అంతరిక్ష కేంద్రంగా.. ఆధ్యాత్మిక మందిరం!

ఓ ప్రార్థనా మందిరం అంతరిక్ష కేంద్రంగా అవతరించిన విధంబెట్టిదనిన!

————————————————————————————–

జాతీయ అంతరిక్ష దినోత్సవం రోజున తెలుసుకోవాల్సిన ఓ చరిత్ర పాఠం!!

#nationalspaceday. సరిగ్గా రెండేళ్ల క్రితం 2023 ఆగస్ట్ 23న చంద్రయాన్ 3తో మన ఇస్రో సృష్టించిన ఓ చరిత్రకు చిహ్నంగా ఆరోజును మనం ఈ నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటున్నాం. ఈక్రమంలో మనమోసారి ఓ విశేషాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. విక్రమ్ ల్యాండర్ ఏవిధంగా చందమామపైనున్న దక్షిణ ధృవాన్ని తాకిందో తెలుసుకున్న మనం.. ఆ లెగసీని ఇంకా మున్ముందుకు తీసుకెళ్లి మనది కాని అంతరిక్ష ప్రపంచంలోనూ ఏం జరుగుతుందో శోధించడం.. శోధించి సాధించడం ఓ థ్రిల్. ప్రపంచ దేశాలతో పోటీలో ఓ సవాల్. అందుకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్.. మొత్తంగా STEM అనే శాస్త్రీయ విజ్ఞానాన్ని ఎలా ప్రమోట్ చేయాలో ఇప్పుడు మరింత చర్చ జరుగుతున్న రోజులివి. అందుకే 2023, ఆగస్ట్ 23న విక్రమ్ ల్యాండర్ తో చరిత్ర సృష్టించిన రోజును నేషనల్ స్పేస్ డేగా ప్రధాని మోడీ ప్రకటించారు. TOUCHING LIVES WHILE TOUCHING THE MOON.. INDIA’S PACE SAGA అనే థీమ్ తో గత ఏడాది 2024 ఆగస్ట్ 23 జాతీయ అంతరిక్ష దినాన్ని మనం జరుపుకున్నాం. అయితే, ఇంత శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి దోహదపడ్డ విక్రమ్ సారాభాయ్.. మొట్టమొదట ఎక్కడినుంచి తన రాకెట్ ప్రయోగాన్ని చేశారో తెలుసుకుందాం. ఈసారి నేషనల్ స్పేస్ డే 2025, ఆగస్ట్ 23న Leveraging Space Technology and Applications for Viksit Bharat 2047 థీమ్ నేపథ్యంలో గోల్డ్ లాంటి ఓల్డ్ స్టోరీ మీకోసం.

అది 1963.. చుక్కల్లోకి ఒక రాకెట్ రివ్వున ఎగిసింది. అదేదో పెద్ద సెటప్ ఉన్న అంతరిక్ష కేంద్రమా..? కాదు.. ఓ క్యాథలిక్ చర్చ్. అవును భారతదేశం తన మొట్టమొదటి రాకెట్ ప్రయోగం చేసిన ఆ కథ ఎంతో ఆసక్తికరమైంది. ఎందుకంటే రాకెట్ తో పాటు.. దాన్ని గగనతలంలోకి వదిలే స్పేర్ పార్ట్స్, ఉత్ప్రేరకాలన్నింటినీ సైకిళ్లు, ఎడ్లబండ్లపై సరఫరా చేసిన రోజులవి.

మరి క్రైస్తవ ప్రార్థనా మందిరం.. అంతరిక్ష కేంద్రంగా ఎలా మారింది..?

సరిగ్గా 1960ల కాలంలో మన గర్వించదగ్గ శాస్త్రవేత్త డాక్టర్ విక్రమ్ సారాభాయ్.. త్రివేండ్రంలోని తుంబా అనే ఓ చిన్న మత్స్యకార గ్రామాన్ని రాకెట్ లాంచింగ్ స్టేషన్‌కు వేదికగా ఎంచుకున్నారు. ఎలాంటి సంభావ్యతలకు లోనుకాని ఓ ప్రదేశంగా తుంబా క్యాథలిక్ చర్చ్ ప్రాంతం అనువైనదిగా భావించారట విక్రమ్ సారాభాయ్. తుంబాలో ఉన్న సెయింట్ మేరీ మాగ్డలీన్ చర్చ్.. భూమధ్యరేఖపై అయస్కాంతత్వాన్ని కల్గి ఉన్న ప్రాంతం కావడంతో రాకెట్ లాంచింగ్ కు సరైన ప్రదేశమని నమ్మారు. అందుకే, డాక్టర్ సారాభాయ్ తుంబా క్యాథలిక్ చర్చ్ ను వేదికగా ఎంచుకోవడానికి.. చాలా టెక్నికల్ అంశాలు కారణమయ్యాయి.

ఇంకేం ఓ ఫైన్ మార్నింగ్ విక్రమ్ సారాభాయ్, ఆయన అనుచరులతో కలిసి.. ఆ చర్చ్ ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు.. రాకెట్ ప్రయోగం కోసం.. త్రివేండ్రం బిషప్ డాక్టర్ బెర్నార్డ్ పెరీరాను సంప్రదించారు. తమ రాకెట్ ప్రయోగం కోసం చర్చ్ తమకు కావాలన్న ప్రతిపాదనను విక్రమ్ సారాభాయ్.. చర్చ్ బిషప్ ముందుపెట్టారు. ఆ మాటతో ఒక్కసారి ఆ బిషప్ కు షాక్ కొట్టినంత పనైందట. ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా.. నెక్స్ట్ రాబోయే ఆదివారం రోజు ఒక్కసారి చర్చుకు రమ్మని ఆహ్వానించారట వారిని. ఇదంతా మరో ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన ఇగ్నైటెడ్ మైండ్స్.. అన్ లీషింగ్ ది పవర్ విత్ ఇన్ ఇండియా అనే బుక్ లో చర్చించారు.

ఆధ్యాత్మికతా, శాస్త్రీయతా.. రెండూ మనల్ని సుసంపన్నం చేయడానికేనన్న బిషప్!

ఇంకేం, ఆ ఆదివారం రానే వచ్చింది. విక్రమ్ సారాభాయ్ మళ్లీ తన సహచరులతో కలిసి చర్చుకు వెళ్లారు. ఆ చర్చుకు ప్రతీ ఆదివారంలాగే.. పెద్ద ఎత్తున ప్రార్థనల కోసం క్రిస్టియన్ భక్తులు పోటెత్తారు. ప్రార్థనలు ముగిశాయి. ఇంకొక సందేశముంది. మీరంతా ఈ సందేశం వినాలన్నారు బిషప్. దాంతో పిన్ డ్రాప్ సైలెన్స్ నెలకొంది. అప్పుడు బిషప్ ఏమన్నాడంటే..?

నాతో ఓ సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన పేరు విక్రమ్ సారాభాయ్. ఆయన మనదేశం కోసం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించే క్రమంలో పలు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు రాకెట్ లాంచింగ్ కోసం మన చర్చుని వారికిమ్మంటున్నారు. సైన్స్ మానవ జీవితాన్ని సుసంపన్నం చేసే సత్యం కోసం అన్వేషిస్తోంది. ఏ మతమైనా చెప్పే ఆధ్యాత్మిక సారం కూడా అదే. మరి ఈ చర్చుని వారి రాకెట్ ప్రయోగం కోసం ఇమ్మంటారా అని అడిగారు బిషప్ బెర్నార్డ్ పెరీరా.

కాస్సేపు మౌనం ఆవహించింది. కానీ, అంతలోనే అక్కడికొచ్చిన భక్తులందరి నుంచీ బిషప్ మాటలకు సానుకూల సమాధానం వచ్చింది. ఆ సమాధానం ఏస్ అంటూ ఆ చర్చంతా ప్రతిధ్వనించింది. ఇంకేం అవసరమైన అనుమతులు వడివడిగా పొందడం.. పేపర్ వర్క్ కూడా పూర్తి కావడంతో.. అక్కడున్న గ్రామస్థులు కూడా పక్క గ్రామానికి షిఫ్ట్ అవ్వడం ఇవన్నీ సామూహిక సహకారంతో చకచకా జరిగిపోయాయి. అలా తుంబా సెయింట్ మేరీ మాగ్దలీన్ చర్చ్ ముందు తోట.. ఓ రాకెట్ లాంచింగ్ స్టేషన్ గా కొత్త రూపు సంతరించుకుంది.

సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ కాస్తా.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ గా రూపాంతరం!

అవునూ! సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ 1544లో గడ్డితో నిర్మించిన ఓ పూరి గుడిసెలాంటి భవనంలో ఓ క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సెయింట్ ఫ్రాన్సిస్ చర్చే.. 20వ శతాబ్దం నాటికి కాంక్రీట్ తో నిర్మించిన సెయింట్ మేరీ మాగ్దలీన్ చర్చ్ గా కొత్త పేరుతో అవతరించింది. సముద్రం ఒడ్డున కొందరు మత్స్యకారులు గంధపు చెక్కలతో చేసిన మేరీ మాగ్ధలీన్ విగ్రహాన్ని గుర్తించడం వల్లే.. ఆ తర్వాత ఆ చర్చ్ పేరు మారడానికి గల కారణంగా చెబుతారు.

అలా 1960లో తుంబా చర్చ్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ గా మారగా.. ప్రార్థనా మందిరం ప్రయోగశాలగా.. బిషప్ ఉండే గది తన డ్రాయింగ్ రూమ్ గా ఉండేదని కలాం తన పుస్తకంలో పేర్కొన్నారు. చర్చ్ లోని పశువుల కొట్టం శాస్త్రవేత్తలంతా పనిచేసే ప్రయోగశాలగా మారిపోయిందట. ఇప్పుడా ఆ చర్చ్ అంతరిక్ష మ్యూజియంగా గుర్తింపు పొందింది.

అలా తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్.. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంగా మారింది. ఇవాళ ఇస్రో వివిధ శాఖలు వివిధ ప్రాంతాలకు విస్తరించగా.. మూలం మాత్రం తుంబా క్యాథలిక్ చర్చ్ కావడం ఓ విశేషం.

సైకిల్ పై రాకెట్! చర్చ్ లో లాంచ్ ప్యాడ్!!

ఇవాళ స్పేస్ రాకెట్ ప్రయోగాల్లో భారత్ పేరు విశ్వవ్యాప్తంగా మారుమోగుతోంది. అదే సమయంలో, విదేశీ సాంకేతికతతో పోటీ పడుతోంది. అంతేస్థాయిలో సవాళ్లనూ ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ్.. మొట్టమొదటి రాకెట్ ప్రయోగానికి కావల్సిన విడిభాగాలను, ముడిసరకును సైకిళ్లు, ఎడ్ల బండ్లు ఉపయోగించి తరలించిన రోజులు నిజంగా ఓ నోస్టాల్జియా. యూఎస్ లోని నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి దిగుమతి చేసుకున్న రాకెట్, నైక్-అపాచీ వంటి విడిభాగాలన్నీ కేవలం సైకిళ్లు, ఎడ్లబండ్లపైనే నాడు తుంబా క్యాథలిక్ చర్చుకు ఎంతో శ్రమకోర్చి తరలించారు.

అలా నవంబర్ 21, 1963లో సెయింట్ మేరీ మాగ్జలీన్ చర్చ్ నుంచి మొట్టమొదటి భారతదేశం ప్రయోగించిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన ఓ చారిత్రాత్మక రోజుగా చరిత్రై నిల్చిపోయింది.

ఒకనాడు బూట్లు, చెప్పులు ధరించకుండా లోనికి వెళ్లే ప్రార్థనా స్థలం.. బెల్స్, టవర్స్ తో అందంగా కనిపించిన చర్చ్ అందాలిప్పుడు.. శాస్త్ర, సాంకేతిక రంగాలకు చిహ్నాల్లా మారిపోయి ఓ మ్యూజియంగా అవతరించాయి. ఒకనాటి తుంబాలోని.. సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్.. 20వ శతాబ్దానికి కాంక్రీట్ తో సెయింట్ మేరీ మాగ్దలీన్ చర్చ్ గా అవతరించిన ప్రార్థనా మందిరంలో.. ఇప్పుడు క్రీస్తు బలిపీఠంకు బదులు.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశ పురోగతి మనకు దర్శనమిస్తుంది.

ఇదండీ ఓ ఆధ్యాత్మిక ప్రార్థనా మందిరం.. ఓ శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన ప్రయోగకేంద్రంగా.. ప్రస్తుతం ఓ సైన్స్ మ్యూజియంగా రూపంతరం చెందిన కథ!

మరిన్ని విజయాలు సాధించి ఇస్రో ప్రపంచ దేశాల ముందు కాలరెగురాయాలని ఆశిద్దాం! నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఇస్రో సాధించిన విజయాలకు, చేస్తున్న ప్రయోగాలకు అభినందలు తెలియజేద్దాం!!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles