జస్ట్ ఫైవ్ మినిట్స్ లో శస్త్ర చికిత్స పూర్తి చేస్తాడు. ఏకంగా లక్షమందికి చూపునిచ్చాడు. ప్రేరణగా నిలుస్తోన్న నేపాల్ లోని ఓ గ్రామీణ కథ ఇది.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ఈ నానుడిని ఒంటబట్టించుకున్న డాక్టరతను.
తూర్పు నేపాల్ ప్రాంతంలో సమీప పాఠశాలకు వెళ్లాలంటే కూడా వారం రోజుల నడక అవసరమయ్యే ఒలాంగ్ చుంగ్ గోలా అనే ఊళ్లో పుట్టాడు సాందూక్ రూయిట్ అనే బాలుడు. విద్యుత్ లేదు. అనారోగ్యానికి గురైతే అంతే సంగతులు. అలాంటి దుర్భరస్థితిలో తన సోదరి 17 ఏళ్ల వయస్సులో క్షయవ్యాధికి గురై చనిపోయింది. ఆ బాధ ఆ బాలుడిని గాయపర్చడమే కాదు.. అతడి జీవన గమనాన్నే మార్చేసింది. ఇప్పుడతను ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నేత్ర శస్త్ర చికిత్స నిపుణుల్లో ఒకడు. ఆ బాలుడి గాధలో నీతి కష్టాలనెదుర్కొని ఆప్తమాలజిస్టుగా ఎదగడం కాదు… ఆ బాధలు, కష్టాలను నైపుణ్యంగా ఎలా మల్చుకోవచ్చో చూపించేది.

సాందుక్ రుయిట్ జీవితాన్ని మార్చిన గురువు!
రుయిట్ భారత్ లోనే వైద్య విద్యనభ్యసించాడు. తిరిగి నేపాల్ వెళ్లిపోయాడు. 1985లో ఆస్ట్రేలియా కంటి వైద్యుడు ఫ్రెడ్ హాలోస్ ను కలవడంతో రుయిట్ జీవితం కీలక మలుపు తీసుకుంది. పేదవాళ్లు డబ్బులేక అంధత్వానికి గురవ్వడం బాధించిన ఇద్దరి ఆలోచనలూ కలిశాయి. హాలోస్ ప్రభావంతో రూయిట్ ఆధునిక క్యాటరాక్ట్ మైక్రోసర్జరీ నేర్చుకున్నాడు. ఆ శిక్షణతో తన మాతృభూమి నేపాల్ లో టిల్గానా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆప్తమాలోజీ పేరిట 1994లో ఖాట్మండులో హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. డబ్బు లేని పేదవాడు వచ్చినా అత్యంత నాణ్యమైన కంటి చికిత్సనందించడమే టిల్గంగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆప్తమాలజీ మోటో.
5 నిమిషాల్లో జీవితాన్ని మార్చే శస్త్రచికిత్స!
ప్రపంచవ్యాప్తంగా క్యాటరాక్ట్ అంధత్వానికి ఎలా కారణమవుతుందో తెలిసిందే. కానీ, రుయిట్ చేసిన గొప్ప పనేంటంటే.. వేగంగా శస్త్రచికిత్సను ఎక్కువమందికి తక్కువ ఖర్చుతో అందించగల్గడం. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ శస్త్రచికిత్స చేయగల్గేలా ఏర్పాట్లు చేయడం. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయడంలో రుయిట్ దిట్ట అని ఫ్రెడ్ హాలోస్ ఫౌండేషనే ప్రకటించింది. ఆ వేగం వేల మందికి చూపునిచ్చింది. అయితే, రూయిట్ శస్త్రచికిత్స విధానంలో కేవలం వేగం మాత్రమే ఉంటే ఆయనకింత పేరొచ్చేది కాదు.. కచ్చితత్వం, పేషంట్ పట్ల గౌరవంతో కూడిన వైద్యవిధానం ఆయన ప్రత్యేకతలు.
మారుమూల గ్రామాలకే చేరిన శస్త్రచికిత్స!
సాధారణంగా ఇప్పటికీ చాలామంది డాక్టర్స్ క్యాంపులు నిర్వహిస్తుంటారు. ఆపరేషన్స్ కోసం తమ హాస్పిటల్స్ కు రమ్మంటారు. కానీ, ఆ విధానాన్నే మార్చేశాడు రుయిట్. మోబైల్ ఐ క్యాంప్స్ నిర్వహిస్తూనే… మారుమూల గ్రామాల్లో శస్త్ర చికిత్సలు కూడా అందించాడు. అందుకోసమే ఆయన టిల్గంగ సంస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఐ క్యాంపుల నిర్వహణ, తక్కువ ధరలో లెన్సుల తయారీ, ఎమర్జెన్సీ అవసరమైనప్పుడు వైద్యమందించేలా స్థానిక వైద్యులకు శిక్షణనివ్వడం వంటివాటితో కంటి వైద్య ప్రపంచానికే రుయిట్ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
2009 నాటికే రూయిట్ సుమారు లక్ష మందికి చూపునిచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి వ్యవస్థగా మారి… ఆ వ్యవస్థకే చూపునిచ్చిన కథ సాందూక్ రుయిట్.
ప్రపంచం కొనియాడినా లక్ష్యం మాత్రం సేవే!
సాందూక్ రుయిట్ సేవలకు అనేక అవార్డులు వచ్చాయి. 2006లో రామన్ మెగసెసే, 2007లో ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఆ తర్వాత పద్మశ్రీ, 2023లో ఐఎస్ఏ అవార్డ్ ఫర్ సర్వీస్ టూ హ్యూమానిటీ వంటి ఎన్నో పురస్కారాలందుకున్నాడు.
ఇవన్నీ ఆయనకు దక్కిన గుర్తింపు ఏ స్థాయో చూపిస్తుండొచ్చేమోగానీ… రుయిట్ అసలైన వారసత్వమేంటంటే వేలాది మంది శిక్షణ పొందిన నేత్ర వైద్యుల తయారీ.
రుయిట్ కథ అద్భుతమంటే సరిపోదు.. కరుణ, క్రమశిక్షణ, సేవ, శాస్త్రం ఇలా ఇవన్నీ ఒకచోట మిళితమైన ఒక పరిపూర్ణత. ఒక వ్యక్తి కష్టాలు, బాధల్లోంచి… సానబెట్టిన బంగారంలా తయారై చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన పాఠం రుయిట్.



