిన చొరవ ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక కొత్త ఆహ్వానించదగ్గ పరిణామం. ఏ ముఖ్యమంత్రైనా తమ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు.. ఇతర విపక్షాలనూ పిలవడం ఆనవాయితే. కానీ, మోహన్ మాఝీ నవీన్ పట్నాయక్ దగ్గరకు వెళ్లిన తీరు… ఆయనను ఆహ్వానించిన తీరే ఇప్పుడు సభ్య నాయకుల సమాజం తెలుసుకోవాల్సింది, మసలుకోవాల్సింది.
మాఝీ నవీన్ పట్నాయక్ దగ్గరకు వెళ్లడమే కాదు.. తనకంటే వయస్సులో పెద్దవాడైన నవీన్ పట్నాయక్ కాళ్లపై పడ్డాడు. నవీన్ పట్నాయక్, ఆయన తండ్రి బిజూ పట్నాయక్ గురించి.. వారి రాజకీయ వారసత్వం గురించి తెలిసిన వ్యక్తి మాఝీ. వారి గొప్పదనాన్ని గుర్తించే వ్యక్తి. పైగా తానూ ఓ గిరిజన రైతు బిడ్డ.. న్యాయశాస్త్ర పట్టభద్రుడిగా చదువుకున్నవాడు… రాజకీయాల్లో ఒక సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి రేంజుకు ఎదిగినవాడు… కాబట్టే, నవీన్ పట్నాయక్ కన్నా తానేం తక్కువ అనే అహాన్ని సీఎం ఐపోయాగానే ముందుకు తీసుకురాలేదు. చదువు సంస్కారం నేర్పితే ఎలా ఉంటుందో అలా వ్యవహరించాడు. నవీన్ పట్నాయక్ సూచనలు, సలహాలు అడిగాడు. అంతకుముందు తనకున్న పాలనానుభవాన్ని తనతో పంచుకోవాలని కోరాడు. ఏదైనా తప్పొప్పులుంటే సూచించాలని, సరిచేయాలని పెద్దమనసుతో అడిగాడు.
అంతవరకూ కూడా ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా… ఒక హుందా రాజకీయాలకు కేరాఫ్ అన్నట్టుగా పాలించిన నవీన్ పట్నాయక్ నూ ఆ విషయం ఆశ్చర్యపర్చింది. అంతకుమించి సంతోషపెట్టింది. తనను ఆహ్వానించినట్టుగానే ఆయన మాఝీ ప్రమాణ స్వీకారనికి విచ్చేశాడు. ఆయన వచ్చినందుకు ప్రధాని మోడీ నుంచి మొదలుకుంటే.. అందరూ ఆయన్ను ఆప్యాయంగా పలుకరించిన తీరు అక్కడికొచ్చినవారితో పాటు, టీవీల్లో చూస్తున్న వీక్షకులనూ ఆకట్టుకుంది.
ఇవాళ ఎన్నికలైపోతూనే ఈవీఎంలను బ్లేమ్ చేయడమో.. లేక, ఎన్నికల అధికారులు, పోలీసులపై విరుచుకుపడటమో సర్వసాధారణంగా దేశమంతా చూస్తున్నాం. కానీ, అందుకు భిన్నమైన పాలిటిక్స్ ఇప్పుడు ఒడిశాలో కనిపించాయి. ల్యాండ్ ఆఫ్ జగన్నాథ్ గా చెప్పుకునే ఆ సన్నిధిలో చోటుచేసుకున్న ఈ పాలిటిక్స్ ఇప్పుడు మిగిలిన రాజకీయ సమాజానికీ కళ్లు తెరిపించి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నాయకులు పనిచేయాలనే ఓ సందేశాన్నీ పంపిస్తున్నట్టు లేదూ..?



