హల్కాస ఏక్ నషాసా… ఆఖోంపే ఛారహా హై… అంటూ సూతింగ్ గా వినిపించే ఓ మెలోడీ గొంతు గురించి ఓసారి చెప్పుకోవాల్సిన ఆయన పుట్టినరోజిది. తన గమకాలతో మత్తైన తమకంలో ముంచే ఆ పేరు హరిహరన్. సినీ నేపథ్య గాయకుడిగా… తమిళ, మళయాళ, కన్నడ, తెలుగు, హిందీ, సంస్కృతం, భోజ్ పురి, మరాఠీ, సింహళ, ఒరియా, బెంగాలీ వంటి బహు భాషా పాటగాడిగా హరిహరన్ దాదాపు అందరికీ సుపరిచితుడే.
మెహిదీ హాసన్, తలాత్ మహమూద్, బడే గులాం అలీ ఖాన్ వంటివారి తరం తర్వాత.. ఎవరైనా ది బెస్ట్ గజల్ సింగర్స్ ఉన్నారా అంటే గజల్స్ అభిమానులు ఠక్కుమని చెప్పే పేర్లలో హరిహరన్ పేరు ఉండి తీరుతుంది.

మీడియావారికి అక్రిడేషన్ కార్డులా… ఓ సంస్థలో పనిచేస్తున్నవారికి ఓ గుర్తింపు కార్డులా… భారతదేశ జనమందరికీ మన ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్ కార్డులా.. బొంబాయి సినిమాలోని ఉరికే చిలుక పాటే తన గుర్తింపంటాడు హరిహరన్. ఆ 71 ఏళ్ల హరిహరన్.. గజల్ జర్నీ ప్రారంభించి యాభై ఏళ్లు అవుతుండగా.. ఏప్రిల్ 3న ఈరోజు హరిహరన్ జన్మదినం సందర్భంగా ఓసారి కాస్త చెప్పుకుందాం.
పది భాషల్లో 16 వేలకుపైగా పాటలు పాడాడు హరిహరన్. 2004లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్న ఈ కళాకారుడు.. ఫ్యూజన్ సంగీతంలోనూ దిట్ట. లెస్సీ లూయిస్ తో కలిసి కలోనియల్ కజిన్స్ వంటి ఆల్బమ్స్ తో దేశాన్ని ఉర్రూతలూగించాడు. క్రిష్ణ నీ బేగనే బారో అంటూ.. ఓ భక్తి గీతానికి అప్పటికున్న ప్రాచుర్యానికి మరిన్ని గమకాలద్దాడు. చిన్నికృష్ణుడి సౌందర్యాన్ని వర్ణిస్తూ.. రారమ్మని పిలిచే ఈ పాట.. ఓవైపు లెస్సీ లూయిస్ వెస్ట్రన్ మ్యూజిక్.. మరోవైపు హరిహరన్ గానంతో నూతన పంథాలో కొత్త పుంతలు తొక్కింది. ఆ స్ఫూర్తి ఆ గీతాన్ని వేదికలపై విరివిగా పాడేలా పురిగొల్పింది.
గుల్షన్ కుమార్ టీ-సీరిస్ సంస్థ ద్వారా హరిహరన్ పాడిన హనుమాన్ చాలీసా ఇప్పటికే 4 బిలియన్లకు పైగా మంది వీక్షించారంటే ఎంత పాప్యులరో అర్థం చేసుకోవచ్చు. శాస్త్రీయ సంగీతకారులైన హెచ్ ఏ ఎస్ మణి, అలమేలు మణికి జన్మించిన హరిహరన్.. స్కూల్ చదువు ముంబై మాటుంగాలోని డాన్ బాస్కో స్కూల్ లో సాగింది. సెయింట్ జేవియర్ కళాశాలలో ఉన్నత విద్యనభ్యసించిన హరిహరన్… 1977లో తన మ్యూజికల్ జర్నీని ప్రారంభించాడు. తల్లిదండ్రులిద్దరూ శాస్త్రీయ సంగీత విద్వాంసులు కావడంతో… వారసత్వంగా తనకూ సంగీతమబ్బింది. సినీ నేపథ్య గాయకుడిగా, గజల్ సింగర్ గానే సుపరిచితుడైన హరి.. గమకాల్లోనూ, స్వరస్థానాలను అలవోకగా ఆరోహణ, అవరోహణల్లో పలికే తీరులోనూ, నోట్స్ పై స్టాండ్ అయినప్పుడు శాస్త్రీయ సంగీతంపై కూడా ఆయనకున్న పట్టు ఇట్టే అర్థమైపోతుంది.
హరిహరన్ విశ్వరూపం చూడాలంటే.. visaal-gazals for connoiseurs అనే ప్రైవేట్ ఆల్బమ్ విని తీరాల్సిందే. అలాగే గుల్ఫామ్, ఖరార్, హజిర్, ఇన్ ట్యాక్సికేటింగ్ హరిహరన్, జష్న్, హల్కా నషా, ఆథ్వాన్ సుర్ (ది అదర్ సైడ్ ఆఫ్ నౌషాద్), పైఘామ్, కాష్, ఆత్మ వంటి ఎన్నో హరిహరన్ సంగీత ప్రతిభకు అద్దం పట్టిన ప్రైవేట్ ఆల్బమ్స్.
1977లో ఆల్ ఇండియా సుర్ సింగర్ కాంపిటీషన్స్ లో ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకున్న తర్వాత… హరిహరన్.. జైదేవ్ అనే నాటి సంగీత దర్శకుడి గమన్ సినిమాలో పాడటానికి తొలి సంతకం చేశాడు. ఆ సినిమాలో హరిహరన్ పాడిన అజీబ్ స నేహా ముజ్ పర్ గుజర్ గయా యారో అనే పాట పెద్ద హిట్. ఉత్తరప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ దక్కించుకుంది. 1992లో ఏ. ఆర్. రెహమాన్ ప్రభంజనంతో.. స్టీరియో టైపిక్ గాయకులకు చెక్ పెట్టి కొత్త గాయకుల తెరంగ్రేటం ముమ్మురమైంది. ఆ సమయంలో రోజా సినిమాలో హరిహరన్ సాంగ్స్ ఒక రేంజ్ లో హిట్టవ్వడంతో పాటు.. ఆ తర్వాత వచ్చిన బొంబాయి సినిమాలోని ఉరికే చిలుక పాట… హరిహరన్ పాటకు ఓ ఆధార్ కార్డులా మారిపోయింది.
పూదోట నిదురొమ్మని పూలే స్మరించు వేళ ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు అంటూ దివి నుంచి భువిపైన ల్యాండ్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ లా హైపిచ్ నుంచి కిందకు దిగుతూ ఆలపించిన వెన్నలవే వెన్నలవే ఎందరికో తమ మెరుపుకలల్ని గుర్తుచేసేది. హాయ్ రామా అంటూ రంగీలాలో కామవర్ధినీకి కొత్త ఊపిరులూదాడు. కళ్లు మేలుకుంటే కాలమాగుతుంద భారమైన మనసా అంటూ.. ఇందిరను లాలీ లాలీ అని జో పుచ్చాడు. డిజిటల్ లో చెక్కిన స్వరమా, ఎలిజబెత్ టైలర్ తరమా, జాకీర్ హుస్సేన్ తబలా నువ్వేనా అంటూ హుషారుగీతాన్నాలపించినా.. తొలివలపు పచ్చదనాన్ని సఖితో కలిసి ఎగిరి గంతేసే పాటను ఆలపించినా… మిగతా పాటగాళ్లతో పోలిస్తే హరిహరన్ సిగ్నేచర్ సంథింగ్ మెస్మరైజ్. పైగా ఈ పాటలన్నీ రెహమాన్, హరిహరన్ కాంబో గట్టి బంధానికి ప్రతీక. అదే స్థాయిలో బ్లాక్ బాస్టర్స్ గా నిల్చిపోయినవి. 1998లో బార్డర్ లో అనుమాలిక్ సంగీతంలో హరిహరన్ పాడిన మేరే దుష్మన్, మేరే భాయి పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా నేషనల్ అవార్డ్ దక్కింది. అలాగే, అజయ్-అతుల్ సంగీత దర్శకత్వంలోని జోగ్వా అనే సినిమాలోని జివ్ రంగ్లా పాటకు కూడా నేషనల్ అవార్డ్ వచ్చింది.
ఇక గజల్స్ విషయానికొస్తే భారతీయ గజల్ సింగర్స్ లో… మహామహులు కూడా హరిహరన్ గజల్స్ గమకాలకు ముగ్ధులవుతారు. సుమారు 35 ఆల్బమ్స్ చేశారు హరిహరన్. ఆశాభోంస్లేతో కలిసి చేసిన అబ్షర్ ఈ గజల్ అమ్మకాల్లో టాప్ గా నిల్చింది. దివంగత ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తో కలిసి.. హరిహరన్ తీసుకొచ్చిన హజిర్ ఆల్బమ్ సంగీత ప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. హరిహరన్ స్వాగత గీతంతోనే 2010లో కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. పద్మశ్రీ, కలైమామాణి వంటి అవార్డ్స్ అందుకున్న హరి… 2010 నుంచి 2011 మధ్య ప్రతీ గురు, శుక్ర, శనివారాల్లో ప్రముఖ తమిళ టీవీ ఛానల్ జయటీవీలో హరియుదాన్ నాన్ అనే కార్యక్రమంలో తన పాటలతో కనిపించి, వినిపించేవారు. దక్షిణాదివారిని ఉత్తరాదివారు ఆదరించడం అరుదైన సమయంలో.. ఉత్తరాదిన హరిహరన్ ఒక ట్రెండ్ సృష్టించిన గాయకసార్వభౌముడు.
శంకర్ మహదేవన్ తో కలిసి హరిహరన్ చేసిన కొన్ని స్టేజ్ షోస్ ఆయన ఎనర్జీ లెవల్స్ కు గీటురాయి. ప్రతిభావంతుడైన మరో సింగర్ పక్కనుంటే… తానింకెంత రెచ్చిపోతాడో కళ్లకు కట్టే స్టేజ్ షోస్ అవి.
తన యాభై ఏళ్ల మ్యూజికల్ జర్నీ 16 వేలుకు పైగా పాటలతో.. ఓ ఫోటో ఆల్బమ్ తిరగేసిన చందంగా సాగిపోయింది. సుమారు 16 వేలకు పైగా పాటలు పాడిన హరిహరన్. 50 ఏళ్లకు పైబడ్డ ఆ గాత్ర ప్రయాణం.. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని విష్ చేద్దాం.



