20 ఏళ్ల కుర్రాడు.. ఊరంతా మద్యం మాన్పించేశాడు!

పిట్ట కొంచెం… కూత ఘనం!

బెదిరించారు… వెరవలేదు.. పైగా తిరిగి ఎదిరించి నిలబడ్డాడు… గ్రామంలో మద్యాన్నీ, బాలకార్మిక వ్యవస్థనే లేకుండా చేశాడు. అదీ కేవలం ఓ 20 ఏళ్ల కుర్రాడి ఘనత. పేరు సూర్జీత్ లోదీ… ఊరు మధ్యప్రదేశ్ విదిషా జిల్లాలోని గంజ్ బసోడా గ్రామం.

పుట్టుకతోనేమీ రాదు అలవాటు. కానీ ఏదైనా అలవాటయ్యాక మాత్రం వదలడం చాలా కష్టం. అది వ్యసనమై రూపాంతరం చెందిందా ఇక పని ఔట్! అదిగో ఆ స్థితి నుంచి గ్రామాన్ని కాపాడాడు సూర్జీత్. మద్యానికి బానిసలైన అధిక జనాభాకు కేరాఫ్ అడ్రస్ గా మారి… ఇంట్లో ఆడవాళ్లు, పిల్లలు ఆ మద్యం మత్తులో గృహహింసకు గురువుతున్న పరిస్థితులను మార్చేశాడు. తన ఊరు గంజ్ బసోడాను… ఇప్పుడు మద్యరహిత గ్రామమే కాదు… బాలకార్మిక వ్యవస్థా ఎక్కడా కనిపించకుండా చేశాడు.

ఇదేమంత ఒక్కరోజులోనో ఈ ఒక్కొడితోనో జరిగిందేమీ కాదు… కానీ అందుకు మూలం మాత్రం లోదీ ఒకేఒక్కడు. 20 ఏళ్ల వయస్సులో పిట్టకొంచెంగా కూతఘనంగా ఉంటే మద్యానికి బానిసలైపోయిన ఏ నడివయస్కుడు మాత్రం వింటాడు… ఏ పెద్ద మనిషి మాత్రం పట్టించుకుంటాడు…? అందుకే లోదీ వ్యూహాత్మకంగా పావులు కదిపాడు. తనతోటి పిల్లలతో స్నేహాన్ని పెంచుకున్నాడు. అలా వీలైనంత ఎక్కువ మందిని ఫ్రెండ్స్ ని చేసుకున్నాడు. ఓ 90 మందిని తన కాజ్ ఏదైతే ఉందో దానికనుగుణంగా తలూపేటట్టు చేశాడు. కాదు కాదు… వాళ్లంతా ఒక్కొక్కళ్లూ ఒక్కో లోదీలా తయారయ్యేట్టు వారికి మద్యం గురించి జరుగుతున్న అనర్థాల గురించి చెప్పుకొచ్చాడు. అయితే, ఇదంతా లోదీ తన 17 ఏళ్ల వయస్సులోనే మొదలెట్టాడు.

గంజ్ బసోడాలో బెల్ట్ షాపుల సంఖ్య అధికం. కానీ లోదీ వ్యూహం ఫలించింది. తనతోటి స్నేహితులు 90 మంది ఇళ్లల్లో తమ తండ్రులు మద్యం మానేస్తేనేగానీ అన్నపానీయాలు ముట్టమని భీష్మించేలా వారిని కౌన్సిలింగ్ చేశాడు. దాంతో కన్నపేగుల మీద ఉన్న ప్రేమతో… తండ్రులు తాము బానిసైన మద్యాన్ని కూడా వదిలి.. మెల్లిమెల్లిగా ఆ వ్యసనానికి దూరమై తమ అలవాట్లను మార్చుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఉద్యమం పక్క గ్రామాలకూ పాకింది. గంజ్ బసోడాతో స్పూర్తితో… లెహ్దేరా పంచాయితీ పరిధిలో ఉన్న మరో రెండు గ్రామాలైన సాహ్వా, బిలాయ్ ల్లోనూ ఇప్పుడు మద్యనిషేధం పూర్తిగా అమల్లోకి వచ్చేసింది.

ఈ ఉద్యమాన్ని లోదీ కేవలం 13 ఏళ్ల టీనేజ్ వయస్సులోనే ప్రారంభించాడు. లోదీ తండ్రి మద్యానికి బానిసై తన తల్లినీ, తనను ఇంట్లోగృహహింసకు గురి చేయడంతో పాటు… తండ్రి మాట్లాడే మాటలతో మానసికంగా బాగా డిస్టర్బైనాడు. పైగా లోదీ తండ్రి మద్యానికి బానిసైఉన్నదంతా ఊడ్చేయడంతో.. వీరి కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా పూర్తి దిగజారిపోయింది. మరోవైపు ఆ వయస్సులో చదువుకునేందుకు డబ్బులేక చదువు మానేసిన సూర్జీత్ ని తండ్రి పనికి వెళ్లి సంపాదించాలని తన మద్యపానం కోసం వేధించేది. ఈ విషయం కాస్తా కైలాస్ సత్యార్థి ఫౌండేషన్ సభ్యులకు చేరింది. వారు వచ్చారు. లోదీ తండ్రిని కౌన్సిలింగ్ చేసే యత్నం చేసినా… ఆయన కుటుంబ విషయాల్లో ఇతరులు తలదూర్చేందుకు ఏమాత్రం సందివ్వలేదు. దాంతో చేసేదిలేక తిరిగి వెళ్లిపోయారు. అయితే సూర్జీతే పట్టువదలని విక్రమార్కుడిలా తన తండ్రి మద్యం మానేసేవరకూ ఉపావాస దీక్ష చేశాడు. దాంతో తండ్రి దిగిరాక తప్పలేదు. ఈ స్ఫూర్తి ఊరంతా పాకడంతో పాటు… సూర్జీత్ చూపించిన బాట అందరికీ అనుసరణీయమై పక్క పల్లెల్లో కూడా మద్య నిషేధం అమల్లోకొచ్చింది.

అంతేకాదు, తన ఊరుతో పాటు… పక్క ఊళ్లల్లోనూ స్కూల్ డ్రాపవుట్లై… బాలకార్మికులుగా పనిచేస్తున్న వారి వివరాలు సేకరించి.. వారందరినీ మళ్లీ బడిబాట పట్టించడంలోనూ లోదీ… ఆయన స్నేహబృందమంతా ఒక పట్టుదలతో పనిచేశారు. అనుకున్నది సాధించారు. ఇప్పుడు మద్యనిషేధంతో పాటు… బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా లోదీ, ఆయన మిత్రబృందం పనిచేస్తోండగా… లోదీ తెగువ, పట్టుదలపై గ్లోబల్ ఫ్లాట్ ఫామ్స్ లోనూ చర్చకు వచ్చింది. 1999లో ప్రారంభమై.. సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో పనిచేసేవారికి ఐక్యరాజ్యసమితి ఇచ్చే ప్రతిష్ఠాత్మక డయానా అవార్డ్ లోదీకి దక్కింది. 2021లో తన పదిహేడో ఏట ఆ అవార్డ్ అందుకున్నాడు.

డయానా అవార్డ్ తనపై మరింత బాధ్యత పెంచిదంటున్నాడు జస్ట్ పదిహేడేళ్ల ఈ కుర్రాడు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకై 1960 దశకంలో ప్రారంభించిన కైలాస్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ లోనూ చేరి బాలమిత్ర గ్రామ్ అనే కార్యక్రమంలో తాను సైతం అంటున్నాడు. అయితే సూర్జీత్ పట్టుదలకు.. స్థానిక గ్రామపంచాయితీ పాలకవర్గం కూడా తోడ్పాటునందించింది. దాంతో బెల్ట్ షాపులపై దాడులు జరిగాయి. అదే సమయంలో మద్యం మాఫియా నుంచి బెదిరింపులు వచ్చినా ఖాతర్ చేయకుండా పట్టుదలతో తాననుకున్న లక్ష్యాన్ని చేరాడు సూర్జీత్ లోదీ. మద్యం మాఫియాకు ఆర్థికాధారమైన బెల్ట్ షాపులను మూసేయడం వల్ల వారి పొట్ట కొట్టకుండా… వారికీ గ్రామపంచాయితీ తోడ్పాటుతో పాటు… సామాజికంగా కొంత చందాలు వసూళ్లు చేసి వారి పిల్లల చదువుల కోసం కూడా చేయూతనందించిన బాధ్యత ఓ పదిహేళ్ల కుర్రాడిదంటే.. ఇది కదా సమాజంలో ఓ బాధ్యతకల్గిన పౌరుడి పాత్ర అంటే…?!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles