కారు డ్రైవర్ గా జీవితాన్నారంభించాడు: కలాం స్ఫూర్తితో ప్రొఫెసర్ అయ్యాడు!!

కలాం స్ఫూర్తి.. ఓ కారు డ్రైవర్ జర్నీ!

తాము ఆచరణలో పెట్టి మెస్సేజిచ్చేవారిని ఈ సమాజమెప్పటికీ స్వీకరిస్తుంది… అంతకుమించి గౌరవిస్తుంది. అలాంటివారిలో పైమెట్టులో ఉండి ఈ తరం చూసిన మహానుభావుడు కలాం. ఓ వ్యక్తి రక్తమాంసాలతో భూమిపై నడయాడన్నది భవిష్యత్ తరాలు నమ్ముతాయా అంటూ గాంధీ గురించి నాటి ఐన్ స్టీన్ వర్ణనెంత నిజమో… ఈ తరానికి కలాంను చూసే అవకాశం దక్కి… భవిష్యత్ తరాలకు ఆయన గురించి చెప్పే అవకాశం కూడా దక్కడం అంతే నిజం!

ఎెందుకంటే కలలను సాకారం చేసి చూపిన కఠోర నిజం. తానెంచుకున్న శాస్త్ర, సాంకేతిక రంగం నుంచీ.. తన కృషి, తన అణుకువ వంటివి ఆయన్ను దేశ అత్యున్నత పీఠంపై కూర్చోబెడితే.. అదే స్థాయిలో ఆ పదవికి వన్నె తెచ్చిన ఓ రోల్ మాడల్. అల్లా కృపతో రామేశ్వర సన్నిధానాన ఆ సముద్రగర్భం నుంచి ఉదయించిన జ్యోతిర్లింగం కలాం. మనిషి మానసిక ఎదుగుదలకు.. సమసమాజ స్థాపనకు.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ప్రగతి బాట పట్టించేందుకు.. విద్య ఎంత ముఖ్యమో.. ఆ విలువ తెలిసిన సరస్వతీ పుత్రుడు. అలా ఎందరో ఏకలవ్య శిష్యులకు ద్రోణాచార్యుడులాంటి కలాం జీవితంలోని ఓ ఆసక్తికర పేజీని టీచర్స్ డే సందర్భంగా ఓసారి చెప్పుకుందాం.

…………………………………………………………………………………………………………….

అన్నదానము గొప్పదనవచ్చునేగాని.. అన్నంబు జాములో నరిగిపోవు.. వస్త్రదానముగూడ భవ్యదానమెగాని.. వస్త్రంబు ఏడాదిలో పాతదగును.. గృహదానమొకటి యుత్కృష్ఠదానమేగాని.. కొంప కొన్నేండ్లలో కూలిపోవు.. భూమి దానము మహాపుణ్యదానమేగాని.. భూమియన్యుల జేరిబోవచ్చు.. అరిగిపోక, ఇంచుకయేని చిరిగిపోక, కూలిపోక, యన్యులపాలుగాక, నిత్యమయి, వినిర్మలమయి, నిశ్చలమయి యొప్పుచుండు విద్యాదానమొకటి జగతి.. అనే చిలకమర్తి లక్ష్మీనృసింహం పంతులు మాటే.. కలాం బాటైన కథ ఇది!

………………………………………………………………………………………………………………

అలా MY INDIA ideas for the future అనే తన పుస్తకంలో తనను ఇన్స్పైర్ చేసిన కలాం చెప్పిన కథే “ఓ డ్రైవర్.. డాక్టరైన కథ”

అది 2011, జనవరి 7వ తేది. మధురైలో మీనాక్షీ మిషన్ హాస్పిటల్ లో పెడియాట్రిక్ అంకాలజీ క్యాన్సర్ యూనిట్ ను ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అబ్దుల్ కలాం ప్రారంభించారు. ఆల్ ఆఫ్ సడెన్ ఓ వ్యక్తి కలాంకు తారసపడ్డాడు. ఇంకొంచెం క్లోజ్ కు వెళ్లితేగానీ.. కలాం ఆ మనిషిని గుర్తు పట్టగల్గాడు. హైదరాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ల్యాబొరేటరీలో పనిచేసేటప్పుడు.. పగలనకా, రాత్రనకా.. సుమారు 9 ఏళ్ల పాటు.. కలాంకు కారు డ్రైవర్ గా.. చేదోడువాదోడుగా నిల్చిన వ్యక్తతను!

పేరు.. వి. కదిరేశన్. తాను కలాంకు డ్రైవర్ గా చేస్తున్నప్పుడు.. తనకు సమయం చిక్కినప్పుడల్లా దినపత్రికలు, అందుబాటులో ఉన్న పుస్తకాలు, జర్నల్స్ వంటివి చదువుతుండటాన్ని కలాం బాగా గమనించేవారట. నిన్ను ఇంతగా చదివించడానికి వెనుకున్న కారణమేంటి… నీకింత ఆసక్తేంటని అడిగారట ఓరోజు కలాం కదిరేశన్ ను. తన కొడుకు, బిడ్డ చదువుకుంటున్నారని.. వారి సందేహాలు తీర్చడం చాలాసార్లు తనకు కష్టంగా మారుతుండటంతో.. వాళ్ళ పుస్తకాలు థరోగా చదివి.. తనకున్న సామర్థ్యం మేరకు అర్థం చేసుకుని.. అవి నివృత్తి చేసే యత్నం చేస్తుంటానని.. ఆ క్రమంలోనే ఏది కనిపించినా చదివేయడం ఓ అలవాటుగా మారిందన్నాడు కదిరేశన్. ఆసక్తి రేకెత్తించిన ఆ డ్రైవర్ సమాధానంతో ఆలోచనలో పడ్డ కలాం… ఆ డ్రైవర్ ను ఓ క్రమపద్ధతిలో దూరవిద్య ద్వారా చదువు కొనసాగించమని ప్రోత్సహించారట. అందుకు రెగ్యులారిటీకి భిన్నంగా కొంత సమయాన్ని కూడా వదిలేయడంతో.. ప్రైవేట్ గా హైస్కూలు చదువు పూర్తి చేశాడు కదిరేశన్. ఆ తర్వాత కలాం ప్రోత్సాహంతో ఉన్నత విద్యపైనా దృష్టి సారించాడు. తన ప్రతిభా, సామర్థ్యాలు పెంచుకోవాలనుకున్న కదిరేశన్ బీఏ హిస్టరీ పూర్తి చేశాడు. అదే వరుసలో ఎంఏ హిస్టరీ ఐపోయింది. అక్కడితో ఆగకుండా.. కదిరేశన్ కు చదువొక తీరని దాహమైంది. ఎంఏ పొలిటికల్ సైన్స్ లో పట్టా సాధించాడు. ఆ తర్వాత బీఎడ్.. నెక్స్ట్ ఎంఎడ్.. ఇదిగో ఇలా సాగింది కలాం సూచనలతో కారుతో పాటు.. ఎడ్యుకేషన్ అనే వెహికిల్ స్టీరింగ్ కూడా పట్టుకున్న డ్రైవర్ కదిరేశన్ ఆసక్తికర చదువుల జర్నీ!

1992 వరకూ కలాంకు డ్రైవర్ గా పనిచేసిన కదిరేశన్.. ఆ తర్వాత మనోన్మనియమ్ సుందర్ నార్ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశాడు. 2001లో పీహెచ్డీ పూర్తి చేసుకుని.. డ్రైవర్ కదిరేశన్ కాస్త అలా డాక్టర్ కదిరేశన్ అయ్యాడు. ఆ తర్వాత ఆ డ్రైవరే.. తమిళనాడు విద్యాశాఖలో ఉద్యోగస్తుడిగా సేవలందించి.. 2010లో ఏకంగా మధురై దగ్గర్లోని మెల్లూరులో ఆర్ట్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాడు. డ్రైవర్ కదిరేశన్ అంకుఠిత దీక్ష, చదువుపై ఉన్న తపన, అందుకు తగ్గ పట్టుదల.. వాటితో తనకు దొరికిన సమయాన్ని సద్వినియోగపర్చుకోవాలన్న సమయపాలన.. వెరసి.. ఓ మనిషి అంచెలంచెలుగా ఎలా ఎదిగాడో చెప్పడానికి.. కదిరేశన్ కథ ఓ ఉదాహరణ. దాన్నే MY INDIA ideas for the future అనే పుస్తకంలో రాసుకున్నారు డాక్టర్ అబ్దుల్ కలాం!

నువ్వెవ్వరు.. ఎక్కడ పుట్టావు.. పేదనా, ధనికనా అన్నవెప్పుడూ ప్రతిబంధకాలు కావు.. నీకంటూ ఓ విజన్.. ఆ కలను సాకారం చేసుకోవాలన్న సంకల్పబలం.. అందుకు తగ్గ కృషితో నువ్వు సంపాదించుకునే జ్ఞానమే.. నిన్ను నీ లక్ష్యం వైపు నడిపిస్తాయి.. ఓ కదిరేశన్ లా విజయాన్నందిస్తాయి. ఇదీ స్థూలంగా విద్యకున్న గొప్పతనాన్ని తన MY INDIA ideas for the future పుస్తకంలో చెబుతూనే.. తనకు ప్రేరణ కల్గించిన ఓ స్కూల్ డ్రాపవుట్.. డ్రైవర్ నుంచి డాక్టర్ గా.. ఏకంగా ప్రొఫెసర్ గా ఎదిగిన కథను అంతే అందంగా చెప్పుకొచ్చారు కలాం.

from.. MY INDIA – ideas for the future BOOK.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles