కొన్ని వార్తలు ప్రాంతాలతో సంబంధం లేకుండా కదిలిస్తాయి. చైతన్యప్రతీకలై ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తాయి. అలాంటి వార్తే అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థుల పాదయాత్ర!
ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్స్ లేకపోవడం, విద్యార్థినిలున్న స్కూళ్లు, హాస్టల్స్ లో కనీసం నాప్కిన్స్ కూడా అందుబాటులో ఉంచకపోవడం, ఉపాధ్యాయుల కొరత, అన్ని సబ్జెక్ట్స్ చెప్పే ఉపాధ్యాయుల్లేక, ఒకే ఒక్క టీచర్ అన్ని సబ్జెక్ట్స్ చెప్పే దుస్థితి, వాష్ రూమ్స్ సౌకర్యాల్లేకపోవడం, ల్యాబ్ ఫెసిలిటీస్ లేకపోవడం, మధ్యాహ్న భోజనం సరిగ్గా లేకపోవడం, దాని నిర్వాహకులకు బిల్లులు సరిగ్గా రాకపోవడం, వారు అప్పులు చేసి మధ్యాహ్న భోజనం నిర్వహించడం… ఇలా రకరకాల సమస్యలు స్కూల్ అంటే గుర్తుకొస్తాయి. ఇప్పటికీ ప్రాంతాలకతీతంగా.. యావత్ దేశం మొత్తం సర్కారీ పాఠశాలల్లో ఇదే దయనీయ స్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. కనిపిస్తూనే ఉంటాయి కూడా!

అయితే అదే సమస్యపై అరుణాచల్ ప్రదేశ్ పక్కే కెస్సాంగ్ జిల్లాని మారుమూల ప్రాంతం నాంగ్న్యో కస్తూర్బా గర్ల్స్ స్కూల్ విద్యార్థులు కదం తొక్కారు. ఏకంగా 90 మంది విద్యార్థినులు కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్ కు పాదయాత్ర చేపట్టారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను నిరసించే లాంగ్ మార్చ్ అది.
అయితే, ఆ జిల్లా హెడ్ క్వార్టరేదో దగ్గర ఉన్న ప్రాంతమేమీ కాదు. ఏకంగా 65 కిలోమీటర్లు ఆ విద్యార్థినులు తమ సమస్యను ఎత్తిచూపేందుకు పాదయాత్రి చేశారు. కాలినడకన వారి సమస్యల పట్ల వారి పోరాటం యావత్ భారతం దృష్టిని వారివైపు ఆకర్షించింది. సెలవు దినమైన ఆదివారం రోజు రాత్రి అందుకు ప్లాన్ చేసుకున్నారు. రాత్రివేళ ప్రారంభమైన వారి కాలినడక ఉదయాన్నే ఆఫీసులు తెరుచుకునేసరికి జిల్లా హెడ్ క్వార్టర్ పక్కే కెస్సాంగ్ కు చేరుకుంది.
ఇంటర్ ప్లస్ వన్, ప్లస్ టూ విద్యార్థులు ఆ పాదయాత్రకు నాయకత్వం వహించారు. ఇతర విద్యార్థులుకు కూడా వారితో కలిసి జాగ్రఫీ, పొల్టికల్ సైన్స్ ఉపాధ్యాయులను నియమించాలన్న డిమాండ్ తో మేము సైతమంటూ అడుగులు వేశారు.
విద్యార్థినులు వారి డిమాండ్ ను అధికారులు, ప్రభుత్వం ముందుంచుతూ ప్రదర్శించిన ప్లకార్డులు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. ” ఉపాధ్యాయుడు లేని పాఠశాల అది కేవలం ఓ భవనం మాత్రమే” నంటూ వారు రాసిన స్లోగన్స్ కూడా అందరినీ ఆలోచింపజేశాయి.

అప్పటికే తమకున్న ఉపాధ్యాయుల కొరతపైన పదే పదే హైయర్ అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోవడంతో.. ఏకంగా తమ 65 కిలోమీటర్ల కాలినడకతోనైనా అధికారుల్లో చలనం రాకపోతుందానని విద్యార్థులు ఒక ఉద్యమమై కదిలారు.
2011-12లో ఏర్పాటు చేసిన ఆ పాఠశాల ఇప్పుడు సెయ్ డోన్యి అనే ఛారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో నడుస్తోంది. వెనుకబడిన వర్గాల బాలికల కోసం ఏర్పాటు చేసిన కస్తూరిబా బాలికల విద్యాసంస్థలో ఓ హెడ్ మాస్టర్, 13 మంది ఉపాధ్యాయులు, ఓ హాస్టల్ వార్డెన్ ఉన్నారు. అయితే ఉపాధ్యాయులు సబ్జెక్స్ వారీగా లేకపోవడం నిజమేనని అధికారులే ఒప్పుకున్నారు. ఏదైతేనేం.. 90 మంది విద్యార్థినుల 65 కిలోమీటర్ల పాదయాత్ర ఫలితాన్నైతే ఇచ్చింది. వారి కాలినడకకు కదిలివచ్చిన ప్రభుత్వం.. వారికి కావల్సిన టీచర్స్ ను తక్షణమే ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. దీంతో నాంగ్న్యో కస్తూర్బా గర్ల్స్ స్కూల్ విద్యార్థినుల పాదయాత్ర దేశవ్యాప్త చర్చైంది.



