23 ఏళ్లకే కోహ్లీ ధూంతడాకా: అందుకే, ఆ పాక్ మ్యాచ్ ప్రత్యేకం!

క్రికెట్ అంటే అమితమైన క్రేజ్ చూపించే భారత్ వంటి దేశాల్లో కొన్ని మ్యాచులు చిరస్మరణీయాలుగా మిగిలిపోతాయి. అందులో జస్ట్ 23 ఏళ్ల వయస్సులో.. అదీ ఛేజింగ్… అందులోనూ దాయాది దేశమైన పాక్ తో విరాట్ మెరుపుల కథ ఇది. కోహ్లీ పుట్టినరోజున ఓసారి ఆ మెమరీలోకి!

అది 2012, మార్చ్ 18వ తేదీ.. అంటే సుమారు 13 ఏళ్ల క్రితం కథ. ఆసియాకప్. ఢాకా వన్డేలో విరాట్ తన వ్యక్తిగత అత్యధిక పరుగులు 148 బంతుల్లో 183తో ఒక కళాత్మకమైన ఇన్నింగ్స్ నిర్మించాడు. మొదట బ్యాటింగ్ చేసిన దాయాది దేశమైన పాకిస్థాన్ 329 పరుగులు చేసి, 330 పరుగుల టార్గెట్ పెట్టింది. స్పీడ్ బౌలర్లకు కేరాఫైన పాక్.. అందులోనూ, దాయాది దేశం అవ్వడంతో అభిమానుల నుంచి సహజంగానే ఉండే ఒత్తిడి మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచది.

అయితే, ఆమ్యాచులో మరో 13 బంతులు మిగిలి ఉండగానే భారత్ పాక్ పెట్టిన 330 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని ముద్దాడింది.

ఆ మ్యాచులో జట్టు విజయంలో… సగం పాత్ర విరాట్ కోహ్లీదే. ఎందుకంటే 330 పరుగుల్లో 183 పరుగులు సాధించి సగానికి పైగా పరుగులందించాడు. కోహ్లీ అప్పట్నుంచీ పరుగుల మిషన్ కు పర్యాయపదమయ్యాడు.

ఆ మ్యాచులో ఓ పెట్టని గోడలా నిల్చున్న విరాట్.. ఏకంగా 22 బౌండరీలు, ఒకే ఒక్క సిక్సర్ తో నిల్చుని ధాటిగా ఆడుతుంటే పాక్ బౌలర్లు నేలకేసి, ఒకరి ముఖాలకు ఒకరేసి, అప్పుడప్పుడూ ఆకాశానికేసి బిత్తరచూపులు చూడాల్సిన పరిస్థితేర్పడింది. హఫీజ్ అనే బౌలరైతే… అసలు, తానెందుకు బౌలర్నైనా అని మథనపడాల్సి వచ్చేలా చేశాడు. బంతి గాల్లోకి లేవకుండానే బౌండరీలతో దిక్కులు చూపించాడు. ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ అంటే ఎలా ఉండాలో ఆరోజు కోహ్లీ ఆట ప్రపంచం మొత్తానికి చూపించింది. ఆశ, శ్వాస అన్నీ ఆటే అన్నట్టుగా క్రికెట్ లో రాణించే ఆస్ట్రేలియన్స్ సైతం అబ్బురపడే ఆట అది.

అప్పటి కెప్టెన్ మిస్బా ఉల్ హక్ బౌలర్లను మార్చి మార్చి ఏమార్చినా… అంతకుమించిన మార్చ్ ఫాస్ట్ తో బంతులను బౌండరీకి తరలించి తుత్తునియలు చేశాడు కోహ్లీ. మహ్మద్ హఫీజ్, ఉమర్ గుల్, ఐజాజ్ చీమా, సయాద్ అజ్మల్, షాహిద్ అఫ్రిది, వహాబ్ రియాజ్.. ఇలా ఐదుగురు బౌలర్లను ఎలా మార్చినా లాభం లేకపోయింది. ఏ బౌలరూ కనీసం 40 పరుగులకు తక్కువ ఇవ్వనంతగా ఉతికి ఆరేశాడు కోహ్లీ.

ఇదే విషయాన్ని ఓసారి కోవిడ్-19 సమయంలో కోహ్లీ తన ఇన్ స్టా గ్రామ్ లైవ్ లో తాజా మాజీ వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తో మాట్లాడుతూ పంచుకున్నాడు.

ఆ మ్యాచులో సచిన్ 52 పరుగులు చేస్తే.. రోహిత్ శర్మ 68 పరుగులు చేశాడు. ఓపెనర్ గా వచ్చిన గౌతమ్ గంభీర్ డక్ ఔట్ అయ్యాడు.

ఆ మ్యాచులో తన అనుభూతిని, అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రమాదకరమైన, వైవిధ్యమైన పాక్ బౌలింగ్ ను ఎదుర్కొంటున్నప్పుడు తనకు ఎదురైన సవాళ్ల గురించీ… కఠినమైన పరిస్థితుల్లో క్రీజులో నిల్చున్న తీరు గురించీ ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో రోహిత్-కోహ్లీ జంట పరుగుల కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒకరినొకరు ఢీకొన్న ఘటననూ షేర్ చేసుకున్నాడు.

ఆ మ్యాచ్ జరిగి 13 దాటినప్పటికీ.. ఓ మరపురాని మ్యాచుగా.. ఓ పూర్తి స్థాయి పసందైన విందునందించిన ఆటగా గుర్తుంచుకునేదిగా నిల్చిపోయింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles