V. Sai Vamshi… (విశీ) ✍🏻✍🏻
———————————————————
1500 సినిమాలు..ఆరు వేల నాటకాలు.. ఓ ‘మోడ్రన్’ నటి
ఒక నటుడు/నటి ఎన్ని సినిమాల్లో నటించగలరు? వంద, రెండు వందలు, ఐదు వందలు..చాలా అరుదుగా వెయ్యి. మనోరమ, నంబియార్, నగేష్ లాంటి తమిళ నటులకు, చలపతిరావు, వై.విజయ, బ్రహ్మానందం, అలీ లాంటి తెలుగు నటులకు వెయ్యి దాకా సినిమాలు చేసే అవకాశం దక్కింది. ఈ జాబితాలో మనకు తెలియని నటులు కూడా ఉన్నారు. అందులో ఒకరు ఎస్.ఎన్.లక్ష్మి. తెలుగు సినిమాలకు నిర్మలమ్మ బామ్మ అయితే, తమిళ సినిమాలకు ఎస్.ఎన్.లక్ష్మి బామ్మ. మనోరమ తర్వాత అమ్మమ్మ, నానమ్మ, తాతమ్మ పాత్రలను తమిళంలో అద్భుతంగా పోషించి మెప్పించిన నటి ఆమె. ఆమె గురించి వింటే ‘మోడ్రన్ విమెన్’ అనిపించక మానదు.

సెన్నల్‌కుడి నారాయణ లక్ష్మి అయిన ఆమె ఎస్.ఎన్.లక్ష్మిగా గుర్తింపు పొందారు. సొంతఊరు తమిళనాడులోని విరుదనగర్. తల్లిదండ్రులకు 13వ సంతానం. తండ్రి మరణించాక తల్లి చిన్న హోటల్లో పనిచేస్తూ అందర్నీ పోషించేది. తన ఆరుమంది అన్నలు తనను సరిగ్గా చూడటం లేదని పదకొండో ఏటే ఆమె ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆమెకు ఓ డ్రామా ట్రూప్ పరిచయమైంది. వారి ఆట, పాట ఆమెను ఆకర్షించాయి. వారితో చేరి ఆమె కూడా నాటకాల్లో నటించడం మొదలుపెట్టింది. ఇదంతా 1940ల నాటి మాట. ఆడవాళ్లు నాటకాల్లో నటిస్తే వింతగా చూసే కాలంలో ఆమె దాన్ని ఉద్యోగంలా స్వీకరించారు. ఎవరేమనుకున్నా ‘డోన్ట్ కేర్’ అనుకున్నారు.
రకరకాల పరిస్థితుల అనంతరం ఆమె జెమినీ స్టూడియోస్ గడప తొక్కారు. నెలకు రూ.150 జీతానికి అందులో చేరారు. ఆ రోజుల్లోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని, మరో నలుగురు అమ్మాయిలతో కలిసి ఉండేవారు. ముందే చెప్పినట్లు, ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్..తన పని తనది. సినిమాల్లో అవకాశాలు రావడానికి ముందే దాదాపు రెండు వేల నాటక ప్రదర్శనలు ఇచ్చారు ఎస్.ఎన్.లక్ష్మి. ఆ తర్వాత కూడా నాటకాలను కొనసాగించారు. తమిళనాడులో ఉన్న అందరు పెద్ద నాటక దర్శకుల వద్దా పనిచేశారు. నాటకాల్లో ఆమె డేరింగ్ లేడీ. యుద్ధాలు, పోరాటాల సన్నివేశాలు చేసేందుకు ఏమాత్రం వెనకాడేవారు కాదు. 1959లో ఎంజీర్ నటించిన ‘బాగ్దాద్ తిరుడన్’ సినిమాలో చిరుతపులితో పోరాడే సన్నివేశంలో నటించారు. అవి ఆమె ధైర్యసాహసాలు.
తమిళంలో నేటికీ క్లాసిక్ సినిమాగా చెప్పుకునే ‘చంద్రలేఖ’(1948) ఆమె తొలి సినిమా. అందులో గ్రూప్ డ్యాన్సర్‌గా చిన్న వేషం వేశారు. ఆ తర్వాత వెంటనే అవకాశాలు రాలేదు. అటు నాటకాల్లో నటిస్తూ, ఇటు సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ చాలా కష్టపడ్డారు. నటుడు నగేష్ ఆమె ప్రతిభను గుర్తించి దర్శకుడు కె.బాలచందర్‌కు పరిచయం చేశారు. అలా ‘సర్వర్ సుందరం'(1964) సినిమాలో నగేష్ తల్లి పాత్ర ఆమెకు కీలక పాత్ర దక్కింది. అది కెరీర్‌ను మలుపు తిప్పింది. అవకాశాలు విరివిగా రావడం మొదలైంది.

ఇంట్లో నుంచి వచ్చేసిన ఎనిమిదేళ్ల తర్వాత ఆమెను వాళ్ల కుటుంబసభ్యులు కనిపెట్టారు. అప్పటికే ఆమె నటిగా మారారు. తన కెరీర్ తనది అనుకుని ముందుకు సాగారు. ముప్పై ఏళ్ల వయసులోనే 60 ఏళ్ల వయసున్న పాత్రలు పోషించిన వారిలో ఎస్.ఎన్.లక్ష్మి ఒకరు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద పాత్రలా అని ఆమె సందేహపడలేదు. ‘నేను నటిని. నాకు ఇచ్చిన పాత్ర నేను సక్రమంగా నటిస్తాను’ అని అనుకున్నారు. అలాగే నటించారు. ఒక్కోసారి సినిమాలో ఆమెకు చిన్నపాత్ర దక్కేది. అయినా తన నటనతో దాన్ని అందరికీ గుర్తుండిపోయేలా చేసేవారామె. ఎంజీఆర్, శివాజీ గణేషన్ లాంటి నటులతో కలిసి నటించారు. ఆ తర్వాత వచ్చిన రజినీకాంత్, కమల్‌హాసన్ పక్కనా ధీటైన పాత్రలు చేశారు.
మలివయసులో ఆమె కెరీర్‌ను తీర్చిదిద్దిన వ్యక్తి కమల్‌హాసన్. మైఖేల్ మదన కామరాజన్(1990) సినిమాలో ‘దొంగ బామ్మ’ పాత్రతో ఎస్.ఎన్.లక్ష్మి అందరికీ సరికొత్తగా పరిచయమయ్యారు. ఈమె చేత ఇటువంటి వెరైటీ పాత్రలు చేయించవచ్చని అందరికీ గురికుదిరింది. ఆమే ‘మహానది’(1994) సినిమాలో కమల్‌హాసన్ అత్త పాత్ర చేసి విషాదాన్ని పండించారు. ఆ తర్వాత ‘పోతురాజు’(2004) సినిమా దాకా కమల్ ప్రతి సినిమాలో ఎస్.ఎన్.లక్ష్మికి ఓ పాత్ర దక్కింది. ‘ఆమెకు మీరు ఎలా నటించాలో చెప్పాల్సిన అవసరం లేదు. సీన్ పేపర్ ఆమె చేతికివ్వండి. మొత్తం ఆమే చూసుకుంటారు’ అని కమల్‌హాసన్ తన అసిస్టెంట్లకు చెప్పేవారంట. అదీ ఆమె ప్రతిభ మీదున్న నమ్మకం.
1948లో 20 ఏళ్ల వయసులో నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఆమె 2011 దాకా నటిస్తూనే ఉన్నారు. మొత్తం 60 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్. 1500 సినిమాలు, వాటితో సమానంగా ఆరు వేల నాటక ప్రదర్శనలు, పది టీవీ సీరియళ్లు. ఇంతటి ఘనమైన కెరీర్ చాలా అరుదుగా దక్కే అవకాశం. దాన్ని ఆమె పదిలపరుచుకున్నారు. 1960లోనే సొంత ఇల్లు, కారు సమకూర్చుకుని ఆనాటి మగాధిపత్య సమాజాన్ని ఒక్క వేటున ధిక్కరించారు. ‘పెళ్లి చేసుకోవా?’ అని ఎవరైనా అడిగితే ‘పెళ్లి నాకు సరిపడదు’ అని నిర్మొహమాటంగా చెప్పేవారు. తన కుటుంబసభ్యుల్ని బాగా చూసుకునేవారు. తన ఆస్తిలో చాలా భాగాన్ని దానధర్మాలకు వినియోగించారు. 70 ఏళ్ల వయసులో కూడా సొంతంగా కారు నడుపుతూ చెన్నై మొత్తం తిరిగేవారు. She is Modern for her times. 2012 ఫిబ్రవరి 20న గుండెపోటుతో మరణించారు.
ఇటువంటి నటులు మనకు ఉన్నారు. ఇటువంటివారు నటనను ఒక వృత్తిగా, దైవంగా భావించి పనిచేశారు. నిందలు వస్తాయి, ఆరోపణలు వస్తాయి, అపార్థాలు రానేవస్తాయి. డోన్ట్ కేర్! పని చేసుకుంటూ పోవడమే! ఇవాళ్టికీ తమిళ ప్రేక్షకులు ఆమె నటనను గుర్తుచేసుకుంటున్నారు. ఆమె నటించిన సీన్లను చూస్తూ తృప్తి పడుతున్నారు. ‘ఎస్.ఎన్.లక్ష్మి మా తమిళ నటి’ అని చెప్పుకుంటున్నారు. ఒక గొప్ప నటి జీవితానికి ఇది కదా సార్థకత.



