అమెరికా పౌరసత్వం పొందిన తొలి భారతీయుడెవరు..?

NANCHARAIAH MERUGUMALA..✍️

అమెరికా పౌరసత్వం పొందిన తొలి భారతీయుడు పంజాబీ సిక్కు కావడానికి నానక్ బోధనలే కారణం!
————————–+++++—-+++-


శారీరక, మానసిక శ్రమను మాత్రమే నమ్ముకొని ప్రపంచం నలుమూలలకు వెళ్లి జీవించే దైర్యం, స్ఫూర్తిని ఇచ్చిన గొప్ప విశ్వ మానవుడు గురు నానక్ దేవ్ 555 వ జయంతి ఈరోజు. ప్రస్తుతం పాకిస్తాన్ పాలనలోని భూభాగం రాయ్ భోయ్ దీ తల్వాండీలో ఐదున్నర శతాబ్దాల ఐదేళ్ల క్రితం అదీ కార్తిక పౌర్ణం రోజు జన్మించాడు నానక్.

పంజాబీ హిందూ ఖత్రీ కుటుంబంలో పుట్టారు గురు నానక్. ఆయన తర్వాత సిక్కు ధర్మానికి గురువులైన మిగిలిన తొమ్మిది మందీ కూడా హిందూ ఖత్రీ కుటుంబాల్లో పుట్టడం యాదృచ్ఛికం అంటారు. సిక్కులు ఆచరించే భౌతికపరమైన (వేషభాషలు) పద్ధతులు ఏవీ నానక్ దేవ్ నిర్దేశించినవి కావు. చివరి, పదో గురువు గురు గోవింద్ సింగ్ ఈ నియమాలు రూపొందించి వాటిని కట్టుదిట్టంగా అనుసరించాలని ఆదేశించారు. గురు నానక్ ను ప్రథమ పంజాబీ కవిగా భారత పంజాబీలే గాక పాకిస్తాన్లో అంతర్భాగమైన పెద్ద పంజాబ్ లోని ముస్లిం పంజాబీలు సైతం పరిగణించి గౌరవిస్తారు.

పాక్ పంజాబ్ నగరం లాహోర్ కి చెందిన విద్యావేత్త, రచయిత హరూన్ ఖలీద్ ఇంగ్లిష్ వ్యాసాలు చదివాక నేను బాబా గురు నానక్ దేవ్ గురించి సాధ్యమైనంత ఎక్కువ తెలుసుకున్నాను. గురు నానక్ బతికి ఉండగా ఆసియా ప్రాంతమంతా (తెలుగు ప్రాంతాలు సహా) పర్యటించారు. ఆయన తిరిగిన అన్ని ఊళ్లు, నగరాలకు వెళ్లిన హారూన్ ఖలీద్ ఇంగ్లిష్ లో Walking with Nanak అనే గొప్ప పుస్తకం రాశారు.

ఇంకా ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతాలైన పంజాబ్, సింధ్, బలోచిస్తాన్, ఖైబర్ ఫఖతున్క్వా పావిన్సుల్లో స్థానిక ముస్లింలు ఆచరించే హిందూ ఆచారాలు, నమ్మకాలను వివరిస్తూ ఆయన్ కొన్నేళ్ల క్రితం In Search of Shiva అనే గ్రంథం కూడా రాశారు. మొత్తమ్మీద హరూన్ ఖలీద్ అనే ప్రగతిశీల ముస్లిం మేధావి, Anthropologist రచనలు చదివి నానక్ గురించి నేను కాస్త తెలుసుకోవడం ఆనందంగా ఉంది. సిక్కు ధర్మంలో చేరకుండా నానక్ బోధనలు అభిమానించే నానక్ పంథీలు అనే మతవర్గం ఉత్తరాదిన ఉంది. ఇంకా జీవించి ఉన్న బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ ఆడ్వాణి ( 97 ) కూడా నానక్ పంథీయే. ఆడ్వాణి కొడుకు, పిల్లల పెళ్ళిళ్ళు కూడా డిల్లీ గురుద్వారాలో జరిగాయి.

అగ్రరాజ్యం అమెరికాలో అక్కడి పౌరసత్వం పొందిన ( 1918లో) ప్రథమ భారతీయుడు లేదా భారత సంతతి వ్యక్తి పంజాబీ సిక్కు ( భగత్ సింగ్ థిన్డ్ ) కావడం అనేది గురు నానక్ బోధనల వల్లే సాధ్యమైందనుకోవాలి. అమెరికా పౌరసత్వం కోసం అక్కడి అత్యున్నత కోర్టులో సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి విజయం సాధించాడు భగత్ సింగ్ థిన్డ్.

ఫోటోలు: 1) Walking with Nanak పుస్తకం ముఖచిత్రం

2) అమెరికా పౌరసత్వం పొందిన మొదటి భారతీయుడు భగత్ సింగ్ థిన్డ్.

3) హరూన్ ఖలీద్, Walking with Nanak రచయిత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles