బిష్ణోయ్ భుజంపై తుపాకీ.. మోడీపైకి గురి! న్యాయవిచారణ పేరిట.. భారత్ కు సవాల్ విసురుతున్న కెనడా!!

పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య.. ప్రస్తుతం భారత్, కెనడా.. ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత అథమ పరిస్థితులకు దిగజారిపోయాయి. ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించడంతో పాటు.. ఎవరి దేశాలకు వారి రాయబారులను తిరిగి వాపస్ రమ్మనే స్థాయిలో ఈ బంధం దిగజారడానికీ.. సిద్ధిఖీ హత్యకు కారకుడని ఆరోపణలెదుర్కొంటున్న లారెన్స్ బిష్ణోయ్ పేరే వినరావడంతో.. ఇటు దేశంలోనే కాకుండా.. అటు అంతర్జాతీయంగా కూడా లారెన్స్ బిష్ణోయ్ ఎవరనే చర్చకు తెరలేచింది.

2023లో ఓ సిక్కు వేర్పాటువాద నాయకుడి హత్యలో భారత కుట్ర ఉందనే అభియోగాలను మోపిన కెనడా.. అందులో, భారత దౌత్యవేత్తల హస్తముందనే ఆరోపణలు గుప్పించడంతో పాటు.. అందుకు లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్ స్టర్ ను తమ కార్యకలాపాలకు వాడుకుంటోందంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఫోకస్ ను భారత్-కెనడా బంధం వైపు తిప్పాయి.

సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్జీప్ సింగ్ నిజ్జార్ హత్యపై దర్యాప్తు చేస్తున్న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్.. భారత్ లోని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (raw) ఆదేశాల మేరకే లారెన్స్ బిష్ణోయ్ అండ్ గ్యాంగ్ నిజ్జార్ ని మట్టుబెట్టినట్టుగా ఆరోపిస్తోంది.

ఇప్పుడు కెనడా ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో.. సిక్కులు అధికంగా ఉండే చోట లబ్ది పొందేందుకు ఇదంతా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆడుతున్న నాటకంగా భారత్ జస్ట్ కొట్టిపారేస్తోంది. అదే సమయంలో కెనడాకు టిట్ ఫర్ ట్యాట్ ఎలా చేయాలనే యోచనలో ఉన్న భారత్.. ఏ అవకాశాన్నీ వదలకుండా అంతర్జాతీయ సమాజం ముందు కెనడా ఆరోపణలను అబద్ధాలుగా నిరూపించేందుకూ అస్త్ర,శస్త్రాలనూ సిద్ధం చేసుకుంటోంది.

డ్రగ్స్ అక్రమరవాణా కేసులో ఏటీఎస్ పోలీసుల చేతుల్లో అరెస్టై.. ప్రస్తుతం, లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్ జైలు ఊచలు లెక్కించడాన్నీ కెనడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తోంది. గుజరాత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావడం.. ఆ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే మళ్లీ కొలువు దీరడం… అహ్మదాబాద్ సబర్మతీ జైలులో బిష్ణోయ్ ఖైదు కావడంతో.. వీటన్నింటికీ ముడిపెడుతూ కెనడాలో భారత్ లోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకతను నూరిపోస్తూ అక్కడి సిక్కు కమ్యూనిటీ నుంచి ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఈ కొత్త నాటకాన్ని కెనడా రచించిందన్నది భారత్ వాదన.

భారత్-కెనడా సంక్షోభంలో.. బిష్ణోయ్ పేరెందుకు తెరపైకొచ్చింది..?

కెనడియన్లపై దాడి చేసేందుకు భారత దౌత్యవేత్తలు సమాచారాన్ని సేకరిస్తూ.. దాన్ని వ్యవస్థీకృత నేరగాళ్లకు అందజేస్తున్నారన్నది నాల్గు రోజుల క్రితం సోమవారం రోజు కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ప్రధాన ఆరోపణ. పైగా భారత్ తప్పు చేస్తోందని.. తమ గడ్డపై తమ పౌరులను చంపుతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదంటూ ట్రూడో మాట్లాడటం… నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయముందన్న ప్రచారాన్ని భుజానికెత్తుకోవడంతో ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఒక యుద్ధ వాతావరణం నెలకొంది.

ఇదే సమయంలో, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ వింగ్ కూడా బిష్ణోయ్ ముఠా పాత్రపై కెనడా మీడియా ముందు మాట్లాడుతుండటంతో.. భారత్ వర్సెస్ కెనడా ద్వైపాక్షిక వివాదంలో బిష్ణోయ్ పాత్రకు ప్రాధాన్యత మరింత పెరిగింది. దీంతో ఇటు భారత్ లో సిద్ధిఖీ హత్యతో మరోసారి వెలుగులోకొచ్చిన బిష్ణోయ్.. అటు అంతర్జాతీయంగా కూడా గ్యాంగ్ స్టర్ గా తన ఉనికిని మరింత గట్టిగా చాటిచెప్పుకునే అవకాశాన్నీ కెనడా కల్పించింది.

మరోవైపు వాషింగ్టన్ డీసీకి చెందిన కొందరు డిప్లమాట్ల్స్.. భారత్, కెనడా సంబంధాలు ఒకే ఒక్క ఏడాదిలో కుప్పుకూలిపోయిన తీరు దురదృష్టకరమంటూనే… క్రిమినల్ ముఠాలతో సంబంధాలు పెట్టుకుని కెనడా ఆరోపించినట్టుగా చేయడం మాత్రం అంతర్జాతీయ సమాజంలో భారత్ కు చెడ్డపేరేనంటూ ఇండియాను ఇరుకున పెట్టే అడ్వంటేజెస్ తీసుకుంటుండటమూ మరోవైపు కనిపిస్తోంది.

భారత్ పాలిట మరో పాక్ లా తయారైన కెనడా!

పరిమళాలు వెదజల్లాల్సిన భారత-కెనడా ద్వైపాక్షిక సంబంధాల్లో.. సిక్కుల వేర్పాటువాదం, ఖలిస్తానీ ఉద్యమాలు.. దశాబ్దాల నుంచి ముల్లుల్లా గుచ్చుకుంటూనే ఉన్నాయి. 1980ల్లో సిక్కులపై భారత భద్రతా దళాల దాడులు, ఊచకోతే అందుకు ప్రధాన కారణంగా చెబుతుంటారు. ఆ సమయంలోనే పెద్దమొత్తంలో సిక్కులు కెనడాకు వలస వెళ్లి సెటిలయ్యారు. ఇప్పుడక్కడ పెద్దఎత్తున సిక్కుల సంఘాలు కూడా వేళ్లూనుకుని.. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో కూడా కీలకంగా మారాయి.

అలాంటి పరిస్థితుల్లో 1985లో కెనడాలోని మాంట్రియల్ నుంచి ముంబైకి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్నీ సిక్కు తిరుగుబాటుదారులు పేల్చడంతో ఆ విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కుప్పుకూలింది. ఆ ఘోర ఘటనలో ఏకంగా 329 మంది మృత్యువాత పడితే.. ఎక్కువ మంది అందులో కెనడా పౌరులే ఉన్న సంగతీ గమనించాల్సిన విషయం.

చల్లారిందనుకుంటున్న ఖలీస్తానీ ఉద్యమం… మెల్లిగా ఈ మధ్యకాలంలో పుంజుకోవడం.. కెనడాతో పాటు.. సిక్కులు బలంగా ఉండే కమ్యూనిటీలో మళ్లీ ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటం.. గతేడాది సెప్టెంబర్ లో సుఖ్ దూల్ సింగ్ అనే వేర్పాటువాదిని మోస్ట్ వాంటెడ్ గా భారత్ ప్రకటించడం.. అలా ప్రకటించిన తెల్లవారే అతను కెనడా విన్నీపెగ్ పట్టణంలో కాల్పుల్లో మరణించడం… సుఖ్ దూల్ ను తామే చంపామని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించడం.. డ్రగ్ అడిక్ట్ అయిన అతడి చర్యల వల్లే ఈ శిక్ష అని తెలపడంతో.. ఇండియా-కెనడా ద్వైపాక్షిక బంధాల్లోనూ గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ పాత్రా కొత్త చర్చకు అవకాశం కల్పించింది.

ఈ క్రమంలోనే ఇలాంటివన్నీ ఆధారంగా చేసుకుని కెనడా.. బిష్ణోయ్ వంటి గ్యాంగ్ స్టర్స్ తో చేతులు కలిపి.. భారత నిఘా సంస్ధలు తమ గడ్డపై అరాచకాన్ని సృష్టిస్తున్నాయని ఆరోపిస్తోంది. అదంతా ట్రాష్ అంటూ భారత్ కొట్టిపారేస్తోంది. దీంతో ప్రస్తుతం ఇండియా-కెనడా సంబంధాలు దౌత్యపరంగా చర్చించుకుని పరిష్కరించుకోలేని స్థితిలోకి దిగజారిపోయి… భారత్-పాక్ సంబంధాల కన్నా తీవ్రంగా క్షీణించిపోవడం.. రానున్న రోజుల్లో ఇంకెలాంటి పరిణామాలకు తెరతీస్తాయనే ఒకింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

భారత్-కెనడా వివాదంపై స్పందించిన యూఎస్, యూకే!

హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో భారత్ ఏజెంట్ల హస్తముందన్న కెనడా ఆరోపణల నేపథ్యంలో.. కెనడా చేపట్టే విచారణకు భారత్ పూర్తిగా సహకరించాలని యూకే కోరుతోంది. తమకు కెనడా జ్యుడీషియల్ సిస్టమ్ పై పూర్తి నమ్మకముందని.. అలాగే, భారత్ కూడా సహకరిస్తుందన్న విశ్వాసాన్నీ యూకే ప్రకటిస్తోంది. అప్పుడే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందన్నది యూకే వాదన.

భారత్ కు కెనడా వార్నింగ్!

నిజ్జర్ హత్య కేసు విచారణలో భారత్ గనుక సహకరించకపోతే… కచ్చితంగా అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ను దోషిగా నిలబెడతామంటోంది కెనడా. ముఖ్యంగా ఇండియాతో ఇంటలిజెన్స్ సమాచారాన్ని షేర్ చేసుకునే దేశాలైన యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో పాటు.. జీ7 దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీల నుంచి విచారణకు ఒప్పించేలా ఒత్తిడి కూడా తీసుకొస్తామంటున్నాడు ట్రూడో.

ఇండియాకు సంబంధించిన ఆరుగురు డిప్లమాట్స్ పదే పదే కెనడాలో ఎలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కు పాల్పడుతున్నారో పలుమార్లు భారత ప్రభుత్వానికి సమర్పించామని.. కానీ, భారత్ నుంచి ఎలాంటి స్పందనా లేదని.. తగిన ఆధారాలు కూడా చూపేందుకు సిద్ధమంటున్నాడు ట్రూడో. కెనడాలో భారత హైకమిషనర్, దౌత్యవేత్తలే ఆ గ్యాంగ్ స్టర్స్ కు సహకరిస్తున్నారని.. ఎన్నిసార్లు భారత ప్రభుత్వానికి ఈ విషయంపై సమాచారమిచ్చినా చీమ కుట్టినట్టైనా స్పందించలేదనేది కెనడా వాదన. ఈనేపథ్యంలో యూకేతో పాటు.. యూఎస్ కూడా భారత్ కెనడా ఆరోపణలను సీరియస్ గా తీసుకోవాలని కోరుతోంది. న్యాయవిచారణకు సహకరించాలంటోంది. మొత్తంగా అంతర్జాతీయ సమాజం దృష్టంతా ఇప్పుడు కెనడా-భారత్ వివాదం వైపు చూస్తున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఏ విధంగా జవాబిస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles