సుద్దసుద్ది

ఊర్లల్ల ఎండల్ల చేసుకునే పనులల్ల
సుద్ద తవ్వుకచ్చుడు తప్పకుంట చేసేపని.
ఊరికోతీరు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క శివారుకు
సుద్దకట్టు భూములు, పాతబాయిలు, వందుర్లు,
ఒర్రెగడ్డలకు, కాలువగడ్డలకు, పాతబాయిబొందలకు
ఎక్కడ సుద్దదేలిందంటే అక్కడికి సుద్దకు పోవుడుండేది.
ఎన్కట ఏడుమోటలబాయిలు, ఐదుమోటలబాయిలు
ఊరెలుపు ఊరెలుపు పాడువడ్డబాయిలుంటుండె గద,
అటువంటి బాయిబొందల అంచులకు సుద్దగడ్డ తేలేది.
బక్కర్యాగడి భూములల్లవారే వొర్రెగడ్డలకూ సుద్ద తేలేది.
మా అమ్మగారి ఊర్ల ఊరచెరువు ఒర్రెగడ్డలకు సుద్దతేలితే,
మా ఊర్ల పెద్దకాలువ గడ్డలకు, వంకమోతుకు సుద్దదొరికేది.
రేపు సుద్దకు పోదామనానుల్లా అనుకోని ముగ్గురునల్గురు
ఆడోళ్లు సల్లవూటనే పొద్దుపొద్దుగాల సుద్దకు బైలెల్లెటోళ్లు.
తవ్వంతపిల్ల వుంటె తల్లికి ఆసర అని శాత్రం చెప్పినట్టుగ
వాళ్లెంబడి జోజోటమోలె బడిపిల్లలనుగూడ తీస్కపోదురు.
ఎండకాలంల చెల్కమీద మనుషుల పొలిపిరి వుండదాయె,
పిల్లలు ఎంబడివుంటే ఆ అలికిడి తెల్లగోలు వేరేవుంటదిగద.
ఓ చిన్నగడ్డపార, కొంకనో కొడవలో, ఒకటిరెండు అంచెలు
ఎండకాలం దూపకోర్వరాదు గనుక పెద్దసర్వల మంచినీళ్లు
ఇవ్వన్నివట్టుకోని బిలబిలమని పొలుమారుమీదికి పోతాంటె
పిల్లగండ్లకయితే, కొత్తగ రెక్కలచ్చినట్టు వశపడని సంబురమే.
ఎగిరినంత దుంకినంత ఒర్రినంత బొర్రినంత ఆడినంత మాపి.
పనితక్కువ ఒర్రుడెక్కువ, సగంనీళ్లు ఖతంజేసుడే పిల్లగండ్లపని.
పెద్దోళ్లంతా చాయజూసి, ఇదివరకు తవ్వుకపొయిన బొందలకు
సరిసెన గెలికి తవ్వుకుంట మంచి సుద్దకోసం ఎన్కులాడుదురు.
కొన్నిసార్లు తవ్వెడుసుద్దకే సుద్దగడ్డ తేలిపోతుండేది. కొన్నిసార్లు
ఇరుసమూడుగుంచాల సుద్దతవ్వినాగుడ తవ్వినకొద్ది ఎల్తుండే.
తడితడిగ, మెత్తగ, కొద్దిగ పేలిపేనరంగుల దొరికేసుద్ద, చక్కదనం.
తవ్విన సుద్ద అంచెలు నింపుకోని, వొర్రెగఢ్డలకు ఈతపండ్లేరుకోని
అయిన్ని నీళ్లు తలోబొట్టు తాగి అంబటాల్లకు ఊరుతొవ్వదొక్కేది.
తెచ్చిన సుద్ద, వాకిట్ల నున్నటిజాగల ఓ రెండురోజులు ఎండవోసి,
చేబండవట్టి గడ్డలుబెడ్డలు నలుగ్గొట్టి, రాళ్లురప్పలుంటే ఏరిపారేసి,
మల్లోపూట కలెండినంక, తాత్పరంగ నూకలజల్లెడతోటి జలెవట్టి,
మెత్తగ తెల్లగ ధగధగ మెరిసే సుద్ద, పెద్దకాగుల నింపి దాచిపెట్టేది.
వానకాలపు ముసుర్లకు తడిదాకి మెత్తవడ్డ సుద్ద, జరజర జారది,
సుద్దచిప్ప పొయికాడికి తీస్కపొయి రెండు నిప్పుకలువేసి బొర్లిచ్చి
కొద్దిసేపు సుద్దను కాపుడంబెడితే,మల్ల తెల్లతెల్లగ మల్లెపువులెక్క
మెరుపులు మెరిసి, ముట్టుకుంటె వేళ్లసందునుంచి పట్టుజారినట్టు
జలజలజారి,పెద్దరువాజకెదురుంగ పచ్చటివాకిట్ల వెండితీగయేది.
ఇగురం తక్కువ ఈరక్కలు, ఆర్నెల్లకే తెచ్చిన సుద్దంత ఖతంజేసి
సుద్దకు ఇంట్లపొంట తిరుగుడుగుడ, యాదిజేసుకోవల్సిన మాటే.
మలినంలేని తెలుపుగనుక వెన్నపూస అన్నట్టే సుద్దపూస అంటరు.
ఈ తెల్లసుద్దపూసనే మనభాషల జాతీయంగసుత నిలిచిపోయింది.
ఎండల్ల నల్లపూసైతెదప్ప, సుద్దపూస ఏడాదిపొద్దు పువ్వైపూయది.
ఇదుల్లా.. ఒకనాటి తెలంగాణ పల్లెలల్ల సుద్ద తవ్వుకచ్చుకునే తీరు.
ఇది… మన పల్లెపని – ఇల్లిరువాటు ముచ్చట !
డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి.. ✍🏻 (తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్, కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల)



