పశ్చిమాసియా ముచ్చట అంటేనే నిత్య రావణకాష్ఠం. తాజాగా హెజ్బొల్లా టార్గెట్ గా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో.. ఆ మిలిటెంట్ గ్రూప్ చీఫ్ నస్రల్లాతో పాటు మరి కొందరు కమాండర్స్ చనిపోయారన్న వార్తల నేపథ్యం ఒకవైపు.. ఈ మధ్య లెబనాన్ వేదికగా జరిగిన పేజర్స్, వాకీటాకీల పేలుళ్లు ఇంకోవైపు .. దీంతో మరోసారి అంతర్జాతీయంగా మొస్సాద్ పేరు మార్మోగిపోతోంది.
ఇంతకీ ఏంటీ మొస్సాద్..?

సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ.. అమెరికా సీఐఏ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గూఢచార సంస్థ మొస్సాద్. కొన్నిసార్లు అమెరికా సీఐఏ కూడా ఆశ్చర్యపోయే మొస్సాద్ వ్యూహాలు, సర్జికల్ స్ట్రైక్స్ యావత్ ప్రపంచాన్నీ అబ్బురపరుస్తాయి. ఈమధ్య హెజ్బొల్లా లక్ష్యంగా సాగిన పేజర్స్, వాకీటాకీల పేలుళ్లతో పాటు… సుమారు 3 దశాబ్దాలకు పైగా ఇజ్రాయెల్ కు కంట్లో నలుసులా మారిన హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను లేపేశారన్న వార్తల నేపథ్యంలో… వీటన్నింటి వెనుకా మొస్సాద్ హస్తమే కీలకం. ఇప్పుడు సైబర్ హ్యాకింగ్ లోనూ.. భద్రతలోనూ మొస్సాద్ ఓ బెంచ్ మార్క్!
గూఢచారి సంస్థ అంటేనే గోప్యత. అందుకు పర్యాయపదం మొస్సాద్. దానికితోడు ఎప్పటికప్పుడు అప్డేషన్ దాన్ని మిగిలిన ప్రపంచంలోని నిఘా సంస్థలన్నింటి నుంచీ మరింత ప్రత్యేకంగా నిలబెడుతోంది. వ్యూహం, చతురత, కచ్చితత్వం, గోప్యత, మెరుపుదాడులతో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపించేలా మొస్సాద్ దాడులుంటాయి. పైగా ప్రత్యర్థిని ఎత్తుకు పై ఎత్తు వేసి చిత్తు చేయడంలో మొస్సాద్ కదలికలు, స్పాంటెనిటీ నుంచీ ప్రపంచ నిఘా సంస్థలన్నీ నేర్చుకోవాల్సినవెన్నో. ఈమధ్య జరిగిన పేజర్, వాకీటాకీల పేలుళ్ళలో అలాంటి వ్యూహాన్నే అనుసరించింది. మోబైల్ ఫోన్స్ వాడితే జరిగి పరిణామాలను ముందే ఊహించి అందుకు ప్రత్యామ్నాయంగా హెజ్బొల్లా పేజర్లను వాడితే… ఆ పేజర్లనే పేల్చే ఎక్స్ ప్లోజివ్స్ తో హిజ్బొల్లా వ్యూహాలను తన ప్రతివ్యూహాలతో చిత్తడి చేసింది మొస్సాద్. అందుకు హెజ్బొల్లా కదలికలను కనిపెట్టడంతో పాటు.. వారు తమ వ్యూహాలకు ఏం వాడబోతున్నారో నీడలా ఉంటూ పట్టేయడమే మొస్సాద్ ప్రత్యేకత.
గూఢచార సమాచార సాంకేతికతలో ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే వరల్డ్ బెస్ట్ మొస్సాద్. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, దేశంలో జరిగే అంతర్గత కుట్రలకు అడ్డుకట్ట వేయడం వంటివాటి కోసం 1949లో ఏర్పాటైన మొసాద్ ఆపరేషన్స్.. ఇప్పుడు ఇజ్రాయెల్ సరిహద్దులను దాటి విస్తరించాయి. అలా ప్రపంచంలోనే ప్రధాన గూఢచర్య సంస్థల్లో ఒకటిగా మొస్సాద్ హెడ్ లైన్స్ కెక్కింది.
శత్రువులెంత జాగ్రత్త పడ్డా దాన్ని ఛేదించేందుకు శత్రు భూభాగాల్లోకి కోవర్ట్ ఆపరేషన్లతో చొచ్చుకెళ్లడం మొస్సాద్ ప్రత్యేక లక్షణాల్లో ప్రధానమైంది. అంతర్జాతీయ గూఢచార సంస్థలతోనూ కలిసి పనిచేస్తూనే… విస్తృతమైన నెట్ వర్క్ ను ఏర్పర్చుకోవడం.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వంటివెన్నో మొస్సాద్ నుంచి నిఘా సంస్థలు చూసి నేర్చుకోవాల్సిన అంశాలు.

నాజీల యుద్ధంలో నాటి క్రిమినల్ అడాల్ఫ్ ఐచ్ మాన్ ను సజీవంగా పట్టుకోవడంతో పాటు, మరి కొందరు కీలకమైన వారిని మట్టుబెట్టడంతో మొస్సాద్ సాహసాలు ప్రపంచం ముందుకొచ్చాయి. నాటి నుంచి తన పేరును నిలుపుకోవడమే కాదు.. ప్రపంచంలోని మిగిలిన నిఘా సంస్థలన్నీ నివ్వెరపోయేలా, మొస్సాద్ ను మార్గదర్శిగా భావించేలా ఈ గూఢచార సంస్థ దూసుకుపోతోంది.
బేనేట్ పేరుతో పిల్చే.. ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్ తో మొస్సాద్ పేరు ప్రపంచంలో మరింత మార్మోగింది. 1972 నుంచే మొస్సాద్ దూకుడుకు కళ్లెం వేయగల్గే మొనగాళ్లు లేకుండా పోయారనుకోవచ్చు. అప్పుడు జరిగిన మ్యూనిక్ ఒలంపిక్స్ సమయంలో 11 మంది ఇజ్రాయెలీ అథ్లెట్లను చంపిన కుట్రలో.. పాలస్తీనా ఉగ్రవాదులను జస్ట్ ఓ రిమోట్ బటన్ ఆపరేషన్ తో ఏరిపారేసింది మొస్సాద్. ఆ క్రమంలో రోమ్ లో దాక్కున్న అప్పటి పాలస్తీనా చీఫ్ యాసర్ అరాఫత్ సమీప బంధువైన వాల్ జ్వైటర్ ను చంపేసిన మొస్సాద్ .. ఆ తర్వాత ఫ్రాన్స్ లో ఓ అపార్ట్ మెంట్లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ప్రతినిధి మహ్మూద్ హమ్షారీని ఫోన్ బాంబు ద్వారా పేల్చేసింది. జస్ట్ ఓ జర్నలిస్టుగా ఇంట్లోకి ఎంటరై… ఆయన వాడే ల్యాండ్ లైన్ ఫోన్ లో ఎక్స్ ప్లోజివ్స్ పెట్టి.. ఆయనకు కాల్ చేశారు. ఆ ఫోన్ ఎత్తిన వెంటనే రిమోట్ తో బటన్ నొక్కగానే.. హమ్షారీ తునాతునకలయ్యాడు. అలాగే, 1996లో హమాస్ బాంబు తయారీదారుణ్ని.. తన మోబైల్ ఫోన్ లో ఎక్స్ ప్లోజివ్స్ పెట్టి పేల్చేసింది. కొద్ది నెలల కిందటే పాలస్తీనా మిలిటెంట్ గ్రూమ్ హమాస్ మెయిన్ కమాండర్ ఇస్మాయిల్ హానియేను కూడా మొస్సాద్ చంపేసిన తీరు.. ఇజ్రాయెల్ వ్యతిరేకులకు కంట నిద్రలేకుండా చేసింది. ఇరాన్ లోని వీవీఐపీలు కొలువుంటే చోట.. అత్యంత భద్రత నడుమ.. తన ఇంట్లోకి చొరబడి బాంబు పెట్టి ఒక్క రిమోట్ నొక్కుతో తునాతునకలు చేసింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే హజ్బొల్లా తన ప్లాన్ మార్చి.. మోబైల్ కు ప్రత్యామ్నాయంగా పేజర్లను వాడితే… ఆ ఎత్తుగడనూ చిత్తు చేసిన నేర్పరితనం మొస్సాద్ ది! ఇలా చెప్పుకుంటూ పోతే.. కలుగులో ఉన్న ఎలుకనైనా బయటకు లాక్కురాగల సామర్థ్యం మొస్సాద్ సొంతం.

ఇంతకీ మొస్సాద్ వార్షిక బడ్జట్ ఎంత..?
అన్నింట్లో వేలుపెట్టే అగ్రరాజ్యాల పెద్దన్నతనపు పెత్తనంతో.. ఇప్పుడేదేశం చూసినా సరిహద్దుల్లో తమ దేశభద్రతకై, తమ దేశంపై జరుగుతున్న కుట్రలను ఛేదించే నిఘా వ్యవస్థలపై పెద్దమొత్తంలో నిధులు వెచ్చించాల్సిన గత్యంతరం లేని పరిస్థితేర్పడింది. ఈ క్రమంలో అన్నింటా వేలుపెట్టే పెత్తనంతో అగ్రరాజ్యాలు కూడా అదే స్థాయిలో శత్రువుల్ని తయారుచేసుకున్నాయి. ఆ క్రమంలో వాటి రక్షణ రంగ బడ్జెట్ గానీ, మరీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు శత్రుదేశాలు, మిలిటెంట్ గ్రూప్స్ సమాచారాన్ని చేరవేసే గూఢచార వ్యవస్థల బడ్జెట్ గానీ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఎందుకంటే ఆయా దేశాలు అంత ప్రాధాన్యత ఇవ్వక తప్పనిసరి పరిస్థితి రాను రాను పెరుగుతోంది. ఈ క్రమంలో యూఎస్ కు చెందిన సీఐఏ తర్వాత… అత్యధికంగా ఓ గూఢచర్య సంస్థ.. దాని నిర్వహణకు ఎక్కువ బడ్జెట్ దక్కించుకుంటుందంటే అది మొస్సాదే. అలా మొస్సాద్ వార్షిక బడ్జెట్ 3 బిలియన్ డాలర్స్ అంటే మామూలు మాట కాదు. అంటే, ఇజ్రాయెల్ పూర్తిగా మొస్సాద్ పై ఏ స్థాయిలో ఆధారపడిందో దాని వార్షిక బడ్జెట్టే చెబుతుంది. ఇక మొస్సాద్ లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 7 వేలకు పైగానే ఉంది.
ప్రస్తుత మొస్సాద్ చీఫ్ ఎవరు..?
డేవిడ్ డాడీ బర్నియా 2021లో యొస్సీ కోహెన్ నుంచి బాధ్యతలు స్వీకరించాక.. మొస్సాద్ దూకుడు ఇంకా పెరిగింది. మొస్సాద్ చీఫ్ నియామక ప్రక్రియ కూడా మొస్సాద్ రహస్య ఆపరేషన్లంత గోప్యంగా జరుగుతుంది. కేవలం అక్కడి ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది, సివిల్ సర్వీసెస్ అడ్వైజరీ కమిటీ, అలాగే మొస్సాద్ ఏజెన్సీకి తప్ప… సదరు అక్కడి క్యాబినెట్ మంత్రివర్గానికిగానీ, పార్లమెంట్ కు కూడా ఎలాంటి ప్రమేయంగానీ, కనీసం ఎవరు ఎంపిక కాబోతున్నారన్న సమాచారంగానీ ఉండదంటే ఎంత పకడ్బందీ నియామకమో చెప్పాల్సిన పన్లేదు.
1996 వరకూ కూడా మొస్సాద్ చీఫ్ ముఖం బాహ్య ప్రపంచానికి తెలియనిచ్చేవారు కూడా కాదు. కానీ, 1996 నుంచి మేజర్ జనరల్ డ్యానీ యాటోమ్ నియామకంతో అది పూర్తిగా మారిపోయింది. ప్రతీ ఐదేళ్లకోసారి డిప్యూటీ కమాండర్ ను మార్చేసే సంస్కృతిలో భాగంగా.. ఆ చీఫ్ ఎవరనేది, ప్రకటించేవరకూ మొస్సాద్ ఆపరేషన్స్ లాగే సస్పెన్స్ కొనసాగాల్సిందే!
ఏ కీలక ఆపరేషన్స్ జరిగినా… స్పై మాస్టర్సే మొస్సాద్ లో కీలకం. డేవిడ్ డాడీ బర్నియాకు ముందు కూడా 12 మంది స్పై మాస్టర్సే మొస్సాద్ లో అత్యంత ప్రభావవంత శక్తులు. ఇటీవల కాలంలో మొస్సాద్ ఏజెన్సీ పూర్తిగా ఆధునీకరించారు. వెబ్ సైట్ పేజీతో పాటు.. ఫేస్ బుక్ పేజ్ కూడా నిర్వహిస్తోంది మొస్సాద్. మొస్సాద్ ఇన్స్పిరేషన్ తో.. ఫౌడా, ది స్పై, టెహ్రాన్, ఫాల్స్ ఫ్లాగ్ వంటి పలు ఇజ్రాయెల్ థ్రిల్లర్స్ కూడా మొస్సాద్ పేరును నిత్యస్మరణకు పెడుతున్నాయి.
అసలు మొస్సాద్ చీఫ్ ను ఎలా నియమిస్తారు..?
ప్రస్తుత డైరెక్టర్ బర్నియాకు ముందు మరో 12 మంది మొస్సాద్ డైరెక్టర్లలో కొందరు సీక్రెట్ సర్వీస్ లో కెరీర్ ఆఫీసర్లుగా పనిచేసినవారున్నారు. మరో ఐదుగురు మాత్రం ఆర్మీ నేపథ్యమున్నవారు సెలక్టయ్యారు. అయితే మరికొందరు రెండు సర్వీసుల్లోనూ అనుభజ్ఞులు.
ప్రస్తుత చీఫ్ బర్నీయా.. 2021లో యొస్సీ కోహెన్ నుంచి బాధ్యతలు స్వీకరించాడు.

1983లో బర్నియా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.. ఐడీఎఫ్ లో పనిచేశారు. న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత చదువులు చదివిన బర్నియా, పేస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందాడు. ఇజ్రాయెల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులోనూ పనిచేశాడు. అలా ఆర్థికవేత్తగా తన కెరీర్ ను నిర్మించుకుంటున్న సమయంలో ఆయన అనూహ్యంగా బాట మార్చుకున్నారు. సయరత్ మత్కల్ కమాండ్ యూనిట్ లో సైనికుడిగా పనిచేసిన తర్వాత ఆయన ప్రయాణం మొసాద్ నిఘా సంస్థ చీఫ్ వరకూ కొనసాగింది.
అంతకుముందు మొస్సాద్ కు నాయకత్వం వహించిన యొస్సీ కోహెన్ నేపథ్యం కూడా ఐడీఎఫ్ లోనే కొనసాగింది. ఒక ప్యారాట్రూపర్ గా స్వచ్ఛందంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లో పనిచేసి.. స్క్వాడ్రాన్ లీడర్ గా ఎదిగాడు. 2016లో మొస్సాద్ లో డిప్యూటీ హెడ్ గా, ఆ తర్వాత ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారుగా కూడా పనిచేశారు. 2017 నుంచే మొస్సాద్ దూకుడు మరింత పెంచింది. సైబర్ సెక్యూరిటీ వింగ్ ను మరింత బలోపేతం చేసింది. కొత్త స్టార్టప్ లకు తెరలేపి.. కొత్త ఆవిష్కరణలను ఆహ్వానించింది.
మొస్సాద్ చీఫ్ కాలపరిమితి ఐదేళ్లు..?
మొస్సాద్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించేవారి కాలపరిమితి సాధారణంగా ఐదేళ్లకు మించి ఉండదు. కానీ, 13 మంది స్పై మాస్టర్లలో మొస్సాద్ పదో చీఫ్ గా వ్యవహరించిన మీర్ డాగన్ 2002 నుంచి 2011 వరకూ అంటే 9 ఏళ్ల పాటు కొనసాగారు. అలాగే గత చీఫ్ కోహెన్ కు సంబంధించిన పదవీకాలాన్ని కూడా ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహు అప్పుడు ఆర్నెల్లపాటు పొడగించారు.
మొసాద్ డైరెక్టర్స్… వారిపై ఉన్న అభిప్రాయాలు!
2020లో ఇరాన్ అణ్వాయుధాల తయారీలో కీలకంగా వ్యవహరించిన మొహసిన్ ఫక్రిజాదేను పగటిపూటే మట్టుబెట్టిన విషయాన్నిగుర్తించిన గత చీఫ్ కోహెన్ ను జెరూసలెమ్ పోస్ట్ రిస్క్ టేకర్ గా అభివర్ణించింది. కోహెన్ ఇంపాక్ట్ మొస్సాద్ పై ఎంతగా ఉందంటే.. ఆయన ఒత్తిడితో సిబ్బందితో పాటు, మొస్సాద్ బడ్జెట్ ను కూడా పెంచేశారు. అరబ్బు దేశాల్లోని సున్నీ తెగలతో సంబంధాలు నెరిపే క్రమంలో కోహెన్ ఎఫెక్ట్ తో.. ప్రత్యేక విదేశాంగ మంత్రిత్వశాఖను కూడా ఏర్పాటు చేసింది ఇజ్రాయెల్.
కోహెన్ కు ముందు 2011 నుంచి 2016 వరకూ పనిచేసిన చీఫ్ తామిర్ పార్దోకు కొంత సాంప్రదాయకవాదిగా పేరుండేంది. ఇరాన్ అణు శాస్త్రవేత్త డారియర్ రెజాయ్ హత్యకు కారణం తామిర్ పార్దో గా జర్మనీకి చెందిన న్యూస్ ఔట్ లెట్ స్పీగెల్ గతంలో వెల్లడించింది. మోటార్ బైకుపై వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వెంటాడి గొంతుపై కాల్చినట్టుగా ఆ సైట్ పేర్కొంది.
ఇలా మొస్సాద్ చీఫ్ డైరెక్టర్స్ గా వ్యవహరించినవారి లైఫ్ స్టైల్స్ ఒక్కొక్కరివీ ఒక్కో తీరుగా ఉండటంతో పాటు.. మొస్సాద్ వంటి గూఢచర్య సంస్థను నడిపించడంలో మాత్రం వీరందరూ ఇజ్రాయెల్ లక్ష్యాలకనుగుణంగా పనిచేయడం విశేషం.
అసలు మొస్సాద్ ఎలా ప్రారంభమైంది..? ఎవరి బ్రెయిన్ చైల్డ్..??
ఇజ్రాయెల్ వ్యవస్థాపకుడు, మొదటి ప్రధాన మంత్రి డేవిడ్ బెన్ గురియోన్ ఈ సంస్థకు రూపకల్పన చేశారు. 1940ల కాలంలో అప్పుడు యూదులపై అరబ్బుల ఆధిపత్యం కొనసాగుతున్న క్రమంలో ఈ మొస్సాద్ ఏజెన్సీకి బీజం పడింది. మొదట్లో రక్షణ మంత్రిత్వశాఖ అధీనంలో పనిచేస్తూ.. విదేశాంగశాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్స్ ను కొనసాగించేది. యూరప్, అలాగే.. రక్షణశాఖ హెడ్ క్వార్టర్స్ టెల్ అవీవ్ నుంచి ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంటుంది. .
మొస్సాద్ ఓ సంచలనం… సినీ రైటర్స్ కూ క్రేజీ ప్రాజెక్ట్!
అలాంటి కొన్ని సినిమాల్లో ఆపరేషన్ ఫినాలే ఒకటి. నాజీ నేరస్థుడిగా ఇజ్రాయెల్ వెంటాడిన అడాల్ఫ్ ఐచ్ మాన్ సినిమా ఆ కోవలోదే! అలాగే 1972లో మ్యూనిచ్ మారణకాండలో ఇజ్రాయెల్ ఒలింపిక్ జట్టులోని 11 మందిని చంపిన వారిని కనిపెట్టి.. వారిని మట్టుబెట్టే రహస్య ఆపరేషన్ పై 2005లో వచ్చిన స్టీవెన్ స్పీల్ బర్గ్ మూవీ కూడా ఈ మొస్సాద్ ఆపరేషన్స్ కు సంబంధించిందే! 2019లో వచ్చిన ది రెడ్ సీ డైవింగ్ రిసార్ట్స్ వంటి సినిమాలకూ మొస్సాద్ స్పై ఆపరేషన్సే ప్రధాన ఇతివృత్తాలు.
సో మొత్తంగా ప్రారంభమైన్నాట్నుంచీ వార్తల్లో నిలుస్తున్న గూఢచార సంస్థగా.. మొస్సాద్ ది ఈ శతాబ్దంలోనే ఎవ్వరూ అందుకోలేని ఓ ప్రత్యేకత!



