డిసెంబర్ 14 రాజ్‌కపూర్ జయంతి ముగింపు
హమ్ హై వహీ… హమ్ థే జహా
మహమ్మద్ ఖదీర్‌బాబు…✍️
రాజ్‌కపూర్ ఒక వెల్డర్‌ని, ఒక బస్ కండక్టర్‌ని సినీ సాహిత్యకారులుగా మలిచాడు.
మధుర నుంచి వచ్చి బొంబాయి రైల్వేలో వెల్డర్‌గా పని చేస్తున్న శైలేంద్ర కవిత్వాన్ని పీపుల్స్ థియేటర్ సమావేశంలో విని ‘నాయనా.. నీ పాటలు నాకు ఇవ్వు’ అని అడిగితే శైలేంద్ర ఇవ్వలేదు. సినిమా వాళ్లకు రాయడం ఏమిటి నాన్సెన్స్ అన్నాడు. ఆ తర్వాత అతని భార్యకు కాన్పులో సమస్య వచ్చింది. ప్రాణం పోయే స్థితి. రైల్వే జీతం ఆస్పత్రికి చాలదు. డబ్బు కోసం నానా ఠోకర్‌లు తిన్నాక రాజ్‌కపూర్ మాత్రమే గుర్తుకొచ్చాడు. నేరుగా ఆఫీసుకు వెళ్లి ‘నాకు ఐదువందలు ఇస్తే మళ్లీ ఇస్తా. లేదా పాటలు రాసిస్తా’ అన్నాడు. 500 చాలా పెద్ద మొత్తం. ‘ఇస్తా. పాటలే ఇవ్వు’ అన్నాడు రాజ్‌కపూర్. రెండే పాటలు రాశాడు ‘బర్సాత్’ కోసం. ‘బర్సాత్ మే హమ్‌సే మిలే తుమ్ సజన్… తుమ్ సే మిలే హమ్’… ‘పత్‌లీ కమర్ హై… తిరిచి నజర్ హై’… ఆ తర్వాతదంతా ఘన శైలేంద్రం.

బొంబాయి బెస్ట్ బస్ సర్వీస్‌లో ఎక్కి దిగే అమ్మాయిల మీద తెగ కవిత్వం కడుతున్న బస్ కండక్టర్‌ని పృధ్వీరాజ్ కపూర్ గమనించి ‘వీడెవడో పనికొచ్చేవాడిలా ఉన్నాడ్రా’ అని కొడుక్కి రికమండ్ చేస్తే అదే ‘బర్సాత్’లో పాటలకు టికెట్ కొట్టించాడు రాజ్‌కపూర్. ‘జియా బేకరార్ హై’ అని రాశాడా కండక్టర్. విన్న వాళ్లు బేకరార్ అయ్యి పేరు కనుక్కున్నారు. హస్రత్ జైపురి అట.
ఇద్దరూ రాజ్‌కపూర్ టీమ్ అయ్యారు. కాని ఆ మాత్రానికి చెప్పుకుంటామా?
కవి ప్రభుత్వాలకు ప్రత్యర్థి అని నమ్మాడు మజ్రూ. నెహ్రూ అంతటి వాడి మీద కవిత్వంతో విరుచుకు పడితే అరెస్టు వారెంట్ ఇచ్చి ‘సారీ చెప్పు చాలు’ అన్నారు. మజ్రూ చెప్పకుండా ఇంకో సభలో నెహ్రూ మీద కవిత్వం చెబుతుంటే చిర్రెత్తుకొచ్చి అరెస్ట్ చేశారు. రెండు సంవత్సరాలు జైలు. అనుభవిస్తా అని వెళ్లాడు. మరి పెళ్లాం పిల్లలో? నర్గిస్ ద్వారా అంతకు ముందే మజ్రూ పరిచయం ఉన్న రాజ్‌కపూర్ ఈ సంగతి విని, అభిమానధనుడైన మజ్రూ ఉచితంగా డబ్బు తీసుకోడని తెలిసి, తన దగ్గర ఇద్దరు మాణిక్యాల వంటి కవులు ఉండగా, ఉత్తుత్తినే పాట రాయమని మజ్రూకు 1000 రూపాయలు పంపాడు. పాటకు 250 తీసుకుంటున్న మజ్రూకు నాలుగింతల రెమ్యూనరేషన్. ఆ పాట చాలా రోజుల వరకూ అలా ఉండి ‘తీస్రీ కసమ్’లో మార్పులతో హస్రత్ పేరు మీద వచ్చింది.
రాజ్‌కపూర్ అందరికీ ఇష్టం. ఎందుకు అనంటే ‘జీవితం ఆనందంగా జీవించడానికి… నలుగురికీ ఆనందం పంచడానికి’ అని చెప్పేవాడు, ఉండేవాడు. కాసింత పరిచయంలోనే లాగేస్తాడట. అందుకే హృషికేశ్ ముఖర్జీ రాజ్‌కపూర్ తాగుడు చూసి ‘ఈ ప్రాణ స్నేహితుడు పోతే నా గతేం కాను’ అని కనీసం సినిమాగా మిగులుద్దామని ‘ఆనంద్’ తీశాడు. అందులోని ఆనంద్ రాజ్‌కపూరే. ‘బాబూ మోషాయ్’ అని హృషికేశ్‌ను పిలిచింది రాజ్‌కపూరే. ఆ పాత్రలానే రాజ్‌కపూర్ ఒక ఆకర్షణాక్షేత్రం.
ముగ్గురు హీరోలు… దిలీప్ కుమార్, రాజ్‌కపూర్, దేవ్‌ఆనంద్. ఒకడు తగ్గినా తగ్గినట్టే అనుకోలేదు. దేవ్‌ఆనంద్ రాజ్‌కపూర్‌ని చూసిన వెంటనే ‘ఒరే అయ్యా.. ఇంత లావు ఎందుకైపోతున్నావురా’ అని పూర్తిగా బెంగ పడేవాడట. దిలీప్ కుమార్ ‘ఎంతైనా పోటీ పడు. కానీ ఫ్లాప్ మాత్రం ఇవ్వకు. ఫ్లాప్ ఇచ్చే రాజ్‌కపూర్‌ని చూస్తే నాకు అసహ్యం’ అనేవాడట.
రాజ్‌కపూర్ ఉత్సవంగా బతికాడు. ఆర్.కె. స్టూడియోలో హోలీ, వినాయక చవితి… పేద సాదలకు స్టూడియో వర్కర్లకు దాన ధర్మాల వేడుకలు. భారీ ఆహార పదార్థాలు, పార్టీలు… స్నేహితులే లోకం. ఇలాంటి వాడు ప్రేమలో దెబ్బ తిన్నాడు. తాను ఎగ్జిట్ అయ్యే సమయం వచ్చిందని పాత్రకు తెలిసింది కాని దర్శకుడికి తెలియలేదు. నర్గిస్ నిష్క్రమించాక తట్టుకోలేక మత్తులో మునిగి ఇంటికి చేరి బాత్ టబ్‌లో కూచుని గంటల కొద్దీ ఏడ్చేవాడు. ఇక పోతాడనే అందరూ అనుకున్నారు. అప్పుడు తండ్రి పృధ్వీరాజ్ కపూర్ వచ్చి ‘ఒరే అబ్బాయ్.. ఈ ముసలి వయసులో నీ పాడె మోసే ఖర్మ పట్టించకురా. అంత బరువు ఏ తండ్రీ మోయలేడు’ అనంటే ఆ మాట అందరికీ పాకి ‘షోలే’లో డైలాగ్‌గా మారింది. ఆ మాటతోనే రాజ్‌కపూర్ మేల్కొన్నాడు.
‘నాతో పని చేసిన స్త్రీలు నాలో తయారైన వారి పాత్రలను చూసి తాము ఆ పాత్రలతో ప్రేమలో పడ్డామని తెలియక నాతో ప్రేమలో పడేవారు’ అంటాడు రాజ్‌కపూర్. అతను ప్రేమలోనే ఉన్నాడు సదా. స్త్రీలు, పురుషులు అనే విభజన ప్రపంచానికి. అతనికి కాదు.
రాజ్‌కపూర్ ఆస్తమా అటాక్ వల్ల కుర్చీలో నుంచి లేవలేకపోతే ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి తనే వేదిక దిగి దాదాసాహెబ్ బహూరించారు నాటి రాష్ట్రపతి వెంకటరామన్. ఇలా చరిత్రలో లేదు. ఆ అవార్డు తీసుకుని కోమాలోకి వెళ్లిపోయాడు రాజ్‌కపూర్. ఆ సమయంలో అవార్డు కోసం పెషావర్‌లో ఉన్న దిలీప్ కుమార్ హుటాహుటిన ఢిల్లీ చేరుకుని ఎయిమ్స్‌కు వెళ్లాడు. రాజ్‌కపూర్ పక్కన కూచుని ‘ఒరేయ్… మన పెషావర్ నుంచి వస్తున్నాను. అక్కడి కబాబ్‌ల వాసన– మనిద్దరికీ ఇష్టమైన కబాబ్‌ల వాసన– మనం చిన్నప్పుడు అక్కడ తిరిగి రోటీలతో తిన్న కబాబ్‌ల వాసన నా ఒంటి నిండా ఉంది. లేవరా’ అని ఏడ్చాడు.
ఇంత ప్రేమ ఏ మనిషైనా బతికుండగానే పొందవచ్చు. ప్రయత్నించాలి అంతే.
కల్మశంతో ఏం సాధించ వచ్చో తెలియదుగాని ప్రేమతో చిన్న చిర్నవ్వునైనా సాధించవచ్చు. పిసినారులకు, లెక్కల మనుషులకు, కడుపులో ఒకటి పైకి ఒకటిగా ఉండేవారికి బృందాలు, స్నేహాలు ఉండలేవు. పోతే ఒక మాట తలుచుకునేవారు కూడా.
ఇక్ దిన్ బిక్ జాయేగా మాటీకె మోల్
జగ్ మే రహ్ జాయేంగే ప్యారే తేరే బోల్…
– డిసెంబర్ 13, 2024



