1965 వార్ లో అదృశ్యమైన ఫైటర్: దేవయ్య ఓ అన్ సంగ్ హీరో!!

భారత్ పాక్ మధ్య భీకర యుద్ధం నడుస్తున్న వేళ.. అదే భారత్ పాక్ యుద్ధంలో కనిపించకుండా పోయిన ఓ వీరుడి గురించి చెప్పుకుందాం. భారత్ పాక్ మధ్య 1965లో జరిగిన యుద్ధం ఎంత భీకరమైందో తెలిసిందే. ఆ యుద్ధంలో అదృశ్యమై ఏమైపోయాడో చాలాకాలంపాటు తెలియక, ఆ తర్వాత మరణించినట్టు ప్రకటించిన అజ్జమడ బొప్పయ్య దేవయ్యే మనం చెప్పుకోబోతున్న ఆ మహావీర చక్ర యోధుడు.

వీర్ పహారియా అజ్జమడ బి. దేవయ్యగా ప్రధాన పాత్రలో ఈ మధ్యే తెరకెక్కింది ఆయన బయోపిక్ స్కైఫోర్స్. అక్షయ్ కుమార్ కూడా ఓ కీలకపాత్ర పోషించిన ఆ బాలీవుడ్ సినిమా పెద్ద హిట్ ఏమీ కాకపోయినప్పటికీ.. ఓ అన్ సంగ్ హీరో గురించి ఓసారి స్మరించుకునే, తెలియని వారికి తెలియపర్చే ఓ అవకాశం కల్పించింది.

స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య గురించి చెప్పుకునేముందు మనం అసలు మొదట 1965లో భారత్- పాక్ మధ్య ఏంజరిగిందో కూడా కాస్త చెప్పుకుందాం.

1965 ఇండో-పాక్ వైమానిక యుద్ధం!

వైమానిక యుద్ధాల్లో ఇండియా-పాకిస్థాన్ మధ్య 1965లో జరిగిన వార్ చరిత్రలో మరో చీకటి అధ్యాయం. ఇండియా-పాక్ ఈ రెండు దేశాల మధ్య అదే మొట్టమొదటి వైమానిక యుద్ధం కూడాను. 1965 సెప్టెంబర్ మాసంలో వేలాదిమంది సైనికులు ఇటు భారత్, అటు పాకిస్థాన్ లో తమ రక్షణ కోసం దాడులకు తెగబడ్డారు.

ఓవైపు యుద్ధం కొనసాగుతుండగానే ఇటు భారత్, అటు పాకిస్థాన్ రెండు దేశాలు మాదే విజయమంటే మాదేనంటూ ప్రకటించాయి. ఇద్దరూ చెప్పిన లెక్కలు సరిపోలక ఓ గందరగోళ వాతావరణాన్ని సృష్టించాయి. తాము 104 ఎయిర్ క్రాఫ్ట్స్ ని నాశనం చేశామని.. అలాగే, తమ సొంత యుద్ధ విమానాలు పందొమ్మిదింటిని కోల్పోయామని పాక్ ప్రకటించింది. కానీ, అందుకు భిన్నమైన లెక్కలను భారత్ విడుదల చేసింది. 73 పాకిస్థాన్ యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్టు, తాము 35 ఎయిర్ క్రాఫ్ట్స్ ను కోల్పోయినట్టు భారత్ ప్రకటించింది. ఎవరికీ పూర్తిగా ప్రయోజనం లేని ఓ యుద్ధంగా.. ఎవ్వరికీ విజయం దక్కని ఓ యుద్ధంగానే ఆ వార్ ముగిసిపోయింది.

నాటి ఇండో-పాక్ వార్ కు బహుముఖ వివాదాలు కారణమయ్యాయి. సాయుధదళాల విమానాలు, అతి పెద్ద ట్యాంకర్స్ తో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన మరో భీకరయుద్ధమది. ఇరువైపులా గణనీయమైన నష్టమూ జరిగింది. దానివల్ల రాజకీయ, భౌగోళిక వివాదాలు మరింత పెరిగాయి. మొత్తంగా పాక్- భారత్ సంబంధాలు గతం కంటే దూరమయ్యేందుకు కారణమైన యుద్ధం 1965 వార్.

1965 ఇండో-పాక్ యుద్ధంలో స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య పాత్రేంటి..? అసలాయనెవరు..??

1965 ఇండో-పాక్ యుద్ధంలో స్క్వాడ్రన్ లీడర్ అజ్జమడ బొప్పయ్యది కీలకపాత్ర. ఆ యుద్ధంలో దేవయ్య అదృశ్యమయ్యాడు. సుభాష్ చంద్రబోస్ లాగానే అదృశ్యమైపోయిన ఆయన.. బతికున్నాడా, మరణించాడా అన్నదీ తెలియని పరిస్థితి. అలా దశాబ్దాలపాటు ఆయన ఉనికి ఓ రహస్యంగా మారింది. భారత వైమానిక దళం (INDIAN AIR FORCE) మొదట ఆయన అదృశ్యమైనట్లు నివేదించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు దేవయ్య మరణించినట్లు ప్రకటించింది. కానీ, ఆయన మరణంపై కచ్చితమైన ఆధారాలను మాత్రం చూపలేకపోయింది.

1965 యుద్ధం తాలూకు నష్టాన్ని అంచనా వేసేందుకు 1979లో బ్రిటీష్ రచయిత జాన్ ఫ్రైకర్ నేతృత్వంలో పాక్ వైమానిక దళం ఓ కమిషన్ నియమించింది. అప్పుడు ఫ్రైకర్ కమిషన్ దేవయ్య మరణించినట్టు ధృవీకరించింది. పాక్ సెంట్రల్ పంజాబ్ లోని సర్గోధ జిల్లా సమీపంలో లభించిన మృతదేహాన్ని అక్కడి గ్రామస్థులు ఖననం చేసినట్టు ఆయన తన నివేదికలో పేర్కొన్నారు.

ఆ తర్వాతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేవయ్య వీరమరణం చెందినట్టు ప్రకటించింది. వీరమరణం పొందిన దేవయ్యకు 1988లో భారత ప్రభుత్వం మహావీర్ చక్రను ప్రదానం చేసింది. యుద్ధం జరిగిన 23 ఏళ్ల తర్వాత మహావీర్ చక్ర పురస్కారాన్ని ఆయన భార్య స్వీకరించారు. దేశం కోసం పోరాడి అసువులు బాసిన సైనికుడిగా దేవయ్య పేరిట.. తన జన్మస్థలమైన కర్నాటకలోని కొడగు జిల్లా మడికేరిలో బస్ట్ స్టాండ్ సర్కిల్ కు ఆయన పేరు పెట్టుకున్నారు. అలాగే, ఆయన జ్ఞాపకార్థం ఆ ఊళ్లో ఓ విగ్రహాన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఓ బస్సు ఢీకొని ఆ విగ్రహం ధ్వంసం కావడంతో అది ఉద్ధేశపూర్వకంగా ఎవరైనా చేశారా అనే అనుమానాలకూ తావిచ్చింది.

ఇండో-పాక్ యుద్ధంలో సర్గోధను లక్ష్యంగా చేసుకుని స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య సాహసోపేతమైన ఎయిర్ క్రాఫ్ట్ దాడిలో పాల్గొన్నాడు. 12 యుద్ధవిమానాల్లో ఒకటి ఫెయిల్ అవ్వడం వల్ల ఎయిర్ ఇన్స్ట్రక్రటర్ గా వ్యవహరిస్తున్న స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య తానూ రంగంలోకి దిగాడు. దేవయ్య ఎయిర్ క్రాఫ్ట్ ను.. పాక్ శత్రుమూకల యుద్ధవిమానాలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ యుద్ధవిమానంలోంచి కాల్పులు జరిపి శత్రువులను కుప్పకూల్చిన దేవయ్య నిగ్రహం కోల్పోలేదు. కానీ, ఒక్కసారి పాకిస్థాన్ పైలట్ లెఫ్టినెంట్ అమ్జాద్ తన పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ AIF104 యుద్ధవిమానంతో దేవయ్య ఎయిర్ క్రాఫ్ట్ ను అడ్డగించాడు. అలా తన విమానం క్రాష్ అయి గతి తప్పింది. ఆ తర్వాత దేవయ్య కనిపించకుండా పోయారు.

మొత్తంగా నాటి 1965 ఇండో-పాక్ భయంకర వైమానిక యుద్ధంలో కీలకపాత్రధారిగా వ్యవహరించిన స్క్వాడ్రన్ లీడర్ అజ్జమడ బొప్పయ్య దేవయ్య.. వింగ్స్ ఆఫ్ ఫైర్ గా గుర్తింపు పొందాడు.

అలా దేవయ్య కథతో తెరకెక్కిందే స్కై ఫోర్స్. నాడు ఓ. పీ. తనేజా నేతృత్వంలో 13 ఎయిర్ క్రాఫ్ట్స్ దళాలు పాకిస్థాన్ పై చేసిన సాహసోపేతమైన యుద్ధం తాలూకు సన్నివేశాల కల్పనతో ఈ సినిమాను తెరకెక్కించారు. అక్షయ్ కుమార్ తనేజా పాత్ర పోషించగా.. స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య పాత్రలో వీర్ పహారియా నటించాడు. సారా అలీఖాన్ దేవయ్య భార్య పాత్ర పోషించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles