Maruthi Powrohitham… ✍️
ఇటీవల కన్నడ భాషలో అందరి ఆదరణ పొందిన పిల్లల సినిమా “పప్పీ” ఉత్తర కర్నాటక(రాయచూర్ ప్రాంతం ) నుండి ఒక కుటుంబం(దుర్గప్ప, అతడి భార్య, బావ కనకప్ప, కొడుకు పరశురాం) తము చేసిన అప్పలు తిరిగి చెల్లించే ప్రయత్నంలో భాగంగా బెంగళూరుకు వలస వస్తుంది. కూటికోసం , కూలికోసం పట్టణంలో బ్రతుకుదామని ఊరు విడిచిన ఆ కుటుంబం మురికివాడలో నివాసం వుంటూ రోజూ మట్టిపనికి పోతుంటారు. అయితే బెంగళూరుకి వలస వచ్చిన ఆ కుటుంబానికి తమ పిల్లవాడి చదువు పట్ల శ్రద్ధ ఉంటుంది. ఆ వాడలోనే అందరూ తలా కొంత మొత్తం వేసుకొని ఒక టీచర్ ను నియమించుకొని రేకుల షెడ్ లో ఒక స్కూలును నిర్వహించుకొంటూ ఉంటారు. ఈ సినిమాలో హీరో పరశురాం అలియాస్ పరశు. పరశుకు స్కూలులో ఆదిత్య అలియాస్ ఆది అనే అబ్బాయి స్నేహితుడు అవుతాడు. ఈ ఆదిత్య కుటుంబం కూడా హోస్పేట దగ్గర ఉండే ఉలిగి నుండి బెంగళూరుకు వలస వచ్చిన కుటుంబమే. ఈ పిల్లల ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు అత్యంత సహజంగా ఉంటాయి.

ముఖ్యంగా సినిమాలోని రాయచూరు, కొప్పల్ ప్రాంతపు మాండలికంలోని సంభాషణలు వినడానికి చెవులకు ఇంపుగా ఉంటాయి. ఈ మాండలిక సంభాషణలే ఈ సినిమాకు ప్రాణం. సినిమా మొదలు అయినప్పటి నుండి ముగిసే దాకా సహజమైన దృశ్యాలు, సహజమైన కల్మషం లేని సంభాషణలు మనలను ఆకట్టుకొంటాయి. దాదాపు అందరూ అత్యంత సహజంగా నటించారు. సినిమా కథ చెప్పను కాని కొన్ని సంభాషణలను పరిచయం చేస్తాను. బహుశా ఈ మాండలికం మా కర్నూలు పశ్చిమప్రాంతపు మాండలికాన్ని పోలి వుండడం వలననేమో నన్ను విపరీతంగా ఆకట్టుకొంది.
“ఎయ్ ! పావురాలు ! మస్తున్నాయి కదా!”
“ ఇవి నావే లే ! మా యప్ప కొనిచ్చిండాడు”
“మీ యప్పకు నీవంటే జీవం కదలే”
“అవ్వు. ఒక్కడే కొడుకుని కదా”
“కొడకా! మామేం యాభై మంది ఉండామా యలే! నానుండేది కూడా ఒక్కడే . ఒక రూపాయడిగితె ఇచ్చేకి యాడాది సేస్తాడు. సారాయి తాగేకి, కబాబ్ తినేకి వాడి దగ్గర దుడ్లు ఉంటాయ్ గానీ, నాకిచ్చేకి ఉండేల్లెవు”
****
“లే పరుశు! ఈ పావురాలు అమ్మితే మా యప్ప తంతాడు లే ”
“ అమ్మినంక నీ పావురాలు నీకి తెచ్చిస్తా కదా ”
“కొనుక్కున్నోల్లు పావురాలు ఏంటికి ఏనక్కిస్తారు”
“ ఈ పావురాలకి ఒక శక్తి ఉంటాదలే. ఎవురు సాకింటారో వాళ్ళింటికి అవి తిరిగి వొచ్చె వొస్తాయలె. ఇన్నిదినాలు బెంగళూరు బడిలో ఏమి నేర్సుకొనిండావులే. నాను అనుకొనినదానికన్నా ఈనికి మొబ్బు జాస్తే ఉండాది ”
*****
“లే పర్షా ! మనం పావురాలు అమ్మింది మాయప్పకి తెలిసింది లే “
“ఎట్ల తెలిసేలే “
“ఏ మాయప్ప శానా హుశారులే “
“ మరి నీవెంటికి ఇంత మబ్బు ఉండావలే”
*****
“ఏయ్! మైకడుక్కోని రడీ కాఫొండి! మీయమ్మోళ్ళు అదేమో విధానసౌదా సూసేకి పోతారంట”
“మైకడుక్కొని ఫోనీకే విధానసౌదా వీడి అత్తిల్లా ఏమన్నా?”
“జల్దీ వేరే అంగి ఏస్కోని ఫోలే”
*****
“లే ఆదీ! రారా అర్జంటయ్యేదే”
“చా తాగి వొస్తా ఉండలే”
“నీయమ్మ కొడకా! నాకి చా ముఖ్యమా? నీ దొడ్డి ముఖ్యమా?”
“రా యలే ! అర్జంటు అయ్యేదే”
“అంత అర్జంటు అయ్యింటే మా బాత్రూమ్లో ఫోలే”
“బాత్రూంల కూసొంటే నాకి దొడ్డికి రాదలే! బయటికి ఫోతే సల్ల గాలి తగల్తా ఉంటాది. మాట్లాడుకొంటా కూసోవోచ్చు”
“ ఈ బెంగులూర్ల పీల్సేకే మంచి గాలి లేదు. ఈనికి దొడ్డికి పోయేకి సల్ల గాలి కావల్లంట”
*****
“”లే పర్షా! టీచర్ ఈ ఫొద్దు ప్రశ్నలు అడుగుతాను అనింది కదలే ! ఎట్లలే?”
“ఏం భయపడే పనిల్యా. టీచర్ ప్రశ్న అడుగుతాది కదా! మనకి జవాబు గొత్తు అనేతట్ల సెయ్యి ఎత్తల్ల”
“టీచర్ లేసి సెప్పు అంటే?”
“ తిక్కనాయల్లా! టీచర్లు ఎప్పుడుకూడా సెయ్యి ఎత్తినోల్లని కాకుండా ఎత్తనోల్లని అడుగుతారలే!
****
”మన జాతీయ ఫలము(పండు ) ఏమిటి ?
ఎవ్వరూ జవాబు ఇవ్వరు. టీచరే మామిడి పండు అని చెబుతుంది.
అప్పుడు పరశు ఇలా అనుకొంటాడు. “వోలె వానెమ్మ తమోటా పండు అనుకునింటిని కదా ”
“మన జాతీయ జంతువు ఏది “
”ఎనుము గొడ్డు “
”కాదు టీచర్ ఆవు ”
*******
“ టీచర్ ఆదికి దొడ్డికి వోచ్చేదే నంట”
“వానికొస్తే నీవు ఏంటికి అడుగుతావు?మీతో బేజారు వచ్చింది. పోరా ఆది”
“టీచర్ ఆదిగాడితో నానూ ఫోతాను
“నీవెంటికి? వాడికి కడిగేకి ఫోతావా? ఈ నాయండ్లు క్లాసులో కూర్చొని నేర్చుకున్న దానికన్నా దొడ్డికి పోయిందే ఎక్కువసార్లు సూడు”
ఈ సంభాషణలు చాలు సినిమా సహజత్వాన్ని అర్థం చేసికోనడానికి. బహుశా మాది ఉత్తర కర్నాటక సరిహద్దు గ్రామం కావడం వలనేమో నన్ను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకొంది. మిమ్ములనూ తప్పక ఆకట్టుకొంటుంది…..
ఈ సినిమా డైరెక్టర్… ఆయుష్ మల్లి
అమెజాన్ ప్రైమ్ లో ఉంది .


