మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీలో కొత్త ఉత్సాహానికి బాటలు వేస్తున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ 13 సీట్లతో పోలిస్తే… కేవలం 8 పార్లమెంట్స్ సీట్సుతో సరిపెట్టుకున్నప్పట్నుంచే బీజేపీతో పాటు, ఆర్ఎస్ఎస్ వంటివన్నీ ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికలపై ఫోకస్ చేశాయి. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ 148 స్థానాల్లో పోటీ చేస్తే… ఇప్పటికే 133 స్థానాల్లో బీజేపీ దూసుకుపోతోంది. అసలు ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలను మించి అత్యంత ప్రభావవంతంగా బీజేపీ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ మహారాష్ట్ర బీజేపీ విజయంలో ఇద్దరు బ్యాక్ బెంచ్ బాయిస్ దే కీలకపాత్ర. వారెవరో మీకు తెలుసా..?
మహారాష్ట్రలో బీజేపీకి ఈ ఎన్నికల్లో దక్కింది థంబింగ్ మెజార్టీ. ఎందుకంటే 1990 తర్వాత వంద సీట్ల కంటే ఎక్కువగా ఒక పార్టీ గెల్చకున్న దాఖలాల్లేవిక్కడ. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఈ ఎన్నికల్లో… మహాయుతి నుంచి బీజేపీ, మాజీ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అబ్బాయ్ అజిత్ పవార్ సారథ్యంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీలు జట్టు కడితే… మహావికాస్ అఘాడీ పేరుతో కాంగ్రెస్, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన, బాబాయ్ శరద్ పవార్ సారథ్యంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీలు జట్టు కట్టడంతో… మహారాష్ట్ర ఎన్నికలు దేశంలో అత్యంత ఆసక్తికర ఎన్నికలుగా మారాయి. మరోవైపు ఇక్కడ పలువురు తండ్రీ కూతుళ్లు, బాబాయ్ అబ్బాయిలు, మామా అల్లుళ్లు.. ఇలా కుటుంబాలు కూడా పార్టీలుగా వేరుపడి ప్రత్యర్థులుగా నిలవడంతో.. యావత్ దేశం దృష్టినీ మహారాష్ట్ర ఎన్నికలు ఆకర్షించాయి.

అయితే, ఇక్కడ రెండుగా చీలిపోయిన శివసేన, ఎన్సీపీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎన్నికల్లో… అంతకంటే ప్రతిష్టాత్మకంగా బీజేపీ సవాల్ గా తీసుకోవడం ఆసక్తికర రాజకీయాంశం. ఇప్పటికే మహాయుతి మొత్తం 288 సీట్లకుగాను 200కు పైగా సీట్లను గెల్చుకునే అవకాశముండగా… 148 చోట్ల పోటీలో నిల్చిన బీజేపి 133 సీట్లలో దూసుకుపోతుండటం.. మరోవైపు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా రేసులో వెనుకబడి కేవలం 15 సీట్లల్లోనే గట్టి పోటీనిస్తుండటంతో మొత్తంగా మహారాష్ట్ర ఎన్నికలు భారతీయ జనతాపార్టీకి ఒక కొత్త ఊపునిచ్చాయి.
బ్యాక్ రూమ్ బాయ్స్ దే కీలకపాత్ర!
మహారాష్ట్ర ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించినవారు ఒకరు భూపేంద్రయాదవైతే.. ఇంకొంకరు అశ్వనీ వైష్ణవ్. వీరిద్దరూ కేంద్ర మంత్రులు. మహారాష్ట్ర భారీ విజయంలో వీరిద్దరే వాస్తుశిల్పులు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా వీరి సేవలకు ఇప్పటికే కృతజ్ఞతలు ప్రకటించారు. వీరిద్దరూ ఇంఛార్జ్, కో- ఇంఛార్జులుగా వ్యహరించారు. 2024లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన వెంటనే బీజేపీ అధిష్ఠానం వీరిద్దరినీ మహారాష్ట్ర ఎన్నికలకు ఇంఛార్జులుగా నియమించింది. బీజేపీని మహారాష్ట్రలో అట్టడుగు స్థాయి వరకూ తీసుకెళ్లిన ఘనత వీరిద్దరిది. నవంబర్ పదోతేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మేనిఫెస్టో విడుదల చేసిన సమయంలోనూ వీరిద్దరూ వెళ్లి.. తెలియకుండా జనంలో కూర్చుని వారినుంచి ఎలాంటి స్పందన ఉందో గమనించారు.
సవాల్ గా తీసుకున్న బీజేపీ!
గత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 38 లోక్ సభ స్థానాలకుగాను బీజేపీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెల్చుకుంది. ఇది హిందుత్వ సెంటిమెంట్ అధికంగా కల్గిన మహారాష్ట్రలో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ. మరోవైపు తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలను గెల్చుకున్న అతి పెద్ద పార్టీగా నిల్చింది. అది అప్పటికే అధికారంలో ఉన్న మహాయుతిని కలవరపెట్టింది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై బీజేపీ గట్టిగా ఫోకస్ చేసింది. గత ఏడాది మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీని విజయపథంలో నడిపించడంలోనూ భూపేంద్ర యాదవ్, అశ్వనీ వైష్ణవ్ లదే కీలకపాత్ర. మధ్యప్రదేశ్ ఎన్నికల తర్వాత ఈ ఇంఛార్జులపై పూర్తి విశ్వాసముంచిన బీజేపీ అధిష్ఠానం మహారాష్ట్రలోనూ వీరికే వ్యూహరచన బాధ్యతలప్పగించింది.
భూపేందర్ యాదవ్, అశ్విని వైష్ణవ్ ఎవరు?
వీరిద్దరూ కేంద్ర మంత్రులు. భూపేంద్ర యాదవ్ అమిత్ షాకు సన్నిహితుడు. రాజస్థానీ బీజేపీ నాయకుడైన భూపేద్రకు.. సొంత రాష్ట్రం రాజస్థాన్ తో పాటు, ఉత్తరప్రదేశ్, బీహార్ తో సహా, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లోనూ మంచి పట్టుంది. భూపేంద్ర రాజస్థాన్ లో 2013 ఎన్నికలకు, జార్ఖండ్ లో 2014 ఎన్నికలకు కో ఇంఛార్జ్ గా వ్యవహరించడంతో పాటు… గుజరాత్ కు అప్పటికే ఇంఛార్జ్ గా ఉన్నారు. అలాగే గత 2019 లోక్ సభ ఎన్నికలతో పాటు, 2020 బీహార్ శాసనసభ ఎన్నికల్లోనూ ఇంఛార్జ్ గా వ్యవహరించారు. అయితే, మహారాష్ట్ర వంటి రాష్ట్రంలో ఇంఛార్జ్ గా వ్యవహరించి పార్టీని విజయం వైపు నడిపించడం మాత్రం ఇదే తొలిసారి. భూపేంద్ర యాదవ్ ప్రస్తుతం పర్యావరణ, అటవీశాఖ కేంద్ర మంతిగా ఉన్నారు. 2012 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న భూపేంద్ర.. ప్రస్తుతం అల్వార్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడు.
ఇక అశ్వనీ వైష్ణవ్ ది ప్రత్యేక శైలి. ప్రస్తుతం రైల్వే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిష్టర్ గా ఉన్నారు. కాన్పూర్ ఐఐటీయన్ గా టెక్నాలజీలో మాస్టర్స్ చేసిన అశ్వినీ వైష్ణవ్.. అమెరికాలోని ఫిలడేల్ఫియాలో వార్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏలో పట్టా పొందారు.
సమాచార సాంకేతికత అనేది బలహీన వర్గాల జీవనశైలిని మార్చి వారిని స్థితిమంతులుగా నిలబెట్టాలన్న లక్ష్యం, ఉద్దేశంతో అశ్విన్ వైష్ణవ్ ఆలోచనలుంటాయి. భారత ప్రభుత్వ వెబ్ సైట్ లో చదివినప్పుడు అట్టడుగు వర్గాల జీవన స్థితిగతులను మార్చే విధంగా ప్రభుత్వ విధానాలుండాలని బలంగా విశ్వసించే వ్యక్తిగా అశ్వనీ వైష్ణవ్ కనిపిస్తారు.
అయితే, అశ్వనీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్ ఈ ఇద్దరూ మహారాష్ట్రలో బీజేపీ విజయ ప్రస్థానంలో కీలక పాత్రధారులైనప్పటికీ.. ఎక్కువ హడావిడి లేకుండా మీడియాకు దూరంగానే తమ వ్యూహాలను రచిస్తూ.. బ్యాక్ బెంచ్ బాయ్స్ గా ఉంటూ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నడిపించారు. ముఖ్యంగా మహారాష్ట్రలో బీజేపీ అలయెన్స్ మహాయుతి విజయానికి… లాడ్లీ బెహన్ యోజన పథకం ఓ గేమ్ ఛేంజర్ గా మారింది. పద్దెనిమిదేళ్లు నిండిన ఆడపిల్లలకు ఇప్పటికే ప్రతీ నెలా 15 వందల రూపాయలిస్తుండగా.. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే రెండు వేల 1 వంద రూపాయలిస్తామని ప్రకటించడం ఇక్కడ మహాయుతికి బాగా కలిసివచ్చిందనే టాక్ ఉంది. ఎన్నికల ప్రచార సమయం నుంచే ఈ విషయం ప్రజల్లో బలంగా చర్చ జరగడం కూడా బీజేపీ విజయానికి కలిసి రాగా… ఈ యోజన పథకం రూపశిల్పుల్లో కూడా వీరిద్దరి పాత్ర ఉండటంతో… ఈ బ్యాక్ బెంచ్ బాయిస్ ఇద్దరూ ఇప్పుడు వార్తల్లో వ్యక్తులయ్యారు.
అయితే, మహారాష్ట్రలో బీజేపీ విజయంలో ఈ ఇద్దరు బ్యాక్ బెంచ్ బాయిస్ అయిన అశ్వనీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్ పేర్లు ఇప్పుడెలాగైతే పతాకశీర్షికలకెక్కుతున్నాయో… జార్ఖండ్ లో బొక్కాబోర్లా పడి ఎదురుదెబ్బ తగిలిన బీజేపి అపజయంలో మధ్యప్రదేశ్ ఇంఛార్జులుగా వ్యవహరించిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. అలాగే, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మల పేర్లు కూడా ఇప్పుడు వార్తల్లో హైలెట్ గా నిలుస్తున్నయి. జార్ఖండ్ ఫలితాలు బీజేపీకే కాకుండా… ఇంఛార్జులుగా వ్యవహరించిన వీరిద్దరికీ షాక్ ఇవ్వడంతో… మహారాష్ట్ర, జార్ఖండ్ ఇంఛార్జుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.



