ఎంఐటీ వర్సెస్.. ప్రహ్లాద్ అయ్యంగార్!
విదేశాల్లో స్వేచ్ఛా వాతావరణం గురించి అప్పుడప్పుడూ మాట్లాడుకుంటుంటాం. కానీ అదంతా ఉట్టిమాటే. తమకు నచ్చని పనులు జరిగితే.. తమ రాజ్యం మెచ్చని పనులు చేస్తే ఆ స్వేచ్ఛను హరించేందుకు విదేశాలూ వెనుకాడవనే కథ భారతీయ మూలాలున్న ప్రహ్లాద్ అయ్యంగార్ ది.
ప్రహ్లాద్ అయ్యంగార్ మసాచుసెట్స్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్డీ స్కాలర్. కానీ, ఇప్పుడతణ్ని ఎంఐటీ నిషేధించింది. కాలేజ్ క్యాంపస్ లోకి కూడా అడుగుపెట్టొద్దని హెచ్చరించింది. ఎంఐటీ జర్నల్ లో ప్రహ్లాద్ అయ్యంగార్ పాలస్తీనా అనుకూల వ్యాసం రాయడాన్ని ఎంఐటీ తీవ్రంగా పరిగణించింది. అందుకే, 2026 ఏప్రిల్ వరకూ అతణ్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

ప్రహ్లాద్ తన ఐదేళ్ల నేషనల్ సైన్స్ ఫౌండేషన్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోషిప్ ను ముగించే సమయంలో ఈ వేటు పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాలస్తీనా ఉద్యమానికి అనుకూలంగా మల్టీ డిసిప్లినరీ స్టూడెంట్ మ్యాగజైన్ అయిన రిటెన్ రెవల్యూషన్ కోసం ప్రహ్లాద్ తన ఆర్టికల్ రాయగా.. ఆ మ్యాగజైన్ ను కూడా నిషేధించడంతో పాటు.. ఏకంగా ప్రహ్లాద్ నూ కాలేజ్ నుంచి డిటెయిన్ చేశారు.
తనను డీటెయిన్ చేయడంపై స్పందించిన ప్రహ్లాద్.. అమెరికా క్యాంపస్ లలో వాక్ స్వాతంత్రానికి పట్టిన దుర్గతిగా చెప్పుకొచ్చాడు. అయితే, ప్రహ్లాద్ రాసిన కథనం తీరు విద్యార్థులను రెచ్చగొట్టేలా, హింసను ప్రేరేపించేలా ఉందని ఎంఐటీ బృందం పేర్కొంది.
అయ్యంగార్ ఎలక్టికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి పీహెచ్డీ స్కాలర్ గా చదువుతున్నాడు. అయితే, అయ్యంగార్ సస్పెండ్ కావడం ఇది రెండోసారి. పాలస్తీనా అనుకూల ప్రదర్శనల నేపథ్యంలో గతేడాది కూడా ఓసారి అయ్యంగార్ సస్పెండయ్యాడు. ఆ తర్వాత కూడా ఎంఐటీలో వర్ణవివక్షపై నిరసనలు జరిగాయి. ఈ క్రమంలో ప్రహ్లాద్ సస్పెన్షన్ ను.. మిగిలిన విద్యార్థీ సమూహానికి ఒక హెచ్చరికలాంటిదని ఎంఐటీ తన X ఖాతాలో కూడా వెల్లడించింది.
రిటెన్ రెవల్యూషన్ లో అక్టోబర్ లో వెలువడ్డ అన్ పసిఫిజం అనే వ్యాసం ఎంఐటీలో తీవ్రకలకలం రేపింది. రెచ్చగొట్టే విధంగా ఆర్టికల్ లో ఉపయోగించిన భాష.. క్యాంపస్ లో మరింత కల్లోలానికి దారి తీస్తుందని భావించిన ఎంఐటీ డీన్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్.. డేవిడ్ వారెన్ రాండాల్.. మ్యాగజైన్ సంపాదకులకు.. ఆర్టికల్ లో ఉపయోగించిన భాషపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ మెయిల్ పంపించాడు. అలాగే, యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రకారం.. ఉగ్రవాద సంస్థైన పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా లోగోను కూడా వ్యాసాల్లో కల్గి ఉండటంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాడు.
ఎంఐటీ మ్యాగజైన్ వ్యాసంలో కలకలం రేపిన ఉగ్రవాద సంస్థల చిత్రాలు!
అయ్యంగార్ రాసిన వ్యాసం కన్నా ఎక్కువ… ఆ మ్యాగజైన్ ఆ వ్యాసం కోసం ప్రచురించిన ఉగ్రవాదసంస్థల చిత్రాలు తీవ్ర కలవరం రేపాయి. శాంతి కాముక వ్యూహాలు కూడా పాలస్తీనాకు ఉత్తమ మార్గం కాకపోవచ్చనే సందేశమూ ఆ ఆర్టికల్ లో ఉన్నట్టు ఎంఐటీ పేర్కొంది. అయితే, తాను వ్యాసం మాత్రమే రాశానని.. అందులో మ్యాగజైన్ సంపాదకులు ప్రచురించిన చిత్రాలకు తననెలా తప్పుబడుతారని ప్రశ్నిస్తున్నాడు ప్రహ్లాద్ అయ్యంగార్. ఆ ఫోటోలను బేస్ చేసుకుని తనను ఉగ్రవాద మద్దతుదారుడిగా చిత్రీకరించడంపై అయ్యంగార్ ఆవేదన చెందుతున్నాడు.
కేవలం తాను రాసిన వ్యాసానికి పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ పోస్టర్స్ ను ప్రచురించడం వల్ల.. నేను ఉగ్రవాదానికి మద్దతిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారంటూ తన న్యాయవాదికి రాసిన లేఖలో ప్రహ్లాద్ పేర్కొన్నాడు. అంతేకాదు, తన సస్పెన్షన్ ను ఓ అసాధారణ చర్యగా ప్రతిఘటిస్తున్నాడు.
ఇది కేవలం తనపై మాత్రమే చేస్తున్న దాడి కాదని.. మొత్తం విద్యార్థి సమూహంతో పాటు.. అధ్యాపకుల హక్కులను కూడా ప్రశ్నార్థకం చేసేదంటాడు ప్రహ్లాద్. తనను తీవ్రవాదిగా ఎంఐటీ పేర్కొనడం ఎంతవరకూ సబబన్నది ప్రహ్లాద్ ప్రశ్న..?
అయితే ఇప్పుడు ఈ నిషేధం కేవలం ప్రహ్లాద్ అయ్యంగార్ కు మాత్రమే పరిమితం కాలేదు. సదరు రిటెన్ రెవల్యూషన్ ఎడిటర్ పై కూడా వేటు వేయడంతో పాటు, ఆ మ్యాగజైన్ నే ఇప్పుడు నిషేధించింది ఎంఐటీ. ఈ ఇన్సిడెంట్ తర్వాత బోస్టన్ కేంద్రంగా నడిచే ఓ రేడియోతో కూడా ప్రహ్లాద్ మాట్లాడాడు. తన కేసుపై ఇప్పుడు ప్రహ్లాద్ వైస్ ఛాన్స్ లర్ తో అప్పీల్ కు వెళ్లాడు. విద్యార్థిసంఘాలతో కలిసి ఎంఐటీ హైరార్కీపైన ఒత్తిడి పెంచే పనిలో పడ్డాడు. అంతేకాదు, రెండు రోజుల క్రితం డిసెంబర్ 9వ తేదీన కేంబ్రిడ్జ్ సిటీహాల్ లో ప్రహ్లాద్ కు మద్దతుగా విద్యార్థిసంఘాల సంకీర్ణమంతా కలిసి భారీ ర్యాలీని కూడా నిర్వహించింది.
ఎంఐటీ వ్యవహారతీరు భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనన్నది ప్రహ్లాద్ అయ్యంగార్ చెబుతుంటే.. తీవ్రవాద కార్యకలాపాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటోంది ఎంఐటీ. మొత్తంగా ఇప్పుడు భారతీయ మూలాలున్న ప్రహ్లాద్ వ్యవహారంతో.. ఎప్పుడూ ఉన్నత చదువులకు కేరాఫ్ గా వినిపించే ఎంఐటీ పేరు ఇప్పుడు ఇలా ఎంఐటీ యాజమాన్యం వర్సెస్ విద్యార్థులున్నట్టుగా రచ్చకెక్కింది.



