నెట్ ఫ్లిక్స్ IC 814 THE KANDAHAR HIJACK సీరిస్ ఇప్పుడు చర్చనీయాంశమే కాదు… వివాదాలకూ తెరలేపింది. ముఖ్యంగా ప్రస్తుత మోడీ నేతృత్వంలోని బీజేపీకి.. నాటి ప్రధాని వాజ్ పాయ్ సారథ్యంలోని బీజేపీ తప్పిదాన్ని ఎత్తి చూపుతూ.. మొత్తంగా బీజేపీ పాలననే తప్పుబట్టే వైఖరికి కాందహార్ హైజాక్ ఘటన అవకాశం కల్పిస్తోందన్న భావన నెలకొన్నట్టుంది. అందుకే ఆ హైజాక్ ఘటనలో ఏం జరిగిందనే వాస్తవాల కంటే.. మొత్తంగా జనమంతా ఆ ఘటననే మర్చిపోవాలని కోరుకుంటుందేమో అంటున్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజ్యసభ ఎంపీ సాగరికా ఘోష్.

ఇవాళ ఏ విషయంపైనా పూర్తి స్థాయిలో శోధన జరుగుతుంది. ఎందుకంటే ఇది సోషల్ మీడియా హైపర్ యాక్టివ్ గా పనిచేస్తున్న హైపర్ పోలరైజ్డ్ టైం.
ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ నుంచి ఆ సీరీస్ ని తొలగించాలనే డిమాండ్స్ హిందూ సంఘాలు, బీజేపీ నేతల నుంచి వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ యుద్ధాలతో పాటు.. కోర్ట్ మెట్లెక్కేవరకూ వచ్చింది.
ఎందుకంటే IC 814 THE KANDAHAR HIJACK సీరీస్ లో ఐదుగురు ముస్లిమ్స్ పేర్లను హిందూ పేర్లతో పిలవడమే వివాదానికి కారణమైంది. నెట్ ఫ్లిక్స్ లో ఆ సీరీస్ నే తొలగించాలనే డిమాండ్ కు తెరలేపింది.
సాధారణంగా హైజాకర్స్ కచ్చితంగా తమ ఒర్జినల్ నేమ్స్ తో చలామణి కారు. వారు మారుపేర్లతోనే పరిచయమయ్యే అవకాశాలే ఉంటాయి. IC 814లో బర్గర్, చీఫ్, డాక్టర్ వంటి మారుపేర్లు కూడా మనకు వినిపిస్తాయి. ఆ పేర్లంటనేవి హైజాక్ హైడ్రామాకు తెరపడ్డాక కొద్ది రోజుల తర్వాతగానీ తెలియలేదు. అలాంటి ఓ అంశాన్ని పట్టుుకుని ఇప్పుడు వివాదాన్ని సృష్టించడంపైనే అభ్యంతరమంతా!
అంతేకాదు పాకిస్థాన్ ఐఎస్ఐ పాత్రపైనా సీరీస్ లో ఫోకస్డ్ గా చూపించలేదనేదీ హిందూవాదుల మరో ప్రధాన వాదన.
1999, డిసెంబర్ 24న జరిగిన IC 814 హైజాక్ ఇష్యూ ఎనిమిది రోజుల ఎపిసోడ్ గా నడిచి ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద హైజాక్ ఘటనగా నిల్చింది. అదే సమయంలో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై భిన్నాభిప్రాయాలను ప్రపంచం ముందుంచింది.
ఇంకా బీజేపీ ఆందోళనలకు ప్రధాన కారణమేంటి..?
IC 814 హైజాకింగ్ సమయంలో వాజ్ పాయ్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం… బలహీనంగా, మందకొడిగా, గందరగోళంగా వ్యవహరించిందనీ.. నిర్ణయాత్మకంగా మారలేకపోయిందన్న వాదనలు మళ్లీ ఈ సీరీస్ తో చర్చకు రావడమే.. ఇప్పటి బీజేపీ ఆందోళనలకు కారణం. ముఖ్యంగా విమానంలో ఉన్నవారిని విడిపించే క్రమంలో.. ఉగ్రవాదులతో రాజీ పడుతున్నట్లుగా చూపడం కూడా ఇప్పటి బీజేపీ పెద్దలకు నచ్చడం లేదు. పైగా నాటి ప్రధాని వాజ్ పాయ్ ఒత్తిళ్లకు తలొగ్గినట్టుగా ఉండటం కూడా ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోసింది. స్పష్టంగా విధానపరంగా ఆదేశాలిచ్చి ఆ ఎపిసోడ్ ను అణిచివేయాల్సి ఉండగా.. చర్చలు, కబుర్లతో సాగదీసినట్టుగా నాటి ఎపిసోడ్ ను కళ్లకు కట్టే ప్రయత్నం చేయడం వంటివి కూడా ఇప్పుడు బీజేపీకి నెట్ ఫ్లిక్స్ వెబ్ సీరిస్ పై ఆగ్రహానికి కారణాలు.
వాస్తవానికి బీజేపీకి పదే పదే గుర్తు చేసే అత్యంత చేదు జ్ఞాపకాల్లో కాందహార్ హైజాక్ ఘటన ప్రధానమైనది. జాతీయవాదం పేరుతో ప్రజల్లోకి వెళ్లే క్రమంలో.. నాటి ఆ ఘటనను తెరకెక్కించడమే బీజేపీకి నచ్చలేదు.
సాగరిక ఘోష్ ఏమంటారంటే.. నేను వాజ్ పాయ్ జీవిత చరిత్ర రచయిత్రిగా… IC 814 హైజాక్ ఇష్యూపై పలు వివరాలను సేకరించాను. విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ ను ఇంటర్వ్యూ చేశాను. అప్పటి రా హెడ్ ఏస్ దులత్.. అలాగే, జీవితాంతం వాజ్ పాయ్ కి సన్నిహితుడిగా ఉన్న నారాయణ్ మాధవ్ ఘాటే వంటివారితో మాట్లాడాను. వారంతా ఆ హైజాక్ ఘటనను బాధాకర ఘటనగానే పేర్కొన్నారు. జస్వంత్ సింగ్ దానిపై బాహాటంగా మాట్లాడేందుకు నిరాకరించారు.
ఇక నారాయణ్ మాధవ్ ఘాటే ఏమంటారంటే.. తమకు రెండు అవకాశాలు మాత్రమే ఉండేనని.. ఒకటి చెడ్డది.. ఇంకోటి పూర్తిగా అధ్వాన్నమైనదని చెప్పుకొచ్చారంటారు. ఈ క్రమంలో అధ్వాన్నమైనదానికంటే.. చెడ్డదే బెటర్ ఆప్షన్ అయిందన్నారు. రాజీ పడాల్సిన సమయంలో పడకపోతే ఏం ఉత్పాతం జరుగుతుందో ఆలోచించాల్సి ఉంటుంది.. కొన్నిసార్లు పంతాల కంటే ప్రాణాలు ముఖ్యమైన పరిస్థితుల్లో రాజీ పడాల్సి వస్తుంది. ఆనాడు అదే జరిగిందంటారట దులత్.
అమృత్ సర్ లో హైజాకర్స్ ను నిలుపుదల చేయలేకపోవడంపై విమర్శలు!
ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన IC 814 విమానం.. ఖాట్మండ్ లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి టేకాఫ్ అయ్యాక.. సుమారు 180 మందికి పైగా ప్రయాణీకులున్న ఆ విమానాన్ని ఢిల్లీకి వెళ్లే మార్గమధ్యంలో ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి కాక్ పిట్ లోకి దూరి కెప్టెన్ దేవీశరణ్ మెడపై తుపాకీ పెట్టి బెదిరంచాడు. వెనువెంటనే మరో నల్గురు క్యాబిన్ లో వ్యక్తులను హ్యాండ్సప్ అన్నారు. అంతలోనే కాక్ పిట్ నుంచి కెప్టెన్ వాయిస్ వినిపించింది. విమానం హైజాక్ కు గురైంది. దయచేసి హైజాకర్స్ సూచనలు పాటించండి అనేది ఆయన మాటల సారాంశం. ఆ సమయంలో ఆ విమానంలోనే రా అధికారి శశిభూషణ్ సింగ్ తోమర్ కూడా ఉండటం యాదృచ్ఛికం.
విమానంలో ఇంధనమెంత ఉందన్న హైజాకర్ ప్రశ్నకు ఢిల్లీకి చేరేంత అనే సమాధానం వచ్చింది కెప్టెన్ దేవీశరణ్ నుంచి. అయితే, దాన్ని లాహోర్ కు మళ్లించు అన్నది హైజాకర్స్ డిమాండ్. దాంతో చేసేదిలేక లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు సమాచారమిచ్చారు. కమ్యూనికేషన్ గ్యాప్ కూడా కనిపించిన ఆసమయంలో.. అంతకుముందే పాక్-భారత్ మధ్య కార్గిల్ యుద్ధం రేపిన చిచ్ఛుతో పాక్ విమానం ల్యాండింగ్ కు అనుమతించలేదు. ఇంధనం కూడా నిండుకునే పరిస్థితి రావడంతో తప్పనిసరి అనివార్య పరిస్థితుల్లో హైజాకర్స్ కు ఇష్టం లేకపోయినా అమృత్ సర్ లో విమానం ల్యాండ్ కావల్సి వచ్చింది. అలా సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు అమృత్ సర్ కు చేరుకుంది IC 814 విమానం.
అక్కడ వాజ్ పాయ్ ప్రభుత్వం విఫలమైందనేదే ప్రధాన ఆరోపణ. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల తుపాన్ ఒకవైపు.. వాటిని ఎలా అమలు చేయాలో తెలియని పరిస్థితులొకవైపు కనిపించాయి. కొందరైతే ఏకంగా ట్రాలీలు, రోడ్ రోలర్స్, ట్రక్కుల వంటివి ఫ్లైట్ దగ్గరకు తీసుకెళ్లి విమానం కదలకుండా నిలువరించాలనే సలహాలూ ఇచ్చారు. కానీ, పంజాబ్ ముఖ్యమంత్రి అందుకు ఒప్పుకోలేదు. దానివల్ల ప్రయాణీకులకు హాని కల్గితే కొత్త సమస్య ఏర్పడుతుందని.. సున్నితంగా డీల్ చేయాలని ఆదేశించారు.
అంతపెద్ద హైజాక్ జరిగితే నాడు వెనువెంటనే ప్రధాని వాజ్ పాయ్ కి సమాచారమే అందలేదు. పాట్నా నుంచి ఢిల్లీకి వచ్చాక విషయం తెలియడంతో సాయంత్రం ఆరుగంటల సమయంలో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. మొత్తంగా నాటి ఆ ఘటన వాజ్ పాయ్ ని పూర్తిగా షాక్ కు గురిచేసిందని ఘటాటే గుర్తు చేసుకున్నట్టు తన వ్యాసంలో పేర్కొన్నారు సాగరికా ఘోష్.
అమృత్ సర్ విమానశ్రయంలో ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్ నింపించుకోవాడనికి తీసుకునే సమయంలోపు అక్కడికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ చేరుకుని ఆపరేషన్ కు ప్లాన్ చేసుంటే.. ఆ ఘటన తాలూకు అనుభవం మరోలా ఉండేదేమో! కానీ, మానేసర్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకునేందుకే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయిన ఎన్ఎస్జీ బృందం.. అమృత్ సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేసరికి ఏకంగా రాత్రి 8 గంటల 15 నిమిషాలయ్యింది. అప్పటికే 25 నిమిషాల ముందు 7 గంటల 49 నిమిషాలకు అమృత్ సర్ నుంచి హైజాక్ కు గురైన ఎయిర్ క్రాఫ్ట్.. లాహోర్ కు బయల్దేరింది. అలా మళ్లీ లాహోర్ లో ల్యాండైన IC 814 మళ్లీ తిరిగి ఇంధనాన్ని నింపుకుని.. దుబాయ్ వెలుపల ఉన్న ఎయిర్ బేస్ లో ల్యాండైంది.
అప్పటికే మొదలైన చర్చల వల్ల దుబాయ్ లో కొందరు ప్రయాణీకులను విడుదల చేయడానికి తీవ్రవాదులు ఒప్పుకున్నారు. అప్పటి పౌర విమానయాన మంత్రి శరద్ యాదవ్ కు ఆ సందేశం చేరింది. మరోవైపు, భారత ప్రభుత్వం కమాండో ఆపరేషన్ కు కూడా దుబాయ్ లో ప్లాన్ చేసినట్టు ముష్కరుల్లో ఒక ఆందోళన నెలకొంది. కానీ, ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు.
అంతకుముందు అమృత్ సర్ లోనూ అలాంటి ఆపరేషనే చేస్తారనే భయంతో.. ఉగ్రవాదుల ఎదురుదాడిలో భాగంగా రూపిన్ కత్యాల్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేయడం.. అతడు చనిపోవడం ఆ హైజాక్ ఘటనలో తీవ్ర విషాదాన్ని రేపింది.
కానీ, అప్పటికే 24 గంటలు టీవీల్లో ఈ హైజాక్ ఎపిసోడ్ కాక రేపుతోంది. దేశమంతా ఒకటే చర్చ. అందులో ప్రయాణించిన కుటుంబీకులు, బంధువుల్లో తీవ్రమైన ఆందోళన. ఆ కవరేజ్ వీక్షిస్తూ దేశంలో నెలకొన్న ఆందోళ పరిస్థితులు చూసిన నాటి ప్రధాని వాజ్ పాయ్ నరాలు తెగే ఉత్కంఠననుభవించారు.
ఒక అవమానకరమైన సందర్భమది!
1998 పోఖ్రాన్ 2 అణు పరీక్షల తర్వాత భారత్ ఒంటరైంది. ఆ సమయంలో ఎవ్వరూ కనీసం సాయం చేసే పరిస్థితులో కూడా లేరు. ఏ దేశం కూడా కనీసం మధ్యవర్తిత్వం కోసం ముందుకురాని ఓ సంధి పరిస్థితి నెలకొంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో చేసేదేం లేక వాజ్ పాయ్ ప్రభుత్వం హైజాకర్స్ తో చర్చలకు ఉపక్రమించింది. అలా కాందహార్ కు తీసుకెళ్లిన విమానాన్ని, అందులో ప్రయాణీకుల్ని విడిపించేందుకు.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టైన మసూద్ అజార్ ను భారత్ విడుదల చేయడం.. ఆ తర్వాత తానే 2001లో భారత పార్లమెంట్ పై దాడి వ్యూహకర్తల్లో ఒకడన్న వార్తలు వెల్లువెత్తడం.. పుల్వామా దాడిలోనూ అజార్ ప్రమేయముందన్న ఆరోపణలతో నాటి వాజ్ పాయ్ ప్రభుత్వానికి.. కౌంటర్ ఇచ్చుకునే అవకాశాన్నీ కాందహార్ ఘటన కాలరాసింది
కాందహార్ లో టెర్రరిస్టులను అప్పగించి.. హైజాకర్స్ చెర నుంచి విమాన ప్రయాణీకుల్ని రక్షించేందుకు నాటి విదేశాంగ మంత్రి ఎస్కార్ట్స్ ను భద్రత నడుమ తీసుకెళ్లడం కూడా వాజ్ పాయ్ జీర్ణించుకోలేకపోయారు. కష్టపడి పట్టుకున్న కరడుగట్టిన తీవ్రవాదులకు రక్షణ కల్పిస్తూ.. వారిని తీసుకెళ్లి హైజాకర్స్ వద్ద వదలేయడం ఆయనకు నచ్చలేదట. క్యా వో చలే గయా అంటూ వాజ్ పాయ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారట.
బలమైన జాతీయవాదాన్ని ప్రదర్శించే పార్టీకి సంబంధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రవాదులను వదలడం, వారికి ఎస్కార్ట్ భద్రత ఇచ్చి వారిని వారి డెన్ కు చేర్చడం వంటివన్నీ ఉగ్రవాదుల డిమాండ్స్ కు పూర్తిగా లొంగిపోవడమేనన్న ఘాటైన విమర్శలకు తెరలేపింది. ఆ సమయంలో ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారైన అజిత్ కుమార్ ధోవల్ కూడా వాజ్ పాయ్ అగ్రశ్రేణి బృందంలో ఒకరు కావడం గమనార్హం.
ఇప్పటి మోడీ, అప్పటి వాజ్ పాయ్ ప్రభుత్వాల మధ్య చర్చగా మారిన వ్యత్యాసం..?
నేటి నరేంద్రమోడీ నేతృత్వంలోని కొత్త బీజేపీకి.. నాటి వాజ్ పాయ్ నేతృత్వంలోని పాత బీజేపీకి మధ్య పాలనాపరమైన అంశాల్లో కావచ్చు.. విదేశాంగ విధానాల్లో తీసుకునే అగ్రెసివ్ డిసీషన్స్ లో కావచ్చు.. కచ్చితంగా తేడా కనిపిస్తుంది. సైద్ధాంతిక ఎజెండాలో పాత బీజేపీలో అంత చురుకుదనం లేదు అనడానికి పలు తీవ్రవాద దాడులు ఉదాహరణలుగా కనిపిస్తాయి. అయితే, ఆ మచ్చ ఇప్పుడు మోడీ నేతృత్వంలోని బీజేపీపై పడటం.. సుతారమూ ఇష్టం లేకనే ఈ చర్చపై బీజేపీ ఇప్పుడు ఎదురుదాడులు, ఫిర్యాదులతో కాందహార్ ఘటనను తెరమరుగు చేసే యత్నం చేస్తోందంటారు ఘోష్.
1999లో కార్గిల్ వద్ద పాకిస్థాన్ సైనికులు భారత్‌లోకి దూసుకొచ్చారు. అదే ఏడాది IC 814 హైజాక్ కు గురైంది. 2001లో ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేశారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీపై కూడా భారీ దాడి జరిగింది.
ముహ్ తోడ్ జవాబ్ దేంగే.. మేమూ ఇంతకంటే ఘాటుగా ప్రతిస్పందిస్తాం కాచుకోండి అంటూ నాటి బీజేపీ నినాదాలకే పరిమితమైంది. పైగా పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 1993లో జరిగిన ముంబై దాడుల కేసులో దావూద్ ఇబ్రహీంను పట్టుకోవాలని డిమాండ్ చేసింది. కానీ, అధికారంలోకి వచ్చాక మాత్రం సవాళ్లనెదుర్కోవడంలో విఫలమైందనే ఆరోపణలను మూటగట్టుకుంది. 1990వ దశకంలో ప్రతీకారం తీర్చుకోవాలన్న చందంగా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించిందే తప్ప.. అధికారం చేతికొచ్చాక మాత్రం బ్యాక్ ఫుట్ లో ప్రేక్షకపాత్ర వహించిందనేది నాటి బీజేపీపై ఘోష్ గుప్పించే ప్రధాన విమర్శ.
మరి మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం వాజ్ పాయ్ ని మించి గొప్పగా సాధించిందేమిటి..?
ఇటీవలి నివేదికల ప్రకారం.. చైనా 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది.
భారత, చైనా కమాండర్ల మధ్య ఇరవై ఒక్క సార్లు చర్చలు జరిగాయి. సరిహద్దు వివాదాలే లేకపోతే.. ఏం చర్చించుకుంటున్నట్టు..? 2020లో గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణల్లో భారత్ 20 మంది సైనికులను కోల్పోయింది. అయినా మన దేశంలోకి ఎవ్వరూ చొరబడరరనే మాట చెప్పడమే తప్ప.. ఆచరణలో జరిగిందేమిటి..? ఇప్పటికీ సరిహద్దు వివాదం విషయంలో నేరుగా మోడీ చైనా పేరును కూడా ఎత్తడానికి సాహసించలేదన్నది కొత్త బీజేపీ ప్రభుత్వ రథసారధిపైనున్న ప్రధాన విమర్శ. పదునైన వాక్చాతుర్యం జనాన్ని ఉత్తేజపర్చేందుకు ఉపయోగపడొచ్చేమోగానీ.. అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయ వివాదాలు, పలు సవాళ్లను బట్టి రాజీలు కూడా తప్పవనే విషయాన్ని గమనించాలంటారు ఘోష్.
అయితే, తాజాగా IC 184 THE KANDAHAR HIJACKతో మరోసారి నాటి వాజ్ పాయ్ ప్రభుత్వ తీరుపై భిన్నరకాల చర్చలకు తెరలేసిన నేపథ్యంలో.. ఇప్పటి బీజేపీ పెద్దలకు ఇది రుచించడంలేదు. దాంతో నాటి సంకీర్ణంలో ఉన్నవారు కూడా బాధ్యత తీసుకోవాల్సిందేనంటూ కొత్త వాదనలు తెరపైకి తెచ్చి డిఫెన్స్ ప్రదర్శిస్తున్నారు. కానీ, అలాంటి సమయాల్లో జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో ప్రధాని చుట్టూ ఉన్న కోర్ టీమ్ మాత్రమే నిర్ణయం తీసుకుంటుందనే కనీస అవగాహన లేకపోవడమే ఇలాంటి వితండవాదాలకు కారణమంటారు సాగరికా ఘోష్.
తమ అనుమతి లేకుండానే తమ క్లిప్పింగ్స్ వాడుకోవడంపై తాజాగా ఏఎన్ఐ కూడా IC 814 THE KANDAHAR HIJACK వెబ్ సీరిస్ నిర్మాతపై లాసూట్ ఫైల్ చేయడం కొసమెరుపు!
(డిస్ క్లెయిమర్: సాగరికాఘోష్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, ప్రముఖ జర్నలిస్ట్. ఇవి పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. కానీ, చర్చించదగ్గవి. తెలుసుకోవాల్సినవి.)



