ఆమె సుప్రభాతం వెంకన్నకు మేల్కొలుపు! ఆ అమృతగానం ముక్కోటి దేవతలకు ఆటవిడుపు!!

కుంజమ్మ మెచ్చిన నీలిరంగు కంచి జార్జియస్!

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలన్నారు త్యాగరాజస్వామి వారు. కానీ ఆ ఎందరో మహానుభావులు సైతం చేతులెత్తి దండం పెట్టిన అపర సంగీత సరస్వతీ రూపం… మానవతరం చూసిన భారతరత్నం ఎంఎస్. సుబ్బలక్ష్మి. ఎందుకంటే ఆమె సుప్రభాతం ఆ వెంకన్నకు మేల్కొలుపు. ఆ అమృతగానం ముక్కోటి దేవతలకు పవిత్రార్చన. ఆ స్వరం మహామహులకు ప్రాణం. ఆమె రాగం కోట్లాదిమందికి హృదయాంగమం.

1916, సెప్టెంబర్ 16న జన్మించిన ఆ అపర సంగీత సరస్వతి గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. ఆమె దివికేగి సుమారు 20 ఏళ్లవుతున్న సందర్భంలో.. కొన్ని విషయాలు ఆమె గురించి చెప్పుకుందాం.

ఎంఎస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరు మధురై షణ్ముఖవాడివు సుబ్బలక్ష్మి. కానీ ఆమెనంతా కుంజమ్మ, లేదా కుంజు అనే పొట్టి పేరుతో కుటుంబీకులు, బంధువులు పిల్చేవారట.

సుబ్బలక్ష్మి తల్లి దేవదాసీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా… ఆమె మంచి వోకల్ క్లాసికల్ సింగర్. అంతేనా… సుబ్బలక్ష్మి అమ్మమ్మ మంచి వాయిలనిస్ట్.

పురుషులు వాయిలిన్, మృదంగంపై కూర్చోగా… అప్పటివరకూ ఉన్న సాంఘిక నియమాలను తోసిరాజని కర్నాటక క్లాసికల్ కచేరీ చేసిన మొట్టమొదటి మహిళ సంగీత కళానిధి ఎంఎస్ సుబ్బలక్ష్మి.

ఏసియన్ నోబెల్ బహుమతిగా చెప్పుకునే రామన్ మెగాసెసె అవార్డుని ఇప్పటివరకూ సంగీతంలో అందుకున్న మొట్టమొదటి మహిళా వోకల్ సింగర్ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి.

చాలా చిన్నవయస్సులోనే సెమ్మంగూడి శ్రీనివాస్ అయ్యర్ దగ్గర కర్నాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవడం ప్రారంభించిన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి… పండిట్ నారాయణరావ్ వ్యాస్ దగ్గర హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలోనూ నైపుణ్యమైన శిక్షణ పొందారు.

1927లో తిరుచ్చిరాపల్లిలోని రాక్ ఫోర్ట్ టెంపుల్ లో కేవలం 11 ఏళ్ల వయస్సులోనే తన మొట్టమొదటి శాస్త్రీయ సంగీత కచేరీ చేశారు కుంజమ్మ.

ఎఫ్.జీ. నటేశా అయ్యర్ తో కలిసి సేవాసదనం అనే సినిమాలో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి నటిగా కూడా తెరపైన కనిపించగా… ఆ సినిమా ఆ రోజుల్లో విమర్శకుల ప్రశంసలందుకోవడంతో పాటు… కమర్షియల్ గానూ మంచి హిట్ సాధించింది.

అంతేకాదు… సావిత్రి సినిమాలో నారదుడి పాత్రలోనూ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి అలరించారు. ఎందుకంటే తన భర్త సదాశివం ప్రారంభించిన కల్కి అనే వారపత్రికను ప్రారంభించడానికి డబ్బు కోసం ఆమె ఆ సినిమాలో నటించారు. అప్పటినుంచి సదాశివం పేరు కల్కి సదాశివంగా మారిపోయింది. ఆయన ప్రఖ్యాత తమిళ నవలా రచయిత, అలాగే స్వాతంత్ర్య సమరయోధులు.

1997లో భర్త సదాశివం మరణించాక సుబ్బలక్ష్మితన లైవ్ శాస్త్రీయ సంగీత గాన కచేరీలను ఆపేశారు.

భారతదేశం నుంచి మొట్టమొదటిసారి ఐక్యరాజ్యసమితిలో తన గానంతో అలరించిన ఘనత నైటింగేల్ ఎం.ఎస్. సుబ్బలక్ష్మిదే. అందుకే ఐక్యరాజ్యసమితి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పేరిట ఆమె వందో పుట్టినరోజును పురస్కరించుకుని ఒక స్టాంప్ ను కూడా విడుదల చేసింది.

ఆమె ఎక్కువగా భిన్నమైన షేడ్స్ లో కనిపించే కాంచీపురం నీలిరంగు జార్జియస్ చీరలనే ధరించేవారు. అందుకే ఆమె తదనంతరం ఆ చీరలు ఎం.ఎస్. బ్లూ చీరలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.

ఎమ్మెస్ ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా మాత్రమే మొదట పరిచయం. కానీ, ఆమె ఓ దేవదాసీ కుటుంబంలో జన్మించిందన్న విషయం తెలిసాక.. ఆ రెండు వైరుధ్యాల మధ్య ఓ ఐకానిక్ సింబల్ గా ఎదిగిన ఎం.ఎస్ ఎలా ఫీలై ఉంటుందన్నదీ ఆసక్తికరమే.

ఎం.ఎస్. సుబ్బలక్ష్మికి సంబంధించి ప్రముఖ జర్నలిస్ట్ టీ.జే.ఎస్. జార్జ్ రాసిన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి- ది డిఫినిటివ్ బయోగ్రఫీ పుస్తకంలో ఆమె జీవితంలో ఎత్తుపల్లాలన్నింటినీ చర్చించారు. జార్జ్ చేసిన రీసెర్చ్ తో వెలువడిన ఆ పుస్తకాన్ని ప్రముఖ రచయిత్రి ఓల్గా తెలుగులోకి అనువదించారు.

2004లోనే ఆ పుస్తకాన్ని జార్జ్ ఇంగ్లీష్ లో రాశారు. కానీ, దాన్ని తెలుగులోకి, ఇతర భాషల్లోకి అనువాదం కాకుండా బ్రాహ్మణులలోని ఒకవర్గం అడ్డుుకుందనే ఆరోపణలూ ఉన్నాయి. ఎందుకంటే అప్పటివరకూ బ్రాహ్మణ్ ఐకాన్ గా మాత్రమే పరిచయమైన సుబ్బలక్ష్మి.. దేవదాసీ నేపథ్యాన్ని బాహ్యప్రపంచానికి తెలియపర్చడం ఇష్టం లేకనే అనేది వాదన.

సాక్షాత్తూ అపర సరస్వతీదేవిని పోలిన ఆ వర్ఛస్సు… ఎప్పటికీ ఓ మధుర జ్ఞాపకం. సంగీత ప్రపంచమున్నంతవరకూ ఆ ‘భారతరత్నం’ పేరు సంగీతంలో శిఖరసమానం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles