అమ్మ మరణం ఆయన్ని కదిలించింది! అంబులెన్స్ దాదాని చేసింది!!

అమ్మ గుండెనొప్పితో కొట్టుకుంటోంది. కన్నపేగుగా తల్లిని వెంటనే కాపాడాలని ఆ కొడుకు గుండె వేగం అంతకంతకూ పెరిగుతోంది. మరోవైపు, ప్రతి ఇంటి తలుపూ తడుతున్నాడు.. ఏదైనా వాహనం దొరక్కపోతుందాన.. అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోతానానని! ఎందుకంటే.. అదంతా కొండలు, గుట్టలతో కనీసం మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోని ఓ మారుమూల ప్రాంతం. ప్రాథమిక చికిత్సలకు కూడా కనీసం ఆ ఊరు నోచుకోని పరిస్థితి. ఇక అక్కడ అంబులెన్స్ అనే మాటకు చోటే లేదు. బాగున్నంతసేపే ప్రాణాలు. ఏదైనా జరిగితే… ఇంక ఆయుష్షు అంతే సంగతులు. అదే పద్ధతిలో తన అమ్మ కార్డియాక్ అరెస్టై తనేమీ చేయలేని నిస్సహాయస్థితిలో.. విగతజీవిగా మారింది. ఆ తడే.. అతడిలో మానవీయ కోణాన్ని స్పృశించింది. తల్లి మరణం తట్టి లేపింది. ఇప్పుడేందరో ప్రాణాలను కాపాడిన ఓ సామాజికారోగ్య ఉద్యమకారుడయ్యాడు. అందుకే.. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నాడు. కానీ, ఆ అవార్డులు, రివార్డులు తనకో లెక్కే కాదంటాడు. తన తల్లిలాంటి మరణాలు ఇంకెవ్వరికీ రావొద్దన్న తపనే తనను నడిపిస్తోందంటాడు. అందుకే కచ్చితంగా చెప్పుకోవాల్సిన కథయ్యాడు.. కరీముల్లా హక్!

ఇంతకీ ఏం చేస్తుంటాడు కరీముల్లా హక్..?

పశ్చిమబెంగాల్ జల్పాయ్ గురి జిల్లా రాజాదంగాకు చెందిన కరీముల్లా హక్… తేయాకు తోటల్లో పనిచేసే ఓ కార్మికుడు. స్థానికంగా బైక్ అంబులెన్స్ దాదా అని.. కరీముల్లాకు షార్ట్ అండ్ స్వీట్ నేమ్. తన ఊరు రాజాదంగా, పక్కనే ఉన్న దలాబరీ అనే గ్రామంతో పాటు.. చుట్టుపక్కల పల్లెలకు కూడా అంబులెన్స్ సర్వీసంటే.. కరీముల్లా హకే. తన బైకునే అంబులెన్స్ గా మార్చిన కరీముల్లా అందిస్తున్న సేవలకు యావత్ భారతం అబ్బురపడుతూనే అభినందిస్తోంది. అందుకే భారత ప్రభుత్వం 2017లోనే కరీముల్లాను పద్మశ్రీతో సత్కరించింది.

తన ద్విచక్ర వాహనాన్ని అంబులెన్స్ గా ఎందుకు మార్చాల్సి వచ్చింది..?

అది 1995.. తన తల్లి గుండెపోటుకు గురైంది. తన ఊళ్లో ఉన్న ప్రతి ఇంటి తలపూ తట్టాడు. ఎక్కడా ఒక్క వాహనం కూడా దొరకలేదు. అంబులెన్స్ లేదు. కాదు.. అసలు ఆ ఊరికి అంబులెన్స్ అనే పదమే పరిచయం లేదు. ఆ పరిస్థితుల్లో తన తల్లిని తరలించలేక తల్లడిల్లుతున్న కరీముల్లా ముందే.. తల్లి అసువులు బాసింది. తన నిస్సహాయతతో కళ్లముందే తల్లి చనిపోయిన దైన్యం ఎంతగా కలిచివేసిందో… తన ఊరితో పాటు.. చుట్టుపక్కల ఊళ్లల్లో ఉన్న తన తల్లిలాగా కనీస మౌలిక సదుపాయల్లేక… ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో వైద్యసదుపాయం లేక, అంబులెన్సులు వచ్చే రోడ్జు మార్గం లేక… ఇవన్నీ కరీముల్లా హక్ ను తీవ్ర మథనానికి గురి చేశాయి. అంతలోనే ఓరోజు తాను పనిచేస్తున్న తేయాకు తోటలో… తన సహచర కార్మికుడు కూడా కళ్లు తిరిగి పడిపోయాడు. ఆ సమయంలో ఇంకేం.. కరీముల్లా వెంటనే అక్కడ పనిచేస్తున్న వారిని బైక్ అడిగి.. బండిపై తన స్నేహితుణ్ని వెనక్కి కట్టి.. వాగులు, వంకలు, అడవులు దాటుతూ ఎలాగోలా ఆసుపత్రికి తరలించి తన దోస్తును కాపాడుకున్నాడు. అదిగో అప్పుడే కరీముల్లాలో తానో ద్విచక్ర వాహనాన్ని కొని అంబులెన్స్ గా మార్చేస్తే… అనే ఆలోచన తట్టింది.

అదిగో అలా ఆ ఆలోచన నుంచి పుట్టిందే.. బైక్ అంబులెన్స్. ఎవరైనా తన కోసం బైక్ కొనుక్కుంటారు. కానీ, కరీముల్లా తన గ్రామంతో పాటు.. చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకం కోసం ఓ ద్విచక్ర వాహనాన్ని అదీ లోన్ తీసుకుని కొనుగోలు చేశాడు. అలా 1998లో తన మోటార్ బైక్ అంబులెన్స్ కు ఓ స్ట్రెచర్ కూడా ఏర్పాటు చేసుకుని.. తన గ్రామంతో పాటు.. చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలకు అంబులెన్స్ సేవలను ప్రారంభించాడు.

25 మైళ్ల దూరం వెళ్లితేనేగానీ ఆసుపత్రి సదుపాయం లేని అక్కడి చుట్టుపక్కల ఊళ్ల ప్రజానీకానికి… ప్రథమ చికిత్స అందించే ఏర్పాట్లతో పాటు.. 2018లో బజాజ్ ఆటో లిమిటెడ్ వారి సాయంతో వాటర్ ప్రూఫ్ స్ట్రెచర్, పోర్ట్స్, ఆక్సిజన్ సిలిండర్స్ వంటివి కూడా ఏర్పాటు చేసుకుని తన సేవల్ని మరింత విస్తరించాడు.

తేయాకు తోటల్లో కార్మికుడిగా కరీముల్లాకు వచ్చేదే 5 వేల జీతమైతే.. అందులో ఆయన ఖర్చు కూడా ఎక్కువగా ఆంబులెన్స్ లో సదుపాయాలకే పెట్టడం అతడి మానవీయ కోణానికి నిదర్శనం. ఇద్దరు కొడుకుల్లో ఒకరు తమలపాకుల దుకాణం నడుపుతుంటే.. మరో కుమారుడు సెల్ ఫోన్స్ రిపెయిరింగ్ షాప్ నడుపుతుంటాడు. ఇద్దరు బిడ్డలకు ఎలాగోలా పెళ్లిళ్లూ చేసేశాడు. ఇక తన జీవిత సార్థకత.. అంబులెన్స్ దాదాగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ.. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడటమే.

ఇప్పటివరకూ సుమారు 7 వేల మంది ప్రాణాలను కాపాడాడు కరీముల్లా. ఆసుపత్రులకు వాగులు, వంకలు, పొలాల మధ్య నుంచి రోడ్డు సౌకర్యాలు లేని ప్రాంతాల నుంచి తరలించి కాపాడిన కరీముల్లా.. కోవిడ్ సమయంలో చేసిన సేవలు యావత్ దేశం మొత్తానికీ స్ఫూర్తినిచ్చాయి. సాధారణంగా దేశ ప్రధానితో సెల్ఫీ తీసుకోవడానికి ఎవరైనా క్రేజ్ చూపిస్తారు. కానీ, ప్రధాని మోడీనే కరీముల్లాతో సెల్ఫీ కోసం క్రేజ్ కనబర్చడం విశేషం. 2018లో రాష్ట్రపతి కోవింద్ నుంచి పద్మశ్రీ అవార్డ్ అందుకున్నాక.. సాయంత్రం వేళ.. మోడీనే కరీముల్లాతో సెల్ఫీ దిగాడు. 2019లో బైక్- అంబులెన్స్ దాదా పేరుతో కరీముల్లా బయోగ్రఫీని బిస్వజిత్ ఝా అనే జర్నలిస్ట్ రాయడంతో.. కరీముల్లా హక్ స్టోరీ మరింత మందికి చేరువైంది. త్వరలో కరీముల్లా బయోగ్రఫీపై ఏకంగా ఓ సినిమా కూడా రాబోతుండగా.. టెడ్ ఎక్స్ టాక్ షోలోనూ తనదైన శైలిలో తన సామాజిక వైద్యసేవపై తనకు తెలిసింది నర్మగర్భంగా మాట్లాడి మన్ననలందుకున్నాడు. అలాగే, 2021లో అమితాబ్ ప్రెజెంటేషన్ లో నిర్వహించిన కరమ్ వీర్ స్పెషల్ ఎపిసోడైన కౌన్ బనేగా కరోడ్ పతిలోనూ.. ప్రముఖ నటుడు సోనూసూద్ తో కలిసి పాల్గొని భాగస్వామయ్యాడు.

ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే… మానవత్వానికి ఓ ప్రతీకగా… తన చుట్టుపక్కల గ్రామాలకు తాను అందిస్తున్న వైద్యసాయమంత ఎత్తైన మనస్తత్వం.. కరీముల్లా హక్!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles