విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం… విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః… విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం దైవతం… విద్యా రాజసు పూజ్యతే న తు ధనం విద్యావిహీనః పశుః… ఇది భర్తృహరి సుభాషితం.
విద్య మనిషికి అందమైన రూపం. దాచి ఉంచిన గొప్ప ధనం. విద్య వల్ల భోగాలు, కీర్తి, సుఖం లభిస్తాయి. విద్య గురువులకు గురువు. విదేశాలకు వెళ్లినప్పుడు బంధువులా సహాయపడుతుంది. విద్య గొప్ప దైవం. రాజులు కూడా ధనం కంటే విద్యనే పూజిస్తారు. విద్య లేనివాడు పశువుతో సమానం అని భావం.

అలాంటి విద్య విలువ తెలుసుకున్న గ్రామమది. అందుకే, ఆ గ్రామమిప్పుడు సివిల్ సర్వెంట్స్ కు ఓ పరిశ్రమ!
ఉత్తరప్రదేశ్ జాన్ పూర్ జిల్లాలోని మాధోపట్టి గ్రామం గురించి చదువు మీద ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరూ తెలుసుకుని తీరాలి. అదో చిన్న గ్రామం. కేవలం 75 కుటుంబాలుండే ఊరు. వారికక్కడ ఎలాంటి కోచింగ్ ఇనిస్టిట్యూట్స్ లేవు. మెట్రోపాలిటియన్ నగరాల్లో చదువుకోవడానికి కనిపించే వసతులు, సౌకర్యాలు అస్సలే కానరావు. కానీ, ఆ ఊరు సివిల్ సర్వెంట్స్ తో ఇప్పుడు ఒక ప్రభంజనంలా నిలుస్తోంది.
జస్ట్ 75 కుటుంబాలున్న ఓ ఊరు.. ఇప్పుడు ఏకంగా 50 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఉద్యోగస్థులను తయారుచేసే వాతావరణంతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంటోంది. కేవలం ఐఏఎస్ సాధించినవారి సంఖ్యే ఇప్పుడిక్కడ 47 మంది అంటే నమ్మగలరా…?
సాధారణంగా ఏ ఊరువారైనా బాగా తెలివితేటలున్నవారు అధికసంఖ్యలో కనిపిస్తే.. ఆ ఊరు నీళ్లల్లోనే ఏదో మహత్యముందనుకుంటూ ఉంటాంగా! అదిగో అలా అక్కడి సివిల్ సర్వెంట్స్ లో చాలామంది కూడా మొదటి ప్రయత్నంలోనే తమ లక్ష్యాలను సాధించి తమ గ్రామానికి అలాంటి విశేషమైన పేరు సంపాదించిపెట్టారు. అందుకే ఇప్పుడు మాధోపట్టి.. భారత్ సివిల్ సర్వీసెస్ ఫ్యాక్టరీగా ఖ్యాతికెక్కింది. అందుకు, అక్కడి సమాజం నుంచి లభించే మద్దతు కూడా వారిని సానుకూల దృక్పథంలో నడిపిస్తోంది.
విద్యలో ఆ ఊరు రాణించడం వెనుక వందేళ్ల చరిత్ర!
స్వాతంత్ర్య సమరయోధుడు ఠాకూర్ భగవతి దిన్ సింగ్, ఆయన భార్య శ్యామ్రాతి సింగ్ మొదట్లో పిల్లలకు విద్యనందించడంతో ఆ ఊరు బీజాక్షరాలను దిద్దడం ప్రారంభించింది. 1917లో ఆ ప్రయాణం ప్రారంభమైంది. అలా ప్రారంభంలోనే అబ్బాయిలతో పాటు.. బాలికలకూ విద్యనందించాలని శ్యామ్రాతి తీసుకున్న నాటి విప్లవాత్మక నిర్ణయంతో మొదలైన లెగసీ… ఇవాళ విద్యా పరివర్తనలో ఆ ఊరు వృద్ధి చెందిన తీరుకు ఓ ప్రేరణగా నిల్చింది.
ఆ తర్వాత బ్రిటీషర్స్ కాలంలోనే ఈ ఊరుకు చెందిన ముస్తఫా హుస్సేన్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు ఎంపికై.. ఆ తర్వాత తరాల నుంచి ఇప్పటితరం వరకూ కూడా స్ఫూర్తినిస్తున్నాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ సివిల్స్ లో ఆ గ్రామవాసులు పెద్దగా ఎవ్వరూ లక్ష్యాలను సాధించలేకపోయారు. అలా 40 ఏళ్లు గడిచాక ప్రకాష్ సింగ్ అనే మరో వ్యక్తి సివిల్స్ లో దేశంలోనే రెండో ర్యాంక్ సాధించి.. మళ్లీ మాధోపట్టిలో సివిల్స్ వైపు యువత చూపును తిప్పి.. తమ గ్రామాన్ని మేథోపట్టిగా మార్చాడు.
ఎక్కువశాతం సివిల్ సర్వెంట్సే కావడం వెనుక ఉన్న రహస్యమేంటి..?
చదువులంటే పట్టణాల్లో, నగరాల్లో కోచింగ్ సెంటర్స్ లో విచ్చలవిడిగా డబ్బులు కట్టి పేరెంట్స్ పిల్లలను అప్పగించిరావడం, అక్కడ వారు బాయిలర్ కోళ్లలా మగ్గుతూ చదవడం కాదని.. సమిష్ఠి మార్గదర్శకత్వంతో ఎదగడమని నిరూపించింది మాధోపట్టి. సివిల్ సర్వీసెస్ సాధించినవారు ఉద్యోగాలు రాగానే.. రెక్కలు గట్టుకుని మూలాలు మరిచి ఎగిరిపోరు. మధ్యమధ్యన ఊరికి వచ్చి సెమినార్స్ లో పాల్గొంటారు. ఔత్సాహితులైన ఆశావహులకు పాఠాలు బోధిస్తారు. మార్గనిర్దేశనం చేస్తారు. ఒకింట్లో ఎవరైనా సివిల్ సర్వెంటైతే.. ఆ ఊరంతా కలిసి వేడుక జరుపుకునే ఐక్యత అక్కడి ప్రత్యేకత. షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నట్టుగా జ్ఞానాన్ని పంచుకునే ఒక సంస్కృతితో మాధోపట్టి యావత్ దేశం మొత్తం చూపునూ తనవైపు తిప్పుకుంది
ఆ ఊరికి చెందిన ఓ సింగ్ నల్గురు సోదరులూ ఐఏఎస్ లు. వినయ్, ఛత్రపాల్, అజయ్, శశికాంత్. ఆ నల్గురి విజయాన్ని ఊరు ఊరంతా కలిసి జరుపుకుంది. ఇప్పుడక్కడి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తో పాటు.. ఇతర గ్రూప్ ఎగ్జామ్స్ లో విజయాలు సాధించినవారు.. భిన్నరంగాల్లో దేశం మొత్తం విస్తరించి మాధోపట్టి పేరును నిలబెట్టారు. అంతరిక్ష పరిశోధన, న్యాయవ్యవస్థ, బ్యాంకిగ్ సెక్టార్, అణుశాస్త్రవేత్తలు ఇలా ఈ ఊరంటేనే విద్యావేత్తల నిలయం. ఏ ఒక్కరిని కదిపినా.. వారొక్క లైబ్రరీలా కనిపిస్తారు. ఇలా జాతీయస్థాయిలో మాధోపట్టి సివిల్ సర్వెంట్లకు ఓ చిరునామాగా మారింది.
మొదటే భర్తృహరి సుభాషితాల్లో చెప్పినట్టుగా ఒక సమాజం విద్యను ఆదరిస్తే.. గౌరవిస్తే.. దాని విలువ తెలుసుకుంటే.. సరిగ్గా అంచనా వేయగల్గితే ఏం జరుగుతుందో చెప్పడానికి మాధోపట్టి ఓ నిలువెత్తు ఉదాహరణ.
చదువంటే డబ్బు.. బడా ప్రైవేట్, కార్పోరేట్ స్కూల్స్, కాలేజెస్ మాత్రమే అని భావిస్తున్న రోజుల్లో… ఆశయం, అందుకు తగ్గ కృషి, సాయమందించి, ప్రోత్సహించే సమాజముంటే ఎలా ఎదుగవచ్చో మాధోపట్టి మిగిలిన సమాజానికి చూపిస్తోంది.



