సినిమా అంటేనే డ్రామా. కానీ, జీవితమూ అంతకంటే ఓ పెద్ద డ్రామా. జీవితంలో అలాంటి ఓ పెద్ద డ్రామాను అనుభవించాకే.. సినీ డ్రామాలో తానో మెగా హాలీవుడ్ స్టార్ అయ్యాడు. తండ్రి ఓ గూఢచారిగా పనిచేస్తే.. తల్లి నల్లమందును అక్రమరవాణా చేసేది. కట్ చేస్తే కొడుకు హాలీవుడ్ మెగాస్టార్.
జాకీచాన్… గగుర్పొడిచే అరివీరభయంకరమైన స్టంట్స్ మాత్రమే ప్రేక్షకుడి కంటబడి ఆందోళన చెందకుండా.. ఆ యాక్షన్ సన్నివేశాలకు కాసింత కామెడీ జత చేసి ఎదిగిన ప్రత్యేక నటుడు. హాలీవుడ్ యాక్షన్ స్టార్ గా మారడానికి ముందే జాకీచాన్ కథ ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మించిన నాటకీయతతో సాగింది.

1954లో హాంకాంగ్ లో జన్మించిన చాన్ కాంగ్ సాంగ్ ఉరఫ్ జాకీచాన్.. తన తల్లిదండ్రులెవరనే రహస్యాన్ని బయటకు చెప్పుకుండానే సమాజానికి పరిచయమై తనను తాను నిరూపించుకున్నాడు.
తండ్రో గూఢచారి – తల్లి ఓ స్మగ్లర్!
జాకీచాన్ తండ్రి చార్లెస్ చాన్ ది అసాధారణ జీవితం. చైనా అంతర్యుద్ధంలో చైనీస్ నేషనలిస్ట్ ప్రభుత్వం కోసం గూఢచారిగా పనిచేశాడు. చైనాలో రాజకీయ అస్థిరత ఏర్పడిన సమయంలో నిఘా వర్గాలకు ఉపయోగపడుతూ గూఢచర్యలో పాల్గొన్నాడు. వివిధ పట్టణాలు, ప్రాంతాలకు రహస్యంగా వెళ్లడం, నకిలీ గుర్తింపు కార్డులతో ఆయా ప్రాంతాల్లో తనను తాను పరిచయం చేసుకోవడం గూఢచారిగా తన పని. ప్రాణాంతక పరిస్థితుల్లో కూడా తాను పని చేయాల్సి వచ్చింది. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక ఇక చార్లెస్ హాంకాంగ్ కు పారిపోయాడు. హాంకాంగ్ లోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయంలో ఓ వంటవాడిగా పనిచేశాడు.
ఇక తల్లి లీ- లీ చాన్ ది తండ్రి కంటే ప్రమాదకరమైన జీవితం. చైనాలో సివిల్ వార్ నడుస్తున్న సమయంలో ఆమె నల్లమందు సప్లైయర్స్ లో ఒకరు. జాకీ చాన్ కుటుంబ చరిత్ర గురించి రాసిన బ్రిటీష్ రచయిత, జర్నలిస్ట్ జేమ్స్ పామర్ చెప్పేదాని ప్రకారం.. లీ నల్లమందును అక్రమ రవాణా చేసింది. కానీ, బయట తన అస్తిత్వం కోసం మాత్రం స్టేజ్ ఆర్టిస్ట్ గానూ, బ్లాక్ జాక్ డీలర్ గానూ చలామణి అయ్యేది. కడు పేదరికమే జాకీచాన్ తల్లిదండ్రులిద్దరూ ప్రమాదకరమైన జీవితాలనెంచుకున్నట్టు సదరు రచయిత పేర్కొంటున్నారు. చివరకు లీ చాన్ కూడా చైనా నుంచి హాంకాంగ్ కు పారిపోవాల్సి వచ్చింది.
అలా లీ – లీ చాన్, చార్లెస్ చాన్ ఇద్దరూ హాంకాంగ్ లో కలుసుకున్నారు. విదేశీ దౌత్యకార్యాలయంలోనే పరిచయం పెరిగి ప్రేమగా మారి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అదిగో అక్కడే పుట్టాడు మన హాలీవుడ్ మెగాస్టార్ జాకీచాన్. జాకీచాన్ తాను పెరిగి పెద్దగయ్యేవరకూ కూడా తల్లిదండ్రుల జీవితాలు ఎలా గడిచాయో తనకు తెలీదు. తాను సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న సమయంలోనే ఆ విషయాలు బయటపడ్డాయి. ఆ సమయంలో అలాంటి విషయాలు తనకు చేటు చేసే అవకాశాలూ లేకపోలేదని.. ఏనాడూ జాకీచాన్ తన కుటుంబానికి సంబంధించిన విషయాలను ఏ వేదికపై తప్పిపోయి కూడా మనసు విప్పి చెప్పలేదు.
గ్లోబల్ యాక్షన్ ఐకాన్ గా జాకీచాన్!
జాకీచాన్ హాలీవుడ్ మెగాస్టార్ గా ఎదగడమూ అంత సులభంగా ఏమీ జరుగలేదు. ఏడేళ్ల ప్రాయంలోనే చైనా డ్రామా అకాడమీలో చేరాడు. అక్కడే తను మార్షల్ ఆర్ట్స్, విన్యాసాలు, ఇతర ప్రదర్శనలు, కళల్లో రాటు దేలాడు. అక్కడ తాను తీసుకునే శిక్షణ కఠినంగానే కాదు.. కొన్నిసార్లు క్రూరంగా కూడా ఉండేది. కానీ, ఆ పెయిన్ లోంచే జాకీ సాహసోపేతమైన విన్యాసకారుడిగానూ మారాడు. అదే సమయంలో తనలోని హాస్యచతురతను బయటపెడుతూ చమత్కారిగా కూడా ఆవిర్భవించాడు.
బ్రూస్ లీ సినిమాలు ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ఎంటర్ ది డ్రాగన్ లో స్టంట్ మ్యాన్ గా పనిచేసిన తర్వాత.. జాకీకి 1978లో డ్రంకెన్ మాస్టర్ తో ఓ పెద్ద బ్రేక్ లభించింది. అది మార్షల్ ఆర్ట్స్ సినిమా. అయితే, అదే సమయంలో అందులో కామెడీ కూడా ఓ ప్రధానమైన ట్రాక్. అందులో జాకీచాన్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. అది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత పోలీస్ స్టోరీ, ప్రాజెక్ట్ ఏ వంటివాటితో ఫేమస్ యాక్షన్ కమ్ కామెడీ హీరోగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక క్రిస్ టక్కర్ తో కలిసి రష్ హవర్ చేసిన జాకీచాన్ ను హాలీవుడ్ హీరోలనే విస్తుపోయేలా చేసింది. ఆయనకొస్తున్న ఆదరణ ఒక సమయంలో హాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోల్లోనే ఓ చర్చగా మారింది. రష్ హవర్ కు తోడు.. ఆర్మర్ ఆఫ్ షాంఘై నూన్, ది టక్సెడో, ది కరాటే కిడ్ వంటివి సూపర్ హిట్స్ కావడంతో.. ప్రాశ్చాత్యహీరోలతో సరిసమానంగా జాకీచాన్ క్రేజ్ కూడా విశ్వవ్యాప్తమైంది.
జాకీచాన్ జీవితంలో చాలాసార్లు మరణించి.. మళ్లీ జీవించాడు. అవునూ, ఇది నిజం. అతడి యాక్షన్ సీన్స్ అతణ్ని నరకం అంచులకు తీసుకెళ్లి మళ్లీ బతికి బట్ట కట్టేలా నిలబెట్టాయి. తన యాక్షన్ సీన్స్ ను పండించేందుకు అతడు చేసిన స్టంట్స్ తో జాకీచాన్ కు అయినన్ని గాయాలు.. ప్రపంచంలోనే ఏ సినీ ఇండస్ట్రీలో మరో ఏ హీరోకు కూడా అయ్యుండవు. అయితే, ఆ విన్యాసాలు, వాటితో హాస్యాన్ని మిళితం చేసిన తీరే జాకీచాన్ ను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
మార్షల్ ఆర్ట్స్ లో అప్పటికే బ్రూస్ లీ పేరు వరల్డ్ వైడ్ గా ఒక రేంజ్ లో వినిపించిన కాలంలో.. తానూ, మళ్లీ మార్షల్ ఆర్ట్స్ తో మాత్రమే ప్రవేశిస్తే జస్ట్ కాపీ క్యాట్ లాగా మిగిలిపోతానని గ్రహించి, గమనించి.. తన విన్యాసాలకు, కూసింత చమత్కారాన్నీ అద్ది ప్రత్యేక నటుడిగా పేరు తెచ్చుకున్నాడు జాకీచాన్.
తల్లిదండ్రులు అనుభవించిన రహస్య జీవితాలను ఎక్కడా బయటపడనీకుండానే.. అలాంటి ఐడెంటిటీ ఎక్కడా అవసరం లేకుండానే.. తన స్వశక్తితో ఎదిగిన యాక్షన్ స్టార్ జాకీచాన్.



