బ్రాండ్ క్రియేషన్ లో ఆయనో లెజెండ్!

where ever you go our network follows అంటూ హచ్ కుక్క ఓ పిల్లవాడి వెనుకే ఫాలో అవ్వడం గుర్తుందా..? మనం ఓ క్రికెట్ మ్యాచునో, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమానో చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చే చాలా యాడ్స్ మనల్ని చికాకు పెడతాయి. ఆప్షన్ ఉంటే వెంటనే వాటిని స్కిప్ కూడా చేసేస్తాం. కానీ, మనుషుల్లేకుండా.. చిన్న చిన్న క్యూట్ జూజూ క్యారెక్టర్లనే స్నేహితులుగా, ప్రేమికులుగా, కుటుంబ సభ్యుల్లా మల్చిన అదే వొడాఫోన్ యాడ్ ను మాత్రం క్రికెట్ అంత ఇంట్రెస్ట్ గా చూసేశాం. అలా జనాల్ని ఉర్రూతలూగించిన యాడ్ గురువే పీయూష్ పాండే.

మనసును హత్తుకుంటేనే మెదట్లో పుట్టిన ఆలోచనకు విలువ. ఇదే ఆయన నమ్మకం.

వాణిజ్య ప్రకటనల రూపకల్పనలో ఆయనో మాయగాడు. వివిధ రంగాల్లో ఐకానికి ఫిగర్స్, సెలబ్రిటీలను ఎలా చెప్పుకుంటామో.. ఇండియన్ అడ్వర్టైజింగ్ రంగంలో ఆయనో ఐకాన్. ఆయన సృష్టించిన మ్యాజిక్ అడ్వర్టైజింగ్ రంగపు ఆనవాళ్లనే మార్చేసింది. ఆ రంగంలో పనిచేసే మరెందరికో సవాల్ గా నిల్చింది. ఆ పోటీని తట్టుకుని నిలబడాలంటే ఆ స్థాయిలో ఆలోచించగల్గాలి. అలాంటి అద్భుతమైన మేథోపరమైన పోటీకి వాణిజ్య ప్రకటనల రంగంలో తెరతీసిన లెజెండ్ పీయూష్ పాండే. ఫేస్ ఆఫ్ ది ఇండియన్ అడ్వర్టైజింగ్ పాండే.

కుచ్ కాస్ హై హమ్ సబీ మే.. కుచ్ బాత్ హై హమ్ సబీ మే.. అంటూ క్యాచీ లైన్స్ తో హ్యూమన్ ఎమోషన్స్ ని టచ్ చేశాడు. ఆయన తెరకెక్కించిన క్యాడ్ బరీ డెయిరీ మిల్క్ ప్రమోషన్ ఓ ఐకానిక్ అడ్వర్టైజ్మెంట్ గా నిల్చింది. భార్యభర్తల బంధం నుంచీ ఇద్దరు ప్రాణస్నేహితుల వరకూ.. ఒక దశలో సెటైరికల్ గా విడదీయలేని రాజకీయ బంధంతో ముడిపడ్డవాళ్లకు వర్తించేలా… ఫెవికాల్ కోసం ఆయన రూపొందించిన యే ఫెవికాల్ కా జోడా హై మరో అదిరిపోయే హిట్ యాడ్. ఓ ట్రక్కులో లెక్కకు మించిన జనాన్నెక్కించి.. దాని వెనుకభాగంలో ఫెవికాల్ ది అల్టిమేట్ అధేసివ్ అన్న సబ్ క్యాప్షన్ తో అవార్డ్ విన్నింగ్ యాడ్ ను క్రియేట్ చేసింది సృజనాత్మకమైన పీయూష్ పాండే అనే బుర్ర.

చలో మేరా లూనా అని ఆయన దృశ్యరూపంలో చిత్రీకరించిన తీరుతో లూనా మోపెడ్ అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి. టండా మతలబ్ కోకా కోలా అని ఆయన చూపిస్తే… యువత వేలంవెర్రిగా శీతలపానీయాలవైపు మళ్లారు. గూగ్లీ వూగ్లీ వూష్ అంటే పాండ్స్ క్రీమ్ ను అతివలు ఎగబడి కొన్నారు. హర్ ఘర్ కుచ్ కెహతాహై అంటూ ఏసియన్ పెయింట్స్ యాడ్ తో అడ్వర్టైజింగ్ రంగానికి కొత్త రంగులద్దారు.

ఏ కొత్త బ్రాండ్ ను అద్భుతంగా ప్రమోట్ చేయాలన్నా… ఏ కార్పోరేట్ సంస్థైనా పీయూష్ పాండే అనే క్రియేటివ్ జీనియస్ మాత్రమే కావాలనుకునేది. ఆయన సిగ్నేచర్ మార్క్ ఉంటే ఆ యాడ్ సూపర్ హిట్టయినైట్టే. అలాంటి వాణిజ్య ప్రకటనల రూపకల్పనలో అక్టోబర్ 24, 2025న.. పీయూష్ పాండే కన్నుమూతతో ఒక శూన్యత ఏర్పడింది.

ప్రజలతో మమేకమయ్యే ఏ రంగంలోనైనా జనం ఆలోచనలతో కనెక్ట్ కాగల్గాలి. వారిని ఆకట్టుకున్నప్పుడే నాల్గు కాలాలపాటు నిలవగలమని ఎరిగిన దార్శనికుడు పీయూష్ పాండే. సూక్ష్మంలో మోక్షాన్ని ఎలా చూపించాలో తెలిసిన నేర్పరి. అందుకే తాను రూపొందించిన ఏ యాడ్ నైనా ప్రజలకనుకూలమైన వారి స్థానిక భాషలో పలకరించి, వారి అటెన్షన్ ను తన యాడ్ వైపు డైవర్ట్ చేసేలా.. కేవలం ముప్పై, నలభై సెకన్లలో దృశ్యరూపంలో చెప్పగల్గాడు కాబట్టే ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ అడ్వర్టైజింగ్ గా పేరు సంపాదించాడు.

రాజస్థాన్ రాజధాని జైపూర్ ఆయన స్వస్థలం. 1955లో జన్మించిన పాండే.. 27 ఏళ్ల వయస్సులోనే ఒగిల్వీ అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఉద్యోగానికి కుదిరాడు. అప్పటివరకూ ఆంగ్లేయుల ఆధిపత్యంతో కనిపిస్తున్న వాణిజ్య ప్రకటనలను ఆమూలాగ్రం మార్చేసి కొత్తరూపునిచ్చాడు. చాలా క్రియేటివ్ గా డిజైన్ చేశాడే అనుకునే కన్నా… మనసు హత్తుకునేలా ఉంది అనిపించాలి. ఇదే పీయూష్ పాండే ఆలోచన. ఫెవికాల్ కోసం రూపొందించిన యాడ్ లో తన స్వస్థలమైన రాజస్థానీ నేపథ్యమైనా… మధ్యప్రదేశ్ టూరిజం కోసం తయారుచేసిన హిందుస్థాన్ కా దిల్ దేఖో ప్రకటనైనా భావుకతతో పాటు, ఆయా ప్రాంతాల నేటివిటీని ప్రతిబింబించేవి.

సన్ లైట్ డిటర్జెంట్ తో పీయూష్ పాండే అడ్వర్టైజింగ్ రూపకల్పన మొదలైంది. చాలా సాదాసీదాగా ఉంటూనే బలంగా నాటుకుపోయే చిన్న చిన్న కథలు, హత్తుకునే ఈడియమ్స్ తో ఆయన రూపొందించిన జింగిల్స్ అమితాదరణకు నోచుకున్నాయి. భారత్ లో ఆర్థిక సరళీకరణల కంటే ముందే ఆయన అడ్వర్టైజింగ్ రంగంలో ప్రయాణం ప్రారంభమైనా… నేటి మోబైల్ జనరేషన్ వరకూ ఆయన ఎప్పటికప్పుడూ తన యాడ్స్ రూపకల్పనలో అప్డేటెడ్ గా ఉండేవారు.

అడ్వర్టైజింగ్ రంగంలో ఆయన సేవలకుగాను 2016లో భారత ప్రభుత్వం పాండేను పద్మశ్రీతో సత్కరించింది.

భారతీయ రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగ ప్రముఖులెందరితోనూ ఆయనది విడదీయలేని బంధం. 2014 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ అబ్ కీ బార్ మోడీ సర్కార్ అనే ప్రచారంతో ముందుకొచ్చింది. ఆ నినాదం కూడా పీయూష్ పాండేదేనంటూ మోడీ తన X ఖాతాలో పేర్కొంటూ నివాళులర్పించారు. సునిశితమైన హాస్యచతురతతో ఆయన రూపొందించిన అడ్వర్టైజ్మెంట్స్ ను తల్చుకుంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వంటివారు ఆయన్ను తల్చుకున్నారు.

ప్రకటనలకు స్థానికత అనే ఓ కొత్త ఫ్లేవర్ అద్ది అడ్వర్టైజింగ్ రంగానికే పితామహుడనిపించుకున్నవాడు పాండే అంటాడు.. భారతీయ అడ్వర్టైజింగ్ రంగంలో మరో టాప్ మోస్ట్ లీడర్ గా ఎదిగిన ప్రహ్లాద్ కక్కర్.

పీయూష్ పాండే ఎంట్రీ వరకూ కూడా భారతీయ అడ్వర్టైజ్ రంగంలో ఆంగ్లం ఎత్తిపోతలే తప్ప.. స్థానిక భాషకు చోటుండేది కాదు. కానీ, అలాంటి రెండో స్థానంతో సరిపెట్టిన స్థానిక భాషకు ప్రథమ ప్రాధాన్యత కల్పించిన బ్రాండ్ ఎక్స్పర్ట్ పీయూష్ పాండే.

వీక్షకుల భావోద్వేగాలను తన ప్రకటనలవైపు ఎలా మళ్లించాలో తెలిసిన గొప్ప బ్రెయిన్ పాండే. క్రికెట్ మైదానంలో ఆటగాడు సిక్స్ బాదాక క్యాడ్ బరీ తింటున్న అమ్మాయి గ్రౌండ్ లోకి డ్యాన్స్ చేస్తూ పరిగెత్తే ఆ దృశ్య చిత్రీకరణ వీక్షకుల హృదయాలను హత్తుకుంది. అందుకే, ఇప్పటికీ ఆ డెయిరీ మిల్క్ యాడ్ చిరస్థాయిగా నిల్చిపోయింది.

ఆయనతో యాడ్స్ రూపొందించుకున్న ఆసియన్ పెయింట్స్ నుంచి, ఫెవికాల్ వంటి సంస్థల వరకూ అన్నీ పాండేకు ఘన నివాళులర్పించాయి. ఫెవికాల్ సంస్థైతే.. ఆయన్ను భారతీయ సాంస్కృతిక భావాలను చిరునవ్వులతో చెక్కిన సృష్టికర్తగా పేర్కొంది.

పీయూష్ జర్నీ వాణిజ్య ప్రకటనలకే పరిమితమైనదేం కాదు.. సామాజిక ప్రకటనల్లోనూ ఆయనది దేశం గుర్తుంచుకునే భాగస్వామ్యం. పోలియో వ్యాప్తి నిరోధకతకు అమితాబ్ తో ప్రచారం నుంచి.. మిలే సుర్ మేరా తుమ్హారా వంటి దేశ సమైక్యతా గీత రూపకల్పన వరకు పీయూష్ పాండే అడుగడుగునా తల్చుకునే సృజనశీలి.

తన కుటుంబంతో కలిసి చూసేలా లేని ప్రకటనను తానెన్నడూ చేయనని ప్రకటించి.. వెగటుకు, అశ్లీలతకు తావు లేకుండా వాణిజ్య ప్రకటనలకు డిమాండ్ సృష్టించారు పాండే.

ఆయన మరణంతో ఇండియన్ అడ్వర్టైటింగ్ రంగంలో ఒక శూన్యత ఏర్పడిందన్నది నిజం. దాన్ని భర్తీ చేయడమూ అసాధ్యమే. అయితే, ఆయన స్ఫూర్తి, ప్రభావం మాత్రం అడ్వర్టైజింగ్ రంగంపై ప్రసరిస్తూనే ఉంటాయి.

ప్రపంచాన్ని కృత్రిమ మేథ శాసిస్తున్న రోజుల్లోనూ పీయూష్ క్రియేషన్స్ మర్చిపోలేనంత ప్రభావాన్ని ముద్ర వేశాయి. సాంకేతికత ఎన్నిటికీ మానవ కల్పనాశక్తిని చెరిపివేయలేదనేది నిరూపించి వెళ్లిపోయిన వ్యక్తి పీయూష్ పాండే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles