గ్రేట్ యూనైటెడ్ కింగ్డమ్ క్వీన్ విక్టోరియా నుంచి లేఖనందుకున్న భారతదేశ మొట్టమొదటి మహిళా వైద్యురాలి కథ చెప్పుకుందామిప్పుడు. 14 ఏళ్లకే తల్లైన ఆమె… ఆ తర్వాత 19 ఏళ్లకే ఎండీ పూర్తి చేసి భారతదేశ మొట్టమొదటి వైద్యురాలెలా అయింది…? ఎవరామె… ఆమె వెనుకున్న చరిత్రేంటి..??
ఆనంది గోపాల్ జోషి… ఈమె మహారాష్ట్రకు చెందిన ఓ భూస్వామ్య కుటుంబంలో పుట్టింది. ముంబై ప్రెసిడెన్సీలోని థానే జిల్లా కళ్యాణ్ లో 1865, మార్చ్ 31వ తేదీన జన్మించిన ఆనంది మొదటి పేరు యమున. చిత్పవన్ బ్రాహ్మణ సమాజానికి చెందిన యమునకు కేవలం 9 ఏళ్ల వయస్సులో తన కంటే 20 ఏళ్లు పెద్దవాడైన, అంతకుముందే తన భార్యను కోల్పోయిన పోస్టల్ క్లర్క్ గోపాల్ రావు జోషితో బాల్య వివాహం చేశారు. గోపాల్ రావు ఆ తర్వాత యుమున పేరును ఆనందిగా మార్చేశాడు. గోపాల్ రావు ఓ న్యాయవాది కూడా కావడంతో పాటు.. ప్రగతిశీల ఆలోచనలున్న వ్యక్తిగా ఆనందిని చదువులో ప్రోత్సహించాడు. ఆమెకు కూడా ఉన్న విద్యాపరమైన ఆకాంక్షలకు భర్తగా అడ్డు తగలుతూ పురుషాధిక్యాన్ని చూపించకుండా బలమైన మద్దతునిచ్చాడు.

టర్నింగ్ పాయింట్!
9 ఏళ్ల వయస్సులో గోపాల్ రావు జోషితో వివాహమనంతరం… సరిగ్గా ఐదేళ్ల తర్వాత తన 14 ఏళ్ల వయస్సులో ఆనంది ఓ మగ పిల్లవాడికి జన్మనిచ్చింది. కానీ, ఆ బాబు అనారోగ్యం కారణంగా.. సరైన వైద్య చికిత్స అందకపోవడంతోనే కేవలం పదిరోజుల్లో మరణించాడు. ఆ హృదయవిదారక ఘటన ఆనందిలో తాను డాక్టర్ కావాలనే కోరికవైపు అడుగులేయించింది.
అలా భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలి జననానికి బీజం పడింది!
14 ఏళ్ల సమయంలోనే తన భర్త గోపాల్ రావు నుంచి లభించిన మద్దతుతో డాక్టర్ కావాలనే సంకల్పంతో ఆనంది తన విద్యాప్రయాణాన్ని ప్రారంభించింది. మొదట ఓ మిషనరీ పాఠశాలలో చేర్పించడానికి గోపాల్ రావు జోషి ప్రయత్నించినా అది విఫలం కావడంతో.. ఆనంది, జోషి జంట కలకత్తాకు మకాం మార్చారు.
1880లో గోపాల్ రావు.. తన భార్య ఆనంది వైద్య విద్యను అభ్యసించడానికి సాయం కోరుతూ అమెరికన్ మిషనరీలోని రాయల్ వైల్డర్ కు ఓ లేఖ రాశారు. ఆ లేఖ న్యూజెర్సీ నివాసైన థియోడిసియో కార్పెంటర్ అనే మహిళ దృష్టికి వెళ్లింది. వారికి జరిగిన కథంతా ఆ లేఖలో ఉండటంతో ఆమె చలించింది. జోషి ఆకాంక్షకు మద్దతునివ్వాల్సిందిగా ఆమె రాయల్ వైల్డర్ ను కోరుతుంది. వారిద్దరి ప్రోత్సాహంతో ఫిలడేల్ఫియాలోని పెన్సిల్వేనియాలోని ఉమెన్స్ మెడికల్ కళాశాలలో చదువుకునే అవకాశం లభించింది. కానీ, యునైటెడ్ స్టేట్స్ కు బయల్దేరేముందు ఆమె అనారోగ్యానికి గురై బలహీనతతో, జ్వరంతో బాధపడింది.
ఓవైపు పెన్సిలేన్వియా మెడికల్ కళాశాలలో అవకాశం.. ఇంకోవైపు అనారోగ్యం… వాటి మధ్య ఓ హిందూ మహిళ ఉన్నతవిద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్లడమనే ఆలోచనపై ఆగ్రహించే నాటి సనాతన సమాజం… ఆ సమయంలో ఆనంది, జోషి దంపతుల జంట ఎన్నో సవాళ్లనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఆమె సెరంపోర్ కాలేజ్ హాల్ లో హిందూ సమాజాన్ని ఉద్దేశించి ఓ ప్రసంగం చేసే అవకాశం దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకుంది ఆనంది. ఎందుకు హిందూ మహిళలు అప్పుడున్న పరిస్థితుల్లో వైద్యులుగా ఎదగాలో ఆమె విశ్లేషణాత్మకంగా వివరించి దాని ప్రాముఖ్యతను తెలియజెప్పింది.
మొత్తంగా వైద్య విద్య లక్ష్యంతో సైన్స్ చదివిన ఆనంది.. 19 ఏళ్ల వయస్సులో పెన్సిలేన్వియా వైద్య కళాశాలలో చేరింది. 1886లో తను ఏకంగా మెడికల్ పట్టా సాధించింది. అయితే తన మెడిసిన్ చదువు సమయంలో ఆమె వెస్టర్న్ కల్చర్ కు అలవాటు పడలేక.. తన సంప్రదాయ హైందవ పద్ధతులను విడనాడలేక ఒక మానసిక సంఘర్షణ కూడా అనుభవించినట్టు తాను ఇండియాలోని తన కుటుంబీకులకు రాసిన లేఖల్లో పేర్కొంది. ప్రసూతిశాస్త్రం అనే ఆమె ఆర్టికల్ అప్పటి జర్నల్స్ లో అచ్చైంది. విద్యావేత్తల నుంచి ప్రశంసలు లభించాయి. అలా ఆమె సాధించిన విజయానికి ఏకంగా విక్టోరియా రాణి నుంచే అభినందనలందుకుంది ఆనంది.
భారత్ కు తిరిగివచ్చిన ఆనంది, జోషి దంపతులకు మహారాష్ట్ర సమాజం నుంచి హృదయపూర్వకమైన వేడుకలతో ఘనస్వాగతం లభించింది. కొల్హాపూర్ రాచరిక రాష్ట్రం నాడు ఆమెను స్థానిక ఆల్బర్ట్ ఎడ్వర్డ్ ఆసుపత్రిలో మహిళా వార్డుకు హెడ్ డాక్టర్ గా నియమించింది.
చిన్న వయస్సులోనే మరణం బాధాకరం!
యూఎస్ లో ఆమె చదువుతున్న సమయంలో కఠినమైన వాతావరణ పరిస్థితులు, ఆహార మార్పుల కారణంగా మరింత అనారోగ్యానికి గురైంది. ఆ ప్రభావం వల్ల ఆ తర్వాత ఆమె క్షయవ్యాధికి గురైంది. భారతదేశానికి తిరిగివచ్చిన కొంతకాలానికి ఆమె ఆరోగ్యపరిస్థితి మరింత క్షీణించింది. 1887, ఫిబ్రవరి 26వ తేదీన కేవలం 22 ఏళ్ల వయస్సులో ఆనంది జోషి మరణించింది.
తాను ఎన్నో కష్టాలకోర్చి సంపాదించిన వైద్య పట్టాతో పూర్తిగా ప్రాక్టీస్ చేసే అవకాశం జోషికి ఎప్పుడూ లభించలేదు. అయితే, తనకున్న సామాజిక అడ్డంకులను ఛేదించి వైద్యవృత్తిలోకి ప్రవేశించిన మొట్టమొదటి భారతీయురాలిగా.. నెక్స్ట్ జనరేషన్ మహిళలకు రోల్ మాడల్ గా ఆనంది జోషి తన పేరు నిలుపుకుంది. ఆనంది గోపాల్ పేరుతో ఓ బయోపిక్ గా కూడా ఆమె చరిత్ర తెరకెక్కింది.



