నాల్గు దశాబ్దాల క్రితమే ఆస్కార్ కు ఎంపికైన తెలుగు చిత్రం.. రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వం వహించి 1994లో విడుదలైన ఫారెస్ట్ గంప్ కంటే ముందే ఆస్కార్ నామినీస్ కోసం వెళ్లిన చిత్రం.. స్వాతిముత్యం. ఏకంగా ఆ చిత్రానికి ఇన్స్పిరేషన్ గా నిల్చిన మూవీ కావడం మరో విశేషం.
సంప్రదాయ, వాణిజ్య ధోరణులన్నింటినీ పక్కకు జరిపేసింది. అప్పటివరకూ వెండితెరపై కనిపించే హీరోయిక్ ఎలివేషన్స్ వంటివాటికి పూర్తి భిన్నంగా రూపొందింది. భారీ యాక్షన్ సీన్లతో ఎలాంటి అతిశయోక్తులకు తావివ్వలేదు. అలాగని స్పెషల్ లవ్ స్టోరీ కూడా కాదు. కానీ, ఓ వ్యక్తి నడి వయస్సుకొచ్చినా మానసిక ఎదుగుదల లేక పసివాడిలానే ప్రవర్తించడం.. భర్తను కోల్పోయిన ఓ మహిళ విధవరాలిగా సమాజపు అపహాస్యాన్ని, ఎగతాళిని మోయడం.. ఈ రెండింటికీ ముడిపెట్టి, నిశ్శబ్దంగా సాగే ప్రయాణంతో, ప్రేక్షకుల హృదయాలను లోతుగా తాకేలా విశ్వనాథుడు వెండితెరపై చెక్కిన అద్భుత దృశ్యం స్వాతిముత్యం.

1986లో విడుదలైన ఈ సినిమాకు రచన, దర్శకత్వం రెండింటినీ విశ్వనాథే ఓ తపస్సులా చేసిన తీరు మనకు వెండితెరపై అడుగడుగునా కనిపిస్తుంది. మసాలా సినిమాలు, యాక్షన్ సన్నివేశాలతో దూకుడు ప్రదర్శిస్తున్న చిత్రాలు, ప్రేమకథలు, ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిల్మ్స్ పుట్టగొడుగుల్లా విడుదలయ్యే వేళ.. మన చుట్టుపక్కల పరిసరాల్లోనే సులభమైన కథల్లో క్లిష్టమైన సమాజపు ధోరణులను తెరకెక్కించిన సినిమా స్వాతిముత్యం. ఇలాంటి సినిమాకు వచ్చే లాభాలను అంచనా వేయకుండా, నష్టపోయినా పర్లేదనుకునే ఏడిద నాగేశ్వర్ రావు వంటి నిర్మాత లభించడం ఆయన అభిరుచేంటో చెప్పేది.
అందుకు తగ్గ తారాగణం.. శివయ్య పాత్రలో కమల్ హాసన్.. లలితగా రాధిక పోషించిన పాత్రలతో పాటు.. ఇళయరాజా అందించిన సంగీతం.. ఎప్పటికీ లాలీ పాట అంటే తెలుగునాట ముందు గుర్తొచ్చే లాలీ లాలీ లుల్లబీ సినిమాను అజరామరంగా మల్చాయి. అందుకే నలభై ఏళ్ల తర్వాత కూడా మనం స్వాతిముత్యం గురించి మాట్లాడుకుంటున్నాం.
సాధారణమైన కథ – క్లిష్టమైన సమాజ పోకడ!
శివయ్య చుట్టూ తిరిగే చిత్రమిది. మానసిక వికలాంగుడైన శివయ్య పెరిగి పెద్దగైనా.. కనీస లౌక్యం సంపాదించకుండా బాల్యంలోని అమాయకత్వంతోనే కనిపించడమే సినిమా హైలెట్. గ్రామంలో జరిగే ఓ ఉత్సవంలో హరికథ రూపంలో పాటను చిత్రీకరించిన శైలి.. అప్పుడే శివయ్య.. అప్పటికే భర్తను కోల్పోయి ఐదేళ్ల కొడుకున్న లలితను పెళ్లి చేసుకోవాలనుకోవడం.. అందుకు సమాజం అంగీకరించకపోవడమే సినిమా కథనం.
చూస్తే స్టోరీ లైన్ మామూలుగా కనిపిస్తుండొచ్చుగానీ.. ఇది సాధారణ ప్రేమ కథ కాదు. సమాజంలో పెద్దగా గుర్తింపు లేని ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్మించుకునే ఓ ప్రయాణానికి సంబంధించిన కథ. అమ్మమ్మ మాటలే తనకు నీతి పాఠాలుగా పెరిగిన శివయ్య నిర్దోషిత్వం, ఏమీ ఆశించకుండా పనిచేసే తత్వం ఇవే స్వాతిముత్యానికి హృదయంలాంటివి. ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తే.. ఎప్పుడో ఒకప్పుడు ఈ సమాజం నీకింత చోటు కల్పించకుండా పోదనే సందేశాన్నిచ్చింది స్వాతిముత్యం.
ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకిన భావోద్వేగ కథనం!

అందుకే స్వాతిముత్యం సుమారు 25కు పైగా కేంద్రాల్లో ఆ కాలంలో 100 రోజులాడింది.
45 లక్షల బడ్జెటైతే.. అందులో సుమారు ఐదోవంతు కమల్ హాసన్ పారితోషికం. సినిమా చిత్రీకరణకు ముందు రాసుకున్న కథకు.. తెరకెక్కి ముగించే సమయానికి ఓ రెండు భారీ మార్పులు కూడా చేయాలని విశ్వనాథ్ భావించారట. మానసిక పరిపక్వత లేని బాల చేష్ఠలతో అప్పటివరకూ కనిపించిన శివయ్య… లలిత తన జీవితంలోకి ఎంటర్ అయ్యాక క్లైమాక్స్ లో పరిపక్వంగా మారాలన్నది ఒకటైతే… ముందుగా చంపేద్దామనుకున్న లలిత క్యారెక్టర్ ను లైవ్ గా ఉంచాలన్నది రెండోది. ఈ రెండు మార్పులు చేస్తే బాగుంటుందన్నది విశ్వనాథ్ లో రేకెత్తిన పునరాలోచన. కానీ, అందుకు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ససేమిరా అన్నారు. అందుకే, లలిత పాత్రకు ముగింపు పలికి.. నిర్దోషిత్వంతో శివయ్య జీవితాన్ని కొనసాగించే ఓ మరపురాని ముగింపుతో స్వాతిముత్యం ఎండ్ కార్డ్ వరకూ అలరించింది.
శివయ్య కాస్తా స్వాతిముత్యంగా ఎలా మారాడు..?
కమల్ హాసన్ పోషించిన పాత్రకు సూటేబుల్ పేరు స్వాతిముత్యం. అయితే, ఈ పేరుపైనా పెద్ద చర్చే జరిగింది. కమల్ హాసన్ ఈ సినిమాకు తన పాత్ర శివయ్య పేరే పెట్టాలని కోరారట. కానీ, విశ్వనాథ్ బాగా మథనం చేశాక స్వాతిముత్యం పేరే బాగుంటుందని పట్టుబట్టారు. ఆలుచిప్పలుగా పిల్చుుకనే గుల్లల్లో పుట్టే ముత్యంలా పాత్ర సారాన్ని ప్రతిబింబించే విధంగా స్వాతిముత్యం టైటిల్ ఉంటుందని వివరించి, పేరును తన తెరరూపానికి తగ్గట్టుగా పెట్టి విజయవంతమయ్యారు విశ్వనాథ్.
కట్టిపడేసే కమల్ నటన!
సుమారు నాల్గు దశాబ్దాలుగా ఎన్నో సినిమా రివ్యూస్ స్వాతిముత్యంపై వస్తూనే ఉన్నాయి. అవేవీ అతిశయోక్తిగా అనిపించవు. ఎందుకంటే, ఈ సినిమాలో కమల్ హాసన్ తన నట విశ్వరూపం చూపించాడు. కేవలం హావభావాలకు పరిమితం కాకుండా.. బాడీ లాంగ్వేజ్, స్పందించే తీరు, తన తడబడే మాటల శైలి ఇలా పాత్రలో పూర్తిగా మునిగిపోయాడు. స్వాతిముత్యం నటనకే ఆయనకు నాడు రెండో నంది అవార్డ్ కూడా దక్కింది. అలాగే, ఆసియా – పసిఫిక్ ఫిల్మ్ ఫెస్ట్ ఉత్తమ నటుడి అవార్డ్ కూడా లభించింది.
ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ లో 1994లో వచ్చిన హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ తో పోలుస్తూ కొందరు జర్నలిస్టులు కమల్ ను టచ్ చేశారు. ఫారెస్ట్ గంప్ కంటే ఎనిమిదేళ్ల ముందే స్వాతిముత్యం విడుదలైంది. దాని ప్రభావం ఆ తర్వాత సినిమాలపై ఉందో, లేదో తనకు తెలియదుగానీ.. ఆ సినిమాలన్నింటికంటే కూడా శివయ్యే ముందుగా వచ్చాడంటూ గట్టిగా ప్రకటించేశాడు కమల్.
విశ్వనాథ్ విజువల్ ఫీస్ట్… రాజా మ్యూజికల్ బీట్!
అప్పటికి వెండితెరపై వస్తున్న సినిమాలకు పూర్తి భిన్నమైన కథతో తెరకెక్కిన స్వాతిముత్యాన్ని రచయితగా, దర్శకుడిగా విశ్వనాథ్ కన్నులపండుగలా తీర్చిదిద్దితే.. మేస్ట్రో ఇళయరాజా స్వరపర్చిన కర్నాటక క్లాసికల్ రాగాలు, జానపదాల సమ్మిళిత శైలి ఆబాలాగోపాలన్నీ అలరించింది. లైట్ వెస్ట్రన్ టచ్ తో స్ట్రింగ్స్ తో ఆయన చేసిన విన్యాసాలు స్వాతిముత్యానికి ఎస్సెట్. వాణిజ్య ధోరణులకు పూర్తి భిన్నంగా లాలీ లాలీ అనే జోలపాటకు స్వరం కడితే…హాల్స్ లో ఉన్నవాళ్లంతా నిద్రపోయేంత మాయ చేసింది ఆ పాట. ఆ తర్వాత ఇంటింటా పిల్లలను జోలపాడి నిద్రపుచ్చే పాటగా ప్రసిద్ధి చెందింది. సువ్వీ సువ్వీ పాటలో అనుపల్లవిలో స్వరాలు.. శివయ్య, లలిత మాటలతో చేసిన వండర్స్ నాటి రేడియో కాలం నుంచి నేటి 4కే టీవీల వరకూ వింటూ, చూస్తూ ఆనందిస్తూనే ఉన్నాం. క్లైమాక్స్ సన్నివేశానికి నేపథ్య సంగీతమందించేప్పుడు తాను కూడా భావోద్వేగానికి లోనై ఏడ్చినట్టుగా కూడా కొన్ని సందర్భాల్లో రాజా చెప్పుకొచ్చారు.

ఆస్కార్ కు నామినేషన్!
స్వాతిముత్యం సినిమా 59వ అకాడమీ అవార్డులో ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగానికి భారతదేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైంది. అలా ఆస్కార్ నామినేషన్స్ లో గౌరవం పొందిన తొలి చిత్రంగా కూడా స్వాతిముత్యంది ఓ రికార్డ్. 1965లో తమిళ చిత్ర నెంజిల్ ఓర్ ఆలయం ఆ తర్వాత రెండో దక్షిణ భారత చిత్రంగా ఈ గౌరవాన్ని పొందింది.
స్వాతిముత్యంకు అవార్డ్స్ పంట!
స్వాతిముత్యం పేరుకు తగ్గట్టుగా సినిమా తెరకెక్కడం.. తెరకెక్కిన సినిమాకు స్వాతిముత్యమని నిర్ణయించడంతో.. అందుకు తగ్గ ఆదరణను పొందింది ఈ సినిమా. ఉత్తమ తెలుగు ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు.. మూడు నంది అవార్డులు, విశ్వనాథ్ కు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. మాస్కో ఫిల్మ్ ఫెస్ట్, తాష్కెంట్ లోని ఆసియన్ – ఆఫ్రికన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కో కూడా స్వాతిముత్యం సినిమాను ప్రదర్శించారు.
తమిళలంలో సిప్పికుల్ ముత్తుగా డబ్ అయిన స్వాతిముత్యం సినిమాను.. 1989లో హిందీలో ఈశ్వర్ పేరుతో అనిల్ కపూర్, విజయశాంతి ప్రధాన పాత్రలతో రీమేక్ చేశారు. ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లోనూ అందుబాటులో ఉన్న స్వాతిముత్యం.. సినిమా నిర్మించినప్పుడు పుట్టని తరాన్ని కూడా అలరించే చిత్రం.



