సంపన్న కుటుంబంలో జన్మించింది. భారతదేశంలోనే ఓ ఐకానిక్ బ్రాండ్ జ్యూయెల్లరీ ఓనర్ ను వివాహమాడింది. వారికో పిల్లవాడు పుట్టాడు. జీవితం సాఫీగా సాగిపోతోంది. కానీ, ఒక రోజు ఆ జీవితాన్ని విషాదం ముంచెత్తింది. రోడ్డు ప్రమాదంలో భర్త మరణం సునామీలా ఓ కుదుపు కుదిపేసింది. అలా ఓ చిన్న బిడ్డకు తల్లైన ఒంటరి మహిళ.. విషాదంలోనూ సంకల్పాన్నంతా కూడగట్టుకుని ఎలా ఎదిగిందో చెబుతుంది మేఘాలీగుప్తా లైఫ్ స్టోరీ. అందుకే ఈ కథ ఆమె మాటల రూపంలోనే విందాం.
నా భర్త మరణించిన 15వ రోజునే నేను పని ప్రారంభించాల్సి వచ్చింది. ఎందుకంటే, గత్యంతరం లేని పరిస్థితి. ఇదీ ప్రముఖ జ్యుయెల్లరీ బ్రాండ్ కు వారసత్వ అధినేత్రిగా అవతరించి ఆ తర్వాత రికార్డ్ సృష్టించిన మేఘాలి గుప్తా చెబుతున్న కథ.

2013, ఫిబ్రవరి 13 ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో నా భర్త మోహిత్ గుప్తా మృత్యువాత పడ్డాడన్న వార్త జీర్ణించుకోలేకపోయాను. అతడి మరణం కుటుంబాన్ని కృంగదీసింది. ఓ సంపన్న కుటుంబంలో పుట్టిన నేను పుట్టింటికి తిరిగి వెళ్లలేను.. అలాగని, భర్త కుటుంబీకులపై ఆధారపడలేను. ఆ సమయంలో సరిగ్గా భర్త చనిపోయిన 15వ రోజుకే తక్షణ కర్తవ్యంగా ఆయన వ్యాపార బాధ్యతలు స్వీకరించాను.
మాది ఉమ్మడి సంపన్న కుటుంబం. ప్రేమ, సంరక్షణ, కావల్సినంత ఆనందంతో తులతూగే ఫ్యామిలీ మాది. కుటుంబ వ్యాపారాలపై నాకు పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకున్నాను. విదేశాలు వెళ్లాలనీ భావించాను. కానీ, నన్ను ఒంటరిగా పంపేందుకు మా కుటుంబం ఒప్పుకోలేదు. ఇంగ్లీష్ ఆనర్స్ చదివాను. 23 ఏళ్లకే ఆభరణాల వ్యాపారితో పెళ్లైంది. జీవితం అందంగా ప్రారంభమైంది. కానీ, ప్రయాణం ఆరంభంలోనే.. విధి వక్రించింది. 32 ఏళ్ల వయస్సులోనే నా భర్తను మృత్యువు తీసుకెళ్లిపోయింది. ఆ దృరదృష్టకర ఘటన నా జీవితంలో ఓ చేదు జ్ఞాపకం.
మా అత్త, మామలకు నా భర్త మోహిత్ గుప్తా ఏకైక కుమారుడు. కానీ, పెళ్లికి ముందే నా భర్త తల్లిదండ్రులను కోల్పోయాడు. పేరు, ప్రతిష్ఠలున్న కుటుంబం నా భర్తది. ఆయన ముత్తాత బహదూర్ షా జఫర్ వద్ద పనిచేశారు. ఆ చక్రవర్తి ప్రోత్సాహంతోనే నా భర్త కుటుంబం ఆభరణాల వ్యాపారంలోకి అడుగుపెట్టింది.
నా భర్త చనిపోయిన 15 రోజులకే నేను ఆయన బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. నా కొడుకు ప్లే స్కూల్ లో చదువుతున్నాడు. ఓవైపు ఆఫీస్ బాధ్యతలు.. మరోవైపు, ఇంటిపనులు. ఒకవైపు దుఖం, తల్లిగా పిల్లవాణ్ని చూసుకోవాల్సిన బాధ్యత, మరోవైపు వ్యాపారం.. ఇవన్నీ సమతుల్యం చేయడం కష్టమయ్యేది. ఏం చేస్తున్నానో, ఎలా చేస్తున్నానో, సరిగ్గా నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానో లేదోనన్న పలు సందేహాలు చుట్టుముట్టేవి. మొత్తంగా ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాననిపించింది.
ఆరంభంలో భావోద్వేగంపాళ్లు ఎక్కువ.. వృత్తిగతమైన ఆలోచనలు తక్కువ అన్నట్టుగా సాగింది లైఫ్. కానీ, బాధ్యతలు భుజాన వేసుకున్నాక ఎలాగైనా ఈదాల్సిందే. అందుకోసం నేర్చుకోవాల్సిందే. ఆ తలంపే మూడేళ్లపాటు వ్యాపారాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు అంకితభావంతో పనిచేసేందుకు పురిగొల్పింది. ఆపరేషన్స్, కస్టమర్ రిలేషన్స్, డిజైన్స్, టీమ్ మేనేజ్మెంట్.. ఇలా ప్రతీ అంశంలోనూ చురుకుగా పాల్గొనేదాన్ని. వారసత్వాన్ని స్వీకరించినంత మాత్రాన అన్నీ జరిగిపోవు.. అందుకు అర్హత సాధించాలి. సవాళ్లను ఎదుర్కోవాలన్న దృఢ సంకల్పంతో అడుగులు వేశాను.
మా బ్రాండ్ శ్రీరామ్ హరి రామ్ జ్యువెల్లర్స్. సుదీర్ఘ చరిత్ర ఉన్న బ్రాండ్. అలాంటి బ్రాండ్ లో సుమారు 20 నుంచి 40 ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బంది సహకారం పూర్తిగా మేఘాలికి లభించింది. ఆరంభంలో మాత్రం ఆమె నాయకత్వం అక్కడివారికి మింగుడుపడేది కాదు. కానీ, మెల్లిగా అందరితో కలిసిపోయి వినయంగా, నేర్చుకునే దృక్పథంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె కట్టుబాట్లు, నైపుణ్యం, కస్టమర్ రిలేషన్స్ చూసి సిబ్బందికీ అమితమైన గౌరవం పెరిగింది.
మేఘాలి వ్యాపార పనుల్లో ఉంటే తన సోదరుడి భార్య మేఘాలి కుమారుడి ఆలనా పాలనా చూసేది. ఆ భావోద్వేగ బంధం ఆమెను తన వ్యాపారంలో తలమునకలయ్యేందుకు తోడ్పడింది. వ్యాపారంలో పెద్దవారైన మామలు కూడా ఆమెకు మార్గదర్శులుగా సహకారమందించారు. ఇన్ని ఉన్నా కూడా అనుకోకుండా ఎదురయ్యే సవాళ్లు, ఎప్పటికప్పుడు ఎదురయ్యే సందేహాలు, అలసట, ఒంటరితనం, భర్త జ్ఞాపకాలు అన్నీ ఆమెను మానసికంగా అతలాకుతలం చేసేవి. కానీ, తనను తాను నిభాయించుకుని ధైర్యం కోల్పోకుండా అడుగులేసింది మేఘాలి.
అందుకే 230 ఏళ్ల జ్యుయెల్లరీ హెరిటేజ్ ను సమర్థవంతమైన వ్యాపారిగా ఎదిగి ముందుకు తీసుకెళ్తున్నారు మేఘాలి గుప్తా. దశాబ్దానికి పైగా ఐకానిక్ డిజైన్స్ క్రియేట్ చేసి ఆమె తన రంగంలో అనేక పురస్కారాలందుకున్నారు. 2022, 23, 24 సంవత్సరాల్లో వరుసగా జ్యువెల్లరీ ఎమినెన్స్ అవార్డ్సుకు జ్యూరీ సభ్యురాలిగా సేవలందించారు. సంప్రదాయం, సృజనాత్మకత, ఆధునికత.. మూడింటి మేళవింపుతో తన బ్రాండ్ ఆభరణాలకు కొత్త నిర్వచనమిచ్చారు.
భర్తను కోల్పోయిన 15 రోజులకే బాధ్యతలు చేపట్టిన మేఘాలి బిజినెస్ జర్నీ… ఓ గొప్ప విజయమే కాదు. భావోద్వేగపరంగా ఆమె చూపిన ధైర్యానికీ నిలువెత్తు నిదర్శనం. మేఘాలి లైఫ్ స్టోరీ వారసత్వాన్ని స్వీకరించడమే కాదు.. అందుకు కావల్సిన అర్హతలను సాధించడాన్నీ చెబుతుంది.
అందుకే మేఘాలీ గుప్తా తనలాంటి ఒంటరి మహిళలకు, నష్టాలెదురైనవారికీ చెప్పే నాల్గు మాటలేంటంటే..
నేర్చుకునే తత్వాన్ని ఎప్పుడూ ఆపకండి, మీకు మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకండి.
వినయంతో జీవించండి, కానీ, మీ ఆశయాలను మాత్రం చిన్నవి చేసుకోకండి.
సాయం కోరండి, అన్నీ ఒంటరిగానే చేస్తామనుకోవడం బలమనుకోకండి.
ఎదుగుదల ఓవర్ నైట్ లో లభ్యమయ్యేది కాదు, కాబట్టి సమయం తీసుకోండి.
ముఖ్యంగా ఎలాంటి పరిస్థితెదురైనా అది మీ పరిస్థితులను నిర్ణయించే నిర్ణాయక శక్తిగా అవకాశమివ్వకండి.
జీవితమెప్పుడూ మనమనుకున్న లెక్కలు, అంచనాల ప్రకారం జరక్కపోవచ్చు. అలాంటప్పుడు సహనం, విశ్వాసం, నిరంతర అధ్యయనాన్ని మాత్రం విడనాడొద్దంటోంది మేఘాలి. వీటితోనే అంధకార క్షణాలను నిర్వచనాత్మక అధ్యాయాలుగా మల్చవచ్చన్న ఆత్మవిశ్వాసం మేఘాలీ గుప్తాది.



