ఆ అటవీ గ్రామాలకు దీపావళి కానుకనిచ్చిన థామస్ అల్వా ఎడిసన్ అతను!

ఒక్కసారి ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూర్, చెన్నై నగరాల్లోని విలాసవంతమైన ప్రాంతాల్లో తిరిగి చూడండి. ఏ అమెరికానో, సింగపూర్ నో తలపించేలా మిరుమిట్లు గొలిపే ఆ లైటింగ్ చూడండి. రాత్రి కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడా అన్నంత ఆ వెలుగుజిలుగులు ఎంత ఆకట్టుకుంటాయో తెలిసిందే కదా. అయితే, ఇంత అడ్వాన్స్డ్ గా ఎలక్ట్రిసిటీ, లైటింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందిన ఇదే సమాజంలో.. ఇంకా ఎలక్ట్రికల్ బల్బు వెలుతురు ఎరుగని అటవీ గ్రామాలున్నాయంటే నమ్మగలరా..? పూణేలోని అలాంటి ఓ ఏడుగ్రామాలకు ఈ దీపావళి వెలుగులు నింపబోతోంది. ఈ వెలుగుల వెనుక ఒకరి ఆలోచన.. ఓ స్వచ్ఛందసంస్థ సదుద్ధేశం వెరిసి… వాళ్ల ఊళ్లకే కాదు, వాళ్ల జీవితాలే ఇప్పుడు వెలుగులతో సుసంపన్నం కాబోతున్నాయి.

పూణేకు దూరంగా విసిరివేబడేట్టుండే ముల్షీ గ్రామానికి చెందిన స్వప్నలీ అనే అమ్మాయి ఐదో తరగతి పాసయ్యేందుకు మూడుసార్లు ప్రయత్నించినా ఆమె విఫలమైంది. కేవలం 12 ఏళ్లుండే స్వప్నలీ.. ఉదయం త్వరగా మేల్కొంటేనే వారి జీవితాలకు కావల్సిన ఆహారాన్ని సమకూర్చుకోగలదు. తన తోబుట్టువులను పాఠశాలకు పంపించగలదు. ఇంటిపనులన్నీ చక్కబెట్టుకోగలదు. స్వప్నలీ జీవితం రొటీన్ గా ఎందుకలా యాంత్రికంగా మారింది..? ఆమె మూడుసార్లు ఐదో తరగతి పాస్ అవ్వడానికి విఫలమైన తర్వాత డ్రాపవుటుగా మిగిలిపోయిన తన పరిస్థితి.. తన తోబుట్టువులకు రాకూడదని నిర్ణయించుకుని కష్టపడుతోంది.

అటవీప్రాంతం అవస్థలెలా ఉండేవంటే..?

తన ఇంటి నుంచి ఆమె చదువుకునే పాఠశాల 10 కిలోమీటర్ల దూరం. చిరుత పులులు కూడా తరచుగా కనిపించే ప్రాంతం. వన్యప్రాణులెన్నింటికో కేరాఫ్. అలాంటి వాతావరణంలో స్వప్నలీ ఇంటికి కరెంట్ వెలుగులంటే తెలియదు. లోతుగా ఆలోచించే పాలకులు.. లోతుల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కరించే ప్రజాప్రతినిధులు, అధికారిక వ్యవస్థలు ఇప్పటికీ లేకపోవడం సిగ్గుచేటని మహారాష్ట్రలోని ఆ గ్రామాలు కళ్లకు కడతాయి. అలాంటి పరిస్థితుల్లో పెరిగిన స్వప్నలీ ఇంటికి సాయంత్రం 5 గంటల వరకు చీకటి పడేలోపు వడివడిగా చేరుకునేది. కానీ, అప్పటికే అలసి సొలసి వచ్చిన స్వప్నలీ ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యేలోపు చీకటి పడిపోయేది. 1879, అక్టోబర్ 21వ తేదీనే థామస్ అల్వా ఎడిసన్ బల్బు నుంచి వెలుగులను కనుక్కున్నా… 2025, అక్టోబర్ 21 వరకు.. అంటే సుమారు శతాబ్దన్నర కాలం పాటు తమ గ్రామాలకు కరెంట్ అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో పెరిగింది స్వప్నలీ. దాంతో ఆమె చదువుకోవడానికి సమయమే చిక్కేది కాదు. దాంతో మూడుసార్లు ఐదో తరగతిలోనే ఫెయిలై డ్రాపవుట్ గా మిగిలిపోయింది.

ఇది ముల్షీలోని ఒక్క స్వప్నలీ కథే కాదు.. కాషింగ్, దావాజే, మాలే, షేర్, వార్టుండే, లావాలే, డిస్లీ వంటి మరో ఏడు గ్రామాల్లో ఇన్నేళ్ల భారతంలో మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు సిగ్గుపడాల్సిన, వెలుగులు నిండని గిరిజనుల చీకటి వ్యథ.

ఓవైపు ఇండస్ట్రియలైజేషన్ కు పెట్టింది పేరన్నట్టుగా కనిపించే పూణే చుట్టుపక్కల ఈ అటవీ గ్రామాల్లో మాత్రం సాయంత్రం సంధ్యవేళైందంటే చాలు.. కారుచీకట్లు అలుముకుంటాయి. దీంతో అక్కడి కట్కారి సమాజం ఎదగాలనే కలలపై కూడా కారునీడలు కమ్ముకున్నాయి.

చిమ్మచీకట్ల నుంచి వెలుగుల వైపు అడుగెలా పడింది మరి..?

పర్టిక్యూలర్లీ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్సుగా ముద్రపడి అలాంటి ప్రమాదకర స్థితిలో ఉన్న ఈ గ్రామాల్లోని ఇళ్లన్నీ మట్టితో నిర్మించి.. కర్రలు, తాటాకుల, గడ్డితో కప్పబడిన పైకప్పులతో కనిపిస్తాయి. వేట వీరి ప్రధాన వృత్తి. కాగా వీరి బాగోగులైతే పట్టించుకోని ప్రభుత్వాలు, అటవీశాఖ అధికారులు పెట్టిన కఠిన నిబంధనలతో.. ఆ వేటకూ వారు దూరమయ్యారు. ఈ గిరిజన గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు మొదలయ్యాయి. కొందరు సంచారజీవులుగా ఎక్కడ పని ఉంటే అక్కడే బతుకుతున్నారు. 2018లో టెక్నీలజీ రీయూజ్ ఎన్విరాన్మెంట్ ఎంపవర్మెంట్ ఇన్నోవేషన్ పేరిట ట్రీఐ అనే ఓ ఫౌండేషన్ ను స్థాపించిన తన్వీర్ ఇనామ్దార్ ను ఈ గ్రామాల్లోని చీకటి బతుకులు కలవరపర్చాయి. అతడి చూపే ఈ గ్రామాల పాలిట వెలుగయ్యింది. వీరి తలరాతను మార్చాలనుకున్నాడు. ఒకవైపు, ఇంత సాంకేతికతతో దూసుకుపోతున్న సమాజంలోనే.. మరోవైపు, కనీసం విద్యుత్ వెలుగులు కూడా లేని గ్రామాలు తన్వీర్ ను ఆశ్చర్యపర్చడంతో పాటే.. అది లేకపోవడమే వీరి జీవితాలను అగాథంలోకి నెట్టేస్తోందన్న సహానుభూతి కదిలించింది.

విద్యుత్ వెలుగులే పూణే చుట్టూ ఉన్న అటవీగ్రామాలకు దిక్సూచిగా మారతాయని నమ్మిన తన్వీర్.. లైటింగ్, వాడకం, భద్రత, లైటింగ్ కోసం కావల్సిన బ్యాకప్ ఇలా ఓ నాల్గు ప్రధాన అంశాలపై ఫోకస్ చేశారు. అలా వీరి కోసం మిషన్ ఉర్జా పేరుతో పోర్ట్ బుల్ ఎలక్ట్రిక్ స్కీమ్ ను రూపొందించి.. ఈ కట్కారీ సమాజంలో వెలుగులు నింపేందుకు ఈ దీపావళిని అందుకు టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఇన్ని ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా ఎవ్వరి చూపూ ప్రసరించని గ్రామాల్లో వెలుగులు ప్రసరించేందుకు తన్వీర్ ఇనామ్దార్ తీసుకున్న సంకల్పం ఇప్పుడు మహారాష్ట్రలో ఓ పెద్ద చర్చగా మారింది.

తన్వీర్ ఇనామ్దార్ ప్రయత్నం ఫలించి.. ఇప్పుడు ముల్షీ గిరిజన గ్రామంలోని 500 ఇళ్లకు 35 వాట్ల ఏల్ఈడీ సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ లిథియం బ్యాటరీ సాయంతో నడిచేలా సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసి.. 18 గంటల బ్యాటరీ బ్యాకప్ అందించేవిధంగా ఇక్కడి లైటింగ్ వ్యవస్థను డిజైన్ చేశారు. ఇది కేవలం ఒక్క ముల్షీకే కాదు.. మనం ముందుగా చెప్పుకున్న పూణే చుట్టుపక్కల పాలకుల కన్నుపడని మరో 7 అటవీ గ్రామాల్లోనూ ఈ దీపావళికి కారుచీకట్లను చీల్చుకుని వచ్చే సోలార్ వెలుగులకు రంగం సిద్ధమవుతోంది. అందుకే ఇప్పుడు తన్వీర్ ఇనామ్దారే ఈ అటవీగ్రామాల ప్రజానీకానికి థామన్ అల్వా ఎడిసన్.

చీకటిపడితే వన్యప్రాణులతో భయపడ్డ జనానికి ఆ చీకట్లను పారద్రోలే పథకం మిషన్ ఉర్జా!

తనకు తెలియని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడే బాలు కట్కర్.. ఓరోజు చిరుతపులిని చూశాడు. ఆ పులిని చూసిన జ్ఞాపకం బాలు అంత త్వరగా మర్చిపోలేకపోయాడు. చీకటి పడ్డాక వాష్ రూమ్ కు బయటకు వెళ్లాలన్నా గజ్జుమనే పరిస్థితి బాలుతో పాటే, ఆ గ్రామాలది.

చీకటి పడితే చదువుకోడానికి ఇక్కడి గ్రామాల్లోని విద్యార్థులకు కుదరని పని. గృహిణులు వంట చేసుకోవడానికీ ఇబ్బందీ. పక్క ఊళ్ల నుంచి తమ ఊరికి తిరిగి రావాలంటే కూడా భయపడే పరిస్థితి. ఇప్పుడు వెలుగు తమ జీవితాలను సుసంపన్నం చేస్తుందన్న ఒక ఆనందపు వెలుగు వాళ్ల కళ్లల్లో కనిపిస్తుండటంతో.. ఈ ఎనిమిది అటవీ గ్రామాలకు ఈ దీపావళి నిజమైన వెలుగుల దీపావళి కాబోతోంది.

ఒక్క చిన్న బల్బు ఎలా వెలుగులు నింపుతుంది..?

ముల్షీతో పాటు, మరో ఏడు గ్రామాల్లోని ఇళ్లలో.. అలాగే, ఈ అటవీ గ్రామాల్లోని వీధుల్లో కూడా మిషన్ ఉర్జా స్కీమ్ కింద ఇప్పుడు సౌరవిద్యుత్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది కేవలం ఎలక్ట్రిసిటీ ఏర్పాటు వల్ల వచ్చే వెలుతురే కాదు.. జీవితాల్లో మార్పును తీసుకొచ్చే వెలుతురు. కొత్త ఆశలను చిగురించే వెలుతురు. తమ ఊళ్ల నుంచి ఇతర పట్టణాలకు వలసలను నివారించే వెలుతురు. చీకట్లో జరిగే జంతువుల దాడులను నివారించే వెలుతురు. ఫలితాల్లో ఫెయిలై ఇంట్లోనే కూర్చునే డ్రాపవుట్స్ ను నివారించి వారింట్లో ఇప్పుడు హాయిగా లైట్ వెలుతురులో చదువుకుని పాస్ అయ్యే అవకాశాన్ని కల్పించే వెలుతురు. 90 శాతం డ్రాపవుట్స్ ను తిరిగి బడికి పంపించే వెలుతురు. చీకటి అదను చూసి ఆకతాయిల వేధింపులను ఎదుర్కొనే మహిళలు తిరిగి ఎదుర్కొనే విధంగా ధైర్యాన్నిచ్చే వెలుతురు.

కట్టెలను కాలిస్తేనేగానీ రాత్రిళ్లు వెలుతురు లేని అటవీ గ్రామాల్లో.. ఆ మంటలు కూడా ఇళ్లకు పాకి ప్రమాదాలు చోటుచేసుకునేవి. అలాంటి అవసరం లేకుండా.. కాంతిని నింపే ఓ కొత్త వెలుగుల్లా సౌరదీపాలు ఈ గ్రామాల చీకటి చరిత్రకు సమాప్తి పలుకబోతున్నాయి. అందుకు, తన్వీర్ ఇనామ్దార్ ఆలోచన, చూపు.. ఈ గ్రామాలపాలిట హైమాస్ట్ లెడ్ లైట్లై ప్రసరించబోతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles