గ్రాఫిక్ టెంప్లేట్స్ లో అతడో కొత్త అధ్యాయం!

ఒకనాడు ఇన్ఫోసిస్ గెస్ట్ హౌజ్ సర్వీస్ బాయ్.. ఇప్పుడు రెండు కంపెనీల సీఈవో!!

విజయానికి నిర్వచనం.. ఈ డ్రాపవుట్ ప్రస్థానం!

విజయానికి నిర్వచనమేంటని ఎవరైనా అడిగితే..? అతగాడి పేరు చెబితే చాలు! స్కూల్ డ్రాపవుట్, ఓ కూలీ కొడుకు, 9 వేల రూపాయలకు ఆఫీస్ బాయ్ గా పనిచేసిన వ్యక్తి.. ఇప్పుడు రెండు కంపెనీలకు సీఈవో! చాలదా.. మరి విజయానికి ఆ నిర్వచనం..?

2015లో ఓ కారు యాక్సిడెంట్ తర్వాత మంచానికే పరిమితమైన సమయంలో తన ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది భగత్. కానీ, సంకల్పబలం మెండుగా ఉన్న యువకుడు. పట్టుదల, కసితో ఎదగాలన్న ప్రయత్నమే భగత్ ను రెండు కంపెనీల సీఈవోను చేసింది. స్టార్టప్ ల రూపకల్పనలో ఇప్పుడు భగత్ పేరు ప్రస్తావించకుండా ఉండలేనంత స్థాయిలో.. ఎప్పటికప్పుడు పరిణామాలు మారిపోయే నేటి సాంకేతిక యుగంలో.. ఓ స్కూల్ డ్రాపవుట్ ఎదగిన తీరు నిజంగా సక్సెస్ స్టోరీనే.

యానిమేషన్, గ్రాఫిక్ ఇండస్ట్రీపై మక్కువ పెంచుకున్న దాదాసాహేబ్ భగత్ అనతికాలంలోనే ఎదిగిన తీరు అబ్బురపరుస్తుంది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన భగత్ బాల్యం చదువంతా ఊర్లోనే గడిచినా.. ఎస్సెస్సీ తర్వాత భగత్ తన కుటుంబం తన చదువు కోసం ఆర్థికభారాన్ని భరించలేని స్థితిలో డ్రాపవుట్ గా మిగిలిపోయాడు. కానీ, ఏదో ఒక ఉద్యోగం చేయకపోతే పొట్ట పోసుకోవడమైనా, ఇల్లు గడవడమైనా కష్టమనే ఉద్ధేశ్యంతో.. కెరీర్ కోసం పూణేకు పయనమయ్యాడు. ఎలాగోలా ఐటీఐ డిప్లమా పూర్తి చేసిన భగత్ కు.. ఇండస్ట్రీయల్ సెక్టార్ లో ఎంత యత్నించినా ఎలాంటి చిన్న ఉద్యోగం కూడా దొరకలేదు. కానీ, ప్రయత్నం ఫలించి.. ఇన్ఫోసిస్ గెస్ట్ హౌజ్ లో రూమ్ సర్వీస్ బాయ్ ఉద్యోగం దొరికింది. అంటే, వచ్చినవారికి మంచినీళ్లు, కాఫీలు, టీలు అందించే పనికి.. నెలకు 9 వేల రూపాయల జీతానికి తన కెరీర్ ను ప్రారంభించాడు.

అయితే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి లభిస్తున్న గుర్తింపుకు అక్కడే ఆకర్షితుడయ్యాడు. అదే సమయంలో ఆ కార్పోరేట్ ప్రపంచం భగత్ ను ఊరించింది. కానీ, తనకు ఎస్సెస్సీ తర్వాత.. పై చదువుల్లేకపోవడం.. కేవలం ఐటీఐ డిప్లమా మాత్రమే.. తన ఉన్నత చదువు కావడంతో ఒకింత నిరాశ కూడా తప్పలేదు. కానీ, ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరికి.. భగత్ ఆసక్తి నచ్చింది. దాంతో అతణ్ని యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ ఫీల్డ్ లో ఎంకరేజ్ చేశారు. అలా ఓవైపు ఉద్యోగం చేసుకుంటూనే.. యానిమేషన్ లో కోర్స్ పూర్తి చేశాడు. దాంతో భగత్ కు ముంబైలో ఓ యానిమేషన్ కంపెనీలో ఓ ఉద్యోగం దొరికింది. కానీ, ఆ ఉద్యోగాన్ని వదిలేసిన భగత్.. ఆ తర్వాత హైదరాబాద్ బాట పట్టాడు. హైదరాబాద్ లో డిజైన్ అండ్ గ్రాఫిక్స్ కు సంబంధించిన ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. మరోవైపు ఏకంగా పైథాన్, సీ ప్లస్ ప్లస్ వంటివి నేర్చుకున్నాడు. అదే సమయంలో గ్రాఫిక్స్ తయారీకి వెచ్చించే అధిక సమయం భగత్ ను ఆలోచింపజేసింది.

దాంతో భగత్ లో మెరిసిన ఆ ఆలోచనే అతడి కెరీర్ ను మలుపులు తిప్పింది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తయారుచేయడానికి పడుతున్న అధిక సమయాన్ని దృష్టిలో పెట్టుకున్న భగత్.. వాటిని టెంప్లేట్స్ గా మార్చి అవసరమైనప్పుడు వాటిని తిరిగి ఉపయోగించుకునే విధంగా ఓ డిజిటల్ లైబ్రరీని తయారు చేయాలని సంకల్పించాడు. అలాంటి విజువల్ ఎఫెక్టివ్ టెంప్లేట్స్ తో మార్కెట్ లో కి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న భగత్ ను.. యాక్సిడెంట్ రూపంలో విధి మరోసారి వెక్కిరించిది. దాంతో సుదీర్ఘకాలం ఇంటికే పరిమితమైన భగత్.. తన ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది.

కానీ, ఏది జరిగినా మన మంచికే అనుకునే మనస్తత్వముంటే భగత్ లాగా ఎదుగొచ్చు అనేలా.. భగత్ ప్రస్థానం తిరిగి మళ్లీ ప్రారంభమైంది. తాను బెడ్ కే పరిమితమైన కాలమంతా రీయూజేబుల్ టెంప్లేట్స్ తో డిజిటల్ లైబ్రరీని మరింత సమర్థవంతంగా తయారు చేసుకున్నాడు. అలా 2015లో నైంత్ మోషన్ పేరుతో సొంతంగా స్టార్టప్ ప్రారంభించాడు. భగత్ మార్కెటింగ్ స్కిల్స్, సమర్థతతో.. కేవలం అతి తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా 6 వేల మంది కస్టమర్స్ ను తయారు చేసుకోగల్గాడు. వాటిల్లో ప్రముఖ ఛానల్ బీబీసీతో పాటు.. మ్యూజిక్ ఛానల్ 9xm వంటివి కూడా ఉండటం విశేషం.

అలాగే, డోర్ గ్రాఫిక్స్ పేరిట సమాంతరంగా తన రెండో కంపెనీని ప్రారంభించాడు భగత్. సోషల్ మీడియా గ్రాఫికల్ వీడియోస్ కోసం.. క్యాన్వా అనే ఫ్లాట్ ఫామ్ తరహాలో ఒక టెంప్లేట్ లైబ్రరీని ప్రారంభించిన భగత్.. కోవిడ్-19 దెబ్బకు పూణే నుంచి తన వేదికను తన స్వగ్రామమైన బీడ్ కు మార్చేయాల్సిన అనివార్య పరిస్థితేర్పడింది. బీడ్ లో ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కు సంబంధించి ఇబ్బందేర్పడటంతో.. 4జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ఒక హిల్ స్టేషన్ పై ఓ గది కిరాయి తీసుకున్నాడు. తను ఎదగడానికి యానిమేషన్, గ్రాఫిక్స్ లో దోహదపడ్డ మరి కొందరి సహకారంతో పాటు.. స్థానిక యువతకు శిక్షణనిస్తూ డూగ్రాఫిక్స్ కంపెనీ ఆపరేషన్స్ ను ఆ హిల్ స్టేషన్ నుంచి ప్రారంభించాడు.

సరిగ్గా ఏడాది తిరిగేసరికి, పదివేల మంది యాక్టివ్ యూజర్స్ సంఖ్య.. తన సోషల్ మీడియా గ్రాఫికల్ టెంప్లేట్స్ వినియోగదారులుగా మారిపోయారు. ముఖ్యంగా పూణే, ముంబై, ఢిల్లీ, బెంగళూర్ వంటి చోట్ల నుంచి అధికసంఖ్యలో యూజర్స్ తయారుకాగా.. జపాన్, ఆస్ట్రేలియా, యూకే నుంచి కూడా తన డూగ్రాఫిక్స్ టెంప్లేట్స్ కు కొద్ది మంది ఆకర్షితులవ్వడంతో.. భగత్ స్టార్టప్ కంపెనీల పేరు మార్మోగింది. తానాశించిన ఆత్మ నిర్భర్ భారత్ కు నిలువెత్తు సాక్షిగా.. మారిన దాదాసాహేబ్ భగత్ ను ప్రధాని మోడీ కూడా అభినందించాడు. ఇప్పుడు భగత్ డూ గ్రాఫిక్స్ అనే సంస్థ.. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి ఇండియన్ డిజైన్ పోర్టల్ గా గుర్తింపు పొందడం విశేషం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles