Into the wild… జీవితం అంటే ఏంటి.. ???
……………………………………………………………………………………………………
Ashok Vemulapalli… ✍️
ఆనందంగా బతకడమేనా జీవితం అంటే.. లేదా కష్టపడి తర్వాత సుఖపడి, కింద పడి మీదపడి, పడుతూ లేస్తూ.. విజయం అపజయం ఎదుర్కొంటూ రోగాలు రొప్పుల తో నీలుగుకుంటూ శరీరాన్ని నెట్టుకురావడమా..బాగా డబ్బు సంపాదించడమా..మంచి పేరు తెచ్చుకోవడమా. దారిద్య్రంలో బతకడమా.. అష్టైశ్వర్యాలు తో బతకడమా.. రిక్షా తొక్కేవాడిదా..లేక అంబానీదా జీవితం..?
కుళ్లు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, అధిపత్యాలు, దెబ్బ తీసుకోవడాలు, విమర్శలు, పొగడ్తలు,సత్కారాలు, ఛీత్కారాలు, అవమానాలు ఇవేనా జీవితంలో అంశాలు..లేక ఇంకేమైనా ఉందా..?
నాకు అర్ధమయింది..మీకు అర్థమయ్యేలా చెబుతాను..ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతామని తెలిసి బతకడమే కదా జీవితం అంటే.. ఇదే into the wild సినిమాలో చూపిస్తాడు దర్శకుడు .

Sean Penn..
ఇంకా కాస్త క్లారిటీగా చెబుతాను.అందర్నీ వదిలేసినోడు..సన్యాసి..అందరూ వదిలేసినోడు సన్నాసి అంటారు కదా.అయితే ఇందులో హీరో కచ్చితంగా సన్యాసి..హిమాలయాల్లో ఋషి పుంగవులు ఏమి చేస్తారు..అందర్నీ వదిలేసి, బంధాలకు దూరంగా గడ్డాలు పెంచుకుని తపస్సు చేసుకుంటారు కదా.. ఇక్కడ హీరో Emile Hirsch.. అంతే..
కుంభమేళాలో నాగసాధువుల్ని చూసాను.. ఒంటిపై బట్టలు లేకుండా.. దిగంబరంగా ఒంటినిండా బూడిద పూసుకుని గడ్డకట్టే గంగానది నీళ్ళలో అలా మునిగి వెళ్లిపోయారు.. ఈప్రపంచంతో..ఈ మనుషులతో..ఈ బంధాలతో.. ఏమాత్రం సంబంధం లేకుండా..స్వేచ్ఛగా..కల్మషం లేకుండా.. దిగులు లేకుండా.. కష్ట సుఖాలు తెలీకుండా..బతికేస్తున్నారు..వాళ్ళు తమ శోధనల్లో కావాల్సింది తమకి కావాల్సింది దొరకబుచ్చుకున్నారు.. సంతృప్తిగా కట్టె కాలేవరకూ .. బతికేస్తున్నారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి??పుట్టుక నుంచి చావుదాక ..వాళ్ళకి దొరికింది..మనకి దొరకనిది ఒకటుంది..అదే సంతృప్తి..అదే peace of mind…

బహుశా ఈ సినిమా చూశాక వైరాగ్యం కట్టలు తెంచుకోవచ్చు..జీవిత వ్యామోహల మీద కించిత్తు విరక్తి పుట్టొచ్చు..లేదా ఎందుకోసమో విపరీతంగా పాకులాడుతున్నామో అర్థంగాక సతమతమవ్వవచ్చు..
క్లుప్తంగా కొందరు సినిమా చూశాక వాడో పిచ్చివాడు.. అనుకోవచ్చు..నచ్చినట్టు బతికేవాడు కచ్చితంగా పిచ్చివాడే.. సంతోషాన్ని వెదుక్కునే వాడు కచ్చితంగా పిచ్చివాడే..
ఇది ఒక నిజ జీవిత కథ.. జీవితాన్ని, ఆనందాన్ని వెదుక్కుంటూ అందర్నీ వదిలేసి అన్నీ వదిలేసి ప్రకృతికి దగ్గరగా వెళ్లి హాయిగా బతికేసిన ఒక పిచ్చివాడి కథ.. అమెరికాలోని అలాస్కా లో Denali National Park and Preserve 1992లో అడవిలో ఒక నది పక్కన శిథిలమై పోయి ఉన్న ఒక బస్సులో వేటగాళ్ళకి దొరికిన మృతదేహం.. పక్కనే ఉన్న డైరీ ఆధారంగా Christopher McCandless జీవితం వెలుగులోకి వచ్చింది.. దాని ఆధారంగా Jon Krakauer నవల ఆ తర్వాత INTO THE WILD సినిమా అయింది
ఒక మూడు గంటలపాటు టెన్షన్లు వదిలేసి ఫోన్ పక్కన పడేసి..రెండు కాళ్ళు చాపుకుని ఈ సినిమా చూడండి.. మిమ్మల్ని అలస్కా వీధుల్లోకి, కాలిఫోర్నియా రోడ్లమీదికి, వర్జీనియా కొండల్లోకి, అలా అలా అడవిలోకి ఆ అడవిలో బాగా పాడై పోయిన బస్సులోకి అక్కడి నుంచి కొత్త జీవితంలోకి తీసుకెళ్లాడు..
అలస్కా కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న Denali Borough సమీపంలోని అడవిలో.. Teklanika River పక్కన పాత డొక్కు బస్సు నుంచి సినిమా ప్రారంభమవుతుంది.. ఆ బస్సులోనే ఆనందాన్ని వెదుక్కుంటాడు Christopher McCandless.. అదే బస్సులో తన అనుభవాల్ని రాసుకుంటాడు..అదే బస్సులో జీవన పరమార్ధాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాడు..సంతోషమంటే ఒంటరిగా పొందేది కాదు అది ఇంకొకరితో పంచుకునేది అని తెలుసుకుని అమ్మానాన్న, అక్క, స్నేహితులని తిరిగి కలుసుకునే ప్రయత్నం చేసినా ప్రకృతి సహకరించకపోవడంతో తిరిగి అదే బస్సులోకి వెళ్లి అక్కడే జీవితాన్ని ముగిస్తాడు..
Emory University లో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక what next అని అడిగితే..జీవితాన్ని వెదుక్కుంటా అంటాడు.. తన సేవింగ్స్ మొత్తాన్ని చారిటీకి ఇచ్చేస్తాడు.. తన గుర్తింపు కార్డులని కాల్చేస్తాడు.. అమ్మ, నాన్న, అక్క కి తెలీకుండా అలా లా బయలుదేరతాడు.. ఎక్కడికో పయనం తెలీదు.. కానీ అలా సాగాలి..కొత్త లోకాన్ని చూడాలి.. ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలి..
అమెరికాలోని అనేక రాష్ట్రాలు రూపాయి ఖర్చులేకుండా తిరుగుతాడు.. తన జేబులో ఉన్న డబ్బుల్ని కాల్చేస్తాడు..బతకాలంటే కాస్త తిండి ఉంటే చాలు డబ్బు అవసరం లేదంటాడు.. ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాడు.. ఎవరు ఏది పెడితే అది తింటాడు.. అన్నీ డైరీలో రాసుకుంటాడు..తన జీవిత పయనంలో తనలాగే ఆనందాన్ని వెతుక్కుంటున్న వారిని కలుస్తాడు .. ఎక్కడెక్కడో పని చేసాడు..ఊహూ.. దొరకలేదు..జీవితానికి కిక్కు రాలేదు..అందుకే అలాస్కాలో గడ్డ కట్టే మంచులోకి వెళ్లిపోవాలి.. ఒకబ్యాగ్, కొన్ని బట్టలు, ఒక రైఫిల్, పదికేజీల బియ్యమ్ ఇదే అతని ఆస్తి.. అలా అలా Teklanika River దాటి వెళ్ళగానే.. అడవిలో ఆశ్చర్యంగా ఒక తుప్పుపట్టిన శిథిలమైన బస్సు కనిపిస్తుంది.1940లో ఒక రోడ్డు నిర్మాణం కోసం తెచ్చిన బస్సు రిపేర్ రావడంతో అక్కడే వదిలేశారు…అందులోనే అతనికి కావాల్సిన ఆనందం దొరుకుతుంది..
అడవిలో దొరికింది తినడం బతకడం ఇదే జీవితం.. ప్రకృతి ఒడిలో సంతోషం అణువణువూ కనిపిస్తుంటుంది.. ఇదే కదా జీవితం ఆనుకుంటాడు.. తల్లి తండ్రి, అక్క, స్నేహితులు, ప్రపంచం ఇవేమీ అతనికి గుర్తుకురావు.. వెంట తెచ్చుకున్న రెండు పుస్తకాలే అతనికి స్నేహితులు..
కానీ ఒక దశలో ఆ ప్రకృతి జీవితం విరక్తి పుడుతుంది..సంతోషమ్ కూడా ఒక దశలో విసుగు పుడుతుంది.. సంతోషం అంటే ఇంకొకరితో పంచువడం అనే విషయం చాలా కాలం తర్వాత అర్ధమవుతుంది.అందుకే ఇన్నాళ్లు తనకు ఆశ్రయం ఇచ్చిన ఆ మ్యాజిక్ బస్సుని వదిలి ఇంటికి పయనవుతాడు. కానీ నది పొంగుతుంది.. గడ్డ కట్టే చలి వణికిస్తోంది..అందుకే ముందుకు వెళ్ళలేడు.. తిరిగి మళ్లీ బస్సులోకి వచ్చేస్తాడు..
కానీ ఆకలి..ఆహారం దొరకదు ఏమి చేయాలో తెలీక చెట్ల ఆకులు, వేర్లు తింటాడు..వాటి విషం కారణంగా ఆరోగ్యం క్షీణించి చనిపోతాడు.. చనిపోయిన ఇరవై రోజుల తర్వాత..అతని మృతదేహాన్ని వేట గాళ్ళు గుర్తిస్తారు..అప్పుడు డెడ్ బాడీ పక్కన దొరికిన డైరీ అతని జీవితాన్ని బయటి ప్రపంచానికి తెలిసేలా చేసింది..అతని దగ్గర కెమెరాలో బస్సు పక్కన తనని తాను తీసుకున్న ఫోటో దొరికింది..

కృిస్టోఫర్ జీవిత చరిత్ర బయటకు తెలిసాక.. ఆ మ్యాజిక్ బస్సుని చూడటానికి ఎంతోమంది పర్యాటకులు సాహసం చేసి వెళ్లేవారు..అలా వెళ్లిన సందర్భంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. చివరికి June 18, 2020 న అమెరికా ఆర్మీ ఆ బస్సుని.. ఎయిర్ లిఫ్ట్ చేసి హెలికాఫ్టర్ ద్వారా బయటకు తెచ్చి అలాస్కాలో రహస్య ప్రదేశంలో ఉంచారు..
ఒక విధంగా మన అర్థమైన రీతిలో.. అతను.. గౌతమబుద్ధుడు లాంటివాడు. ప్రాపంచిక సుఖాలను అనుభవించడం జీవిత పరమ లక్ష్యం కాదని భావించి అన్నీ వదిలేసి వెళ్లిన సిద్ధార్థుడు.. గౌతమ బుద్ధుడు ఎలా అయ్యాడో ఇక్కడ Christopher McCandless కూడా “Alexander Supertramp అవుతాడు.. ఇంకా అర్థం కావాలంటే.. గోపిచంద్ నవల అసమర్థుని జీవయాత్రలో సీతా రామారావు లాంటోడు..పోలిక చండాలంగా ఉన్నప్పటికీ స్థూలంగా సారాంశం మాత్రం అదే.. రాయడానికి ఇంకా చాలా ఉంది..కానీ చదవడానికి జనాలకి ఓపిక ఉండాలి కదా…?
CONCLUSION: జీవితాన్వేషణలో ఆనందాన్ని వెదుక్కుంటూ.. అలా కొండలు గుట్టలు ఎక్కి నదులు దాటి.. అలస్కా అడవుల్లోనో..అరకు జలపాతాల పక్కనో…అంత ఆనందంగా నేను బతకలేకపోవచ్చు కానీ ఒక వయసు దాటాక .. నేను..ఒక చిన్న జీవితాన్ని ఊహించుకున్నాను.. ఒక సెకండ్ హ్యాండ్ మినీ బస్సు..అందులోనే బాత్రూమ్..అందులోనే బెడ్…అందులోనే చిన్న కిచెన్.. కొన్ని బట్టలు.. కాసిన్ని బట్టలు.. అదే బంగ్లా..అదే ఆస్తి..అదే ఫార్మ్ హౌజ్..అదే స్టార్ హోటల్.. ఎక్కడికి పడితే అక్కడికి సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవడమే.. కావాల్సివన్నీ చూడటం.. కొత్త మనుషుల్ని కలవడం.. ఏదో ఒక చోట ఆగి బస్సులోనే పడుకోవడం.. ఇంతకన్నా కావాల్సింది ఏదైనా ఉందా??



