బబూల్ గమ్ నమిలినంత ఈజీగా.. బంతిని బౌండరీకి బాదిన రన్ మిషన్!

బబూల్ గమ్ నమిలినంత ఈజీగా.. బౌలర్లకు చుక్కలు చూపించిన పరుగుల మిషన్!

ఒక ప్రత్యర్థి జట్టు ఆటగాడిని.. ఆ కాలంలో హరివీర భయంకరంగా ఆడుతున్న మరో జట్టు.. బ్లాంక్ చెక్ ఇస్తాం.. నువ్వాడుతున్న సొంత దేశం జట్టుకు రెబల్ గా.. మా వైపు ఆడు.. అని అందంటే.. ఆ ఆటగాడెంత ప్రతిభావంతుడై ఉండాలి..?

నోట్లో బబుల్ గమ్ నమిలినంత సులభంగా.. మైదానంలో పరుగుల వరద పారిస్తే… ఒక్క నీనాగుప్తేంటి.. గంపగుత్తగా పడిపోరూ..?

అది జరిగింది కాబట్టే.. సర్ ఇసాక్ వివియన్ అలెగ్జాండర్ రిచర్డ్స్ ను తమవైపు ఆడాలంటూ.. మరో బలమైన టీం.. దక్షిణాఫ్రికా బ్లాంక్ చెక్ ఆఫర్ చేసింది. వెస్ట్ఇండీస్ టీమ్.. సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లిన 1982-83 మధ్య కాలం ఈ ఘటనకు సాక్షీభూతం. కానీ, తన ఆటెంత గొప్పదో.. దేశం పట్ల తనకున్న అంకితభావానిదీ అదే స్థాయి. అందుకే రిచర్డ్స్ సున్నితంగా తిరస్కరించేశాడు.

కొందరు క్రికెటర్స్ తమ దేశం తరపున ప్రాతినిథ్యం వహించి.. ఎందరో అభిమానులను సంపాదించుకుంటారు.. గొప్ప పేరు సాధించుకుంటారు. కానీ, రిచర్డ్స్ లాంటి వాళ్లు కేవలం తన దేశానికే కాకుండా.. ప్రపంచ దేశాల్లోనూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకుంటారు. వెస్ట్ఇండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ వారసత్వంగా.. తనను నిలుపుకోవడంతో పాటు.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సృష్టించుకోవడంతో రిచర్డ్స్ ఫర్ ఎవర్ అనిపించుకోగల్గాడు.

ఎందరో కుర్రకారు కొత్తగా వస్తుండవచ్చు.. రికార్డులను బ్రేక్ చేస్తుండొచ్చు.. తిరగరాస్తుండొచ్చు.. వారూ ప్రపంచ ప్రఖ్యాతులైపోతుండొచ్చు.. కానీ, కొన్ని ఆపాత మధురాల్లో.. క్రికెటున్నంతకాలం వరల్డ్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ మర్చిపోలేని పేరేదైనా ఉంటుందంటే.. అందులో వివ్ రిచర్డ్స్ పేరు కూడా ముందువరుసలో తప్పనిసరి.

1970 నుంచి 1990 మధ్య ఓ రెండు దశాబ్దాల కాలం.. అంతర్జాతీయ క్రికెట్ ను శాసించిన ఓ చక్రవర్తి వివియన్ రిచర్డ్స్. ఆంటిగ్వాలోని సెయింట్ జాన్స్ లో1952 మార్చ్ 7న జన్మించిన రిచర్డ్స్.. తన జట్టులోనే ఎందరో గార్డెన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్ వంటి హేమాహేమీలున్నప్పటికీ.. తనకంటూ రోమ్ గ్లాడియేటర్ లాంటి ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న క్రికెట్ రారాజు.

ఇంగ్లాండ్ క్రికెటర్.. ఫ్రెడ్ ట్రూమ్యాన్ అంటే ఆ రోజుల్లో వేగవంతమైన బౌలింగ్ కు జస్ట్ ఓ పర్యాయపదం. అంత వేగంగా.. అన్ని విధాలుగా బంతులు వేసి.. ప్రత్యర్థి బ్యాట్స్ మ్యాన్ క్రీజులో నిలబడాలంటేనే భయపెట్టే బౌలింగది. అలాంటి బౌలర్ కూడా ఊహించలేని విధంగా.. వీళ్లూవాళ్లు అన్ని పంక్తిభేదం చూపకుండా ఊచకోత కోస్తూ.. బాల్ ను బౌండరీస్ కు తరలించాలంటే.. అది రిచర్డ్సే అయ్యుండాలి.

అయితే, అలాంటి రిచర్డ్స్ ను సైతం కాస్త అటూ, ఇటూ ఆలోచించి ఆడేలా ఇద్దరు బౌలర్స్ ప్రభావం కనబర్చడం విశేషం. వారే ఆస్ట్రేలియన్ బౌలింగ్ లెజండ్స్ డెన్నిస్ లిల్లీ. మరొకరు జెఫ్ థాంప్సన్. ఇక మిగిలిన బౌలర్సంతా రిచర్డ్స్ కు జస్ట్ జుజుబీ.

1976-88 మధ్య 92 మ్యాచ్‌లు ఆడిన రిచర్డ్స్.. 7091 పరుగులతో 55.39 సగటును కల్గి ఉన్నాడు. ఈ పరుగుల్లో ఏకంగా 22 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలున్నాయి. ఈ సయయంలో తానాడిన 29 సిరీసుల్లో రిచర్డ్స్ సగట.. కేవలం 7 సందర్భాల్లో మాత్రమే 30 కంటే తక్కువగా కనిపిస్తుంది.

బ్రాడ్ మ్యాన్, వాల్టర్ హ్యామాండ్ తర్వాత.. లైన్ అప్ లో మూడో ప్లేస్ లో.. అంటే వన్డౌన్ బ్యాట్స్ మ్యాన్ గా వచ్చిన రిచర్డ్స్ మూడో హైయెస్ట్ యావరేజ్ బ్యాట్స్ మ్యాన్ గా నిల్చాడు. 1980ల్లో కేవలం 8 మాత్రమే ఓటమిపాలై.. మిగిలిన 54 శాతం మ్యాచులు గెల్చిన అత్యుత్తమ కెప్టెన్ రిచర్డ్స్. 1983 ప్రపంచ కప్ ఓటమి అనంతరం తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయిన వెస్ట్ఇండీస్ కు.. మళ్లీ జవసత్వాలు నింపాడు. 1984, మే 31న ఇంగ్లాండ్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో.. ఆతిథ్య జట్టును తుత్తునియలు చేశాడు. బాబ్ విల్లీస్, ఇయాన్ బోథమ్, నీల్ ఫోస్టర్ వంటి బౌలర్లను చెండాడి.. తన స్క్వేర్ కట్స్, షాట్స్ తో.. ఏకంగా 189 పరుగులు చేసి.. అంతకుముందు ప్రపంచకప్ లో భారత కెప్టెన్ కపిల్ దేవ్ జింబాబ్వేపై చేసిన 175 పరుగుల స్కోర్ రికార్డును చెరిపేశాడు.

అయితే, క్రికెట్ రారాజుగా ఇప్పటికీ చెప్పుకునే వివియన్ రిచర్డ్స్ కు ఫుట్ బాలంటే కూడా అంతే మక్కువ. 1974లో ఆంటిగ్వా కోసం రిచర్డ్స్ అంతర్జాతీయ ఫుట్ బాల్ జట్టులో స్థానం కల్గి ఉన్నట్టుగా కూడా కొందరు చెబుతుంటారు.

ఫైర్ ఇన్ బాబీలోన్ పేరిట.. 1970 నుంచి 80 మధ్య దశాబ్దకాలంలో.. వెస్ట్ ఇండీస్ క్రికెట్ జర్నీ గురించి తీసిన బ్రిటీష్ డాక్యుమెంటరీలో.. రిచర్డ్స్ తానెదుర్కొన్న గొప్ప బౌలర్లలో తాను కాస్త సంశయించింది.. డెన్నిస్ లిల్లీ, జెఫ్ థాంప్సన్ బాల్స్ ఆడటానికి మాత్రమేనంటూ చెప్పుకొచ్చాడు.

వెస్ట్ ఇండీస్ మాజీ వికెట్ కీపర్ జెఫ్ డూజాన్ కు మైదానంలో ఈల వేస్తూ సరదాగా ఆడటం ఓ అలవాటు. ఓసారి రిచర్డ్స్, డూజాన్ క్రీజులో ఉన్నప్పుడు డూజాన్ ఈల వేయడం మానేయడంతో.. ఎందుకు ఈలపాట ఆపేశావంటూ రిచర్డ్స్ అడిగితే.. జెఫ్ థాంప్సన్ వేగమైన బంతులకు ఇంక ఈలపాటేం వస్తుందని సమాధానిమిచ్చాడట డూజాన్.

2013 ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డేవిల్స్ కు మెంటార్ గా వ్యవహరించిన రిచర్డ్స్… పాకిస్థాన్ సూపర్ లీగ్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ కు కూడా మార్గదర్శిగా నిల్చాడు. అయితే వివ్ రిచర్డ్స్.. తన అరంగ్రేటం మాత్రం మన ఇండియాలో.. బెంగళూర్ లోని చిన్నస్వామి స్టేడియంలోనే చేశాడు. 1974లో ఎంట్రీ ఇచ్చిన రిచర్డ్స్ ను.. భగవత్ చంద్రశేఖర్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోర్స్ కు పరిమితం చేసి ఔట్ చేసేశాడు. కానీ, అప్పుడు భారత్ పై విజయం మాత్రం మళ్లీ విండీస్ దే.

1994లో ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ అంపైర్ గా.. క్రికెట్ సేవల కోసం ప్రత్యేక అధికారిగా నియమించబడటం వివ్ రిచర్డ్స్ కు దక్కిన ఓ గొప్ప గౌరవం. 1999లో ఆయన స్వదేశమైన ఆంటిగ్వా అతణ్ని నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నేషనల్ హీరోగా కీర్తిస్తూ సన్మానించింది.

స్పోర్ట్స్ జర్నలిస్ట్ గా, ఎడిటర్ గా గుర్తింపు పొందిన స్క్లైడ్ బెర్రీ ఏమంటాడంటే.. మైదానంలోంచి క్రీజులోకి అడుగుపెడుతున్నప్పుడు రిచర్డ్ నడకే ఓ చూడచక్కని దృశ్యం. ఏ కొరియోగ్రాఫర్ కూడా.. ఎన్ని స్పాట్ లైట్స్ పెట్టినా, ఎన్ని సౌండ్ ఎఫెక్ట్ లతో తీర్చిదిద్దినా కనిపించని సొగసు రిచర్డ్స్ మైదానంలో నడుస్తున్నప్పుడు కనిపిస్తుందంటాడాయన.

2000 సంవత్సంలో 19వ శతాబ్దపు ఐదుగురు విజ్డన్ క్రికెటర్స్ లో… రిచర్డ్స్ ఒకడు. సర్ డోనాల్డ్ బ్రాడ్ మాన్, సర్ గార్ఫీల్డ్ సోబర్స్, సర్ జాక్ హాబ్స్, షేన్ వార్న్ తర్వాత ఐదోస్థానం రిచర్డ్స్ కు దక్కింది. రిచర్డ్స్ కంటే ముందుస్థానంలో.. నాల్గోస్థానంలో ఉన్న షేన్ వార్న్ తో పాటు.. ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ బోథమ్ కూడా ఆ ఎంపికలో భాగంగా రిచర్డ్స్ కే తమ ఓటు వేశారు. రిచర్డ్స్ వంటి బ్యాట్స్ మ్యాన్ ను తమ కెరీర్ లోనే చూడలేదని ప్రశంసించారు ఆ ప్రతిభావంతులు.

కేవలం వారిద్దరేనా.. బారీ రిచర్డ్స్, రవిశాస్త్రి, మార్టిన్ క్రో, ముత్తయ్య మురళీధరన్ వంటివారెందరో.. ఫస్ట్ క్లాస్ క్రికిట్ చరిత్రలో వంద సెంచరీలు చేసిన వివ్ రిచర్డ్స్ గురించి చెప్పిన మాటలు.. క్రికెట్ లో ఇప్పటివరకూ ఏ బ్యాట్స్ మ్యాన్ కొట్టలేని హైయ్యెస్ట్ మీటర్ల ఎత్తులో నిల్చే సిక్సరంత. 2006 నవంబర్ 30 పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ రికార్డును చెరిపేసేవరకూ.. 30 ఏళ్ల పాటు నిర్విరామంగా ఒక క్యాలెండర్ ఈయర్ లో అత్యధిక పరుగులు చేసిన పరుగులు మిషన్ రిచర్డ్స్.

ఓసారి ఆపాత మధురమైన జ్ఞాపకం కోసమే.. ఆయన పుట్టినరోజున ఈ రిచర్డ్స్ పురాణం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles