తీరికైన టైమిస్తే ఆలోచించుకుని మాట్లాడ్డం వేరు… సమయం తీసుకుని ఏ పనైనా నింపాదిగా చేయడం వేరు… కానీ, టైమింగ్ తో, స్పాంటెనియస్ గా స్పందించడం వేరు. కమ్యూనికేషన్స్ స్కిల్స్ లో అత్యంత ప్రభావవంతమైన మాటకు… ఆ స్పాంటెనిటీ గనుక ఉంటే ఎదుగుదలలో ఇక వారికి ఎదురులేనట్టే. అలాంటి కొందరు ఎప్పటికప్పుడు ఇంప్రెస్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు స్టాండప్ కమేడియన్స్ లో కపిల్ శర్మ పేరు ఆ రేంజులో వినిపించేది.
ఈ విషయాన్ని కపిల్ సొంత రాష్ట్రీయుడైన నవజ్యోత్ సింగ్ సిద్ధూనే చెబుతున్నాడు. కపిల్ ఒక జీనియస్ అంటున్నాడు.

కపిల్ శర్మ పంజాబ్ లోని అమృత్ సర్ వాసి. తండ్రి జీతేంద్రకుమార్ పంజ్ పంజాబ్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఓ హెడ్ కానిస్టేబుల్. తల్లి జానకీరాణి గృహిణి. తండ్రి జీతేంద్రకుమార్ 1997లోనే క్యాన్సర్ కు గురై.. 2004లో మృతి చెందాడు. అలాగే, కపిల్ కు ఓ సోదరుడు, ఓ సోదరి ఉండగా.. సోదరుడు కూడా తండ్రిలాగే ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.
అయితే, కపిల్ లో ఉన్న స్పాంటెనిటీ… అతణ్ని ఓవర్ నైట్ స్టార్ ను చేసింది. కానీ, ఆ స్టార్ అయ్యే క్రమంలోనే ఊహించనన్ని ఒత్తిళ్లు కపిల్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ విషయాల్ని స్టార్ క్రికెటర్ కమ్ పొల్టీషియన్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ మధ్య ది గ్రెయిన్ టాక్ షోలో చెప్పుకొచ్చారు.
నెట్ ఫ్లిక్స్ లో ది గ్రేట్ ఇండియన్ షోకు సంబంధించిన ప్రోమోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. కపిల్ శర్మ కష్టాలు కూడా ఓసారి తెరపైకొచ్చాయి.
ఒక దశలో తనతో చాలామంది కపిల్ పనైపోయిందిక అన్నారని గుర్తు చేసుకున్నాడు సిద్ధూ. కానీ, కపిల్ ప్రతిభపై నాకు అపారమైన విశ్వాసముంది. అతణ్ని వదులుకుంటే పొరపాటు చేసినట్టేనని చాలామందికి తాను హెచ్చరించినట్టూ సిద్ధూ చెప్పుకొచ్చాడు.
నెట్ ఫ్లిక్స్ లో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో తిరిగి జడ్జ్ గా పాల్గొన్న సందర్భంలో సిద్ధూ కపిల్ ఎందుకు ప్రత్యేకమో చెప్పాడు. 2019లో కపిల్ కామెడీ షోస్ నుంచి గెస్ట్ గా తప్పుకున్న సిద్ధూ.. రాజకీయంగా బిజీబిజీ అవ్వడంతో తిరిగి ఇంతకాలానికి తన 61 ఏళ్ల వయస్సులో మళ్లీ కలిశాడు. 20 ఏళ్లల్లో కపిల్ తిరుగులేని హోస్ట్ గా ఎదిగాడని… అందుకు తన టైమింగ్, స్పాంటెనిటే కారణమంటాడు. అందుకే కపిల్ ను మేధావిగా పేర్కొంటున్నాడు సిద్ధూ.
కపిల్ పై ఆరోపణలు!
కపిల్ శర్మ… తన స్టాండప్ కామెడీ షోస్ లో ఇతర హాస్యనటులతో పాటు, వచ్చిన సెలబ్రిటీస్ తో మిస్ బిహేవ్ చేసేవాడని, అదే విధంగా మద్యానికి బానిసయ్యాడని.. పెద్ద ఎత్తున ఆరోపణలెదుర్కొన్నాడు. ఆ సమయంలో తనకెదురైన అవాంతరాలతో మద్యం ఒక వ్యసనంగా మారిన పరిస్థితుల్లోంచి… మళ్లీ ఇవాళ స్టాండప్ కమెడీ షోస్ స్టార్ గా కపిల్ ఎదిగిన తీరు మామూలేం కాదంటూ కపిల్ ను సమర్థించుకొచ్చాడు సిద్ధూ. తానెంత కంగారు పడ్డాడో స్వయంగా చూశానన్నాడు.
అప్పుడు 20ల్లో ఉన్న కపిల్ ను అంతా పనైపోయిందంటే.. తానొక్కటే చెప్పానని… కపిల్ 20ల్లో ఉన్నాడు.. మరో పదేళ్ల వ్యక్తిని ఎవర్నైనా తీసుకొచ్చి మీరు ట్రైన్ చేసినా అతణ్ని కపిల్ ముందు నిలబెట్టడం అంత ఈజీ కాదని చెప్పేశానంటూ కపిల్ ప్రతిభపై తానెంత విశ్వాసంగా ఉన్నాడో చెప్పాడు సిద్ధూ. సింపుల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే ఏ వయస్సు వారిని మీరు తీసుకొచ్చి కామెడీ షో చేసినా… కపిల్ ను మించిన ట్యాలెంటెడ్ ను ఈ షోలో పరిచయం చేయలేరన్నది సిద్ధూ బండగుద్ది చెప్పానంటాడు. ఒకవేళ మీరు అతణ్ని తప్పించాలని చూస్తే… అతడి ప్లేస్ రీప్లేస్ కాకపోగా.. ఇక అతణ్ని మీరు మిస్సైనట్టేనంటూ హెచ్చరించాడట.
కపిల్ కు షారుక్ అండ!
కపిల్ సినిమా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టాక భారీ ఆర్థిక పతనాన్ని చూశాడు. ఒకదశలో ఇక తాను తిరిగి పైకి లేవలేననుకున్నాడు. అలా రెండు సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి చేతులు కాల్చుకుని.. ఇక జీవితమే అయిపోయిందనుకునే దశకు దిగజారిపోయాడు. అదిగో అలాంటి సమయంలో కపిల్ కు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నుంచి సపోర్ట్ లభించింది. తననొక పెద్ద అన్నలా ఆదరించి.. తనకు మద్దతిచ్చిన షారుక్ ఖాన్ కు తానెప్పటికీ రుణపడి ఉంటానంటూ తన కామెడీ షోలోనే కపిల్ చెప్పుకొచ్చాడు.
అయితే, తాను పూర్తిగా బయటకు చెప్పలేని కొన్ని రాజకీయ కారణాలతోనే 2019లో కపిల్ కామెడీ షో నుంచి బయటకు వెళ్లిపోయాను. కానీ, చాలామంది ఆ చెప్పలేని కారణాలకు బదులు.. షోలో ఏదైనా జరిగుంటుందనే ఒక ఊహజనిత కారణాన్ని ఆశిస్తున్నారంటాడు సిద్ధూ. అయితే, పుల్వాదా దాడులపై సిద్ధూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాతే ఆయన కపిల్ కమెడీ షో నుంచి వైదొలగాల్సి వచ్చిందనే చర్చోపచర్చలు జరిగాయి.
మొత్తంగా తాను జడ్జ్ సీటు పైనుంచి వెళ్లిపోయాక.. కపిల్ కామెడీ షోస్ లో జడ్జ్ గా అర్చనాపూరన్ సింగ్ కూర్చుంటున్న సంగతి తెలిసిందే. నిన్న నవంబర్ 16వ తేదీన సిద్ధూ తన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూతో పాటు, మరో వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, ఆయన భార్య గీతాబస్రాతో కలిసి ది గ్రేట్ కపిల్ కామెడీ షోలో పాల్గొన్నాడు.



