Subramanyam Valluri.. ✍️
నేటి యువతరం వారు ఈ సంస్థ తయారు చేసే అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రాండ్ గురించి అడిగితే ఎప్పుడు వినలేదు, చూడలేదు, వాడలేదు అన్న సమాధానం వస్తుంది. ఇరవయ్యవ శతాబ్దంలో ఈ సంస్థ ఒక్క వెలుగు వెలిగి, వాడేవారిని అన్ని దంత సమస్యలను దూరంగా ఉంచింది.

ఈ సంస్థ మూలాలు, మైసూర్ రాజ్య కుటుంబీకులైన వోడాయర్ దూరదృష్టికి నిదర్శనం. వోడాయర్ వారు మన వేదాలలో ప్రస్తావించిన ఆయుర్వేద శాస్త్రం పూర్వవైభవం పొందడానికి చేసిన ప్రయత్నమే 1890లో ప్రారంభించిన “మైసూర్ ఆయుర్వేద కాలేజి”
హిందువుల పురాతన వైజ్ఞానిక శాస్త్రం వెలుగులోకి తేవాలని , యోగ, ఆయుర్వేద శాస్త్రాలు తదితర విషయాలను అప్పటి యువత చదవాలి అన్న సదుద్దేశంతో ఈ కాలేజి స్థాపించారు. ఆయుర్వేద వైద్యం సామాన్యులకు అందుబాటులోకి రావాలని ఉద్దేశ్యంతో ఈ కాలేజీ ప్రారంభించారు. ఒక్క మైసూర్ ప్రజలకు మాత్రమే కాకుండా , కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎవరైనా చేరవచ్చు ఈ కాలేజీలో.
ఆ కాలేజీలో చదువుకుని పట్టభద్రులైనవారిలో కొద్దిమంది వైద్యులుగా పేరొందారు, కొద్దిమంది ఔషధ తయారీ సంస్థలు ప్రారంభించి ప్రజలు మరిచిపోయిన ఎన్నో విలువైన ఔషదాలను పునఃప్రారంభం చేసి పేరొందిన సంస్థల జాబితాలో చోటు సంపాదించారు.
అలాంటివారిలో శ్రీ బి.వి.పండిట్ గారి గురించి తెలుసుకోవాలి. ఆయన ఈ కాలేజీ నుంచి మొట్టమొదటి బ్యాచ్ లో పట్టభద్రులయ్యారు. ఆయన జీవిత లక్ష్యం తాను చదువుకున్న చదువు దేశ వ్యాప్తంగా అందరి ఆరోగ్యానికి ఉపయోగపడాలి.
ఆ నిశ్చయంతో ఆయన సద్ వైద్యశాలను (SADVAIDYASALA 1913లో) ఒక శతాబ్దం క్రితం ప్రారంభించారు. ప్రారంభ దశలో వరుసపెట్టి కొన్ని ఆయుర్వేద ఔషదాలను విడుదల చేసారు. వాటిలో ఒకటి , నంజనగుడ్ పళ్ళ పొడి. నంజనగుడ్ ఆయన స్వస్థలం. (మైసూర్ దగ్గరలో ఉంది , చాలా విశిష్ట ఆలయాలకు ప్రసిద్ది చెందిన ఊరు) కొద్దిరోజుల్లోనే ఆ నంజనగుడ్ పళ్ళ పొడి ఎంతో ప్రాచుర్యం పొంది ప్రతి ఇంట్లో తప్పనిసరిగా వుండే నిత్యావసర వస్తువుగా గుర్తింపు పొందింది. 20వ శతాబ్దంలో ఈ బ్రాండ్ గురించి తెలియని వారుండరు అన్నంతగా. మైసూర్ – నంజనగుడ్ ట్రైన్ ను ప్రేమగా పళ్ళ పొడి బండి అని పిలుచుకునేవారు.
1990 ప్రాంతాల్లో మనదేశ ఆర్ధిక సంస్కరణలలో భాగంగా వ్యాపార ఆంక్షలు ఎత్తివేసిన తరువాత , స్వేచ్ఛ విపణి, మారుతున్న అభిరుచులు వల్ల , అమ్మకాలు పడిపోసాగాయి.
20వ శతాబ్దం మొత్తం నెలకు పది లక్షల బాక్సులు (wholesale boxes) అమ్ముడుపోయిన పళ్లపొడి 21వ శతాబ్దంలోకి ప్రవేశించేసరికి లక్ష బాక్సులకు పడిపోయింది. నిపుణులు సలహా ఇచ్చేవారు అమ్మకాలు పెరగాలంటే పళ్లపొడిలో కొత్త రుచులు ప్రవేశపెట్టండని. 1913లో నిర్ణయించిన ప్యాకింగ్ మార్చి ప్లాస్టిక్ పౌచ్ లలో విక్రయించండి అంతర్జాతీయ కంపెనీలకు ధీటుగా అన్నా బి..వి.పురోహిత్ మనవలు (ప్రస్తుత యాజమాన్యం) వందఏళ్ల క్రితం తమ తాతగారు తయారు చేసిన పళ్లపొడిని మార్చడానికి ఇష్టపడట్లేదు. అలాగే పేపర్లో పళ్లపొడిని తయారుచేసేవారు అప్పటినుండి, ధనసంపాదనే మా లక్ష్యం కాదు పర్యావరణ పరిరక్షణ కూడా మా బాధ్యత అని జవాబుయిస్తారు ఇప్పటికీ.
ప్రస్తుత యాజమాన్యం చెప్పేది ఒక్కటే. ఫాషన్స్ మారతాయి, అభిరుచులు మారిపోతాయి కానీ ఒక వస్తువుకు మారుతున్న తరాలకు మన దేశ పురాతన శాస్త్రాల మీద అవగాహన పెంచాలిసిన అవసరం ఉంది , ఆయుర్వేదం గురించి తెలియాలిసిన అవసరం ఎంతో ఉంది, ఎందుకంటే శాస్త్రీయ పద్ధతుల్లో తయారు చేసిన వస్తువుల్లో ఎటువంటి రసాయనాలు కలపము, అందువల్ల వాడకందార్లకు ఇతరత్రా హాని కలగదు. ప్రకృతి సహజంగా లభించే మూలికలతో తయారయ్యే పళ్లపొడిని భావితరాల వారు ఆదరిస్తారు అన్న నమ్మకం ఉంది అంటారు.
ఒకప్పుడు ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చెయ్యమని సలహా ఇచ్చినవారు కంపెనీ ముందుచూపుకు మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆ సంస్థ ఇప్పటికీ ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ఎప్పుడో వాళ్ళ తాతగారు ప్యాకింగ్ చేసినట్టు.. పేపర్ కవర్లలోనే ప్యాక్ చేసి ఈ పళ్ళపొడిని అమ్ముతున్నారు.
ఈ మధ్యకాలంలో దేశం మొత్తం మీద ఆయుర్వేద ఔషదాలకు విశేష ఆదరణ ఉంది. ఇంకా పెరుగుతుంది అంటారు పురోహిత్ మనవలు.
తమ విస్తరణలో భాగంగా ఆన్లైన్ మార్కెట్ మీద దృష్టిసారించారు. అలాగే అమెరికా యూరోప్ మార్కెట్ల మీద పట్టుసాధించే ప్రయత్నంలో వున్నారు.



