ద్వారకానాథ్ కోట్నీసే కాదు.. ఆర్కాట్ రంగరాజూ చెప్పుకోవాల్సినవాడే!

చిన్నప్పట్నుంచీ పుస్తకాల్లో చదువుకున్న చరిత్రతో.. మనకు చాలామంది హిస్టరీస్.. చాలా అంశాలకు సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు ఎంతో కొంత తెలిసే ఉంటాయి. కానీ, వినని చరిత్రలెన్నో. అలాంటి ఓ వ్యక్తికి సంబంధించిన మనమెప్పుడూ వినని వైద్యుడైన పారాట్రూపర్ హీరో గురించి తెలుసుకుందాం.

ఇప్పటివరకూ యుద్ధకాలాల్లో పెద్దమొత్తంలో వైద్యమందించిన వారి కథలంటే మనకు కెనడాకు చెందిన హెన్రీ నార్మన్ బెథూన్, అర్జెంటీనాకు చెందిన చేగువేరా, ఇండియాకు చెందిన ద్వారకానాథ్ కోట్నీస్ వంటివారెవరో కొందరు స్ఫురణలోకొస్తారు. కానీ, వారికేం మాత్రం తగ్గని ఓ త్యాగమయుడే మనం చెప్పుకోబోతున్న కల్నల్ డాక్టర్ ఆర్కాట్. జి. రంగరాజ్.

జపాన్ వలస ఆధిపత్యం ధోరణులు, చైనా, ఉత్తర కొరియా కూడా వారితో ఏకమై.. దక్షిణ కొరియాపై యుద్ధమేఘాలు కమ్ముకున్న కాలాన చైనాతో జరిగిన యుద్ధంలో తన ప్రాణాలకు తెగించి అక్కడి కొరియన్ల ప్రాణాలను కాపాడిన వైద్యనారాయణుడు లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ ఆర్కాట్ జి. రంగరాజ్.

1941లో హవిల్దార్ మేజర్ మధురసింగ్ తో పాటు భారత్ నుంచి వెళ్లిన మొదటి ప్యారాట్రూపర్లలో ఆర్కాట్ రంగరాజ్ ఒకరు. 1917లో జన్మించిన రంగరాజ్ ఇండియన్ మెడికల్ సర్వీస్ లో చేరడానికి ముందు మద్రాస్ మెడికల్ కళాశాలలో మెడిసిన పూర్తి చేశాడు. ఢిల్లీలోని విల్లింగ్డన్ ఎయిర్ ల్యాండింగ్ స్కూల్ (ప్రస్తుతమిది సఫ్దర్ జంగ్ విమానాశ్రయం) లో ప్యారాట్రూపర్ గా శిక్షణ పొందారు. మెడిసిన్ లో తాను సంపాదించుకున్న జ్ఞానాన్ని ఆ తర్వాత తనకున్న ధైర్యంతో ఇండియన్ సైనిక సంపత్తిగా మార్చాడు.

అప్పుడున్న పరిస్థితుల్లో మెడిసిన్ చదివినవారి సంఖ్య… నైపుణ్యమున్న వైద్యుల సంఖ్య తక్కువగా ఉండేది. ఆ క్రమంలో ఇండియాలో పేరుమోసిన వైద్యుల్లో ఆసక్తి, అనురక్తి ఉండటంతో పాటు, ధైర్యంగా ముందుకొచ్చేవారిని నాటి ఇండియన్ ఆర్మీ గుర్తించి వారి సేవలను వినియోగించుకుంది. అలాంటివారిలో రంగరాజ్ కూడా ఒకరు.

కశ్మీర్ వైద్య కథానాయకుడు రంగరాజ్!

జపాన్ బర్మా క్యాంపెయిన్ లో భాగంగా… రెండో ప్రపంచ యుద్ధంలో డాక్టర్ రంగరాజ్ మణిపూర్ ఫ్రంట్ లో పనిచేశారు. స్వాతంత్ర్యం తర్వాత 1948-49 వరకూ కూడా కశ్మీర్ లో 60వ ప్యారాచూట్ ఫీల్డ్ అంబులెన్స్ యూనిట్ కు రంగరాజ్ నాయకత్వం వహించాడు. కఠినమైన వాతావరణాన్నెదుర్కొంటూ అక్కడ కరియప్ప హాస్పిటల్ ను నడిపించాడు రంగరాజ్. అలా, ప్యారాట్రూపర్ గా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న సైనికులకు తన వైద్యసేవలందించాడు.

యుద్ధకాలాన కొరియా వైద్యసంక్షోభానికి తెరదించిన రంగరాజ్!

1950లో కొరియా యుద్ధం ప్రారంభమైంది. కొరియా యుద్ధం ఎలా ప్రారంభమైందనేదానిపై భిన్నవాదనలున్నాయి. అప్పటికే విడిపోయిన దక్షిణ కొరియాను మళ్లీ తమ భూభాగంలో ఏకం చేసుకోవడానికి ఉత్తర కొరియా.. చైనా, రష్యాల సాయం కోరింది. అలా 1950లో ప్రారంభమైన యుద్దంలో అమెరికా దక్షిణా కొరియా వైపు నిల్చింది. మొత్తంగా క్యాప్టలిస్ట్ వర్సెస్ కమ్యూనిస్ట్ అన్నట్టుగా ఆ యుద్ధం ప్రారంభం సాగింది. అదే సమయంలో అప్పటికే వియత్నాంతో ఫ్రాన్స్ చేస్తున్న యుద్ధానికి అమెరికా మద్దతు ప్రకటించిన క్రమంలో.. చైనా కమ్యూనిజానికి వ్యూహాత్మకంగా చెక్ పెట్టేందుకే దక్షిణా కొరియానే యుద్ధానికి ఉసిగొల్పిందని… అమెరికాపై.. రష్యా, చైనా, ఉత్తర కొరియాలు కూడా ఆరోపణలు గుప్పించాయి. మొత్తంగా తనకున్న శక్తితో దక్షిణ కొరియాకు సాయమందించేలా యునైటెడ్ నేషన్స్ ను కూడా ఒప్పించింది అమెరికా. అలా యుఎస్ తరపున దక్షిణ కొరియాకు మద్దతుగా ప్రత్యక్షంగా యుద్ధరంగంలోకి అడుగుపెట్టింది నాడు అమెరికా. ఎవరూ విజేతగా తేలని నాటి మూడేళ్ల యుద్ధంలో భారత్ దక్షిణ కొరియాకు అండగా నిల్చింది.

అప్పుడే ఏర్పాటైన నాటి స్వతంత్ర్య నూతన భారతం.. కొరియాకు ఆ సమయంలోనే సాయమందించింది. డాక్టర్ రంగరాజ్ యూనిట్ 60వ ప్యారాచూట్ ఫీల్డ్ ఆంబులెన్స్.. యునైటెడ్ నేషన్స్ విజ్ఞప్తి మేరకు వైద్యసాయమందించే మిషన్ గా కొరియాకు తరలివెళ్లింది. 1950, నవంబర్ లో బుసాన్ చేరుకుంది. అప్పటికే తీవ్రరూపం దాల్చిన యుద్ధంలో బ్రిటీష్ కామన్వెల్డ్ బ్రిగేడ్ కు తమ మద్దతును ప్రకటించి వైద్యసాయమందించారు రంగరాజ్ అండ్ టీం.

కొరియా యుద్ధసమయంలో భారత్ పెద్దగా సైనిక దళ సాయం చేయలేకపోయినప్పటికీ… లెఫ్టినెంట్ కల్నర్ ఏ.జీ. రంగరాజ్ నేతృత్వంలోని 60 ప్యారాచూట్ ఫీల్డ్ ఆంబులెన్స్ ను మాత్రం పంపి కొరియాకు పెద్ద సాయమే అందించింది ఇండియా. 1950, నవంబర్ నుంచి 1953, ఆగస్ట్ వరకూ కూడా రంగరాజ్ వైద్య బృందం ఒకవైపు యుద్ధ సమయాల్లో గాయాలపాలైన సైనికులు.. ఇంకోవైపు, అక్కడి యుద్ధంలో తీవ్రంగా గాయపడుతున్న పౌరసమాజానికీ కూడా సేవలందించారు. అలా సుమారు 2 లక్షల 22 వేల 300 మందికి పైగా రోగులకు వైద్యసాయమందించింది ఆర్కాట్ రంగరాజ్ వైద్యబృందం.

అతితక్కువ వనరులతో సరిగ్గా 39 నెలల కాలంలో 2 లక్షలకు పైగా మందికి వైద్యమందించడమే కాకుండా.. 2 వేల 300 మందికి శస్త్ర చికిత్సలు కూడా చేసి ఆపదలో ఉన్నవారి పాలిట దేవుళ్లయ్యారు రంగరాజ్ అండ్ బృందసభ్యులు. అందుకుగాను యూఎస్ కమాండర్ల నుంచి ప్రశంసలందుకుంది. ఇక స్థానికులైతే.. ఆర్కాట్ రంగరాజ్ టీంను ” ఏంజిల్స్ ఇన్ మెరూన్ బెరెట్స్” అని తమ భుజాలకెత్తుకున్నారు.

సాహసం చేయరా డింభకా!

3 వేల 400 మంది అమెరికన్ సైనికులతో కలిసి శత్రు భూభాగంలోకి ప్యారాట్రూపర్స్ గా వెళేందుకు భారతదేశం నుంచి 12 మంది అధికారుల బృందం ముందుకురాగా.. అందులో డాక్టర్ రంగరాజ్ ఒకరు. చైనా, ఉత్తర కొరియా సరఫరా మార్గాలకు పూర్తి అంతరాయం కల్గించడమే ఆ మిషన్ లక్ష్యం. అలాంటి పరిస్థితుల్లో ప్రణాళికాబద్ధంగా ఏవీ జరుగవు. ఓవైపు గడ్డకట్టే మంచులో టీ, బిస్కెట్స్ పైనే ఉంటూ కూడా పలువురిని రక్షించి, అవసరమైనవారికి శస్త్రచికిత్సలందించారు రంగరాజ్.

డాక్టర్ రంగరాజ్ ను ఘనంగా సత్కరించిన దక్షిణ కొరియా!

కల్నల్ డాక్టర్ ఆర్కాట్. జీ. రంగరాజ్ ను దక్షిణ కొరియా తన మూడో అత్యున్నత సైనిక గౌరవమైన చుంగ్ము విశిష్ఠ సైనిక సేవా పతకంతో సన్మానించింది. తనతో పాటు, తన యూనిట్ లోని మరో ముగ్గురు సభ్యులనూ ఆ అవార్డ్ వరించింది. భారతదేశంలో రెండో అత్యున్నత సైనిక శౌర్య పురస్కారంగా చెప్పుకునే మహావీర్ చక్ర కూడా రంగరాజ్ కు లభించింది.

రంగరాజ్ నేతృత్వంలోని సైనిక వైద్య బృందం ఆరు వీర్ చక్ర పురస్కారాలతో పాటు, యునైటెడ్ నేషన్స్, యూఎస్ నుంచి కూడా పలు గౌరవ సత్కారాలనందుకుంది. 2020, జూలైలోనూ దక్షిణ కొరియా ప్రభుత్వం రంగరాజ్ ను హీరో ఆఫ్ ది మంత్ గా పేర్కొంటూ కీర్తించింది. కొరియన్ వార్ హీరో అవార్డ్ కూడా వరించింది. యుద్ధంపై చరిత్ర పాఠాల్లో భాగంగా కొరియన్ పాఠశాలల్లో ఇప్పుడు మన ఆర్కాట్ రంగరాజ్ ఓ ఇండియన్ వైద్య కథానాయకుడు.

యుద్ధ వైద్యుడిగా మొదలై.. వ్యాధులపై సమరభేరి!

1966లో సైన్యం నుంచి పదవీ విరమణ చేసిన డాక్టర్ రంగరాజ్ తనకు దైవంతో సమానమైన వైద్య సేవను మాత్రం ఆపలేదు. ప్రజారోగ్యంలోనూ డిప్లమా చేసిన రంగరాజ్.. ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేశారు. 1969లో ఆఫ్ఘనిస్తాన్ లో మశూచి నిర్మూలనపై సీనియర్ డబ్ల్యూహెచ్వో సలహాదారుగా వెళ్లి సేవలందించారు. ఆ సమయంలో మరో ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ అబ్దుల్ మహమ్మద్ డర్మాంగర్ తో కలిసి పనిచేశారు. వారిద్దరూ కలిసి ప్రజారోగ్యం విషయంలో ఆప్ఘనిస్తాన్ కు మొదటి జాతీయ ఆరోగ్య పాలసీని రూపొందించారు. అదే ఆ ప్రాంతంలో నాడు మశూచి నిర్మూలనకు ఓ దిక్సూచి అయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్, అరేబియా ద్వీపకల్పాల్లోనూ రోగాలబారిన పడ్డవారికి నేనున్నానంటూ వెళ్లి పవిత్రమైన వైద్యవృత్తికే వన్నె తెచ్చాడు రంగరాజ్. ఆయన స్ఫూర్తే ఆయన బృందాన్నీ ఎన్ని కష్టాలెదురైనా ముందుకు నడిపించింది.

లైఫ్ టైం సర్వీస్!

2009లో తన 92 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన డాక్టర్ రంగరాజ్.. యుద్ధభూమిలో శస్త్రచికిత్సల నుంచి ప్రజారోగ్య విజయాల వరకూ వైద్యరంగానికే ఓ మాడల్ గా నిల్చి గెల్చాడు. విశ్వమానవుడిగా ఒక మనిషి ఏవిధంగా ఉండొచ్చో చెప్పడానికి కల్నర్ డాక్టర్ ఆర్కాట్. జీ. రంగరాజ్ జీవితం ఓ ఉదాహరణ. అందుకే ప్రధాన స్రవంతి కథల్లో మనకు ఎక్కువగా కనిపించనీ, వినిపించనీ ఈ కథను బాతాఖానీ మీ ముందుంచింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles