బయో విలేజ్ 2.0.. దస్పరా ఇప్పుడో కొత్త బంగారులోకం!

ఆ గ్రామం ఇప్పుడో కొత్త బంగారు లోకం. నవశకానికి నాంది. 64 కుటుంబాలు కలిసి సృష్టించిన ఓ బయో విలేజ్ కథ ఇది.

త్రిపురలోని దస్పరా బయో విలేజ్ 2.O… గ్రామీణ సుస్థిరాభివృద్ధికి ఓ కేరాఫ్. పునరుత్పాద శక్తి వినియోగానికి ఓ చిరునామా. మెరుగైన వ్యవసాయ ఉత్పాదకతతో సామూహిక అభివృద్ధితో క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ గా మరెన్నో భారతీయ గ్రామాలకు ఆదర్శం.

సిపాహిజాలా జిల్లాలోకి అడుగెట్టి దస్పరా ఎక్కడుంది అంటే గతంలో చెప్పేవారో, లేరోగానీ… ఇప్పుడెవ్వరైనా ఠకీమని అడ్రస్ చెప్పగలరు. ఎందుకంటే స్వయం సమృద్ధితో పర్యావరణ హితంగా ఎదిగి.. ఆర్థిక పరిపుష్ఠిని సంపాదించుకున్న గ్రామంగా దస్పరా ఇప్పుడు పాప్యురల్.

తొలి స్వయం సమృద్ధ గ్రామంగా దస్పరా!

దస్పరా అనూహ్యమార్పుకు అక్కడి ప్రజల ఆలోచనలతో పాటు.. అక్కడి ప్రభుత్వం చూపిన చొరవ కారణమైంది. బయో విలేజ్ 2.O సృష్టి వెనుక త్రిపుర బయోటెక్నాలజీ డైరెక్టరేట్ మస్తిష్కముంది. పునరుత్పాదక శక్తి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం.. పర్యావరణ హిత వ్యవసాయ పద్ధతులను అవలంబించడం… గ్రామం మొత్తాన్నీ సుస్థిరమైన జీవనశైలికి కేరాఫ్ గా మార్చడం.. ఇవీ బయో విలేజ్ 2.O లక్ష్యాలు.

అసలు బయో విలేజ్ 2.O ఆలోచనకు కారణం..?

2018లో మొదట ఈ బయో విలేజ్ 2.Oకు బీజం పడింది. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా మొదటి అడుగు పడింది. తర్వాత మారుతున్న కాలానికనుగుణంగా.. వాతావరణ పరిస్థితులకూలంగా కొత్త సాంకేతిక పరిష్కారాలను కనుగొంటూ ఆ అడుగులు మరింత ముందుకు పడ్డాయి. మేలైన పశుజాతిని గ్రామంలో పెంచుకోవడం, సౌరశక్తి ఆధారిత పరికరాలతో సాంకేతికతను వాడుకోవడం, బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం వంటివాటితో.. దస్పరా నివాసితులు సుస్థిర వ్యవసాయం వైపు అడుగులేశారు.

వ్యవసాయమే జీవనాధారం!

దస్పరా ప్రజల్లో 75 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. మరికొందరు చేపల పెంపకంపై ఆధారపడేవారు. దస్పరా బయో విలేజ్ 2.Oగా మారాక ఇక్కడివారు రసాయన ఎరువులు, ఫాజిల్ ఇంధనాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు. సేంద్రీయ ఎరువులపైనే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ వ్యవసాయం నడుస్తోంది. ఫలితంగా నేలలు సారవంతమయ్యాయి. పంటల దిగుబడులు పెరిగాయి. వాతావరణ కాలుష్యం తగ్గింది. భూగర్భజలాలు పెరిగాయి. కాంటామినేటెడ్ వాటర్ సమస్య లేకుండా పోయింది. ఎనర్జీ ఎఫీషియెంట్ గృహపకరణాలతో కరెంట్ ఆదా చేస్తున్నారు. దాంతో పాటే టెంపరేచర్ సమస్యలకు తగ్గట్టుగా పనిచేయడంతో హైవోల్టేజ్, లో వోల్టేజ్ సమస్యలూ తప్పాయి. వీటన్నింటి ఫలితంగా దస్పరా ప్రజల జీవన ప్రమాణాలూ కూడా అందుకు అనులోమానుపాతంలో పెరగడంతో ఈ బయో విలేజ్ 2.O ఇప్పుడో సక్సెస్ స్టోరీ అయ్యింది.

బయోగ్యాస్ వంటకు ప్రత్యామ్నాయ ఇంధనమవ్వడమే కాకుండా.. కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తోంది. సౌరశక్తితో నడిచే పంపులు నీటిపారుదల వ్యవస్థకు చోదకమవుతున్నాయి. ఎనర్జీ ఎఫీషియెంట్ గృహోపకరణాలు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తున్నాయి.

ఇప్పుడు దస్పరా ఓ రిచ్ విలేజ్!

బయో విలేజ్ 2.Oగా రూపాంతరం చెందాక ఇప్పుడు ఇక్కడి సేంద్రీయ పంటలకు అధిక లాభాలు వస్తున్నాయి, సుస్థిర వ్యవసాయ పద్ధతుల వల్ల ఉత్పాదకత పెరగడంతో పాటు.. సారవంతమైన నేలల్లో ప్రకృతి సిద్ధంగా పండే పంటలు కావడంతో మార్కెట్ లో రేటు అధికంగా పలుకుతోంది. దీంతో కుటుంబాల ఆదాయాలు కూడా పెరిగాయి. గతం కంటే కూడా ప్రతీ కుటుంబం ప్రతీ నెలా కనీసం ఐదువేల నుంచి పదిహేను వేల వరకూ అదనంగా సంపాదించుకుంటోంది.

ఈ ప్రాజెక్టుతో ఆహరభద్రతను పెంచింది. బలహీనవర్గాలకు ఉపాధి అవకాశాలను కల్పించింది. రైతులు కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నారు, మశ్రూమ్ సాగు, తేనెటీగల పెంపకం, బయో కంపోస్టింగ్ వంటి సంప్రదాయేతర వ్యవసాయ విధానాల వల్ల వీరికి ఈ భిన్నమార్గాలు అదనపు ఆదాయం సమకూరుస్తున్నాయి. అదే సమయంలో సంప్రదాయ వ్యవసాయంపైన ఆధారపడటమూ తగ్గిపోయింది.

ప్రపంచస్థాయి గుర్తింపు!

దస్పరా పేరు మార్మోగడం ఇప్పుడు భారత్ కు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. అంతర్జాతీయ సంస్థలు దస్పరా బయో విలేజ్ 2.O విధానాల్ని కొనియాడుతున్నాయి. లండన్ కు చెందిన క్లైమేట్ గ్రూప్ అనే ఎన్జీవో సంస్థ.. దస్పరా అవలంబించిన పర్యావరణ హిత సాంకేతికతను ప్రపంచంలోని 10 ఉత్తమ పద్ధతుల్లో ఒకటిగా గుర్తించింది. ఇక్కడి విధానాల వల్ల దస్పరా ఇప్పుడు సుస్థిరాభివృద్ధి, వాతావరణ మార్పుల నిరోధకత, గ్రామీణ పేదరిక నిర్మూలన వంటి ఎన్నో అంశాల్లో గ్లోబల్ మాడల్ గా నిలుస్తోంది.

దస్పరా ఇచ్చిన విజయం ప్రేరణగా మారి.. త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం మరో వంద గ్రామాలను బయో విలేజెస్ గా మార్చే ఓ కార్యాచరణను ముందుకు తెచ్చింది. ఇప్పటికే మరో పది గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దస్పరా సమగ్ర విధానాలు దీర్ఘకాలిక సుస్థిర ఫలితాలను సాధించడానికి తోడ్పడుతున్నట్టు అక్కడి ప్రభుత్వం గుర్తించింది. బయో విలేజెస్ అభివృద్ధిపై మరింత ఫోకస్ చేసింది.

గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని గాంధీ చెప్పినట్టు త్రిపుర రాష్ట్రంలోని దస్పరా విలేజ్… బయో విలేజ్ 2.O ప్రాజెక్టులో భాగంగా మారుతున్న కాలానికి తగ్గ సాంకేతికతను అందిపుచ్చుకుని సుస్థిర పద్ధతులను అవలంబిస్తోంది. ప్రభుత్వాలు గ్రామీణ భారతంపై దృష్టి సారించి కాసింత మెళకువలు నేర్పిస్తే.. ఒక అద్భుతమైన సమాజాన్నీ.. కొత్త బంగారు లోకాన్ని ఎలా సృష్టించవచ్చో దస్పరా ఇప్పుడో ఉదాహరణగా నిలుస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles