ఇందిరతో ఢీ అంటే ఢీ అన్న హ్యూమన్ సూపర్ కంప్యూటర్ శకుంతలాదేవీ!
హ్యూమన్ కంప్యూటర్… శకుంతాల దేవి… శ్రీనివాస రామానుజన్ తర్వాత మేథమెటిక్స్ లో ఆ రేంజ్ ఉన్న గణిత మేధావి. అది సరే, ఆమె రాజకీయాల్లోకెందుకొచ్చారు…? అందులోనూ, నాటి ప్రధాని ఇందిరాగాంధీపైనే మన తెలంగాణాలోని మెదక్ నుంచి ఎందుకు పోటీ చేశారు..? ఆ హ్యూమన్ కంప్యూటర్ పుట్టినరోజు సందర్భంగా కాసింత ఆ వివరాలు చెప్పుకుందాం రండి.
ఎమర్జెన్సీ విధింపు తర్వాత… ఆరో లోక్ సభ ఎన్నికల్లో రాయ్ బరేలీలో ఇందిరాగాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. జనాతాపార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ చేతిలో ఇందిర ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తొలిసారి కేంద్రంలో కాంగ్రెసేతర జనతాపార్టీ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. కానీ, ఆ ప్రభుత్వం సుస్ధిరంగా లేకపోవడంతో… 1980లో మధ్యంతర ఎన్నికలొచ్చాయి.

అదిగో అప్పుడు ఇందిర చూపు రాయ్ బరేలీతో పాటు.. మరో సురక్షిత స్థానం కోసం వెతుకుతోంది. ఉత్తరాదిలో జనాతాపార్టీ హవా కూడా ఇంకా కనిపిస్తున్నందున.. దక్షిణాది అయితే బరిలో దిగడానికి బెటర్ అనే యోచనలో ఇందిర సహచరులతో పాటు.. దక్షిణాదినేతలు కూడా ఆమెకు సూచించారు. అలా కాంగ్రెస్ ప్రాబల్యముండి.. ఇందిర నిల్చుంటే గెలవగల్గే ప్రాంతమేదన్న ఒక సర్వే కూడా చేయించారు. నాడు ఆంధ్రప్రదేశ్ లో పార్టీని లీడ్ చేస్తున్న కీలక నేతగా ఉన్న చెన్నారెడ్డి మాట మేరకు ఇందిరాగాంధీ మెదక్ నుంచి బరిలోకి దిగేందుకు సంసిద్ధమైంది. కేవలం నామినేషన్ వేసి వెళ్లిపోయిన ఇందిర ఆ తర్వాత ప్రచారానికి కూడా రాలేదు. అప్పుడు మంత్రిగా పనిచేస్తున్న బాగారెడ్డి ఇందిరకు అత్యంత నమ్మకస్థుడిగా ఉండేవారు. ఇందిర కోసం ఆయన ఏకంగా మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీకి మెదక్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఆమె గెల్చారు.
మరి సూపర్ కంప్యూటర్ శకుంతల ఎందుకు బరిలోకి దిగారు..?
ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్లల్లో శకుంతాలాదేవీ ఒకరు. ఎంత తీవ్రంగా అంటే.. ఏకంగా ఇందిరపైన ఆమె ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేంత. అలా శకుంతలాదేవీ.. 1980 పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ తో పాటు.. ముంబై సౌత్ నుంచి రెండుచోట్లా బరిలో నిల్చారు. మెదక్ నుంచి ఇందిరపైన బరిలోకి దిగినవాళ్లల్లో రాజకీయ ఉద్ధండులైన జైపాల్ రెడ్డి జనతాపార్టీ నుంచి బరిలోకి దిగగా.. పీవీ నర్సింహారావు కుమారుడైన రాజేశ్వర్ రావు, తెలంగాణా తొలితరం ఉద్యమనాయకుడు కేశవ్ రావు జాదవ్ వంటివారు పది మంది వరకూ ఢీ అంటే ఢీ అన్నారు.
మరి శకుంతలాదేవీ ఫలితాలెలా వచ్చాయి..?
ఇందిరాగాంధీ పిచ్చి ప్రేలాపనల నుంచి మెదక్ ప్రజానీకాన్ని కాపాడుకునేందుకే తాను మెదక్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు నాడు శకుంతలాదేవి. కానీ, ఇందిర రాజకీయ ఛరిష్మా ముందు… ఆ సూపర్ కంప్యూటర్ స్పీడ్ మాస్ అప్పీలును సంపాదించుకోలేకపోయింది. అందుకే డిపాజిట్ కూడా దక్కకుండానే శకుంతలాదేవి మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరపై చిత్తుగా ఓడిపోయింది. ఇందిరకు 3 లక్షలకు పైగా ఓట్లు వస్తే… శకుంతలాదేవి 6514 ఓట్లతో డిపాజిట్ కోల్పోయింది. అదే సమయంలో ముంబై సౌత్ నుంచి కూడా ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ శకుంతల రాజకీయాల వైపు చూడలేదు. మెదక్ పార్లమెంట్ లో ఇందిర సమీప ప్రత్యర్థిగా జైపాల్ రెడ్డి 82 వేల 453 ఓట్లతో రెండో స్థానంలో నిల్చారు.
2013, ఏప్రిల్ 21న బెంగళూర్ లో తన స్వగృహంలో తుదిశ్వాస విడిచిన ఆ సూపర్ కంప్యూటర్… 1929, నవంబర్ 4న, నేటి రోజున బెంగళూర్ లో జన్మించారు.
తండ్రి సర్కస్ కంపెనీలో ఓ మెజీషియన్. అలాగే తాళ్లపై నడవడం వంటి జిమ్మిక్కులతో వీక్షకులను ఆకట్టుకునేవాడు. మూడేళ్ల నుంచే లెక్కల్లో సూపర్ ఫాస్ట్ గా ఉన్న శకుంతల.. ఆరేళ్లకే తన లెక్కల ప్రతిభతో మైసూర్ యూనివర్సిటీ పెద్దలనే ఖంగు తినిపించింది. 1944లో తండ్రితో కలిసి లండన్ వెళ్లింది. ఆ తర్వాత ఆమె విదేశీ పర్యటనలకు ఎక్కడికెళ్లినా వడివడిగా ఆమె లెక్కలు చేసే తీరుతో అబ్బురపర్చేది. 1977లో 201 అంకెలున్న సంఖ్య 23 వర్గమూలానికి సంబంధించి.. అంతకుముందు డచ్ మేథమెటీషియన్ అయిన విల్లెమ్ క్లీన్ పది నిమిషాల్లో పూర్తి చేస్తే… శకుంతలాదేవి కేవలం 50 సెకన్లలో పూర్తి చేసి సూపర్ హ్యూమన్ కంప్యూటర్ గా చరిత్రకెక్కారు. 13 అంకెలున్న సంఖ్యను కేవలం 28 సెకన్లలో గుణించి కొత్త చరిత్ర సృష్టించి గిన్నీస్ రికార్డుకెక్కింది. అమెరికా స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో 1988లో 95 443 993 క్యూబ్ రూట్ ను కేవలం రెండంటే రెండే సెకన్లలో పూర్తి చేసి ఆశ్చర్యపర్చింది.
ప్రగతి శీల భావాలతో పెరిగిన శకుంతల ది వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్ పుస్తకాన్ని కూడా రాసింది. స్వలింగ సంపర్కులకు సంబంధించిన తొలి పుస్తకంగా కూడా ఆ బుక్ గుర్తింపు సంపాదించుకుంది. దాన్ని సంప్రదాయవాదులు ఖండించారు. కానీ, మనిషిగా జన్మించడం వల్లే తానా పుస్తకం రాశానని కుండబద్ధలు కొట్టింది. అయితే, తన భర్త స్వలింగ సంపర్కుడు కావడమే ఆమె బుక్ రాయడానికి పురిగొల్పిందంటారు.
అయితే, సూపర్ హ్యూమన్ కంప్యూటర్ గా అంత పేరు సంపాదించిన శకుంతల రాజకీయాల్లో నేరుగా ఇందిర వంటి యోధురాలిపై చేసిన ప్రయోగం సక్సెస్ కాలేకపోవచ్చుగానీ… ఆమె చరిత్ర పేజీల్లో రాజకీయాలకూ ఓ పేజీని మాత్రం క్రియేట్ చేసుకుని చర్చనీయాంశమైంది.



