కులం పేరిట.. మతం ముసుగులో కొట్టుకుంటున్న నవ నాగరిక సమాజంలో.. ఇప్పుడో కథ ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. సౌదీకి చెందిన ఓ యువకుడు తన హిందూ తల్లిని కలిసేందుకు కేరళకు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. విద్వేష శక్తులపై మానవత్వం సాధించిన విజయంగా చెప్పుకుంటున్నారు.
సౌదీ అరేబియన్స్ దుస్తుల్లో ఓ యువకుడు.. కేరళకు చెందిన ఓ వృద్ధ మహిళను ఆలింగనం చేసుకుంటూ కనబర్చే భావోద్వేగపు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. సదరు మహిళ పేరు వెల్లడించలేదుగానీ.. చూసేందుకు ఆ ఫోటో కుల, మతాలు, ప్రాంతాలను దాటి బంధాలు ఎంత గాఢంగా ఉంటాయో పట్టిచూపేది.

కొన్నేళ్ల క్రితం కేరళకు చెందిన సదరు ఓ హిందు మహిళ సౌదీలో ఓ ఇంట్లో పిల్లల ఆలనాపాలనా చూసేది. ఆ పిల్లల్లో ఒకడైన ప్రస్తుత యువకుడికి సదరు మహిళ అంటే ప్రాణం. ఎందుకంటే, సదరు కేరళ మహిళ పిల్లల్ని అలాగే చూసుకునేదట. అందులోనూ ప్రస్తుతం ఫోటోలో కనిపిస్తున్న యువకుడితో కాస్త మరింత ఎక్కువగా తల్లీ, కొడుకుల బంధం ఏర్పడినట్టుంది.
కాలం గడిచింది. ఆ పిల్లవాడు పెద్దగయ్యాడు. సదరు హిందూ మహిళ ఇండియాలోని తన సొంత రాష్ట్రం కేరళకు తిరిగివచ్చింది. కానీ, పెద్దగైన ఆ యువకుడిలో మాత్రం తల్లి జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. తనను పెంచుతున్నప్పుడు ఆమె చూపించిన ప్రేమ, ఆప్యాయతను మర్చిపోలేదు. దాంతో కొద్ది నెలలుగా ఆమెను వెతుకుతూ గాలింపు చేపట్టాడు. చివరకు వివరాలు సేకరించాడు. ఆమెను కనుగొన్నాడు. నేరుగా విమాన టిక్కెట్ బుక్ చేసుకుని కేరళకు చేరుకున్నాడు. ఆమె ఇంటి వద్దకు చేరుకోగానే సదరు యువకుడి గుండె బలంగా కొట్టుకుంది.
మరోవైపు, ఆమె తనను గుర్తు పడుతుందానన్న ఒకింత సందేహం!
కానీ, అతణ్ని చూసిన వెంటనే ఆమె గుర్తుపట్టింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. భేటా అంటూ చేతులు చాపి పిల్చింది.
అతడూ బాలుడైపోయి ఆ అమ్మ ఒడిలోకి ఒదిగిపోయాడు. అతడూ ఒక్కసారిగా భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక ఏడ్చేశాడు. ఆమె అతడి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. అదిగో ఆ క్షణం మతం, సరిహద్దులు ఇవన్నీ అప్రస్తుతమైపోయాయి. తల్లీ, కొడుకు మధ్యనుండే స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే కనిపించింది. అవునూ, ఇంకా మానవత్వమున్న మనుషులున్నారు. గురుత్వమున్న మహామనుషులున్నారనిపించేలా ఆ ఒక్క ఫోటో ఇంటర్నెట్ లో ఓ పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేసే చర్చకు తెరలేపింది.
ఆ ఫోటోలో ఉన్నదెవరు.. ఎప్పుడు జరిగిందన్నది పక్కనబెడితే… ఒక సానుకూల దృక్పథాన్ని కల్పించే చర్చకు ఆ తల్లీ కొడుకుల్లాంటి ఇద్దరి ఫోటో కథ కారణమైంది.
.



