చెత్త సేకరణను ఉద్యమంగా మల్చిన గార్బేజ్ గర్ల్! ఎవరా విదేశీ వనిత..?

ఆమె ఒక బహుదూరపు బాటసారి. పర్యాటకురాలిగా బయల్దేరింది. భారత్ లో ఆమె ఎంచుకున్న ప్రాంతాలను చూసి వెళ్లాలని తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ, ఆమె ఇండియాలోనే ఉంటానని ఏనాడూ అనుకోలేదు. ఎందరికో ప్రేరణనిచ్చే ఓ ఉద్యమాన్నే నిర్మిస్తానని అంతకన్నా ఊహించలేదు. అలాంటి ఓ పర్యావరణ ప్రేమికురాలు… ఇప్పుడు గార్బేజ్ గర్ల్ గా గుర్తింపు పొందింది.

ఏ ఒక్క మనిషి మరో మనిషిలా ఉండడు, ఆలోచించడు. ఎంతో కొంత భావసారూప్యముండొచ్చునేమోగానీ… సేమ్ టూ సేమ్ ఎప్పుడూ ఉండదు. కొందరు తమ కోసమే జీవిస్తారు. నిలువెత్తు స్వార్థానికి ప్రతీకలుగా బతుకుతుంటారు. మరికొందరు మాత్రం సమాజంలో ఒక మార్పు కోసం యత్నిస్తుంటారు. అందులోనే తృప్తిని వెతుక్కుంటారు. ఆ రెండో కోవకు చెందిన యువతే… ఇంగ్లాండ్ కు చెందిన జోడి అండర్ హిల్.

1976లో ఇంగ్లాండ్ లోని గ్రేట్ యార్మౌత్ లో పుట్టిన జోడి అండర్ హిల్.. 2008లో భారతదేశానికి పర్యాటకురాలిగా వచ్చింది. అప్పుడామె భారత్ లోనే ఉండిపోయి తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఓ ఉద్యమాన్ని ప్రారంభిస్తానని అస్సలూహించలేదు. కానీ, భారతదేశంలో నియంత్రించలేనంత చెత్త చూసి ఆమె గుండె చలించిపోయింది. ఆశ్చర్యం వేసింది. కలత చెందింది. అప్పుడు ఆమె మదిలో రెండే రెండు మార్గాలున్నాయి. అయితే, భారత్ ను వదిలి వెళ్లిపోవడం.. లేదా, రెండు ఇక్కడే ఉండి చెత్త సమస్యపై ఉద్యమించడం. ఆమె రెండోదాన్నే ఎంచుకుంది. అదే ఆమె జీవితాన్నే మార్చే నిర్ణయమైంది. ఆ తర్వాత జోడి అండర్ హిల్ గార్బేజ్ గర్ల్ గా ప్రసిద్ధి చెందింది.

తాను చెత్తను ఎంచుకోలేదు… చెత్తనే తననెంచుకుంది అంటోంది ఆ గార్బేజ్ గర్ల్ జోడి అండర్ హిల్.

జోడి అండర్ హిల్ జీవితాన్ని ప్రభావితం చేసిన ప్రయాణం!

జోడి భారతదేశంలోని ముంబై, గోవా, కేరళ, కన్యాకుమారి వంటి అనేక ప్రాంతాలు, రాష్ట్రాలు, నగరాలు సందర్శించింది. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని టిబెటన్ చిల్డ్రన్స్ విలేజ్ లో స్వచ్ఛంద సేవ చేసింది. అలా సాగుతున్న ప్రయాణంలోనే తనకో జీవన లక్ష్యం ఏర్పడింది. నదులు, వీధులు, చెరువులు, సరస్సులు, డ్రైనేజీలు, రోడ్లు, ఇలా ఎక్కడ చూసినా పర్వతాల్లా పెరుగుతున్న చెత్త.. జోడీ అండర్ హిల్ ను ఆలోచింపజేసింది.

చెత్తపై తాను ఉద్యమించడానికి గల కారణాల్లో ఒకదాన్ని ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు జోడి అండర్ హిల్. ఓసారి ఓ రైల్లో వెళ్లుతున్నప్పుడు.. ఆమె తిన్న తర్వాత ఆ చెత్తను ఎక్కడ వేయాలని అని తోటి ప్రయాణీకులను అడిగినప్పుడు.. వెంటనే పక్కనున్న వ్యక్తి అది తీసి రైలు కిటికీలోంచి బయటకు రువ్వాడు. ఆ ఘటనతో తాను కన్నీళ్లు పెట్టుకున్నానన్నారు జోడీ. కానీ, తానెందుకు బాధపడ్డానన్నది మాత్రం ఆ బోగీలో ఎవ్వరూ అర్థం చేసుకోలేదంటోంది.

తాను నడిచే వీధులు, ట్రెక్కింగ్ చేసే పర్వత మార్గాలు ఎక్కడ చూసినా.. ప్రకృతి మధ్య విస్తరిస్తున్న ప్లాస్టిక్ భూతం, నీటి సీసాలు, పాలిథీన్ కవర్స్ ఆమెను దిగ్భ్రాంతికి గురి చేశాయి. అడవులు, గుళ్లు ఎక్కడ చూసినా తప్పకుండా కనిపించే చెత్త కుప్పలు ఆమెను బాధించాయి.

ఆమె చుట్టూ అలా చెత్త ఉండటాన్ని జీర్ణించుకోలేని జోడి అండర్ హిల్.. ఎక్కడ చెత్త కనిపించినా తన చేతులతోనే ఎత్తి డస్ట్ బిన్స్ లో వేసేది. మొదట్లో కాగితాలేరుకునేవారుకునేవారు. మరికొందరు జోడిని చూసి నవ్వుకునేవారు. తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో చెత్తను శుభ్రపర్చే సామాగ్రినీ కొనుగోలు చేసింది జోడి. క్రమంగా జోడితో మరికొందరు జోడయ్యారు. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని మెక్ లియోడ్ గంజ్ పరిసర పర్వత ప్రాంతాల్లో అలా మెల్లిగా జోడి అండర్ హిల్ చెత్త సేకరణ ఉద్యమం ఆరంభమైంది. కొద్దిమంది స్వచ్చంద సేవకులతో ప్రారంభమైన ఉద్యమం ఓ సంస్థగా అవతరించింది. ఎక్కడికక్కడ ఆమె చేస్తున్న చెత్త సేకరణతో ఆమె గార్భేజ్ గర్ల్ గా ప్రసిద్ధి చెందింది. స్థానికులూ భాగస్వాములయ్యారు. చెత్త బుట్టలు ఏర్పాటు చేసుకున్నారు. వారానికోసారి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆమె ప్రేరణైంది.

కొద్దిరోజులకు ఆమె తన బృందంతో కలిసి మౌంటెన్ క్లీనర్స్ అనే సంస్థను ఆరంభించింది. ఒకప్పుడు చెత్తతో నిండిపోయిన ట్రయుండ్ ట్రెక్కింగ్ మార్గం వారానికోసారి శుభ్రపర్చడంతో అనూహ్యమైన మార్పును చూసింది. 2012లో చెత్త సేకరణ ఉద్యమం మరింత ఉధృతమైంది. డెహ్రాడూన్ కేంద్రంగా వెస్ట్ వారియర్స్ అనే స్వచ్ఛంద సంస్థను ఆరంభించింది. చెత్తను రీసైక్లింగ్ చేయడం వంటి స్థిరమైన, విస్తృతమైన పరిష్కారాలపై దృష్టి సారించింది.

సరికొత్త మార్పుకు శ్రీకారం!

వెస్ట్ వారియర్స్ సంస్థ కేవలం చెత్త ఏరడం, ఆ చెత్తను రీసైక్లింగ్ చేయడం వరకే పరిమితమైంది కాదు… ప్రజల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేసే ఆలోచనా విధానాన్నే మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. స్థానికులు, వ్యాపార సముదాయాలు, పాఠశాలల యాజమాన్యాలు ఇలా ఎందరి సహకారంతోనో అవగాహన కల్పిస్తూ.. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతీ ఏటా వేలాది కిలోల చెత్తను సేకరిస్తోంది జోడి అండర్ హిల్ నేతృత్వంలోని వెస్ట్ వారియర్స్.

జోడికి దక్కిన గుర్తింపు!

ఆమె సమాజానికి చేస్తున్న సేవకు అదే స్థాయిలో గుర్తింపూ లభిస్తోంది. గ్రీన్ హీరో అవార్డ్ అందుకుంది జోడీ అండర్ హిల్. అమేజింగ్ ఇండియన్స్ అవార్డందుకున్న విదేశీ వనితగా ఆమె ప్రత్యేకంగా నిల్చారు.

చెత్త సేకరణలో జోడీకి ఎదురైన సవాళ్లు!

తాము చేయకపోవడమే కాదు.. ఎవరైనా మంచి చేస్తామన్నా కాళ్లు పట్టి లాగే సమాజాలే ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలతో పాటు, అధికార యంత్రాగం పెట్టిన ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొంది జోడి. కానీ, వాటిని అధిగమించి.. అలాంటి అడ్డంకుల మధ్య కూడా వెస్ట్ వారియర్స్ సంస్థ పేరిట ఉత్తర భారతంలో తన కార్యకలాపాలను కొనసాగించింది. చెత్తతో నిండుకుపోయిన డంప్ యార్డుల్లాంటి సమాజాన్ని శుభ్రపరుస్తూ, అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతోంది.

జోడి అండర్ హిల్ కథ సమాజమంతటికీ ప్రేరణ కావల్సిన కథ. ఏ సమస్యా పెద్దది కాదు.. సక్రమమైన ప్రణాళిక, ఐకమత్యంతో కూడిన సముదాయం ఉంటే పర్యావరణ సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చుననే విషయాన్ని ఇంగ్లాండ్ నుంచి వచ్చిన విదేశీ వనిత జోడి అండర్ హిల్ మనకు గుర్తు చేస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles