పల్లె ప్రజల గొంతుక.. కమ్యూనిటీ రేడియో!

టెక్నాలజీ గురించి ఏమాత్రం తెలియని ప్రజలు కూడా తమ వాణిని వినిపించేందుకు వేదిక కల్పించాయి కమ్యూనిటీ రేడియోలు. అలా ఆసియాలోనే తొలి మహిళా కమ్యూనిటీ రేడియో… భారత్ లోని మొట్టమొదటి గ్రామీణ రేడియో మన సంగం రేడియో. ఎక్కడో ఇంగ్లండ్ లో ప్రారంభమైన రేడియో… మారుమూల పల్లెలకూ చేరి సాంకేతికతను మట్టిమనుషులకు చేర్చింది. వారి జీవనసారాన్ని మరింత మందికి చేర్చి.. పల్లె ప్రకృతి పాఠాలపై ఆసక్తిని రేకెత్తించింది. వ్యవసాయం, పశుపోశణ, విద్య, సంస్కృతి, జీవనోపాధి వంటివాటిని చర్చిస్తూనే.. గ్రామీణ వైవిధ్యాన్నీ మరింత మందికి చేరువ చేసింది. అందుకే సంగం రేడియో.. జనం కోసం జనం నడిపే జనం రేడియోగా గుర్తింపు తెచ్చుకుంది. సంగం రేడియో పరిధిలో ఉన్న పస్తాపూర్ ఎందరో మహిళా రేడియో జాకీలకు కేరాఫ్.

ఇవాళ ఎల్ఈడీ స్క్రీన్స్ శాసిస్తున్న కాలంలో.. ఫింగర్ టిప్స్ పై మోబైల్ లో జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్లిపోతున్న వేగంలో.. ఇప్పటికీ రేడియా కొన్నిచోట్ల విశేషంగా పని చేస్తోంది. మాట్లాడే భాష, యాస, అక్షరాస్యత, పెరుగుతున్న సాంకేతికత ఆధారంగా మారుతున్న డైనమిక్ డిజిటల్ మీడియా ఒకవైపు… ఇప్పటికీ, పల్లె జనాలకు అత్యంత సన్నిహితమైన కమ్యూనిటీ రేడియో ఇంకోవైపు ఇలా రెండూ ప్రజాస్వామ్య మాధ్యమాలుగా వైవిధ్యాన్ని చూపిస్తున్నాయి.

నిత్యం ఉరుకులు పరుగులు, క్రైమ్, సంచలనాలతో విరుచుకుపడే మీడియాకు భిన్నంగా.. కమ్యూనిటీ రేడియో ఇంటి వంట గదుల ముచ్చట్లు చెబుతుంది. పొలాల్లో చేసే సేంద్రీయ వ్యవసాయం గురించి అన్నదాతకు అవగాహన కల్పిస్తుంది. తమ ప్రాంతంలో జరిగే జాతరల ప్రత్యేకతను గురించి చెబుతుంది. అక్కడికెళ్లే బస్సుల సమాచారాన్నిస్తుంది. అయితే, కమ్యూనిటీ రేడియోలు కేవలం సమాచార వ్యాప్తి కొరకే కాదు.. ఇవి అక్కడి ప్రజల వాణిని బలంగా వినిపించే ఆత్మవిశ్వాస ప్రతీకలుగా, సామూహిక శక్తిని పెంపొందించే వాహకాలై ఉపయోగపడుతున్నాయి.

సంగంతో మొదలైన కమ్యూనిటీ రేడియో ప్రస్థానం ఇప్పుడు దేశమంతా విస్తరించింది. కమ్యూనిటీ రేడియోల ఏర్పాటు తర్వాత ఆయా సమాజాలు ఎంత చైతన్యవంతమైనాయో కూడా మనం చాలాచోట్ల పరిశీలించవచ్చు.

సంగం రేడియో!

రేడియోను ఒక సామూహిక వేదికగా మార్చింది సంగం రేడియో. 2008లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణాలో ప్రారంభమైన సంగం కమ్యూనిటీ రేడియా కేంద్రం.. ఆసియాలోనే మొట్టమొదటి మహిళా కమ్యూనిటీ రేడియోగా నిల్చింది. ఎందుకంటే, ఈ రేడియో కేంద్రంలో పనిచేసేవారంతా మహిళలే కావడం విశేషం. పూర్తిగా అప్పటివరకూ నిరక్షరాస్యులైన దళిత మహిళలతో ప్రారంభమైన ఓ విప్లవాత్మక ప్రాజెక్టుగా సంగం రేడియోను చెప్పుకోవాలి. అంతకుముందెన్నడూ మైక్రోఫోన్ అంటే తెలియని వారంతా.. సుస్థిర వ్యవసాయం, పోషకాహారం, విత్తన స్వావలంబం, ఆరోగ్యపాఠాలు, మహిళా హక్కులవంటి ఎన్నో అంశాలపై కార్యక్రమాలు రూపొందించి ప్రపంచంచే శభాష్ అనే స్థాయికెదిగారు.

సమాజంపై సంగం రేడియో ప్రభావం!

అసలు మాట్లాడే హక్కు ఎవరికుంది..? వినిపించే అవకాశం ఎవరికుంది..? ఇలాంటి ప్రశ్నలపై చర్చ జరిగే సమాజంలో ఈ స్టీరియోటైపిక్ ఆలోచనలను మార్చిన సాధనంగా సంగం రేడియో అవతరించింది. దళిత మహిళలకు మైక్రోఫోన్ స్వయం ప్రతిపత్తిని కల్పించిన టూల్ గా మారింది. కుల, లింగ వివక్షలను సవాల్ చేస్తూ గ్రామాల్లో సామూహికంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేసింది.

సంగం రేడియో ప్రయోగంతో భారతదేశంలో మరిన్ని కమ్యూనిటీ రేడియోలు ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో రేడియో మంజీరా పేరిట కూడా మరో కమ్యూనిటీ రేడియోకు సంగం రేడియో స్ఫూర్తిగా నిల్చింది.

రేడియో మేవాత్!

తెలంగాణాలోని జహీరాబాద్ మండలం పస్తాపూర్ నుంచి ఇక కథ హర్యానాకు మారిపోయింది. సంగం రేడియో స్ఫూర్తితో 2010లో సెప్టెంబర్ 1న ప్రారంభమైంది రేడియో మేవాత్. మొదట్లో కేవలం రెండు గంటల ప్రసారాలకే పరిమితమైన ఈ రేడియో కేంద్రం.. ఇప్పుడు రోజుకు 14 గంటల ప్రసారాలతో అక్కడి సమాజ అవసరాలు, ఆశలు, ఆశయాల ఆధారంగా కార్యక్రమాలనందిస్తోంది. స్థానిక భాషలో జనానికర్థమయ్యే స్వరంతో రేడియో మేవాత్.. ఆ ప్రాంతంలో ఒక విప్లవాత్మక మాధ్యమంగా పనిచేస్తోంది.

రేడియో మేవాత్ ప్రభావమెంత..?

ఉపదేశాలో, ఉపన్యాసాలో, భాషణాలో ఇస్తే వినేవారెవ్వరూ లేరు ఈరోజుల్లో. అందుకే, ఇద్దరు మాట్లాడుకుంటే ఎలాగుంటుందో.. ఆ సంభాషణల్లో రేడియో మేవాత్ ప్రోగ్రామ్స్ ను డిజైన్ చేశారు. భేటీ బచావో భేటీ పడావో వంటి బాలికా విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన వంటి చర్చలతో మార్పు అక్కడి సమాజంలో సర్వసాధారణమైన అంశంగా మార్చడంలో రేడియో మేవాత్ పాత్ర కీలకం.

రేడియో బుందేల్ ఖండ్!

మధ్య భారతంలో రేడియో బుందేల్ ఖండ్ 2008, అక్టోబర్ 23న ప్రారంభమైంది. ఆ రాష్ట్రంలో ఇదే తొలి కమ్యూనిటీ రేడియో. దేశంలో డీడీఎస్ ఆధ్వర్యంలో తెలంగాణాలో ప్రారంభమైన సంగం తర్వాత రెండో కమ్యూనిటీ రేడియో ఇది. డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్ అనే సంస్థ.. తెలంగాణా డీడీఎస్ తరహాలో ఈ కమ్యూనిటీ రేడియో బాధ్యతలు చూస్తోంది. యువతులు, స్థానిక నాయకులు, రైతులకే రిపోర్టర్లుగా శిక్షణనిచ్చి.. స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తోంది.

కౌన్ బనేగా శుభ్ కల్ లీడర్ పేరిట వాతావరణ మార్పులకు అనుగుణంగా ఏర్పాటు చేసే కార్యక్రమంతో పాటు.. గలీ గలీ సిమ్ సిమ్ వంటి పోషకాహార ప్రోత్సాహ కార్యక్రమాలు.. పొగరహిత వంటల కోసం జాయ్కా బుందేల్ ఖండ్ కా వంటి ప్రోగ్రామ్స్.. అజీవికా వంటి స్థిరమైన జీవనోపాధిపై అందించే ధారావాహికాలు.. బుందేలీ ఐడల్ పేరిట జానపద సంగీతాన్ని ప్రోత్సహించడం వంటివెన్నో రేడియో బుందేల్ ఖండ్ లో వినిపిస్తాయి.

రేడియో బుందేల్ ఖండ్ ఇంపాక్ట్ ఎలా ఉంది..?

150 గ్రామాల్లో 4 లక్షలకు పైగా ప్రజలు రేడియో బుందేల్ ఖండ్ ను క్రమం తప్పకుండా వింటారు. రేడియో బుందేల్ ఖండ్ అనే కమ్యూనిటీ రేడియో స్థానిక పాలకులను అక్కడి సమాజ అవసరాలను తీర్చేందుకు భాగస్వాములను చేస్తోంది. సంస్కృతి పరిరక్షణతో పాటు, పలు పరిష్కారాలకు ఒక దారిదీపమై నిలుస్తోంది.

రేడియో ఉజ్జాస్!

గుజరాత్ కచ్ ప్రాంతంలో కమ్యూనిటీ రేడియో పేరు రేడియో ఉజ్జాస్. అక్కడంతా స్థానిక యాజమాన్యమే కనిపిస్తుంది. కచ్ మహిళా వికాస్ సంఘటన ఆధ్వర్యంలో నడుస్తోంది ఈ రేడియో. అక్షరాస్యత కూడా లేని మహిళలు కూడా భాగస్వాములై ఇక్కడ తయారుచేసే రేడియో సీరియల్స్ దేశవ్యాప్త గుర్తింపును పొందాయి. జానపద సంగీతాన్ని రికార్డ్ చేసి అలరించడంతో పాటు.. 2002లో వచ్చిన గుజరాత్ భూకంపం వంటి సంక్షోభ సమయాల్లోనూ ముఖ్య భూమిక పోషించింది ఈ రేడియో ఉజ్జాస్. వాతావరణ అనిశ్చితి, గృహహింస, వేతన అసమానతలు ఇలాంటి ఎన్నో అంశాలను చర్చిస్తోంది.

రేడియో ఉజ్జాస్ ఎఫెక్ట్!

తెలంగాణాలోని సంగం మాదిరిగానే రేడియో ఉజ్జాస్ నియంత్రణంతా ఇప్పుడు మహిళల చేతుల్లోనే ఉంది. దాంతో అక్కడ ఇప్పుడు మహిళా నాయకత్వాన్ని స్థానిక పాలనలోనూ భాగస్వామ్యం చేసింది. భాషా, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ సాధికారతకు కేరాఫ్ లా నిల్చింది రేడియో ఉజ్జాస్.

ఈ కమ్యూనిటీ రేడియోలు ప్రస్తుతం మనం చూస్తున్న శాటిలైట్, డిజిటల్ మీడియా వలె కమర్షియల్ ఏమాత్రమూ కావు. విస్తృత వ్యాప్తి ఈ కమ్యూనిటీ రేడియోల ముఖ్య ఉద్ధేశమే కాదు. లైఫ్ స్టోరీస్ ను నిడివి ప్రకారం ఎక్కడికక్కడ తెగ్గోసి కుదించడముండదు. ఇప్పటి పాప్యులర్ మీడియావలె తానే సమాజాల గురించి మాట్లాడదు. ఆ సమాజం మాటల్నే తిరిగి సమాజానికందిస్తుంది. సమాజంతో కలిసి మాట్లాడుతుంది. పల్లె జనానికి స్వయంగా మాట్లాడే అవకాశాన్నిస్తూ వారి వాణి వినిపిస్తోంది. అందుకే, కమ్యూనిటీ రేడియోలు.. ఎన్ని పాప్యులర్ మీడియా సంస్థలు వచ్చినా తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఇంకా ఆయా పల్లెల్లో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. జగిత్యాల జిల్లా లంబాడిపల్లె వంటి చోట్ల నుంచి గంగవ్వ వంటివారు మై విలేజ్ షో వంటి యూట్యూబ్ ఛానల్స్ తో అలరించడం వెనుకా ఈ కమ్యూనిటీ రేడియోల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles