Vamsy Krishna… ✍🏼
……………………………………………………
ఇద్దరు ప్రధాన మంత్రులు
భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నెహ్రు కుటుంబానికి చెందని ఇద్దరు.. ప్రధానమంత్రులుగా పాలించారు. ఒకరు తెలుగు బిడ్డ పాములపర్తి వెంకట నరసింహా రావు కాగా.. మరొకరు పంజాబ్ సర్దార్ డాక్టర్ మన్మోహన్ సింగ్ .
ప్రధానమంత్రులు గా వీరిద్దరి ఎన్నికలో, వీరిద్దరి పరిపాలనలో చాలా సామ్యాలు, తేడాలు వున్నాయి . ఒకరు అపర చాణక్యులుగా పేరు తెచ్చుకుంటే.. మరొకరు యాదృచ్ఛిక ప్రధానమంత్రిగా అపఖ్యాతి పాలు అయ్యారు . ప్రధానమంత్రి కాకముందు పివికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా (స్వల్ప కాలం) విదేశీ వ్యహారాలు, మానవవనరుల శాఖల కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం వుంది. మన్మోహన్ కు ఆర్ధిక మంత్రిగా పనిచేసిన అనుభవం వుంది.

పివిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధీ ఎంపిక చేస్తే , ఆమె కోడలు సోనియాగాంధీ శంకర్ దయాళ్ శర్మ ప్రధాన మంత్రి పదవిని తిరస్కరిస్తే.. పివిని ఎంపిక చేశారు. ఇందిరాగాంధీకి అప్పుడు ఒక బలహీనమైన మనిషి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావాలి. కనుక ఏ కాంగ్రెస్ ముఠాల బలమూ లేని పివిని ఎన్నిక చేసింది. పివి అధికారం యిచ్చిన బలంతో భూసంస్కరణలలాంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని, గట్టిగా మాట్లాడి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ నేపధ్యంలో పదవి పోగొట్టుకుని ఢిల్లీకి వలస వెళ్లి ఆ నగరాన్ని తన శాశ్వత నివాసంగా మలచుకున్నారు.
ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి అనుభవ పాఠాలను నెమరు వేసుకుంటూ మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు అసిధారా వ్రతంలా నడిపి చరిత్రలో తన పేజీ తాను లిఖించుకున్నారు. ముఖ్యమంత్రిగా గట్టిగా మాట్లాడి పదవి పోగొట్టుకున్న పివి.. ప్రధానమంత్రిగా మౌనవ్రతం పాటించి పదవి నిలుపుకుని.. తాను అనుకున్నది నిరాటంకంగా చేశారు. పివి చాణక్యం అంతా రెండు అధికార కేంద్రాలు లేకుండా చూసుకోవడంలోనే వుంది. ప్రధాని అయిన మొదట్లో 10 జనపధ్ ను తరచూ సందర్శించి.. విమర్శలకు తావిచ్చిన పివి ఆ తర్వాత ఆ సందర్శనలు చాలా వరకు తగ్గించారు .
లైసెన్స్ రాజ్ ను వదిలించుకుని ఆర్ధిక సంస్కరణలను కొనసాగించడానికి రాజీవ్ పేరును పదే పదే వల్లించి అంత:పురం నుంచి ఎదురులేకుండా చూసుకున్నారు. విదేశాంగ విధానంలో లుక్ ఈస్ట్ విధానానికి పునాది వేశారు. ఏ ప్రమాదమూ లేదు అనుకున్నప్పుడు మెరుపు కంటే వేగంగా నిర్ణయాలు తీసుకుని, వ్యతిరేకత వస్తుంది అనుకున్నప్పుడు analasys until peraalasys అనే విధానం అవలంబించారు. తన నిర్ణయాలు, వాటి పర్యవసానాల గురించి లోతుగా అధ్యయనం చేసే నరసింహారావు.. ఆర్ధిక సంస్కరణలు మిస్ ఫైర్ అయినప్పుడు సంస్కరణలకు మకరముఖం తప్పిస్తే.. మానవముఖం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. కాంగ్రెస్ రెండోసారి గెల్చి మళ్ళీ పివి రెండోసారి ప్రధానమంత్రి అయి ఉంటే (అసంభవమైన ఊహ అయినా సరే ) పివి తరువాత మళ్ళీ ఇన్నాళ్లకు అవి ఈ రూపంలో ఉండేవి కాదేమో అనిపిస్తుంది. పాకిస్థాన్ విషయంలో ఏమీ చేయకుండా ఏదో చేసే వ్యూహాన్ని ఆయన అనుసరించారు .
ఆయన తరువాత వాజ్ పేయి కార్గిల్ లో యుద్ధం చేస్తే, మళ్ళీ ఇప్పుడు మోడీ ఆపరేషన్ సిందూర్, సింధు జలాల ఒప్పందం నిలిపివేత వంటి కొత్త వ్యూహలతో సంబంధాలను నిర్వచిస్తున్నారు.
సుస్థిర ప్రభుత్వాన్ని అందించడం, ఆర్ధిక సంస్కరణలను మొదలుపెట్టడం, విదేశీ వ్యవహారాల్లో తూర్పు వైపు అని చూపు సారించడం.. ఇలా అతడు అనేక యుద్ధముల ఆరితేరినవాడు పివి.
ఇందుకు విరుద్ధంగా మన్మోహన్ సింగ్ కు.. ప్రభుత్వాన్ని కాపాడుకునే తలనొప్పి లేదు. పివికి భిన్నంగా రెండు అధికార కేంద్రాలను అనుమతించి ప్రభుత్వాన్ని కాపాడుకోవటం అనే తలనొప్పిని మించిన తలనొప్పి కొని తెచ్చుకున్నారు. ఆ నొప్పిని బయటకు కనిపించకుండా సాంప్రదాయ పంజాబీ తలపాగా మాటున దాచి పెట్టారు. పివి మంత్రివర్గంలో ఆర్ధిక సంస్కరణలు మొదలు పెట్టినప్పుడు సగటు కాంగ్రెస్ వాదుల విమర్శలకు కోపగించుకుని మంత్రిపదవికి రాజీనామా సమర్పించి.. పివి దానిని ఆమోదించకపోతే అయిష్టంగానే కొనసాగిన మన్మోహన్.. తాను ప్రధాని అయిన తరువాత ప్రభుత్వ పరంగా తాను ప్రకటించిన ఒక విధాన నిర్ణయాన్ని రాహుల్ గాంధీతో పంచుకున్న ఒక సభలో ఆ విధానంపై రాహుల్ వ్యతిరేకత ప్రకటిస్తే వేదిక మీదే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే సహనాన్ని ఆయన అలవరచుకున్నాడు .
పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలు తనను ఇరుకునపెడతాయి అని భావించినప్పుడల్లా వారిని ఇరుకునే పెట్టె అంశాలవైపు పివి దృష్టి సారిస్తే.. మన్మోహన్ నిస్సహాయంగా నిలిచేవారు.
మన్మోహన్ తన పదవీకాలం మొత్తం మీద విపక్షాల మీద విసుక్కున్నది ఒకే ఒక సందర్భంలో. ప్రతిపక్షాలు సభని స్తంభింపచేసి వినతి పత్రాన్ని ఇవ్వడానికి తన ఛాంబర్ కు వస్తే.. సభలో అడగవలసిన విషయాలకు ఛాంబర్ లో వినతి పత్రాలు ఎందుకు అని చురక వేయడం ఒక్కటే ఆ సందర్భం.
పివికి సోనియాను సంతృప్తిపరచవలసిన బాధ్యత ఎప్పుడూ మీద కత్తిలా వేలాడుతూ ఉంటే మన్మోహన్ కు ఆ బాధ్యత రెండింతలు పెరిగి.. మెడ మీద నాలుగు కరవాలాలు అయ్యాయి. పివి మొదటినుండీ కాంగ్రెస్ రాజకీయాలలో ఆరితేరి తన సహచర నాయకుల గురించిన కూలంకషమైన అంచనాలు ఉండి.. ఎవరిని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేవారు.
మన్మోహన్ కు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదివిన, పనిచేసిన అనుభవం తప్పితే.. రాజకీయ రణతంత్రాలు తెలియవు. అందుకే కాంగ్రెస్ నాయకులు ఆయన మీద స్వారీ చేసేవారు. పివి తను సాధించిన విజయాలను తనకున్న పరిస్థితుల రీత్యా.. రాజీవ్, నెహ్రుల మాటున దాచి ఉంచేవారు. ఈ వ్యూహాన్ని రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత అనుసరించారు.
మన్మోహన్ తాను సాధించిన విజయాలు సోనియా ఖాతాలో పడిపోతున్నా నిర్లిప్తంగా ఉండేవారు . తిరుపతి ప్లీనరీని పివి అంతా తానై నడిపిస్తే ( ఆ ప్లీనరీకి సోనియా రాలేదు ).. మన్మోహన్ ప్రధానిగా వున్నప్పుడు జరిగిన ప్లీనరీలో మన్మోహన్ ఏ ప్రాధాన్యతా లేకుండా ఒక మూలగా ఉండిపోయారు. ఈ ప్లీనరీ జరుగుతున్నప్పుడు రాసిన రన్నింగ్ కామెంటరీలో ఓ వ్యాసకర్త.. “ప్లీనరీలో పాపం మన్మోహన్.. తనకంటూ స్పేస్ లేక మోము చిన్నబోయెన్” అంటూ రాశాడు.
ఇద్దరు ప్రధానమంత్రుల దగ్గర పనిచేసిన సంజయ్ బారు పివి గురించి రాసిన పుస్తకంలో ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తే.. మన్మోమోహన్ ను యాదృచ్ఛిక ప్రధానమంత్రి అన్నాడు.
పివి పరిపాలన మీద ఇన్నాళ్లకు నాలుగు, ఐదు పుస్తకాలు కనిపిస్తుంటే.. మన్మోహన్ మీద నిష్పాక్షికంగా పుస్తకాలు రావలసిన అవసరాన్ని ఈ సమయం గుర్తు చేస్తున్నది.
ఇవాళ పి. వి వర్ధంతి.



