బీహార్ లో.. ఆయనే కాంగ్రెస్ చివరి సీఎం!

బీహార్ ఎన్నికలపై ఆసక్తి నెలకొన్న వేళ… ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ తన ఉనికిని చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ సుమారు మూడున్నర దశాబ్దాల నుంచి అక్కడ అధికారానికి పూర్తిగా దూరమైపోయింది. ఆ పార్టీ అంతర్గత కలహాలు.. నాయకుల స్వయంకృతాపరాధం ఆ పార్టీని గత 35 ఏళ్లుగా నామరూపాల్లేకుండా చేసింది. అందుకు తనవంతు బాధ్యత వహించినవారిలో.. మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాదీ ప్రత్యేక స్థానం. మరి సీఎం పీఠంపై ఆయన ప్రయాణం ఎలా సాగిందో కాస్త తెలుసుకుందాం.

1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సుస్పష్టమైన మెజార్టీ సాధించి అధికారంలోకొచ్చింది. అలా అధికారంలోకి రావడానికి అందుకు అంతకుముందున్న అస్థిరమైన ప్రభుత్వాలను తూర్పారబడుతూ.. సుస్థిరమైన పాలనందిస్తామంటూ హామీలు గుప్పించింది కాంగ్రెస్. కానీ, అధికారంలోకొచ్చాక అస్థిర రాజకీయాలకు కేరాఫ్ అంటేనే కాంగ్రెస్ అనేలా పరిస్థితులు మారిపోయాయి.

1975, జనవరి 2వ తేదీన సమస్తీపూర్ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన బాంబు పేలుడులో కేంద్రమంత్రిగా పనిచేసిన, శక్తివంతమైన కాంగ్రెస్ నాయకుడు లలిత్ నారాయణ్ మిశ్రా అసువులుబాసాడు. కేదార్ పాండే, అబ్దుల్ గఫూర్ ప్రభుత్వాల వెనుక కూడా ఆయనే కీలక చోదకశక్తిగా పనిచేశారు. అయితే, అదే సమయంలో వారిని అధికారం నుంచి దూరం చేయడంలోనూ లలిత్ నారాయణ్ మిశ్రా పాత్ర ఉంది. అప్పుడప్పుడే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, అస్థిర విధానాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మరోవైపు ఎమర్జెన్సీ కాలం. ఆ సమయంలో ఇందిరాగాంధీకి బీహార్ లో ఓ కొత్త ఫేస్ కావల్సి వచ్చింది.

చాలామందిపైన అభిప్రాయ సేకరణ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేదార్ పాండే, అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన హరినాథ్ మిశ్రా, బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న సీతారాం కేసరి ఇలా ఎందరి పేర్లో చర్చకొచ్చాయి. కానీ, వారెవ్వరూ కాకుండా సరిగ్గా ఎమర్జెన్సీ చీకటి రోజులు నడుస్తున్న కాలంలో.. 1975, ఏప్రిల్ 6వ తేదీన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లలిత్ నారాయణ్ మిశ్రా తమ్ముడైన జగన్నాథ్ మిశ్రాను తమ నాయకుడిగా ఎన్నుకుంది. ఐదురోజులు తిరిగేసరికి.. 1975, ఏప్రిల్ 11వ తేదీన 38 ఏళ్ల వయస్సులోనే జగన్నాథ్ మిశ్రా బీహార్ 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. బీహార్ చరిత్రలోనే అప్పటికి తనే అత్యంత పిన్నవయస్కుడైన రెండో సీఎం. అంతకుముందు 32 ఏళ్ల వయస్సుకే కేవలం ఫైవ్ డేస్ ముఖ్యమంత్రిగా ఆ రికార్డ్ సతీష్ ప్రసాద్ అనే సీఎం పేరిట ఉంది.

జగన్నాథ్ మిశ్రా అర్హతలేంటి..?

మిశ్రా అర్హతలు సాధారణమైనవే అయినప్పటికీ.. తను బలమైన నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. ముజఫర్‌పూర్‌లోని బీహార్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశాడు.1968లో శాసన మండలికి ఎన్నికయ్యాడు. 1972 వరకు ఎమ్మెల్సీగా కొనసాగి.. అదే ఏడాది మధ్యంతర ఎన్నికల్లో ఝాంఝర్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. బీహార్ లో నెలకొన్న అంతర్గత కలహాలు, ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో జగన్నాథ్ మిశ్రా అయితే సుస్థిరమైన పాలన ఇవ్వగలడన్న నమ్మకాన్ని కాంగ్రెస్ హైకమాండ్ లో, ముఖ్యంగా ఇందిరాగాంధీలో కల్పించాడు.

అయితే, జగన్నాథ్ మిశ్రా పాలన మొదటి పర్యాయం రెండేళ్లే సాగింది. ఎమర్జెన్సీ ఎఫెక్ట్ తో అధికారమంతా కేంద్రం చేతికి తీసుకోవడంతో… బీహార్ ఆంక్షలకు ప్రయోగశాలలా మారిపోయింది. అదే సమయంలో పత్రికలపై నిషేధం, బలవంతపు శస్త్రచికిత్సలు, ప్రతిపక్ష నాయకుల ఇష్టారీతి అరెస్టులు వంటివి కాంగ్రెస్ కు చెడ్డ పేరు తేవడంతో పాటు.. జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం కూడా బీహార్ లోనే ప్రభావవంతంగా కనిపించడంతో కాంగ్రెస్ తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ వ్యతిరేకతను ఎదుర్కోవడంలో జగన్నాథ్ మిశ్రా విఫలమయ్యాడు. ఆ తర్వాత 1977 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకొచ్చింది. అదే ఏడాది ఏప్రిల్ 30వ తేదీన 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించగా.. అందులో బీహార్ కూడా ఒకటి. దాంతో మిశ్రా అధికారంకు దూరమయ్యాడు.

ఆ తర్వాత 1977 జూన్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కేవలం 57 సీట్లు మాత్రమే గెల్చుకుంది. జనతా పార్టీ 214 సీట్లతో అసెంబ్లీలోనూ భారీ విజయాన్నందుకుంది. 1978లో మిశ్రా ప్రతిపక్ష నాయకుడయ్యాడు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు మిశ్రా తీవ్రంగా యత్నించాడు. 1980లో ఇందిర తిరిగి ప్రధాని అయ్యాక.. కాంగ్రెసేతర ప్రభుత్వాలను రద్దు చేసింది. అలా తిరిగి 1980లో జరిగిన ఎన్నికల్లో 324 సీట్లకుగాను.. 169 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. మళ్లీ మిశ్రా రెండోసారి ముఖ్యమంత్రయ్యాడు.

పార్టీ, ప్రభుత్వం రెండింటిపై పట్టు సాధించిన మిశ్రా!

ఇక అప్పటికే ఇందిర నచ్చిన, మెచ్చిన నాయకుడిగా మిశ్రాకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. దాంతో ముఖ్యమంత్రిగా ప్రభుత్వంతో పాటు.. పార్టీపైనా గట్టి పట్టు సంపాదించాడు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఆది నుంచీ ప్రాంతీయ నాయకులను బలపడకుండా చూడటంలో దిట్ట అని.. అందుకే, తరచూ అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులను మార్చేదనే అపవాదను మూటగట్టుకుంది. అందులో బీహార్ ఏం మినహాయింపు కాదు.

1982 జూలై 31వ తేదీన బీహార్ ప్రెస్ బిల్లు అనే అత్యంత వివాదాస్పద బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో మిశ్రా ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించబడ్డ ఆ బిల్లుతో రాష్ట్రమంతా నిరసనలతో అట్టుడికింది. ఆ తర్వాత 1983లో ఆ బిల్లును వెనక్కి తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితేర్పడింది. మరోవైపు, 1983లో మిశ్రా బాహాటంగానే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కారుపై చేస్తున్న వ్యాఖ్యలతో హైకమాండ్ మిశ్రా విషయంలో పునరాలోచనలో పడింది. రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అధిష్ఠానం 1983 ఆగస్ట్ 11న ఆయన్ను ఢిల్లీకి పిలిపించి రాజీనామా చేయించింది. అలా జగన్నాథ్ మిశ్రా దిగిపోవడంతో.. చంద్రశేఖర్ సింగ్ కొత్త సీఎంగా గద్దెనెక్కాడు.

గద్దె దిగినా తగ్గని మిశ్రా ఛరిష్మా!

సీఎం పీఠం పైనుంచి గద్దె దిగినా.. మిశ్రా ప్రభావం మాత్రం బీహార్ లో కొనసాగింది. 1984లో ఇందిర హత్య తర్వాత రాజీవ్ ప్రధాని అయ్యాక.. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ 196 సీట్ల భారీ మెజార్టీని సాధించింది. కానీ, ఎందుకో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని నడిపించడంలోనూ.. పార్టీని నడపడంలోనూ సుస్థిరమైన విధానాలు కనబర్చలేదు. దాంతో వరుసగా బిందేశ్వరీ దూబే, భగవత్ ఝా ఆజాద్, సత్యేంద్ర నారాయణ్ సిన్హా ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చాల్సి వచ్చింది.

1989 తర్వాత పల్చబడ్డ కాంగ్రెస్ పరపతి!

1990 ఎన్నికల వరకు ఇక కాంగ్రెస్ పై పెరిగిన వ్యతిరేకత ఆ పార్టీని ఏం చేసినా గెలిపించే పరిస్థితుల్లేకుండా చేసింది. వీ.పీ. సింగ్ నేతృత్వంలో బోఫోర్స్ కుంభకోణంపై ధ్వజమెత్తడంతో అది కాంగ్రెస్ కు ఎదురుదెబ్బగా మారింది. అప్పుడు వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ మంచి ఊపును కొనసాగిస్తున్నారు. 1989లో అత్యవసర పరిస్థితుల్లో కాంగ్రెస్ హై కమాండ్ మిశ్రాను మూడో పర్యాయం కూడా ముఖ్యమంత్రిగా నియమించింది. ముస్లిం మైనార్టీల మద్దతు కోసం ఆయన చేసిన ప్రయత్నాలకు.. మౌలానా మిశ్రా అనే పేరు మూటగట్టుకున్నాడు. కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కూడా ఆ పార్టీనిక కాపాడలేకపోయాయి. దాంతో 1990లో కొత్త శకం ప్రారంభమైంది. మార్చ్ 10వ తేదీన లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాడు. ఇక అక్కడితో బీహార్ లో కాంగ్రెస్ పాలనకు ఫుల్ స్టాప్ పడింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఇప్పటివరకూ కూడా తిరిగి సొంతంగా అధికారంలోకి రాలేకపోయింది.

మిశ్రా 1990లో కూడా ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్ష నాయకుడయ్యాడు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా నామినేటై.. పీవీ హయాంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశాడు. జ్యోతిష్యంతో పాటు.. తాంత్రిక విద్యలపైన కూడా మిశ్రాకు అపారమైన నమ్మకముండేది. రాజకీయ సంక్షోభాల సమయంలో తాంత్రిక విద్యలు తెలిసిన మంత్రగాళ్లను సంప్రదించేవారనీ చెబుతుంటారు.

అయితే పశువుల దాణా కుంభకోణంలో (ఫోడర్ స్కామ్) లో కూడా మిశ్రా దోషిగా తేలాడు. జైలు శిక్షననుభవించిన ఆయన ఆ తర్వాత అనారోగ్య కారణాలతో బెయిల్ పై విడుదలయ్యారు. 2019, నవంబర్ లో 83 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.

జగన్నాథ్ మిశ్రా రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు నితీష్ మిశ్రా ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నారు. ఆయన ఝంఝర్పూర్ నుంచి మూడుసార్లు జేడీయూ టికెట్ పై గెల్చారు. 2024లో బీజేపీలో చేరి.. నితీష్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం 20025 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles