పదేళ్ల తర్వాత మోడీనే మృదుస్వభావిగా కనిపిస్తాడంటున్న పీకే! ఇంతకీ ఆ ఆంతర్యమేంటి..?

బీహార్ ఎన్నికల క్రతువు ముంచుకొస్తున్న క్రమంలో.. అదే స్థాయిలో అక్కడి నేతలు కత్తులు దూస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మరో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్న పార్టీ జన్ సురాజ్. ఎన్నికల వ్యూహకర్తగా ప్రపంచానికి పరిచయమై.. రాజకీయ నాయకుడి అవతారమెత్తిన ప్రశాంత్ కిషోర్ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ టార్గెట్ గా ఆ వ్యాఖ్యలు కనిపిస్తుండటంతో పాటు.. అందులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మార్చేయడంతో.. ప్రశాంత్ కిషోర్ మిగిలిన పార్టీల నాయకులను మించి తాను వార్తల్లో నిల్చే యత్నం చేస్తున్నాడు. తన జన్ సురాజ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే యత్నం చేస్తున్నాడు. యాంటీ బీజేపీ శ్రేణులను ఏకం చేసే ప్లాన్ గీస్తున్నాడు.

ముస్లిం ఓటర్ల సంఖ్య అధికంగా కనిపించే బీహార్ లో.. ఎక్స్ క్లూజివ్ గా ఒక ముస్లిం సమావేశాన్ని నిర్వహించారు పీకే. ఆ సమావేశంలో ఆయనేమంటారంటే… రాబోయే రోజుల్లో మీకు ప్రధాని నరేంద్ర మోడీ మృదువైన నాయకుడిగా కనిపిస్తాడంటారు. అంటే, కాబోయే ప్రధాని ప్రస్తుత ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్న ఆదిత్యనాథ్ యోగి అని.. ఆర్ఎస్ఎస్ కూడా డిసైడ్ చేయకముందే.. అదే వారి నిర్ణయం కాబోతోందని ఢంకా బజాయిస్తున్నాడు. దాంతో.. యోగి ఆదిత్యనాథ్ పాలనను చూశాక.. మీరంతా కచ్చితంగా మోడీ ఎంతో మంచివాడనుకునే రోజులు వస్తాయంటూ భవిష్యత్ ఆందోళనను కళ్లముందుంచే యత్నం చేస్తున్నాడు పీకే. అదీ ముస్లింలకు సంబంధించిన ఓ మీటింగ్ లో.

పదేళ్ల తర్వాత నేను మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. అప్పట్లో ప్రధానిగా పనిచేసిన మోడీ సహనశీలి అని మీరే అప్పుడు నాతో అంటారు. కానీ, యోగి ఆదిత్యనాథ్ మాత్రం అసహనపరుడు. ఆర్ఎస్ఎస్ నెమ్మది నెమ్మదిగా కేంద్రాన్ని రైట్ వింగ్ గా మార్చాలని ప్రయత్నిస్తోంది. దాన్ని మీరు ఇంకా గ్రహించలేకపోతున్నారంటూ ఆయన వ్యాఖ్యలు ముస్లిం మైనార్టీ గ్రూపులను ఇంకొంత రెచ్చగొట్టేలా సాగాయి. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ముస్లిం కాన్ఫరెన్స్ లో పీకే మాట్లాడిన ఈ మాటలు కచ్చితంగా వారిని ఎంతో కొంత ప్రభావితం చేసేవి.

అయితే, తన ప్రసంగంలో బీజేపీలోని అటల్ బీహారీ వాజ్ పాయ్, అద్వానీ నుంచి మోడీ, అమిత్ షా మీదుగా.. యోగి ఆదిత్యనాథ్ వరకూ ఆ పార్టీ నాయకత్వాలను పోల్చి చూపిస్తూ వారి రాజకీయ మలుపులను సదరు ముస్లిం మీటింగ్ ముందుంచే ఓ ప్రయత్నం చేశాడు పీకే.

బీజేపీలో కొత్తతరం ఎంటర్ అవుతున్నకొద్దీ.. వారి నాయకత్వం మరింత కఠినంగా ఎలా మారుతుందో ఆ పోలికల ద్వారా చెప్పే యత్నమది. ముస్లిమ్స్ తమ రైట్స్ ను వినియోగించుకునేందుకు ఎందుకు భయపడుతున్నారంటూ ఆయన తీసుకురావాలనుకున్న చైతన్యం కాస్తా.. కవ్వింపు ధోరణిలో కనిపించడం గమనార్హం.

మరి పీకే మీడియాతో ఏమంటారంటే..?

నేను రెచ్చగొట్టడం లేదు. జరుగుతున్న పరిణామాలను మాత్రమే వివరించడానికి ప్రయత్నిస్తున్నా. వాజ్ పాయ్ ని మృదువైన హిందుత్వవాదిగా చూస్తాం. అలాగే, అద్వానీని కఠినమైన హిందుత్వవాదిగా పరిగణిస్తాం. కానీ, నేటి సందర్భంలో మోడీతో పోలిస్తే అద్వానీ మృదువైన నాయకుడిలా అనిపిస్తాడు. కాబట్టి, కాలక్రమంలో బీజేపీ నాయకత్వ పథం మరింత కఠినంగా మారుతోంది. రాబోయే, పది, పదిహేనేళ్లల్లో బీజేపీ నాయకత్వం అలాంటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లబోతోందని హెచ్చరిస్తున్నాడు పీకే.

ఇంకా తేదీలు ఖరారు కాని బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎప్పుడైనా ఉండొచ్చనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఇలాంటి రాజకీయ నాయకుల ప్రసంగాలు, సమావేశాలు, ఇంటర్నల్ కాన్ఫరెన్సులతో బీహార్ రాజకీయాలు ఇప్పుడు రసకందాయంగా కనిపిస్తున్నాయి.

అదే సమయంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ముందు పెట్టి.. యాంటీ బీజేపీ శ్రేణులు బీహార్ లో ప్రచారం చేయడం కూడా చర్చకు తావిస్తోంది. రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పలేకే.. పీకే వంటివారు ఇలాంటి ప్రచారాన్ని భుజానికెత్తుకుంటున్నారని ఎన్డీఏ అలయెన్స్ కౌంటర్ ఎటాక్ కూ పీకే మాటలు అవకాశం ఇస్తున్నాయి.

జన్ సురాజ్ పార్టీపై స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన పీకే గతం తాలూకు ప్రభావమెంత..?

ఇదిగో ఈ ప్రశ్న ఏ సామాన్యుడికైనా మదిలో మెదిలేదే. 2014లో బీజేపీ లోక్ సభ ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించిన ఘనత పీకేది. దశాబ్దానికి పైగా పోల్ మేనేజ్మెంట్ వ్యూహకర్తంగా పీకే బీజేపీ కోసం పనిచేశారు. ఆ తర్వాత ఆయన అన్ని ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలకూ వ్యూహరచన చేస్తూ వచ్చారు. కానీ, రెండేళ్ల క్రితం ఆయన వ్యూహకర్తగా చాలించి.. తానే రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాలనుకున్నాడు. ఏకంగా జన్ సురాజ్ పార్టీనే స్థాపించాడు. రాబోతున్న బీహార్ ఎన్నికల్లో 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్నాడు. మరి పీకేను బీహార్ జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు.. ఇప్పటివరకూ నడుస్తున్న బీహార్ స్టీరియోటైపిక్ పాలిటిక్స్ కు బ్రేక్ వేసి.. పీకే వంటివారిని ఆదరిస్తారా.. లేక, గతంలో వ్యూహకర్తగా ప్రచారం చేసిన పార్టీలను భుజానికెత్తుకుని, మిగిలిన పార్టీలను దునుమాడిన పీకే శైలే ఈ ఎన్నికల్లో పీకేకు శాపంగా మారుతుందా.. వాటిని పీకే ఎలా అధిగమిస్తాడు.. ఢిల్లీలో కేజ్రీవాల్ తరహా రాజకీయాలతో బీహార్ ఎన్డీఏ అలయెన్స్ గోడలు బద్ధలు కొడతాడా.. ఇదిగో ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ఇప్పుడు బీహార్ రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ రసవత్తరంగా కనిపిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles