భారతీయ జనతా పార్టీ యువరక్తాన్ని ప్రోత్సహిస్తోంది. తాజాగా జేపీ నడ్డా స్థానంలో నితిన్ నబిన్‌కు బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలప్పగించడమే అందుకో ఉదాహరణ.
ప్రస్తుతం బీహార్ క్యాబినెట్ మంత్రిగా ఉన్న నితిన్ నబిన్ ను భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డ్.. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించింది. తక్షణమే పార్టీ పగ్గాలు చేపట్టాలని తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది. 2020 నుంచి 2025 డిసెంబర్ వరకూ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సేవలందించిన జేపీ నడ్డా జాగాలో ఇప్పుడు ఆ బాధ్యతల్ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబిన్ నెరవేర్చాల్సి ఉంటుంది.

అసలెవరీ నితిన్ నబిన్..?
నితిన్ నబిన్ ప్రస్తుతం బీహార్ లో రోడ్ కన్స్ట్రక్షన్స్ మినిస్టర్. పార్టీలో కీలక యువ నాయకుల్లో ఒకడిగా నితిన్ నబిన్ కు గుర్తింపుంది. సీనియర్ బీజేపీ నేత నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడే నితిన్ నబిన్. పాలన, వ్యవస్థాగత కార్యకలాపాల్లో గట్టి పట్టు, అనుభవమున్న నేతగా నితిన్ నబిన్ పై బీజేపీ విశ్వాసముంచింది. గతంలోనూ బీహార్ పట్టణాభివృద్ధి, హౌజింగ్ మంత్రిగాను, న్యాయశాఖా మంత్రిగానూ నితిన్ నబిన్ పని చేశారు.
పార్టీ యువ విభాగాన్ని బలోపేతం చేయడంలోనూ నితిన్ నబిన్ ది కీలకపాత్ర.
నితిన్ నబిన్ పొల్టికల్ జర్నీ!
నితిన్ నబిన్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీహార్ లోని సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. 2008 నుంచి భారతీయ యువ మోర్చా నుంచి తన ప్రయాణం ప్రారంభమైంది. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, కో ఇంఛార్జ్ గా పని చేసిన అనుభవముంది. 2010 నుంచి 2013 వరకు యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు నితిన్ నబిన్. 2016 నుంచి 2019 వరకు బీహార్ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడిగానూ పనిచేశారు. అనంతరం 2019లో సిక్కిం బీజేపీ ఎన్నికల ఇంఛార్జ్ గా, అదే ఏడాది జూన్ నుంచి సిక్కిం రాష్ట్ర బీజేపీ సంస్థాగత ఇంఛార్జ్ గానూ బాధ్యతలు నిర్వరించారు.
మంచి శక్తిమంతుడు. చురుకుదనం, ఆర్జనైజేషనల్ మేనేజ్మెంట్ లో దిట్ట. ఇవే నితిన్ నబిన్ కు సీనియర్ నేతల నుంచి ప్రశంసలు కురిపించేవి. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ నితిన్ నబిన్ ను అభినందించారు.
బీహార్ నేల నుంచి వచ్చిన యువకుడు, ఉత్సాహవంతుడు నితిన్ నబిన్ కు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు హృదయపూర్వక అభినందనలంటూ పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో బీజేపీని నితిన్ మరిన్ని విజయశిఖరాలకు చేరుస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.



