వైబ్రెంట్ వాయిస్ ఆఫ్ ఇండియా.. మహేంద్ర!

స్ఫూర్తి పొందిన గురువే మెచ్చిన గానం.. మహేంద్రకపూర్!

తన లైఫ్ టైం మొత్తం పూర్ మ్యాన్స్ రఫీ అనే ముద్రే వేయించుకున్నాడు. చాలాకాలం అతణ్ని రఫీ ప్రతిరూపంలానే చూశారు. రఫీ ఇన్స్పిరేషన్ తో సినిమా రంగంలోకి గాయకుడిగా అడుగుపెట్టినా.. తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నాడు. రఫీలా హై పిచ్ లోనూ గొంతెత్తి పాడగలడు. కర్షకులు, రైతుల జీవన విధానాన్ని కళ్లకుగడుతూ ఆయన ఉపకార్ లో పాడిన మేరే దేశ్ కి ధర్తీ పాట ఇప్పటికీ గణతంత్ర దినోత్సవాన్నో, స్వాతంత్ర్యం సిద్ధించిన రోజో మన చెవుల్ని వీధుల వెంట వీనులవిందుగా తాకుతూనే ఉంటుంది.

బీ. ఆర్. చోప్రా నిర్మాణంలో 94 ఎపిసోడ్స్ సీరియల్ గా 1988 నుంచి 1990 వరకూ.. ప్రతీ ఆదివారం మహాభారత్ అంటూ టీవీ సెట్లలో మోగిన ఆ కంచు కంఠం విన్నవారందరికీ అదో నోస్టాల్జియా. ఆ గాయకుడు మహేంద్ర కపూర్ అని ఆయన అభిమానులకు చెప్పనవసరంలేదు.

9 January 1934 – 27 September 2008

ఆన్ స్క్రీన్ మనోజ్ కుమార్… ఆఫ్ స్క్రీన్ మహేంద్ర కపూర్… ఈ ఇద్దరి జంట సూపర్ హిట్ కాంబినేషన్!

1967లో ఆద్మీ అనే చిత్రంలో కైసీ హసీన్ ఆజ్ బహరోన్ కీ రాత్ అనే పాట మొదట మహమ్మద్ రఫీతోనూ, తలాత్ మెహమూద్‌తోనూ రికార్డ్ చేశారట. కానీ, మనోజ్ కుమార్ తలాత్ వాయిస్‌ వద్దనుకున్నాడు. అందుకు మర్యాదగానే తలాత్ ను రిక్వెస్ట్ చేసి.. మరీ పట్టుబట్టి మహేంద్ర కపూర్‌ను, మహమ్మద్ రఫీతో కలిసి పాటలో భాగస్వామిని చేశాడు. ఈ అనుబంధం నటుడు మనోజ్ కుమార్ ఆన్-స్క్రీన్ మ్యూజికల్ వాయిస్‌గా మహేంద్ర కపూర్ ఇక స్థిరపడిపోయాడు. అలా ఆద్మీ సినిమాలో మనోజ్ కుమార్ పట్టుదలతో… తన గురువు రఫీతో పాడేందుకు మహేంద్ర కపూర్ కు అవకాశం కూడా లభించింది.

రఫీని గురువుగా భావించే 1957లో మెట్రో మర్ఫీ ఆల్ ఇండియా సింగింగ్ పోటీల్లో ఉత్తమ గాయకుడిగా ఆ పురస్కారాన్నందుకున్నాడు. అదే మహేంద్ర కపూర్ కు బ్రేక్ ఈవెన్ అయింది. ఆ తర్వాత 1958లో వి. శాంతారాం దర్శకత్వంలోని నవరంగ్ కోసం సి. రామచంద్ర సంగీతంలో ఆదా హై చంద్రమా పాటతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేనంత బిజీ సింగర్ గా మారిపోయాడు.

మాస్ సింగర్ గా ఓవైపు కిషోర్ కుమార్, ఏ పాటైనా భావయుక్తంగా హై పిచ్ లోనూ, మెలోడియస్ గానూ పాడుతున్న సీనియర్ రఫీ, విషాదగీతాలకు కేరాఫ్ గా నిల్చిన ముఖేష్ కుమార్, క్లాసికల్ టింజున్న పాటలను అవలీలగా పాడేసే మన్నాడే, మెలోడీ కింగ్ గా, గజల్స్ గాయకుడిగా కొనసాగుతున్న తలాత్ మొహమూద్, నిండైన బేస్ స్వరంతో హేమంత్ కుమార్.. ఇలా ఇండస్ట్రీలో ఒకరిని మించి ఒకరన్నట్టుగా పోటీ కొనసాగుతున్న వేళ.. రఫీ ఇన్స్పిరేషన్ తో ఫీల్డ్ కొచ్చి గురువుతో సరిసమానంగా రాణించిన గాయకుడు మహేంద్ర కపూర్.

పంజాబీ అయిన మహేంద్రకపూర్ యాసలో ఎక్కడా పంజాబీ ఛాయల్లేకపోవడం అతడికి కలిసొచ్చింది. అందుకే హిందీలో మనోజ్ కుమార్ కు ఎంతగా ఆయన స్వరం యాప్టైందో.. మరాఠీలో దాదా కొండ్కే అనే సుప్రసిద్ధ నటుడికీ మహేంద్ర కపూర్ గొంతు అలాగే సరిపోయేది. అంతేకాదు, గుజరాతీ, భోజ్ పురి… ఇలా పలు భాషల్లో యాసలో ఎలాంటి చిక్కుల్లేకుండా పాడిన స్వరం మహేంద్ర కపూర్.

యాదృచ్ఛికంగా భాషాభిమానం అధికంగా కనిపించే సినీ రంగంలో తన గురువు రఫీ, మహేంద్ర ఇద్దరూ పంజాబీలే కావడం మరో విశేషం.

మహేంద్ర కపూర్ తన కెరీర్ మొత్తంలో గుమ్రా సినిమాలోని పాటలు హైలెట్. ఆప్ ఆయే తో, ఛలో ఇక్ బార్ ఫిర్ సే వంటి పాటలు ఎప్పటికీ గుర్తుండిపోయేవి.

ఒక్కసారి నీలే గగన్ కీ తలే పాట విని చూడండి.. ఆ గొంతులోని చైతన్యస్ఫూర్తి మనల్ని పాట ఆసాంతం వినేలా చేస్తుంది. 1973లో వచ్చిన ధండ్ సినిమాలోని సన్సార్ కీ హర్ షాయ్ పాట చిరస్థాయిగా నిల్చిపోయేది. బీ.ఆర్. చోప్రా చిత్రాలు ఆస్రా, నికా సినిమాల్లోనూ మహేంద్రకపూర్ పాడిన పాటలు సూపర్ హిట్.

సారే జహాన్ సే అచ్చా హిందుస్తాన్ హుమారా, మేరా రంగ్ దే బసంతి చోలా వంటి దేశభక్తి గీతాలతో పాటు.. ఓం జై జగదీష్ హరే వంటి భక్తిపాటలు విన్నప్పుడల్లా.. మహేంద్రకపూర్ భౌతికంగా లేకపోయినా ఆయన గొంతుతో తానింకా మన మనసుల్లోనే ఉన్నానని చెబుతుంటాడు.

మహేంద్ర కపూర్ కు తన గురువు మహ్మద్ రఫీ అంటే వల్లమాలిన అభిమానం. రఫీ పాడిన ఓ ప్రైవేట్ సాంగ్ ఇలైహి కోయి తమన్నా నహిన్ పాటంటే మహేంద్రకపూర్ కు ఎంతో ఇష్టం. ఆ పాటే అతడు సంగీత పోటీల్లో పాడి గుర్తింపు పొందాడు. అదే మహేంద్ర కపూర్ కు బాలీవుడ్ లో గ్రీన్ కార్డ్ గా పనిచేసింది. కోల్‌కతాలో ఓసారి రఫీతో కలిసి స్టేజ్ షోలో పాల్గొన్నాడు. కానీ, అప్పుడు రఫీ ప్రధాన గాయకుడైతే.. మహేంద్రకపూర్ కోరస్ సింగర్. రఫీని ఎప్పుడూ పొగుడ్తుండేవాడు. ఇప్పటివరకూ జన్మించిన గాయకుల్లో రఫీ అత్యుత్తమమని తన గురువుపట్ల తన అభిమానాన్ని చాటేవాడు. రఫీ సాబ్ కూడా మహేంద్రకపూర్ కృషి, ప్రతిభకు ముగ్ధుడయ్యాడు. మహేంద్ర రఫీ పట్ల తన కృతజ్ఞతా భావాన్ని చూపించే ఏ అవకాశాన్ని వదులుకోలేదు. 1979లో మహేంద్ర కపూర్ లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఓ ప్రోగ్రామ్ చేశాడు. అక్కడ రఫీ కుమారులు ఖలీద్, సయ్యద్ ఉన్నారని తెలిసింది. వెంటనే నిర్వాహకులను పిల్చి రెండు దండలు తీసుకురావల్సిందిగా రిక్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత రఫీ కొడుకులు ఖలీద్, సయ్యద్ ను స్టేజ్ పైకి పిలిపించాడు. వారిద్దరి మెడలో ఆ రెండు దండలు వేసి, వారి పాదాలను తాకాడు. వాళ్లు అడ్డుకోబోతే.. నేను తాకుతోంది మీ పాదాలను కాదు.. ముంబైలో ఉన్న నా గురువు పాదాలనంటూ రఫీపైనున్న తన భక్తిని రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికగా ప్రదర్శించాడు మహేంద్రకపూర్. ఆ ఘటన ఆరోజు కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులను కదిలించింది. ఓవైపు పోటీ, ఇంకోవైపు గురుశిష్యుల బంధం, మరోవైపు ఎవరికివారే గ్రేట్ సింగర్స్ గా కొనసాగిన ఒక ఆరోగ్యకర పోటీ శకం ఆ కాలం.

ఐదు దశాబ్దాలపాటు బాలీవుడ్ తో పాటు, ఇతర భాషల్లో 25 వేలకుపైగా పాటలు పాడిన మహేంద్ర కపూర్ ను వైబ్రెంట్ వాయిస్ ఆఫ్ ఇండియా అనంటారు. మహేంద్రకపూర్ సేవలకుగాను 1972లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 1968లో మేరే దేశ్ కి ధర్తీ పాటకు జాతీయ అవార్డును గెల్చుుకున్నాడు. అనేక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో పాటు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం లతా మంగేష్కర్ అవార్డుతో సత్కరించింది.

అయితే, 70వ దశకంలో ఆర్డీ బర్మన్- కిషోర్ కుమర్ జోడీ ఎప్పుడైతే ఎంటరైందో అప్పట్నుంచీ బాలీవుడ్ సినిమా సంగీతశైలి మారిపోయింది. అది మహేంద్రకపూర్ కే కాదు.. రఫీ, తలాత్ మెహమూద్, ముఖేష్ కుమార్ ఇలా అందరికీ ఓ సవాల్ ఎదురైన కాలమది. కిషోర్ దా ఊపులూపుతున్న సమయాన చాలామంది ప్రముఖ గాయకుల్లాగానే మహేంద్ర కూడా సినిమా ఛాన్సుల్లేక అవస్థ పడ్డారు.

అలాంటి సందర్భంలోనే ఓసారి రఫీ ఇంటికెళ్లిన మహేంద్రకు లాన్ లో కూర్చున్న రఫీ విచారకరంగా ఉండటం కనిపించిందట. నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిర్మాతలే ఇప్పుడు ముఖం చాటేసే పరిస్థితి వచ్చిందంటూ రఫీ చెప్పిన మాటలు మహేంద్రకపూర్ లో కన్నీళ్లకు కారణమయ్యాయట ఆ సమయాన. అదే మరి విధంటే అంటూ మహేంద్ర జవాబివ్వగా.. ఒకసారి మదన్ మోహన్ స్వరపర్చిన తుమ్ జో మిల్ గయే హో పాటను వినమని అడిగారట రఫీ. ఆ పాట విన్న ఆ సమయంలో ఆ గురుశిష్యుల భావోద్వేగాల గురించి మహేంద్రకపూర్ కుమారుడు రుహాన్ కొన్ని పత్రికలవారితో పంచుకున్న విశేషాలివి.

భారతీయ చలనచిత్ర సంగీత రంగంలో సుప్రసిద్ధ గాయకుడిగా అనేకానుభవాలను చవిచూసి, నిలదొక్కుకుని.. తన గురువు మహ్మద్ రఫీ స్ఫూర్తితో ఎదిగిన మహేంద్రకపూర్ తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. తనకంటూ ఒక అభిమానగణాన్ని తయారు చేసుకున్నాడు. సినీ సంగీతమున్నంత కాలం గుర్తుండిపోయే వైబ్రెంట్ వాయిస్ ఆఫ్ ఇండియా మహేంద్రకపూర్ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ అక్షర నివాళి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles