ఓ పన్నెండేళ్ల బాలుడు తన ఆటగదిలో ఓ అణు రియాక్టర్ నిర్మించాడు. ఈ స్టేట్మెంట్ కాస్తా అబ్బురపర్చవచ్చు. కానీ, మీరు వింటున్నది నమ్మాల్సిన నిజం. ఆ బాలుడి గురించి తెలుసుకోవాలంటే డల్లాస్ కు వెళ్లి అతడి పరిశోధనలేంటో తెలుసుకుని రావాలి.
డల్లాస్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో 7వ తరగతి చదువుతున్నాడు టెక్సాస్ కు చెందిన 12 ఏళ్ల బాలుడు ఐడెన్ మెక్ మిలన్. అసలు, చాలామంది పీహెచ్డీ విద్యార్థులు కలలో కూడా ఊహించని విజయాన్ని సాధించాడితను. తన ప్లే రూంలో న్యూక్లియర్ ఫ్యూషన్ రియాక్టర్ ను తయారు చేసి పిట్ట కొంచెం చేత ఘనమని నిరూపించాడు.

అణు సమ్మేళనంతో కూడిన రియాక్టర్ ను తయారు చేసేందుకు మెక్ మిలన్ నాల్గేళ్ల తపస్సు చేశాడు. పరిశోధనలు చేస్తూ క్రమంగా అణు రియాక్టర్ భాగాలన్నింటినీ సమీకరించి నిర్మాణం చేశాడు. అంటే, 8 ఏళ్ల వయస్సుకే మెక్ మిలన్ అణు రియాక్టర్ తయారీపై దృష్టి సారించి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అప్పుడే అణు భౌతికశాస్త్రం, ఫ్యూషన్ ఎనర్జీ వెనుక ఉన్న క్లిష్టమైన సిద్ధాంతాలను అధ్యయం చేయడం ఆరంభించాడు.
ఇందుకోసం, వెస్ట్ డల్లాస్ కు చెందిన లాంచ్ ప్యాడ్ అనే సైన్స్ ప్రయోగాలను ప్రోత్సహించే స్వచ్ఛంద సంస్థ మెక్ మిలన్ కు సాయమందించింది. మెక్ మిలన్ వంటి విద్యార్థుల ఇంజనీరింగ్ ప్రాజెక్టులకు మార్గనిర్దేశం చేస్తుంది ఈ సంస్థ.
ఐడెన్ మెక్ మిలన్ అణు రియాక్టర్ తయారీ కోసం మొదటి రెండేళ్లు పూర్తిగా భౌతికశాస్త్రంలోని సిద్ధాంతాలపైనే దృష్టి పెట్టాడు. ముందుగా థియరీని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాకే.. అణు రియాక్టర్ ను తయారుచేసే పరికరాలపై ప్రాక్టికల్ గా పని ఆరంభించాడు.
న్యూక్లియర్ ఫ్యూషన్ అనేది రెండు తేలికపాటి పరమాణు కేంద్రకాలు కలిసి ఒక భారమైన కేంద్రకంగా మారే ప్రక్రియ. ఈ ప్రక్రియలో భారీ స్థాయిలో శక్తి విడుదలవుతుంది. సాంప్రదాయ అణు విద్యుత్ ఉత్పత్తిలో ఉండే దీర్ఘకాలిక రేడియోధార్మిక వ్యర్థాల్లేకుండా దాదాపు అనంతమైన, స్వచ్ఛమైన శక్తిని అందించే సామర్థ్యం కల్గి ఉండటంతో… మెక్ మిలన్ తయారు చేసిన న్యూక్లియర్ ఫ్యూషన్ రియాక్టర్ ఇప్పుడు సైన్స్ మేధావులనే అబ్బురపరుస్తోంది.
న్యూక్లియర్ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు మెక్ మిలన్ తల్లి ఆందోళన వ్యక్తం చేసింది. కానీ, మెక్ మిలన్ తల్లికి నచ్చజెప్పాడు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా నివారించగలడు, ఆ ప్రయోగాన్ని చేపడుతున్నప్పుడు భద్రతా ప్రమాణాలపై తనకెంత లోతైన అవగాహన ఉందో తల్లికి నమ్మకం కల్గించి మరీ ఐడెన్ ఈ న్యూక్లియర్ రియాక్టర్ ను తయారుచేశాడు.
ఏడో తరగతి చదివే విద్యార్థి అణు రియాక్టర్ ను ఎలా తయారు చేయగల్గాడు..?
ఏడో తరగతి చదివే విద్యార్థంటే సాధారణంగా పక్కపిల్లలతోనో, తన స్నేహితులతోనో ఆడుకుంటూ సరదా సరదా జీవితాన్ని గడిపే వయస్సు. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడప్పుడే బయట ప్రపంచమంటే ఏంటో తెలుసుకోవడం ఆరంభమయ్యే వేళ. లౌక్యం నేర్వని బాల్యం నుంచి కౌమరంలోకి అడుగిడే వయస్సు. కానీ, ఐడెన్ మాత్రం ఆ వయస్సుకు ముందే అణు భౌతికశాస్త్ర అధ్యయనాన్ని మొదలెట్టాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐడెన్ వయస్సుకు అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి చూపాడు. అందుకోసం అనేక సవాళ్లెదుర్కొన్నాడు. ఏళ్ల తరబడి రియాక్టర్ తయారీకి శ్రమించాడు.
కానీ, చివరకు తన రియాక్టర్ తయారై న్యూట్రాన్స్ ను ఉత్పత్తి చేయడంతో ఐడెన్ ప్రయోగానికి ఫలితం దక్కింది. విజయం చేరువైంది. న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అవ్వడమంటే అణు ఫ్యూషన్ జరిగిందనేందుకు నిర్ధారణన్నమాట. ఆ క్షణం తన నాల్గేళ్ల ఆరాటం, వేల గంటల శ్రమకు ఫలితం దక్కింది. మెక్ మిలన్ ప్రయోగంపై అనేక భద్రతా తనిఖీలూ నిర్వహించాకే.. తాననుకున్న విజయాన్ని చేరుకున్నాడతను.
అణు ఫ్యూషన్ భవిష్యత్తేంటి..?
ఇప్పటికే న్యూక్లియర్ ఫ్యూషన్ రియాక్టర్ నిర్మాణం చేసిన పిన్న వయస్కుడిగా ఐడెన్ రికార్డ్ సృష్టించాడు. ఈ రికార్డుకు సంబంధించి ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కూడా పరిశీలిస్తోంది. అయితే, తను ఖ్యాతి కోసం అణు రియాక్టర్ ప్రయోగం చేయలేదని.. సైన్స్ పై తనకున్న జిజ్ఞాసతోనే పరిశోధించినట్టు మెక్ మిలన్ చెబుతున్నాడు.
భవిష్యత్తులో ఫ్యూషన్ ఎనర్జీ ప్రపంచానికి అపారమైన శక్తి వనరుగా మారనుందంటున్నాడు ఈ బుడతడు. తన చిన్న గదిలో పరమాణువులను కలిపి శాస్త్రీయ ఆవిష్కరణలకు వయస్సు ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపిస్తున్నాడు.
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ (STEM) రంగాల్లో ఆసక్తి ఉన్న యువ విద్యార్థులకు ఐడెన్ మెక్ మిలన్ సాధించిన ఈ విజయం ఇప్పుడు ఓ స్ఫూర్తిపాఠం. ఐడెన్ విజయం వెనుక స్థానిక సమాజం మద్దతుతో పాటు, అతడికి సాంకేతిక వనరులందించేందుకు ప్రోత్సహించినవారి తోడ్పాటూ ఉంది.
ఇకముందూ సైన్స్ ప్రయోగాల్లో.. ముఖ్యంగా సస్టైనబుల్ ఎనర్జీ రంగంలో దూకుడు ప్రదర్శిస్తానంటున్న ఐడెన్ మెక్ మిలన్ కథ మేకర్స్ కు స్పేస్ కల్పించి, మంచి మెంటార్షిప్ దొరికితే ఎలాంటి భవిష్యత్ శాస్త్రవేత్తలు సమాజానికి అందివస్తారో తెలియజెప్పేది.



