ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందాడు.. వైట్ కాలర్ నేరాలతో కోట్లకు పడగలెత్తాడు!

నేరాలను అరికట్టాల్సినోళ్లే నేరస్థులుగా మారితే ఎలా ఉంటుంది…? ఉత్తరప్రదేశ్ పోలీస్ అధికారి రిషికాంత్ శుక్లా అనే ఓ ఉదాహరణలా ఉంటుంది.

అవునూ.. రిషికాంత్ శుక్లా కేసు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పోలీస్ వ్యవస్థనే కుదిపేస్తున్న ఘటన. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఉండి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి వంద కోట్ల విలువైన సామ్రాజ్యాన్నే నిర్మించిన సినిమాను తలపించే ఘటన శుక్లాది.

రిషికాంత్ పై వెల్లువెత్తిన ఆరోపణలతో యూపీ ప్రభుత్వం ఆయనపై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. ఆ దర్యాప్తులో శుక్లా సాబ్ ఏకంగా వంద కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా బెదిరింపులు, అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం వంటివాటితో కూడబెట్టినట్టుగా సిట్ తేల్చింది. ఇప్పుడు శుక్లా సస్పెండ్ అయిన అధికారి.

ఒకప్పుడు ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు!

ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్… ఇదీ గతంలో శుక్లాకున్న పేరు. కానీ, ఆ పేరునే తనకు అనుకూలంగా మల్చుకున్న పోలీస్ ప్రబుద్ధుడు రిషికాంత్. కొన్ని ఎన్ కౌంటర్ల తర్వాత తనకు వచ్చిన పేరునుపయోగించుకున్న శుక్లా.. భూదందాల్లో సెటిల్మెంట్స్, భయపెట్టి వసూళ్లు చేయడాలు, కేసులు కాకుండా చూడాలంటే లంచాలకు మరగడం, దాంతో పాటే కాన్పూర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై.. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని సమాంతరంగా రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం.. ఇదిగో ఇలా చేయని క్రైమ్స్ అంటూ లేకుండా పోయాయని సిట్ నివేదిక వెల్లడించింది.

బెదిరింపులు, తప్పుడు కేసులతో భయపెట్టిన శుక్లా!

సిట్ సేకరించిన వాంగ్మూలాలు, బాధితవర్గాల సాక్ష్యాల ప్రకారం.. బిల్డర్స్, వ్యాపారస్థులు, భూయజమానులే రిషికాంత్ శుక్లా టార్గెట్స్. తనకున్న ఇమేజ్ తో తప్పుడు కేసుల్లో ఇరికిస్తానంటూ భయపెట్టేవాడు. అలా చవక ధరల్లో బెదిరించి ఇతరుల ఆస్తులను తన పేరిట చేయించుకునేవాడు. చాలాసార్లు అలా బాధితులను తుపాకీతో కూడా బెదిరించినట్టు సిట్ కు బాధితులిచ్చిన వాంగ్మూలాల్లో నమోదయ్యాయి.

పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ బాధితుడు వెల్లడించినదాని ప్రకారం.. తాము పార్ట్నర్స్ గా కలిసి ఓ భూమిని కొనుగోలు చేశామని.. ఆ భూమి ధర పెరగడంతో… భూమి తనకు వదిలేయాలని శుక్లా బెదిరించాడాట. తన భార్య క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న క్రమంలో.. సదరు శుక్లాలాంటి అధికారితో ఎందుకు తలగోక్కోవడమని భావించాడు సదరు బాధితుడు. శుక్లా ఆ బాధితుడికి ఏడు కోట్ల రూపాయలిస్తానని మాట ఇచ్చాడు. తీరా వెళ్లితే.. తుపాకీతో బెదిరించి, డబ్బులడిగితే ఎన్ కౌంటర్ చేసేస్తానని బెదిరించాడట సదరు పోలీస్ క్రిమినల్. అలా ఆ బాధితుడి భూమంతా అప్పనంగా కొట్టేశాడు శుక్లా. ఇది ఒక బాధితుడికి సంబంధించిన కథనమే. ఇలాంటి కథలెన్నో రిషికాంత్ శుక్లా బెదిరింపులకు భయపడి వెలుగులోకి రాకుండా పోయాయి. మరోవైపు, శుక్లా మాత్రం లెక్కలకందని సంపాదనను సొంతం చేసుకున్నాడు.

నేర సంబంధాల వలయాన్నే సృష్టించిన ప్రబుద్ధుడు శుక్లా!

ఒక్క శుక్లా తల్చుకున్నంత మాత్రాన ఇలాంటివి జరుగవు. దీని వెనుక ఒక సమూహముంటుంది. ముఖ్యంగా లీగల్ గా ఎలాంటి ఇష్యూస్ వచ్చినా వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని కేసుల నుంచి బయపడేసే కొందరు క్రిమినల్ లాయర్సూ ఉంటారు. అలాంటి లాయరే.. అఖిలేష్ దూబే. శుక్లాకు దూబే కూడా తోడయ్యాడు. ఇప్పుడా న్యాయవాది పాత్ర కూడా బట్టబయలైంది. దూబే ద్వారా కొందరిని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి.. బ్లాక్ మెయిలింగ్ తో డబ్బులు గుంజడం శుక్లా నెట్వర్క్ లో మరోభాగం. అలా శుక్లా, దూబే ఇద్దరూ తోడుదొంగలుగా మారి ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ ఆపరేషన్స్ కు తెరతీశారు. అందులో భాగంగా తప్పుడు అత్యాచార కేసులు బనాయించడం, అట్రాసిటీ కేసులు పెట్టించడం, సివిల్ కేసుల్లో పోలీసులు తలదూర్చకూడదని చట్టాలు చెబుతున్నా, భూదందాల్లో కేసులు నమోదు చేసి బాధితులపై ఒత్తిడి తేవడం.. ఇలా రకరకాలుగా అరాకత్వానికి కేరాఫ్ అయింది డీఎస్పీ శుక్లా అండ్ టీం.

అలా తోడుదొంగలిద్దరూ కలిసి కాన్పూర్ మొత్తం పెద్దఎత్తున భూములు సంపాదించినట్టు.. కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు సిట్ చెబుతోంది.

హవాలా పద్ధతిలో మనీలాండరింగ్!

అడ్వకేట్ దూబేకు చెందిన ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో తను బ్లాక్ మెయిల్ చేసి తెచ్చిన డబ్బంతా పెడుతూ.. హవాలా పద్ధతిలో బ్లాక్ మనీని వైట్ గా మార్చేవాడు డీఎస్పీ శుక్లా. దూబే కన్స్ట్రక్షన్ కంపెనీలో శుక్లా భార్య ప్రభా శుక్లా భాగస్వామ్యురాలు. మరో ఇద్దరు డీఎస్పీలు కూడా శుక్లాకు జత కలవడంతో.. పోలీస్ డ్రెస్సులో ఒక క్రిమినల్ ముఠా వైట్ కాలర్ నేరాలకు అలవాటు పడింది. ఈ విషయం బయటకు పొక్కాక సదరు మరో ఇద్దరు డీఎస్పీలను యూపీ ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. అయినా, వారు అక్కడి నుంచి కూడా తమ నేర కార్యకలాపాలు కొనసాగించేవారన్నది సిట్ దర్యాప్తులో తేలిన విషయాలు.

రాజకీయ నాయకుల అండదండలతోనే శుక్లా బరితెగింపు!

చాలా ఏళ్లుగా శుక్లాపై పలు ఆరోపణలున్నా.. ఎటువంటి చర్యల్లేకపోవడంతో.. రిషికాంత్ మరింత రెచ్చిపోయాడు. అందుకు, ఆయనకున్న రాజకీయ అండదండలే ప్రధాన కారణం. యూపీ ప్రభుత్వంలో శక్తివంతమైన నాయకులు, అధికారులు కూడా శుక్లా వెనుక ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే శుక్లా కుమారుడి వివాహాన్ని అంగరంగ వైభవంగా చేశాడు. కాన్పూర్ లోని ఓ విలాసవంతమైన రిసార్ట్ అందుకు వేదిక కాగా.. ఆ పెళ్లికి సీనియర్ పోలీస్ అధికారులంతా వచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా హాజరుకావడంతో.. శుక్లా బల ప్రదర్శనకు కూడా ఆ పెళ్లి వేదిక కేంద్రమైంది.

సిట్ నివేదికతో మరింత లోతుగా కొనసాగుతున్న దర్యాప్తు!

సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారమే.. కాన్పూర్ సమీపంలో ఉన్న 12 విలువైన ప్రాంతాల్లో సుమారు 92 కోట్ల రూపాయల విలువైన బినామీ ఆస్తులను శుక్లా కల్గి ఉన్నాడు. ఇంకా అనేక ఆస్తులకు సంబంధించిన పత్రాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వంద కోట్ల రూపాయలకు పైగా గుర్తించగా.. ఈ ఆస్తుల విలువ మరింత పెరుగువచ్చనేది అధికారుల అంచనా.

1998 నుంచి 2009 మధ్య అంటే సరిగ్గా 11 ఏళ్ల కాల వ్యవధిలో ఈ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఎంతగా బ్లాక్ మెయిలింగ్ చేస్తే.. ఇంతలా డబ్బు కూడబెట్టాడో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా తన ఆస్తులన్నీ.. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎదిగిన కాలంలోనే ఎక్కువగా సంపాదించినట్టుగా కూడా సిట్ పేర్కొంటోంది. శుక్లా అవినీతి, అక్రమాలపై ఇంకా విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతుండగా.. తన ఆస్తులన్నింటినీ ఫ్రీజ్ చేయాలని యోగి సర్కార్ ఆదేశాలు కూడా జారీ చేసింది.

చూశారుగా కంచే చేను మేస్తే ఎంత సంపాదించొచ్చో!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles