తెలంగాణా సలీం అలీ.. దుశర్ల!
…………………………………………………………………………………………………………….
Gopalakrishna Cheraku…✍
సలీం అలీ అనే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. రోబో 2.0లోని పక్షి ప్రేమికుడి పాత్రకు స్ఫూర్తి. ఈ విషయాన్ని రచయిత జయమోహనే వెల్లడించారు. ప్రఖ్యాత విహంగశాస్త్ర (ఆర్నిథాలజీ) నిపుణుడైన సలీం అలీ.. రాజస్థాన్ లోని భరత్ పూర్ లో తొలి పక్షుల అభయారణ్యాన్ని నెలకొల్పి భరత్ పూర్ ను పక్షుల వేదికగా మార్చాడు. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ఏర్పాటులో కీలక భూమిక పోషించాడు. సలీం అలీ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఆ పాత్ర ఇన్స్పిరేషన్ తో.. ఈ సాంకేతిక యుగంలో.. ఇంకాస్త టెక్నాలజీ జోడించి తీసిందే రోబో 2.O.
అయ్యో పక్షులింత క్షోభకు గురవుతున్నాయా.. పక్షులు లేకపోవడం వల్ల ఇన్ని అనర్థాలు కూడా ఉంటాయా..? అని ఎంతో కొంత మానవ సమాజాన్ని ఆలోచింపజేసే పాత్ర.. రోబో 2.౦. కాకాపోతే థీమ్ కంటే ఎక్కువ శంకర్ సినిమాలో టెక్నాలజీనే ఎప్పటిలా డామినేట్ చేస్తుంది.
ఇదంతా ఎందుకంటే ఒక సలీం అలీ రోబో 2.Oకు ఎలా ఐతే ప్రేరణయ్యాడో.. అలా రోబో 2.Oలోని పక్షిరాజును ఇప్పుడు మనం తెలంగాణాలోనే చూడొచ్చు. వారసత్వంగా తనకు సంక్రమించిన ఆస్తులను కూడా పక్షులకు, అటవీ జంతువులకు అంకితం చేసిన జీవ ప్రేమికుడు కాబట్టే.. మన దుశర్ల సత్యనారాయణ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది కూడా.

సూర్యాపేట జిల్లా రాఘవాపూర్ కు చెందిన సత్యనారాయణ.. తన ఆస్తిగా సంక్రమించిన 70 ఎకరాల భూమిని అడవిగా మార్చేశాడు. పక్షులకు, జంతువులకు ఆహారాన్నందిస్తున్నాడు. బాపూ తీసిన లవకుశ సినిమాలో గ్రాఫిక్స్ లో చూపించిన ఆ పచ్చని అటవీ ప్రాంతం.. దుశర్ల సత్యనారాయణ శ్రద్ధతో నాటిన అడవేనంటే నమ్మగలరా..? ఆ అడవిలో అడుగుపెట్టగానే స్వేచ్ఛగా ఎగిరే పక్షుల ఆనంద కిలకిలారావాలు… పరుగులు పెడుతున్న జింకల గెంతుల దృశ్యాలు… పురి విప్పి ఆడే నెమళ్ల నాట్యరీతులు.. గువ్వపిట్టల కిచకిచలతో పాటు.. విషసర్పాలు, ముంగిసలు, పెద్దపిట్టలు, వలస పక్షులు, కొంగలు.. ఇలా ఎన్నో రకాల జీవజాతులు మనకు గొప్ప అనుభూతిని కల్గిస్తాయి.
సత్యనారాయణ వంటివారు లేరని కాదు.. కానీ, వారందరిలోకి ఈ దుశర్ల మాత్రం ఇంకొంచెం స్పెషల్. 70 ఎకరాల్లో పండ్ల చెట్లు.. నీటి కొలను ఏర్పాటు చేసిన సత్యనారాయణ… ఈ అడవిలో పండే ఏ ఒక్క పంటనుగానీ.. పండ్లనుగానీ మనుషులు తినేందుకు ససేమిరా అంటాడు. ఎందుకంటే ఆ పంటైనా, పండ్లైనా.. సత్యనారాయణ ఇంత శ్రద్ధతో పండిస్తోంది కేవలం పక్షులు, జంతువుల కోసం మాత్రమే! అవి వాటికి మాత్రమే దక్కేలా నిత్యం కాపలా కాస్తూనే ఉంటాడు. ఇంటి పెరట్లల్లోనే ఓ రెండు జామ చెట్లుంటే.. వచ్చిపోయేవాళ్ళు ఆ పండ్లని అడిగి కొందరు… దొంగతనంగా కొందరు తినడం సర్వసాధారణం. అలాంటిది 70 ఎకరాల్లో సీతాఫలాలు, జామకాయల వంటి చాలా సీజనల్ ఫ్రూట్స్ పండిస్తున్నా… కనీసం తాను ఒక్క పండు కూడా ముట్టకుండా ఉండటంతో పాటు.. ఇంకెవర్నీ ముట్టనివ్వకపోవడమంటే.. ఎంతో శ్రద్ధ కావాలి. కావలుండాలి. అవి పశు, పక్షాదులకు మాత్రమే అందేలా చేయాలన్న సత్యనారాయణ తపనే.. ఈ అడవిని వన్యప్రాణులు, పక్షుల ఆవాసంగా, ఆహార కేంద్రంగా చేసింది.
సత్యనారాయణ పక్షులను, జంతువులను ఇంతలా ప్రేమిస్తున్నాడు కాబట్టే.. ఈయన పెంచిన ఈ 70 ఎకరాల అడవిలో.. వేల సంఖ్యలో పక్షులిప్పుడు గూళ్లు కట్టుకున్నాయి. సాంకేతికత పేరుతో వెలసిన టవర్లతో కనిపించకుండా పోయిన పిచ్ఛుక గూళ్లన్నీ ఇప్పుడు సత్యనారాయణ స్థాపించిన అటవీ ప్రాంతంలో దర్శనమిస్తాయి. జింకలు, తాబేళ్లు, కుందేళ్లు ఇలా చాలా రకాల అటవీ జంతువులు సంతానోత్పత్తి చేస్తున్నాయి. ప్రకృతి సమతుల్యత కోసం.. మన తెలంగాణావాసి సత్యనారాయణ చేస్తున్న కృషి అభినందనలందుకుంటోంది.
కాస్త భూమి ఉంటే చాలు.. రియల్ ఎస్టేట్ వెంచర్లుగా… అపార్ట్మెంట్ లుగా మార్చి బిజినెస్ చేసేవారు కొల్లలు. కానీ సత్యనారాయణ అందుకు పూర్తి భిన్నం. ఇలాంటి పక్షిరాజ్ లు దేశంలో అరుదుగా కనిపిస్తుంటారు. ఇలాంటి వన్యప్రాణి ప్రేమికులు ఎక్కడో వేళ్ల మీద లెక్కించేలా మాత్రమే తారసపడుతారు. స్వతహాగా పక్షి ప్రేమికుడు, వన్యప్రాణుల ప్రియుడైన సత్యనారాయణ.. దక్షిణ తెలంగాణలో నీటి వసతులు కల్పించేందుకు ఉద్యమిస్తున్న నేత కూడా! నల్లగొండ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో.. 479 మందిని బరిలో నిలబెట్టి నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను దేశం దృష్టికి తీసుకెళ్లిన ఉద్యమకారుడు కూడా ఈ దుశర్లే. తన బ్యాంక్ ఉద్యోగాన్ని సైతం వదిలేసి పోరాడిన యోధుడు. సొరంగం తవ్వి పెట్టు.. నల్లగొండకు బువ్వ పెట్టు అన్న నినాదంతో.. ప్రభుత్వాలపై సత్యనారాయణ పోరాటం ఓ దృఢసంకల్పం. జలసాధన సమితిని ఏర్పాటు చేసి ఉద్యమించిన నాయకుడు. అందుకే.. ఇప్పుడు దుశర్ల సత్యనారాయణ.. ఓ ప్రకృతి ప్రేమికుడుగా… నీటివనరులకై పోరాడుతున్న ఉద్యమకారుడిగా.. ఫ్లోరైడ్ రహిత నల్లగొండ జిల్లా సాధకుడిగా.. తన జీవితానికి ఓ సార్థకతను సాధించిన ఓ కథయ్యాడు!



