ఇండియా- పాక్ యుద్ధమైనా, క్రికెటైనా క్యూరియాసిటీని రేకెత్తించొచ్చునేమోగానీ.. సృజనాత్మక ఆలోచనల నుంచి మొదలు.. యుద్ధాల వరకూ అసలు మనం ఎదుర్కోవాల్సింది ఎప్పటికైనా చైనానే. అలాంటి చైనా నుంచి సిక్కింను కాపాడుకుని ఇండియా పట్టు బిగించిన ఆ యుద్ధం గురించి విన్నారా..? లేదంటే ఇక్కడ చదివేయండి.
1962లో ఇండియా- చైనా మధ్య జరిగిన యద్ధంలో ఇండియా ఘోర పరాభవాన్ని చవిచూసింది. కానీ, ఐదేళ్లు తిరిగేసరికి పరిస్థితి తలక్రిందులైంది. 1967లో చుంబీ వ్యాలీ సమీపంలో నాథూ లా, చో లా వద్ద జరిగిన రెండు యుద్ధాల్లోనూ భారత్.. చైనాకు గట్టి బుద్ధి చెప్పింది. భారత సైన్యానికీ, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి మధ్య జరిగిన ఆ పోరాటంలో ఇండియన్ సైన్యం 88 మంది అసువులు బాస్తే.. చైనీయుల సంఖ్య 300కు పైగానే. యుద్ధమంటేనే మరణంతో తలగోక్కోవడం. ఆ సంగతి కాస్సేపు పక్కనబెడితే, ఆ యుద్ధమే భారత్ కు సిక్కింపైన పట్టుకు కారణమైంది. తాము అజేయులమనే చైనా అహంకార భావనకూ గండి కొట్టింది.

1962 తర్వాత సరిహద్దుల్లో పరిస్థితులేలా మారాయి..?
1962లో చైనాతో యుద్ధంలో ఓటమితో భారత్ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయింది. కానీ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటివారి నాయకత్వం మళ్లీ భారత సైన్యంలో ఉడుకు నింపింది. 1965లో పాక్ తో జరిగిన యుద్ధంలో భారత్ పై చేయి సాధించాక.. మళ్లీ పుంజుకుంది. అదే సమయంలో సిక్కిం తనదేనంటూ చైనా మళ్లీ నాథూ లా, చో లా పాస్ వద్ద కవ్వింపు చర్యలకు దిగింది. అదిగో అక్కడ చైనాకు గట్టి బుద్ధి చెప్పింది భారత్.
నాడు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన చైనా గోర్ఖా రైఫిల్స్ జవాన్లను మీరు కత్తులు నూరి మాపైకి దూస్తే.. మా గోర్ఖాలు అంతకుమించి ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్నెలా ఎదుర్కోవాలో, బుద్ధి చెప్పాలో మాకు తెలుసంటూ భారత ఆర్మీ కల్నల్ కుల్ భూషణ్ జోషి గట్టిగా హెచ్చరించారు. 1967, సెప్టెంబర్ సమయంలో భారత సైన్యం చైనా బంకర్లను ధ్వంసం చేసింది. అక్టోబర్ ఒకటో తారీఖున చైనా మరింత ముందుకొచ్చినప్పుడు.. మన గోర్ఖాలు కౌంటర్ ఎటాక్ గా కత్తులు దూసి గట్టి బుద్ధి చెప్పారు.
చరిత్రలో నాథూ లా, చో లా వద్ద జరిగిన యుద్ధాలు చిన్నవిగానే కనిపించొచ్చునేమోగానీ.. అవి కీలకమైన యుద్ధాలు. తూర్పు హిమాలయాల్లో 15 వేల అడుగుల ఎత్తులో గడ్డ కట్టే మంచులో వీరోచితంగా జరిగిన పోరాటాలవి. 1962లో భారత్ ఎదుర్కొన్న అవమానానికి కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే అంతకంతకూ బుద్ధి చెప్పిన యుద్ధాలవి. బీజింగ్ ను షాక్ కు గురిచేసిన ఫైట్ అది. దాంతో సిక్కిం సరిహద్దుపైన భారత్ పట్టు సాధించింది. అది భారత సైన్యంతో పాటు, రాజకీయ నాయకత్వంలోనూ ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్నీ నింపింది. అదే ఆత్మవిశ్వాసం బంగ్లాదేశ్ విమోచనకు 1971లో జరిగిన భారత్, పాక్ యుద్ధానికి భారత్ కు ఉపయోగపడింది.
వాస్తవానికి పాకిస్థాన్ కు చైనా మిత్రదేశం. ఏ చిన్న అవకాశం దొరికినా భారత్ కు వ్యతిరేకంగా పాక్ కు మద్దతివ్వడానికి చైనా రెడీగా ఉంటుంది. కానీ, 1971 భారత్, పాక్ యుద్ధంలో మాత్రం చైనా తలదూర్చలేదు. అందుకు కారణం, అంతకుముందే 1967లో చైనాకు జరిగిన పరాభవం. సిలిగురి కారిడార్ కు దగ్గర్లో.. భారత్ ఎక్కడైతే 1962లో చైనాతో పరాభవాన్ని చవిచూసిందో.. అదిగో అక్కడే తన పట్టును చైనాతో జరిగిన యుద్ధంలోనూ, ఆ తర్వాత పాక్ తో జరిగిన యుద్ధంలోనూ నిలుపుకుంది.
యుద్ధాల చరిత్రలో భారతీయుల నుంచి చైనాకు తగిలిన రక్తపు గాయానికి 1967 యుద్ధం ఓ సందర్భం. ఇదే విషయాన్ని ఆర్మీ రిటైర్జ్ మేజర్ జనరల్ వీకే సింగ్ తన బ్లాగులో రాసుకొచ్చారు. చాలా మంది మర్చిపోయిన నాథూ లా, చో లా పాస్ లో 1967లో జరిగిన భారత్ చైనా యుద్ధాలను.. భారత సైనికుల వీరోచిత పోరాటన్ని జే. పీ. దత్తా paltan పేరిట 2018లో తెరకెక్కించారు.

1967లో చుంబీ వ్యాలీ సమీపంలో జరిగిన భారత్, చైనా యుద్ధాలకు ఈ వారంలో 58వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. అదే సమయంలో కొన్ని ప్రశ్నలూ ఉదయించేవే. 1962 తర్వాత ఐదేళ్లల్లోనే భారత్, చైనా మధ్య ఎందుకు మళ్లీ యుద్ధం వచ్చింది..? భారత్ అంత దీటుగా ఎలా ప్రతిఘటించగల్గింది..? 1967లో చైనాతోనూ, 1971లో పాకిస్థాన్ తోనూ భారత వ్యూహాత్మక ఆధిక్యం ఎలా సాధ్యమైంది..?
1962 తర్వాత అవమానం- కొనసాగిన సరిహద్దు వివాదం!
1962లో చైనాతో పరాభవం భారత సైనిక, రాజకీయ మనస్థితిపైనే తీవ్ర ప్రభావం చూపింది. ఎందుకంటే, ఆ యుద్ధంలో భారత్ 14 వేల 500 చదరపు మైళ్ల భూభాగాన్ని కోల్పోయింది. నార్త్, ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీగా పిల్చుకునే నేటి అరుణాచల్ ప్రదేశ్, లడాఖ్ లో జరిగిన యుద్ధాల్లో భారత్ ను చైనా ఘోరంగా ఓడించింది. 13 వందల మంది భారత సైనికులు వీరమరణం పొందారు. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఏమన్నారంటే.. మనమే సృష్టించుకున్న కృత్రిమ వాతావరణంలో మనం జీవించడమే మనం పట్టు కోల్పోయేందుకు కారణమంటూ ఒకింత నిర్వేదం వ్యక్తం చేశారు.
1967 వరకు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. 1965లో పాక్ తో జరిగిన యుద్ధంలో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వం.. ఆ తర్వాత ఇందిర సాహసవంతమైన పాలన సైన్యానికి మళ్లీ ధైర్యాన్నిచ్చింది. కానీ, సిక్కిం- టిబెట్ సరిహద్దులో చైనా దూకుడు మాత్రం తగ్గలేదు. భారత దౌత్యవేత్త కే. రఘునాథ్ ను గూఢచర్య ఆరోపణలపై చైనా విచారించడం మరింత ఉద్రిక్తతలకు తెరలేపింది.
కానీ, చైనా ఇప్పటికీ సిక్కింను తన చేతి ఐదువేళ్లల్లో ఒకదానిగా చెప్పుకుంటూనే ఉంది. అసలు ఒకదశలో సిక్కింలో ఇప్పటికీ భారత ఉనికినే చైనా అంగీకరించలేదు. మావో జెడాంగ్ సాంస్కృతిక విప్లవకాలాన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరింత దూకుడును ప్రదర్శించింది. నాథూ లా, చో లా భూభాగాన్ని తమవిగా ప్రచారం చేసుకుంది. సరిహద్దు ఘర్షణలు సర్వసాధారణమైపోయాయి. తరచూ చైనా గస్తీ బృందాలు భారత భూభాగంలోకి చొరబడేవి. రాళ్ల దాడులు, తోపులాటలవంటివీ ఆ సరిహద్దులో జరిగేవి. చైనా కన్నేసిన ప్రాంతాలన్నీ అరుణాచల్ ప్రదేశ్, సిక్కింగ్, ఉత్తరాఖండ్, తూర్పు లడాఖ్ వంటివన్నీ భారత భూ అంతర్భాగాలు. అదే సమయంలో భారత్, పాక్ తో 1965లో యుద్ధానికి సిద్ధమైంది.
1967లో సిక్కిం చోగ్యాల్ రాజు న్యూఢిల్లీ పర్యటన .. భారత్ సిక్కింపై మరింత పట్టు ప్రదర్శించే చర్యగా చైనా భావించింది. దాంతో తమ బంకర్ల వద్దనున్న సైన్యాన్ని చైనా అలర్ట్ చేసింది. ఆర్మీ మేజర్ జనరల్ సాగత్ సింగ్ నేతృత్వంలో భారత సైన్యం సరిహద్దు వెంట కంచె నిర్మించింది.
నాథూ లా వద్ద చైనా బంకర్ల ధ్వంసం!
1967, సెప్టెంబర్ 11న నాథూ లా వద్ద ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. భారత సైన్యం కంచె నిర్మించడాన్ని.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అడ్డుకుంది. చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కంచె కట్టే సమయంలో వైర్లు కడుతున్న కొద్దీ చైనా దూకుడు పెంచింది. బెదిరింపులూ అంతకంతకూ పెరిగాయి. చివరకు చైనా కాల్పులు ప్రారంభించింది. భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ రాయ్ సింగ్ కాల్పుల్లో కిందపడిపోవడంతో.. భారత జనాన్లు ఇక ఎదురుదాడితో తీవ్రంగా ప్రతిఘటించారు. పీఎల్ఏ మిషన్ గన్స్, మోర్టార్స్ తో దాడికి తెగబడింది. కానీ, భారత్ ఆర్మీ వెనుకడుగు వేయలేదు. బ్రిగేడియర్ సాగత్ సింగ్ ఆదేశాల మేరకు భారత్ తన ఆయుధ సంపత్తితో సై అంటే సై అంది. ఆ యుద్ధంలో చైనానే వెనక్కి తగ్గాల్సి వచ్చేలా భారతీయ సైనికులు పోరాట పటిమను ప్రదర్శించారు. అలా 1967, సెప్టెంబర్ 14వరకు నాథూ లా భూభాగమంతా పూర్తిగా భారత్ ఆధీనంలోకి వచ్చేసింది.
చో లా వద్ద గోర్ఖాల ఖుక్రీల ఘాటు యుద్ధం!
ఖుక్రీ అంటే నేపాలీల సంప్రదాయ కత్తి అని అర్థం. సెప్టెంబర్ లో చైనా నాథూ లా వద్ద చేతులెత్తేసిన రెండు వారాల్లో అక్టోబర్ 1న చైనా మరోసారి చో లా భూభాగం వద్ద కవ్వింపు చర్యలు చేపట్టింది. పొగమంచులో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ముందుకు దూసుకురాగా.. ఆ పరిస్థితులను ముందే ఊహించిన భారత 7/11 గోర్ఖా రైఫిల్స్, 10 జాక్ రైఫిల్స్ సైన్యం సిద్ధంగా ఉంది.
జై మా ఖాళీ- ఆయో గోర్ఖాలీ అనే నినాదాలతో గోర్ఖాలు తమ పదునైన కత్తులు దూశారు. ఆ యుద్ధంలో భారత గోర్ఖాల బృందంలోని రైఫిల్ మ్యాన్ దేవీ ప్రసాద్ లింబు.. మిషన్ గన్ తో దూసుకొచ్చిన ఓ చైనీస్ సైనికుణ్ని తన ఖుక్రీ (కత్తి) తో సంహరించిన ఘటన కూడా ఆ యుద్ధచరిత్రలో ఓ ప్రధానమైన పేజీ. దాంతో చైనా సైన్యం ఇక చేసేదిలేక చేతులెత్తేసి పూర్తిగా వెనక్కి తగ్గింది.
1967 విజయాల ప్రభావం!
చైనా వంటి శక్తివంతమైన దేశంపై నాథూ లా, చో లా రెండు చోట్లా విజయం సాధించాక భారత సైన్యం ఆత్మస్థైర్యం హిమాలయాలంత ఎత్తుకు పెరిగిపోయింది. ఆ ధైర్యం, వ్యూహాలే 1971లో పాక్ పై విజయానికి దోహదం చేశాయి. ప్రతిదానికీ గెలికి గిల్లికజ్జాలు పెట్టుకునే చైనా పాకిస్థాన్ తో జరిగిన 1971 యుద్ధంలో కనీసం అటువైపుగా చూడకపోవడానికి కారణం కూడా 1967 యుద్ధంలో చైనాకు భారత్ చెప్పిన గుణపాఠమే. ఆ యుద్ధంతో సిక్కింపై భారత్ పట్టు బిగించింది. 1975లో సిక్కిం భారత్ లో విలీనమైంది 2017 డోక్లాం ప్రతిష్ఠంభనలో కూడా 1967 ఆత్మవిశ్వాసమే భారత సైన్యానికి మార్గదర్శకమైంది. గాల్వాన్, డోక్లాం ఘటనల నేపథ్యంలో 1967 విజయాలు చెప్పిన నీతేంటంటే… ఎంత పెద్ద పరాజయమెదురైనా ధైర్యాన్ని కోల్పోకుండా తిరిగి సంసిద్ధమవ్వడం, అందుకు కావల్సిన సంకల్పం. ధైర్యాన్ని ప్రోది చేసుకోగల్గితే ఎంతటి శత్రువైనా మట్టి కరిపించవచ్చు.



